9
పధ్యం తిన్నాక రెండరోజులతరువాత అతను తండ్రి వున్న గదిలోకి వెళ్ళి "నేనలా బయటికి తిరిగి రానా నాన్న గారూ.' అని అడిగాడు.
రాసుకుంటున్న చటర్జీ తలెత్తి అతని వైపు చూసి 'ఒద్దు బేటా. యిప్పుడు యింకా పూర్తిగా కోలుకోలేదు నువ్వు. మరో నాలుగు రోజులయాక నీ యిష్టం.' అన్నాడు.
'యింట్లో కూర్చుని కూర్చుని బోర్ కొడుతున్నదండి.'
'నిజమే అలాగే అనిపిస్తుంది. నీకు వచ్చింది మామూలు జ్వరం కాదు. డాక్టరు విశ్రాంతి తీసుకోమని మరీ మరీ చెప్పినప్పుడు వినాలి కదు నాయనా. జ్వరం చెప్పిన మాట మనం ఒక్కోసారి వినాలి. లేకపోతె అది మనల్ని అంటిపెట్టుకుని వదలదు.'
శ్రీకాంత్ తండ్రిని యింక అడిగిందుకు సాహసం చేయలేక పోయాడు. అతని జ్వరం లో రోజూ వచ్చి ఉపేంద్ర, మనోమోహిని, కృష్ణ మోహిని చూసి వేడుతుండే వారు. వొళ్ళు తెలియని స్థితిలో ఆ యింటికి ఎవరెవరు వచ్చారో, వచ్చే వారో కూడా అతనికి తెలియదు.
ఈ మధ్య అతనికి పట్టుదల గా కృష్ణమోహిని ని చూడాలని వుంది. తండ్రి అతన్ని బయటికి వెళ్ళ నివ్వడం లేదు. జ్వరం నుంచి కోలుకున్న రోజున దగ్గరుండి అతనే కటింగ్ కని సెలూన్ కి తీసుకు వెళ్ళాడు.
శ్రీకాంత్ బుర్ర వొంచుకొని తన గది లోకి వచ్చేశాడు. రాధిక దగ్గర నుంచి వుత్తరాలు వస్తున్నాయి. శ్రీకాంత్ మెదడులో ప్రవేశించిన ప్రశ్నకి మాత్రం సమాధానం దొరకడం లేదు. యెవర్ని ఆడగాలి? తల్లినా......అతని గుండెలు దడదడ లాడాయి. స్త్రీ ఆవిడ తను వేసే ప్రశ్నకి యేమైనా అయిపోవచ్చును. తమ్ముడిని అడిగితె? వెర్రి ప్రశ్న. తనకే అర్ధం కాని ఈ జటిల సమస్య తమ్ముడు పరిష్కరించగలడా? తండ్రిని సూటిగా అడుగుతే? అతని నవనాడులూ జారి పోయి దిగంతాలకి వెళ్ళి పోయాయి.
అతనిలో అనుకోని గంబీర్యం ఆవరించింది. ఇప్పుడు తను యెవరితోటి యెక్కువగా మాట్లాడడు. తమ్ముడు వుమేష్ వచ్చి పది మాటలాడితే అన్నిటికీ నవ్వుతూ ఒకరి రెండింటికి సమాధానాలు యిస్తాడు. తల్లీ తండ్రి లేనప్పుడు గొంతులో గరగర లాడే విషయాన్ని తమ్ముడికి చెప్పాలను కుంటాడు. కానీ తమ్ముడు ఆ విషయాన్ని తేలికగా తీసి పడేస్తే...... అతనికి యేవీ పాలుపోదు. యెక్కడి కైనా పారిపోవాలని పిస్తుంది. కొంతలో కొంత యిన్నేళ్ళ పరిజ్ఞానం లోనూ అతను గ్రహించాడు తనే చటర్జీ స్వంత కొడుకు కాదేమో అని. అయినా తండ్రి అపేక్ష అతన్ని ఆ వూహ కి అంతకంతకు దూరంగా పారదొలుతుంది.
'ఛ! యెవరో ఏదో అన్నారని నా కెందుకీ అనుమానాలు. లోకంలో సవా లక్ష మంది వున్నారు. ఆ రూమ్ లో యెంత మంది లేరు ఆ నాడు. లాయరు చటోపాధ్యాయ కొడుకు కూడా నా క్లాస్ మేటే. వాడూ ఆ క్షణం లో నా పక్కనే నిలబడ్డాడు. వాడినే అయి వుంటుంది. శ్రీకాంత్ కాస్సేపు ఈ విధంగా అలోచించి తాత్కాలికంగా వుపశాంతి పొందుతాడు. అతనికీ మధ్య యేకాంతంగా వుండాలని వుంటుంది. పుస్తకాలతో కాలక్షేపం చేస్తుండగానే రోజలు దొర్లిపోయి రిజల్ట్స్ వచ్చాయి. ఆనాడు యింట్లో పండగ మాదిరిగా వుంది. యిటు వుమేష్ అటు శ్రీకాంత్ యిద్దరూ ఫస్టు క్లాసు లో పాసయ్యారు.
చటర్జీ కొడుకు లిద్దర్నీ దగ్గరికి తీసుకుని 'ఏం చదవాలనుందోయ్ యింకా?' అని ప్రశ్నించాడు.
ఉమేష్ అన్నాడు ' చిత్త రంజన్ యేచేన్యూ లో లా చదువుతాను నాన్నగారు.'
'ఫారెన్ వెడతావా శ్రీకాంత్. భవిష్యత్ బంగారు కలశం లా వుంటుంది.' చటర్జీ మనసులో మరో భావం ఆ క్షణం లో మెదిలింది. శ్రీకాంత్ ని ఫారిన్ పంపడం వల్ల కొన్ని సమస్యలు ప్రస్తుతానికి దూరం అవుతాయి.
'మీ యిష్టం నాన్నగారూ!' అని వూరుకున్నాడు శ్రీకాంత్. భవిష్యత్ గురించి కలలు కనాలని లేదు. భూత కాలాన్ని తరిచి తరిచి చూడాలనీ కొన్నేళ్ళు వెనక్కు వెళ్ళాలనీ అతనికి అనిపిస్తోంది. గోవింద కొడుకు వైపు బెంగగా చూస్తోంది. ఒకవేళ శ్రీకాంత్ 'వూ' అని వుత్సాహంగా అంటే నిమిషాల మీద అతని ప్రయాణం ఖాయం అయిపోతుంది. శ్రీకాంత్ తల్లి వైపు చూసి తల దించుకున్నాడు. యింట్లో పిల్లలకి యిష్టమైన పదార్ధాలు చేయించాడు చటర్జీ. భార్యనీ , పిల్లల్నీ తీసుకుని ఆరోజంతా వుత్సాహంగా వూరంతా తిప్పాడు. సినిమాకి తీసుకు వెళ్ళాడు. రాత్రి పదీ పదకొండు గంటల వరకూ సందడి గా వాళ్ళకి ఊపిరి అడనీయకుండా తను వుబ్బితబ్బిబ్బై పోతూ పిల్లలకీ, భార్యకి ఆనందాన్ని పంచి యిచ్చాడు.
శ్రీకాంత్ మర్నాడు ఉదయం లేచి హల్లో వచ్చి కూర్చుని పుస్తకం తీసుకుని చదువుతున్నాడు. పదిగంటల వరకూ అతనా నవల లోంచి దృష్టి ని పైకి తిప్పలేపోయాడు. పటుత్వంగా వున్న ఆ నవలని మరీ మరీ చదవాలని పిస్తోంది. తల్లి గ్రహించి కాఫీ టిఫిన్ లు క్రిందికే నౌఖరు చేత పంపించింది. పదిన్నర దాటాక వీధి గేటు తెరుచుకుంది పెద్దగా శబ్దం చెస్తీ . అతను తలెత్తి చూశాడు.
డెబ్బై ఏళ్ళ వృద్దుడు నుదుట విభూది సిందూరం తో వొంటి మీద కండువా వేసుకుని పంచ కట్టుకుని లోపలికి వస్తున్నాడు. ఎండ మూలాన అతని శరీరం నిగనిగ లాడుతోంది నలుపు కారణంగా. అతని తల మీద వెనకగా పిలక ముడి వ్రేల్లాడుతుంది. చెవులకి సూర్యకిరణాలు పడి అతను పెట్టుకున్న వజ్రపు వొంటి రాయి దుద్దుల వంటివి ధగ ధగ లాడుతున్నాయి. చేతిలో సంచీ తప్ప మరేవీ లేదు.
శ్రీకాంత్ యెందరో భిక్షువుల్ని చూశాడు. కానీ అ వచ్చే వ్యక్తీ భిక్షువు కాదని స్పష్టంగా అతని చెవులకి వున్న దుద్దులూ, ఠీవి మ దర్పం చాటి చెబుతున్నాయి. అతను తెలుగు వాడా?
'యేలా తెలుస్తుంది?' శ్రీకాంత్ అనుకునే లోగానే అతను హల్లో కి అడుగు పెట్టాడు.
'మీరు --- అర్దోక్తి లోనే ఆగిపోయాడు శ్రీకాంత్.
అయన భారీ శరీరం మూలంగా కొంత రొప్పుతున్నాడు. చేతి సంచీ ని కిటికీ దగ్గర పెట్టి శ్రీకాంత్ ని నఖ శిఖ పర్యంతం కరువు తీరేలాగా, ఆశగా, ఆబగా, చాలా ఆతృతగా పరికించి చూస్తున్నాడు.
శ్రీకాంత్ మళ్ళీ అడిగాడు. ;ఎవరు కావాలండి.' అని, ఆ మనిషి రూపు రేఖల్ని బట్టి అతను తెలుగులోనే అడిగాడు.

'మీ నాన్న పేరండి?' అయన ప్రశ్నించాడు.
'బలరాం చటర్జీ అండి.'
'యింటి పేరు ?'
'నైషభం.'
'మీ తాతగారి పేరు.'
'సూర్యనారాయణ గారు.'
"మీ అమ్మ పేరు బాబూ.'
శ్రీకాంత్ విసుక్కోలేదు. వృద్దుడు వేసే ప్రశ్నలకి చాలా వోపికగా జవాబులు యిస్తున్నాడు. అయన రావడం తోనే అతను లేచి నిలుచున్నాడు. నిలుచునే యిద్దరూ మాట్లాడుతున్నారు. శ్రీకాంత్ కూర్చోమని చెప్పేందుకు కూడా అతను అవకాశం యివ్వడం లేదు. 'చెప్పు బాబు మీ అమ్మ పేరేమిటి?' ఆయన కంఠం లో వూహించని వేదన మాటల్లో స్పష్టంగా వ్యక్తం అవుతోంది.
'అమ్మ పేరు గోవింద.'
అయన సోఫా లో కూర్చుండి పోయాడు. కూర్చుని సంచీ లోంచి కాగితాల్ని తీసుకుని చేతిలోకి మార్చుకున్నాడు. అయన కళ్ళల్లో నీళ్ళు తిరిగి బొటబొటా రాల సాగినాయి. అయన శ్రీకాంత్ ని దగ్గరగా రమ్మని పిలిచి తన పక్కనే కూర్చో బెట్టుకున్నాడు. శ్రీకాంత్ కి వింతగా వుంది. ఎవరీయన? యెన్ని ప్రశ్నలు వేశాడు? యెందుకు వేశాడు?
'మీకెవరు కావాలండీ' శ్రీకాంత్ నమ్రతగా అడిగాడు.
'నువ్వు బాబూ, నువ్వే కావాలి. యింకెవరూ ఒద్దు.' నీకోసం యిన్ని మైళ్ళు, యిన్నాళ్ళు యింత కష్టపడి వచ్చాను. తీరా వచ్చాక నేను అపజయంతో వెనక్కి వెళ్ళి పోవాలేమో అనుకున్నాను. కానీ.....పశ్చాత్తాప చిత్తులకి దేవుడి దయ వుంటుంది. నువ్వు కనిపించావు. నువ్వు కావాలి....' అయన వెర్రి వాడిలా శ్రీకాంత్ ని రెండు చేతుల్తోనూ చుట్టేసి వొళ్ళంతా నిమర సాగాడు.
శ్రీకాంత్ ని వొళ్ళో కి తీసుకున్నాడు. నుదుట ముద్దు పెట్టుకున్నాడు. అంతటితో తృప్తి పడని వాడిలా దోసిళ్ళల్లో అతడి మొహాన్ని వుంచి ఆ కళ్లల్లో కి చూస్తూ కన్నీరు కార్చసాగాడు.
'మీరు ఎవరండీ? నాన్నగారు కావాలా? నేను ఎవర్నో తెలియకుండా నేను కావాలని అంటున్నారేమిటి?'
'నువ్వే బాబూ. నువ్వే కావాలి. నాతొ వస్తావా,' అయన దస్తావేజుల్ని శ్రీకాంత్ చేతిలో వుంచాడు. శ్రీకాంత్ ఆ కాగితాల్ని అందుకున్నాడు. కానీ వాటిని విప్పి చూడలేదు.
'ఈ వృద్దాప్యం లో 'నా' అనేవాళ్ళు కావాలని హృదయం చేసే ఆక్రందన యింతా అంతటిది కాదు. అది దాటి పోయింది. యేకాకి లా మిగిలాను. డబ్బు కోసం పేచీ పెట్టి రక్త సంబంధాన్ని కాదని కాల తన్నుకున్నాను. అందరూ పోయారు. ఆనాడు నేను పెచీలో దిగక పొతే యిప్పుడు నా యిల్లు యెంత కళకళ లాడేది? కొడుకు పోయాడు. కోడలు .....'అయన ఆపుచేసి శ్రీకాంత్ ని చూస్తూ 'నీకు నిజం తెలుసునా?' అని ప్రశ్నించాడు.
శ్రీకాంత్ అయన వైపు కుతూహలంగా చూశాడు.
'నీలో పోలికలు వాడివి కొట్టవచ్చినట్లు కనిపిస్తుంటే నేను పోల్చుకోలేనూ.'
శ్రీకాంత్ త్రుళ్ళి పడ్డాడు. ముచ్చెమటలు పోయసాగాయి. అతను కూర్చున్న చోటు నుంచి లేవబోతుంటే అయన గట్టిగా పట్టుకున్నాడు. 'గోపాల పురం తూర్పు గోదావరి జిల్లాలోది. యిప్పుడు అక్కడే వుంటున్నాను. ఒకటి కాదు రెండు లక్షలు ఆస్తి. ఈ ఆస్తికి వారసులు లేకుండా పోతారని భయపడి పోయాను. నాకేం తక్కువ. నా మనమడివి నువ్వు నాతొ వచ్చేయి. ఆస్తి నీది. ఆస్తి కోసం ...డబ్బు యెరగా చూపించి లాక్కుపోయెందుకు వచ్చానని అనుకోకు.'
'విష్ణు రోజూ కలలోకి వస్తున్నాడు. నిన్ను తెచ్చుకో మంటున్నాడు. ఈ సంఘర్షణ కి తట్టుకోలేక పోయాను. ఆచూకీ తెలుసుకునేందుకే ఆరుమాసాలు పట్టింది. అన్వేషణ ప్రారంభించాను. చివరికి నిన్ను చేరుకున్నాను. బాబూ నాతొ రావూ.' అయన రెండు చేతులూ దోసిళ్ళుగా పట్టి అర్ధించ సాగాడు. శ్రీకాంత్ పూర్తిగా వినలేదు. అప్పటికే అతడికి కళ్ళు భైర్లు క్రమ్మాయి. మానసికంగా కోలుకోలేని శ్రీకాంత్ కి స్పృహ తప్పిపోయింది.
కొడుకుని పిలవడానికి వచ్చిన చటర్జీ సోఫాలో ముసలాయనా, అయన వొడి లో శ్రీకాంత్ కనిపించారు. చటర్జీ అర సెకండు కాలం స్తంభీభూతుడయాడు. గుమ్మం లోంచి అడుగు హాల్లోకి వేస్తూ 'మీరు ...మీరెందుకు వచ్చారు యిప్పుడు ?' అని ప్రశ్నించాడు.
దీక్షితులు తలెత్తి చటర్జీ ని చూశాడు. శాంతంగా జవాబు చెప్పాడు! 'నా వస్తువు యిన్నాళ్ళూ నీ దగ్గరుంది బాబూ. అడిగి తీసుకు వెళ్ళాలని వచ్చాను.
'వస్తువా?' చటర్జీ కనుబొమ్మలు ముడి వేశాడు అర్ధం కాని వాడిలా.
'ఈ వస్తువే ...దీని కోసం వచ్చాను -- నిన్ను బిక్ష కోరేందుకు సైతం సిగ్గుపడను నేను . నా బిడ్డకి బిడ్డ వీడు. నాకు యిచ్చేయి.'
చటర్జీ నెత్తిన పిడుగు పడ్డట్లయింది:
"లేదు...లేదు . శ్రీకాంత్ నా కొడుకు. మీరు పొరబడుతున్నారు. నా బిడ్డ నా శ్రీ .' చటర్జీ గొంతులో ఖంగారు.
