Previous Page Next Page 
వాసన లేని పూలు పేజి 18

 

    రాజు అంతరాంతరాలలో జరుగుతున్న భావ పరివర్తనాన్ని నిశితంగా పరీక్షిస్తున్న ఆ పదిహేడేళ్ళ కుర్రవాడు గొప్ప అనుభవజ్ఞునిలా తలుపూతూ "నిజమే, కాని మీరు చెడ్డ వారని మాత్రం అక్కడెవరూ అనుకోవటం లేదు. ఆసంగతి మాత్రం చెప్పగలను." అన్నాడు.
    ఆ కుర్రవాని మాటలు రాజు కెంతో స్వాంతన కలిగించాయి. చాలాసేపటి నుండి భాస్కరాన్ని మరొక సంగతి అడుగుదామని ఎంతో ప్రయత్నించి కూడా అడుగలేక పోతున్నాడు . చివరకు ధైర్యం వహించి, చూపులు పక్కకు మరల్చుకొంటూ "పద్మ బావుందా" అన్నాడు.
    భాస్కరం కూడా గాంబీర్యం వహించాడు.  అతను పద్మను స్వంత అక్క కంటే కూడా అధికంగా ప్రేమిస్తున్నాడు. తనకు ప్రియమైన వారికి ప్రియుడు కావటం వల్లనే రాజు పైన అంత అభిమానం. అది వెనుకటి సంగతి. ఐనా ఇప్పటికీ ఆ అభిమాన చాయలు మాసిపోలేదు. "బాగుందని చెప్పలేను. కాని మీకు మాత్రం తెలియదా? అక్క మిమ్మల్ని ఎంతగానో ప్రేమించింది. ఇప్పుడు అందరి కన్నా ఎక్కువగా మనోవేదన అనుభవిస్తున్నది అక్కే!"
    "నాకు తెలుసు భాస్కరం. కాని పద్మ ప్రేమకు నేను అర్హుడిని కాను. ఆమె పవిత్రమైన దేవాలయంలో ఉండవలసిన దేవతా మూర్తి అనుకొన్నాడు రాజు లోలోపలే. పైకి మాత్రం ఏమీ మాట్లడలేదు.
    భాస్కరం మళ్ళీ చెప్పటం మొదలెట్టాడు. "నేను ఈ ఊరు వచ్చే ముందు పద్మక్క కు చెప్పి వద్దామని వాళ్ళింటికి వెళ్ళాను. అప్పుడు యింట్లో ఎవరూ లేరు. పద్మక్క కళ్ళ నీరు నింపుకొంటూ "భాస్కరం రాజు బావ ఏమయ్యాడో ఎవరికీ తెలియదు. నువ్వు చదువు కోసం చాలా దూర ప్రాంతానికి పోతున్నావు. నీకు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే ఉత్తరం వ్రాస్తావు కదూ?' అని బ్రతిమాలి చెప్పింది. నేను సరే నన్నాను. ఇప్పుడు మీరు అనుమతిస్తే పద్మక్క కు ఉత్తరం వ్రాస్తాను."
    రాజు వ్యాకుల కంఠంతో "వద్దు భాస్కరం వద్దు. నువ్వు నాకంటే చిన్న వాడివి. ఐనా నిన్ను బ్రతిమాలు కొంటున్నాను. ఆ పని మాత్రం చెయ్యవద్దు' అన్నాడు.
    "సరే మీకు ఇష్టం లేకపోతె మానేస్తాను. అదీకాక రాయకపోవటమే మంచిదని తోస్తోంది." అంటూ లేచి నిలబడ్డాడు భాస్కరం.
    "మాకిప్పుడు పరీక్షలు జరుగుతున్నాయి. లేకపోతె సాయంకాలం వరకూ మీ వెంటే తిరిగే వాణ్ణి. ఇప్పటికి నాకిక సెలవివ్వండి." అంటూ రెండు చేతులూ జోడించి నమస్కరించాడు.
    హోటలు బిల్లు ఇవ్వటానికి రాజు దగ్గర డబ్బేమీ లేదు. భాస్కరమే బిల్లు చెల్లించాడు. రాజుకు ఎంతో అవమానమనిపించింది. తన అసహాయ స్థితికి తాను జాలిపడటం కన్నా మరేమీ చేయలేకపోయాడు. భాస్కరం హాస్టల్లో తన రూమ్ నెంబరు చెప్పి , ఒకసారి తప్పక వచ్చి వెళ్ళమని ఆహ్వానిస్తూ సెలవు పుచ్చుకొన్నాడు.
    రాజు మానసికంగానూ, శారీరకం గానూ అధికమైన గ్లానితో, కాళ్ళీడ్చుకుంటూ నీరసంగా ఇంటికి చేరాడు.  వనజ చాప మీద అస్తవ్యస్తంగా పడుకొని ఉంది. రాజు రాక గమనించి కూడా , లేచి భోజనం వడ్డించే ప్రయత్న,మేమీ చెయ్యలేదు.
    వనజా కొంచెం లేచి భోజనం వడ్డిస్తావా నాకు చాలా ఆకలిగా ఉంది అన్నాడు.
    "గిన్నెలో అన్నం ఉంది. పెట్టుకు తినండి. నేనిప్పుడు లేవలేను. " అంటూ మరో వేపుకు తిరిగి పడుకొంది.
    ఇది ఇప్పుడు కొత్తేమీ కాదు. వారివురి మధ్య పూర్వపు అన్యోన్యం ఇప్పుడు ఉండడం లేదు. రాజు కాళ్ళూ, ముఖం కడుక్కొని పీట వేసుకొన్నాడు. అన్నం పెట్టుకుని తినే అలవాటు రాజు కింకా కాలేదు. పీట మీద కూర్చున్న వాడు మళ్ళీ లేవాల్సి వచ్చింది. మంచి నీళ్ళ కోసం కూర ఏమీ లేదు. కొద్దిగా నీళ్ళ మజ్జిగ మాత్రం ఉన్నాయి. అవే పోసుకుని అన్నం కలుపు కొన్నాడు. ఉప్పు ఎక్కడుందో తెలియలేదు. దాని కోసం మళ్ళీ లేవటం అనవసర మనిపించింది ఆకలి చచ్చిపోయింది. ఒక్క ముద్ద కూడా తినకుండానే చేతులు కడుక్కొని లేచాడు. వనజ లోపలి కొచ్చి పళ్ళెం వేపు చూసి "ఆకలి లేకపోతె వదిలేయండి గాని, ప్లేట్లో చేతులు కడుక్కోవడమెందుకు? నేనైనా తినేదాన్నిగా!" అన్నది.
    రాజు విమూడిడై వనజ ముఖం వేపు చూడసాగాడు. వనజ నిరసనభావంతో ప్లేటు చుట్టూ శుభ్రం చేయసాగింది. రాజు తేరుకొని "క్షమించు వనజా. నాకా విషయమే తట్టలేదు" అన్నాడు.
    వనజ సమాధాన మివ్వకుండా ప్లేట్లు తీసుకొని లోపలి కెళ్ళి పోయింది. రాజు అరిగిపోయిన చెప్పులు కాళ్ళకు తగిలించుకొంటూ "తెలిసిన వాడొకడు , చాలా రోజుల్నించి నా గడియారం ఇవ్వమని అడుగుతున్నాడు. ఇది అతని కిచ్చి ఇప్పుడే డబ్బు పట్టుకొస్తాను." అంటూ వీధిలోకి వెళ్ళిపోయాడు.

                                      14

    రాజుకు డివిజినల్ ఇంజనీర్ ఆఫీసు నుంచి ఉత్తరం వచ్చింది. ఇంటర్వ్యూకి హాజరు కమ్మని. ఆ ఉత్తరం ఆ పరిస్థితుల్లో అతనికి నిజంగా ఉద్యోగం దొరికినంత సంతోషమే కలిగించింది. పెద్ద హడావిడి చేస్తూ పెట్టె అడుగున పడి ఉన్న సర్టిఫికెట్లూ అవీ వెతకసాగాడు. వనజ నిర్లుప్తంగా చూస్తూ ఊరుకుంది.
    రాజుకు ఉద్యోగం దొరకటం వనజకు సంతోషదాయక మేమీ కాదు. ఈ కష్టాలనూ బాధలనూ రాజు ఎంతకాలం భరించ గాలుగుతాడో వేచి చూడాలని ఉంది. గడియారం అమ్మిన డబ్బు ఎంతో కాలం రాదు. ఆ తర్వాత వనజకు తెలిసినంత వరకూ డబ్బు వచ్చే మరో మార్గమేమీ లేదు. పరిస్థితుల వత్తిడికి తట్టుకోలేక ఇంకా కొద్ది రోజులకైనా రాజు ఇంటికి చెరక తప్పదు. వనజ వేయి దేవుళ్ళను ప్రార్ధించేది కూడా అదే!
    తొమ్మిది గంటలకు ఉన్న వాటిల్లో కల్లా కాస్త మంచి బట్టలు చూసి వేసుకొని ఇంటర్వ్యూ కెళ్ళి పోయాడు. వనజ కిప్పుడు ఇంట్లో చెయ్యాల్సిన పనేమీ ఉండటం లేదు. నాలుగు మెతుకులు వండటం. ఉంటె ఏదైనా కూర చెయ్యటం , లేక పొతే అదీ లేదు. రాజు వెళ్ళేక , స్నానం చేసి, పాత సినిమా పత్రిక ఒకటి ముందేసుకుని కూర్చున్నది. బయట కొత్త కారొకటి వచ్చి ఆగటం గాని, కారు దిగిన వ్యక్తీ సరాసరి లోపలకు రావడం గాని వనజ గమనించలేదు. బూట్ల చప్పుడు విని తలెత్తి చూసింది మరుక్షణం లో నిశ్చేష్టురాలై పోయింది.
    డాక్టర్ రెడ్డి అక్కడున్న ఒకే ఒక కుర్చీలో కూలబడుతూ "ఆహా, ఏం మర్యాద? ఇంటికి వచ్చిన వాళ్ళను సత్కరించటం ఇదే కాబోలు?" అన్నాడు.
    వనజ తనలోని భావ పరివర్తనా వేగాన్ని అదుపులోకి తెచ్చుకొంటూ అతి ప్రయత్నం మీద "క్షమించండి . మిమ్మల్ని చూసేసరికి నామెదడు పని చేయటం మానేసింది. కాని నేనిక్కుడఉన్నానని మీరెలా తెలుసుకొన్నారు? అన్నది.
    రెడ్డి ఆమె ప్రశ్నకు జవాబివ్వకుండా "రాజు ఇంట్లో ఉన్నాడా?' అని అడిగాడు.
    వనజ ఆశ్చర్యపడుతూ "రాజు-- వారు మీకు తెలుసా?" అన్నది.
    రెడ్డి నవ్వుతూ 'విశాఖపట్నం లో మేమిద్దరం అప్తమిత్రులం. వనజా నటన అత్యద్భుతంగా ఉంది సుమా? ఆ విషయం నీకు నిజంగానే తెలియదంటావా?" అన్నాడు.
    ఆ ప్రశ్నకు సమాధాన మిచ్చినా ప్రయోజనమేమీ లేదని వనజ గ్రహించింది. యదార్ధం గానే వనజ కా విషయం తెలియదు. ఇప్పుడు తెలుసుకున్నందువల్ల ఆమెకు సంతోషమేమీ కలుగలేదు. "కొంచెం కూర్చోండి. కాఫీ తీసుకొస్తాను." అన్నది.
    రెడ్డి ఆమెను వారిస్తూ "అక్కర్లేదు. నేను కాఫీలు తాగటానికి రాలేదు. నీతో కొంచెం మాట్లాడాలి?' అన్నాడు.
    వనజ మనస్సు కీడు శంకించసాగింది. "నాతోనా, నాతొ మాట్లాడేందుకేముంది?....ఐనా చెప్పండి?' అన్నది.
    రెడ్డి ముఖంలోకి కాఠిన్యత తెచ్చుకొంటూ "నువ్వు మా వాణ్ణి -- రాజుని విడిచి పెట్టాలి?"  అన్నాడు.
    "మీరనేదేమిటి?" అన్నది వనజ డుఖోద్వేగంతో.
    "ఔను. ఇక నుంచి వాడితో నీకేమీ సంబంధం ఉండకూడదు."
    వనజ కళ్ళ నుండి హటాత్తుగా విద్వేషాగ్ని కురవసాగింది. ఆ సంగతి వారితోనే చెప్తే పోయేదిగా?"
    వనజలో కలిగిన ఈ ఆకస్మిక పరివర్తన రెడ్డి నేమీ చెయ్యలేకపోయింది." విశాఖపట్నం లోనే చెప్పాను. ఇడియట్. నన్ను అపార్ధం చేసుకొన్నాడు." అన్నాడు.
    "మీరు మతి లేకుండా మాట్లాడుతున్నారు! లేకపోతె యేమిటి? మేమిద్దరం ప్రేమించుకోన్నాం." వనజ భారంగా ఒక నిట్టుర్పు విడిచింది. "పోనీండి. అవన్నీ మీరు తెలుసుకొన్నందువల్ల ప్రయోజనమేమీ ఉండదు. కాని నాకో విషయం చెప్పగలరా? ఇంత హటాత్తుగా మా ఇద్దరినీ విడదీసే సత్కార్య భారం మీపైన ఎందుకు వేసుకోన్నారో తెలుకోవాలని ఉంది.' "ఓహో! ప్రేమా!' అన్నాడు రెడ్డి హేళనగా. నన్నూ ఒకప్పుడు ప్రేమించానన్నావ్. ఐనా  అది చాలా కాలం కిందలే. బహుశా మర్చిపోయి ఉంటావు? ఇప్పుడు రాజును ప్రేమించానంటున్నావ్? ఇంకా ఎంత మందిని ప్రేమిస్తావో ఆ భగవంతుడికే తెలియాలి!"
    వనజ మనస్సు వికలమై పోయింది. భగవాన్ ఏమిటీ పరీక్ష? నేనేం పాపం చేశాను? అనుకో సాగింది. చివరకు రెడ్డికి సమాధాన మిస్తూ "నిజమే .ఒకప్పుడు మిమ్మల్ని మనస్పూర్తిగానే ప్రేమించాను. కాని మీరు మోసం చేశారు. ఆ సంగతి మీ మనసాక్షికి తెలియదా?' అన్నది.
    "అంతకుముందు కృష్టారావనే మరొక లా స్టూడెంటు తో తిరుగుతుండేదానివని విన్నాను. అదీ ప్రేమేనంటావా? వనజా, నాకు అంతా తెలుసు. ఇంకా బుకాయించకు."
    వనజ కోపంతో ఉడికిపోసాగింది. స్త్రీ సహజమైన సిగ్గూ, బిడియం , విచక్షణా జ్ఞానం ఏదీ ఆమె కప్పుడు అడ్డు రాలేదు. "ఏం ఎందుక్కాకూడదు? మీరు అ మాత్రం అర్ధం చేసుకోలేరా? ఔను, ఎందు కర్ధం చేసుకొంటారు లెండి? ఆ అవసరం మాత్రం మీ పురుష జాతి కెందుకుంటుంది? ఆడవాళ్ళు అసహాయులని మీకందరికీ తెలుసు మీ అవసరం తీరగానే మాసిపోయిన షర్టు విప్పేసినట్లు తీసి అవతల పారేస్తారు. కాని వారి బ్రతుకు లేమౌతాయో కొంచెమన్నా ఆలోచిస్తారా? మీరెంత మోసగాళ్లో ఆ కృష్ణారావు కూడ అంత మోసగాడే! మీలాంటి వాళ్ళంతా మరొక అమాయకురాలి మెడలో తాళి గట్టి , నంగనాచిలా, పెద్ద మనిషిలా సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతూ సుఖంగా కార్లలో తిరుగుతూ వుంటే మాకు మాత్రం అలాంటి ఆశలుండవా? మీ మనసును మీరు ప్రశ్నించుకొండి. సమాధానం అక్కడే దొరుకుతుంది.  ఒకరి చేతుల్లో మోసపోయిన అభాగిని మరొకరికి విష్కల్మషంగా హృదయాన్ని అర్పించి ప్రేమించే అధికారం లేదా?"
    "యెందుకు లేదు. ఉంది. కాని చిక్కేమీ టంటే మీరు హృదయాని కన్నా ముందు శరీరాన్ని అర్పిస్తుంటారు గదా!" అన్నాడు రెడ్డి వెటకారంగా.
    వనజ హృదయం ద్వేషంతో నిండిపోయింది. ఆ వ్యక్తితో వాదించటం వృధా ప్రయాసని తెలుసుకొని చీత్కారం చేస్తూ "ఔను మీతో వాదన అనవసరం, ప్రేమను గురించి మీకు తెలిసిన దేమిటో నాకు ఎప్పుడో తెలుసు" అన్నది.
    "నువ్వు ప్రేమించేది ప్రేమను కాదు -- డబ్బుని. రాజు వచ్చేప్పుడు చాలా డబ్బు తెచ్చాడని విన్నాను. ఇప్పటికి కొంత ఖర్చైనా ఇంకా చాలా మిగిలి వుండాలి. అది తీసుకొని ఇక్కడ్నించి వెళ్ళిపో. దాన్ని గురించి నిన్నెవరూ అడక్కుండా నేను బాధ్యత వహిస్తాను." 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS