.jpg)
ఇదిగో ! ఈ ప్రకటన చూడండి" అని పేపరందించింది ఇందిర. కల్యాణమూర్తి ప్రకటన పడినంత మేరా మడిచి ఇచ్చిన దిన పత్రిక చూశాడు. కాస్త పరీక్షగా చూసి భార్యతో "పాపం! అందరిదీ కాస్త అటూ ఇటూగా మన భార్గవగాడి వయసే.... ఒకేసారి అడామోగా మొత్తం పదిహేను మంది తప్పిపోయారా! ఈ మధ్య కిడ్నాపులు ఎక్కువయి పోయాయి" అన్నాడు.
"ఖర్మ...." అని ఇందిర టీవీ మీద పెట్టిన కళ్ళజోడు తెచ్చి యిచ్చింది. అది పెట్టుకుని మళ్ళీ చూశాడు. "ఓ! ఇదేదో కోచింగ్ సెంటర్ యాడ్" అన్నాడు.
'అవును . ఎమ్.డి.ఎ యు కాలేజి. ఆ ఫోటోల్లో వున్న వాళ్ళందరూ తప్పిపోయినవాళ్ళు కాదు. టాప్ ర్యాంకర్లు" అంది ఇందిర.
'అరె! నిజమా! ఈ కాలేజీ కొత్తగా పెట్టారు లాగుంది. ఈ పేరు ఇంతకుముందు ఎక్కడా వినలేదే" అని ఆశ్చర్యపడ్డాడు మూర్తి.
"పెట్టి రెండు సంవత్సరాల పైనే అయింది.చూడండి. ఈ కొద్ది కాలంలోనే ఎంత గొప్ప రిజల్టు సాధించారో. మన భార్గవని కూడా యిందులో చేర్పిద్డామండీ. వాడికి టెన్త్ లో ఎయిటీ ఫైవ్ పర్సంటోచ్చింది గదా! మనబ్బాయి లాంటి బ్రిలియంట్స్ కి ఈ కాలేజీయే బెస్ట్...." అంది ఇందిర.
"అలాగే కానీ, నాకు ఈ ఎడ్మిషన్లూ, వెళ్ళి వాళ్ళతో మాట్లాడటాలూ వీటన్నింటికీ టైము లేదుగా? ఎలా?"
"నాకు తెలుసు . మీరు ఆఫీసుకు ఒక్కరోజు కూడా నాగా పెట్టారని. పైగా మీ లోకం మీది. ఈ కాలం గురించీ, ప్రపంచం ఎంత స్పీడుగా పరుగెడుతోందో మీకు తెలీదని నాకు తెలుసు. అందుకే మా తమ్ముడికి ఫోన్ చేసి ఆ కాలేజీ బ్రోషర్ తెప్పించా. ఒరేయ్ వంశీ! టిఫిన్ తింటం అయిందా? తొందరగా రా...." అని కేకేసింది.
"వంశీ వచ్చాడా?" అంటుండగానే మూతి తుడుచుకుంటూ వచ్చి బ్రోషర్ అందించి , పక్కనే స్టూలు మీద కూర్చున్నాడు వంశీ.
నలభై పేజీల- కళ్ళు తిరిగే కలర్స్ లో అత్యంత ఖరీదైన పేపర్ తో వుందది సావనీర్ సైజులో.
ముఖ చిత్రం చిరంజీవి.
"ఇదేంట్రా! కాలేజీ బ్రోషర్ అని ఏదో సినిమా పత్రిక ఇచ్చావ్!" అన్నాడు మూర్తి.
వంశీ విలాసంగా నవ్వి, "బావా! ఈ రోజుల్లో సేలబిలిటీకీ పబ్లిసిటికీ ఫేమస్ ఫిగర్స్ ని వాడుకోవటం మామూలయింది. చిరంజీవి ఈ కాలేజి ఓపెనింగ్ కి రిబ్బన్ కట్ చేసాడ్లె. అదీ గాక చిరంజీవి ఫోటో వెయ్యకుండా ఏ గౌతమబుద్దుడిదో సరస్వతీ దేవి ఫోటో నో వేస్తె ఇన్ని కాలేజీల కాంపిటీషన్లో ప్రత్యేకంగా ఈ ఎమ్ డి ఎ యు సావనీర్ నే ఎందుకు చూస్తారు?" అన్నాడు వంశీ.
మూర్తి తల గోక్కుంటూ " ఇంతకీ ఎమ్ డి ఎ యు కాలేజ్ అంటే ఏమిట్రా?" అని అడిగాడు.
"ఎమ్ డి ఎ యు అంటే మమ్మీ డాడీ అంటీ అంకుల్ కళాశాల అని అర్ధం" అన్నాడు.
"అంతటితో అగారేం? అక్క, బావ, వదిన, షడ్డకుడూ వగైరా కూడా తగిలించోచ్చుగా!" అన్నాడు మూర్తి కొంచెం చిరాగ్గా.
"అబ్బ.... కాస్త మీ చిరాకుని పక్కన పెట్టి, బ్రోషర్ తిరగేయ్యండి! ఫీజులేంతో , టైమింగ్సేమిటో తెలుస్తాయ్..... ఐదొందలు పెట్టి కొన్నదెందుకూ? అంది ఇందిర.
"ఐదొందలా!" నిర్ఘాంతపోయాడు మూర్తి.
"మరి చిరంజీవి బొమ్మా మజాకానా? అసలు వాళ్ళు వాడిన పేపర్ కీ ఫోటోలకే అవుతుంది" అన్నాడు వంశీ.
ఆ రాహుకాలంలో ఆ వర్జ్య సమయంలో ఎడం కన్ను అదురుతున్న దుర్ముహూర్తంలో పేజీ తిరగేశాడు మూర్తి.
ఒకటవ పేజీలో పెద్ద బొజ్జ లేసుకుని, పగలబడి నవ్వుతున్న ఫోజులలో చేతులు జోడిస్తూ ఒక జంట ఫోటో ఫుల్ పేజిలో ఉంది.
"వీళ్ళే బావా! ఈ కాలేజ్ ఫౌండర్స్!" వివరణ యిచ్చాడు వంశీ.
రెండో పేజీ తిప్పగానే ఆరు మడతలు పెట్టిన 1/8 డెమ్మీ సైజులో ఆ కాలేజీ క్యాంపస్ ఫోటో ఉంది. ఈ చివర్నించీ ఆ చివరి వరకూ వైట్ హౌస్ లెవెల్లో ఉంది.
ఇక తరువాత పేజీల్లో , పేజీ పైభాగంలో చిరంజీవి రిబ్బన్ కటింగులూ, ల్యాబ్ ఓపెనింగ్ లూ , స్పోర్ట్స్ మైదానంలో పుట్ బాల్ ఆడుతూ, పిల్లలతో డైనింగ్ టేబుల్ మీద భోంచేస్తూ ఇలాగ ఫోటోలున్నాయి. పేజీల కింద భాగంలో, చిరంజీవి అందాల సినీతారలతో డ్యాన్సులు చేస్తున్న ఫోటోలున్నాయి. ఒక పేజీలో వాటర్ ట్యాంకు ప్రారంభోత్సవం కింద రెయిన్ సాంగు ఫోటో ఉంది.
"ఇంతకీ ఫీజుల గురించి ఎక్కడ రాశారు?" అన్నాడు మూర్తి టైము చూసుకుంటూ. ఇంకో పావుగంటలో ఆఫీసుకి బయల్దేరాలి.
బావగారికి ఫీజు వివరాల పేజీ చూపిద్దామని వంశీ పీజీలు తిప్పుతుంటే ఒక ఫోటోలో ఎద్దుల్లాంటి ముగ్గురు పిల్లలకు ఫౌండరు మాడమ్ గోరు ముద్దలు తినిపిస్తోంది. ఫౌండరు సారు గుర్రంలాగా ఒంగి వుంటే ఆ పిల్లాడు ఎక్కి వూరేగుతున్నాడు.
"ఇదిగో బావా" అని చివ్వరి పేజీ చూపించాడు. భార్గవ చేరతానన్న కోర్సు హాస్టలర్స్ కైతే నలబై వేలు, డే స్కాలర్స్ కైతే (అంటే ఇంట్లోనే వుంటూ కాలేజీ కెళ్లి రావడమన్నమాట) ముప్పై వేలూ అని ఉంది.
మూర్తి గుండె కొట్టుకుంది. తన ఇంజనీరింగు చదువే మొత్తం మూడు వేలల్లో అయిపొయింది. ఈ ముప్పై వేలూ నలభై వేలూ ఏమిటి?
టైమింగ్స్ చూశాడు. హాస్టల్స్ లో వుండి చదువుకునే వారికి స్టడీ అవర్స్ ఇరవై నాలుగు గంటలూట. డే స్కాలర్స్ కైతే కేవలం పదమూడు గంటలేట. అంటే పొద్దున్నే ఏడున్నరకు వెళ్ళి రాత్రి ఎనిమిదిన్నరకు వస్తారన్నమాట. నలబై వేలు దగ్గర ఒక్క చుక్క వుంది. కింద చూస్తె 'అన్ని ఖర్చులూ కలుపుకుని , స్థానిక పన్నులు అదనం. నోహిడెన్ కాస్ట్స్' అని ఉంది.
"ఏమండీ! మనవాణ్ని హాస్టల్లో చేర్పిద్దామండీ. పసిబిడ్డ .... అంత పొద్దున్నే లేచి లంచ్ బాక్సు తీసుకుని వెళ్ళి, మళ్ళీ రాత్రి తొమ్మిదింటికి వస్తే చాలా హైరానా పడిపోతాడు " అంది ఇందిర. భార్య వైపు సూటిగా చూశాడు మూర్తి. భార్య కుట్ర అర్ధమైంది. ' మా ఉద్యోగులకు హాస్టలేమీ లేదు. నేను కూడా హాస్టలలో చేరిపోతే హాయిగా తెల్లవారు ఝామునుంచీ అర్ధరాత్రి దాకా సీరియళ్ళు చూసుకోవచ్చని ప్లాను" అనుకున్నాడు మనసులో.
