Previous Page Next Page 
ప్రతీకారం పేజి 19


    "బలే వాడివే" అంటూ ఇందిర గలగల నవ్వింది.
    రవి ఒక్కసారిగా కిందకు వంగి ఏదో వెతకసాగాడు.
    "ఏమిటీ వెతుకుతున్నావ్? ఏమైనా కనిపించడం లేదా?"
    "అవును !"
    "ఏమిటి ?"
    "చిరుగంటలు! నువ్వు నవ్వినప్పుడు రాలిన గంటకు ఎక్కడ పడ్డాయో కన్పించడం లేదు" అన్నాడు రవి లేచి నిల్చుని.
    వెనక్కు విరిచి దువ్విన జుట్టు చెరిపి అక్కడనుంచి పారిపోవాలనిపించింది ఇందిరకు.
    రైలు కూత వేసింది. రవి ముఖంలో చిలిపితనం మాయమైంది. గాంభీర్యం ఆ స్థానాన్ని ఆక్రమించింది.
    "మళ్ళీ రావడానికి వీలుండదు. ట్రైనింగ్ అయిపోగానే హైద్రాబాదు వెళ్ళి డ్యూటీలో చేరాలి. వెళ్ళగానే ఉత్తరం రాస్తాను. హైద్రాబాద్ వెళ్ళగానే మీ అమ్మగారిని కలుసుకోమంటావా?"
    "నువ్వు హైద్రాబాద్ చేరగానే ఉత్తరం రాయి నేను వారం రోజులు సెలవు తీసుకొని వస్తాను. అప్పుడే మా అమ్మను కూడా పరిచయం చేస్తాను."
    "వారం రోజులు సెలవు తీసుకుంటావా? అక్కడకు వచ్చాక మళ్ళీ నువ్వు తిరిగి వచ్చి ఈ ఉద్యోగంలో చేరగలవా?" కొంటెగా నవ్వుతూ అన్నాడు రవి.
    "ఎప్పుడూ వేళాకోళమే!"
    రైలు కదిలింది. రవి గబగబా వెళ్ళి రైలెక్కాడు.

                                              15

    రవి ఇంట్లో అడుగు పెడుతూనే అక్కడ జరుగుతున్న హంగామా చూసి విస్మయం చెందాడు. ఇంటికి సున్నాలు కొట్టారు. తలుపులకూ, కిటికీలకూ రంగులు వేస్తున్నారు.
    రవి ఓ క్షణం తండ్రికేసి విస్మయంగా చూశాడు.
    తను ట్రైనింగయి వస్తున్నందుకు ఇంత హడావిడా? పిచ్చి నాన్న! పెళ్ళికి చేస్తున్నంత హడావిడి చేస్తున్నాడు.
    పెళ్ళి అనుకోగానే ఇందిర జ్ఞాపకం వచ్చింది రవికి. నవ్వుకుంటూ లోపలకు వెళ్ళాడు.
    రవి స్నానం చేసి భోజనం ముందు కూర్చున్నాడు. మనసంతా ఇందిర రూపమే నిండుకొని వుంది.
    బజారునుంచి ఏవేవో సామాన్లు పట్టించుకొని అప్పన్న వచ్చాడు.
    "అప్పన్నా! ఏమిటవన్నీ?"
    "సరుకులు బాబూ!"
    "అన్ని సరుకులు ఎందుకు? మనింటి కెవరైనా వస్తున్నారా?" అడిగాడు రవి.
    అప్పన్న ఆప్యాయంగా రవి ముఖంలోకి చూసి సన్నగా నవ్వుకున్నాడు.
    "ఎవరొస్తున్నారు?"
    అప్పన్న ఓ క్షణం రవి ముఖంలోకి చూసి "రావాల్సిన వారే వస్తున్నారు బాబూ!" అన్నాడు.
    "అంటే?" అయోమయంగా చూశాడు రవి.
    "రజనమ్మగారు వస్తున్నారు!"
    "రజని వస్తుందా? రజని వస్తే ఈ హంగామా ఏమిటి?" ఇనుమడించిన ఆశ్చర్యంతో ప్రశ్నించాడు.
    "ఏంటి బాబూ! అంత మరీ పసిపిల్లాడిలా అడుగుతారు? తమరి పెళ్ళికి ఈ మాత్రం హంగామా వుండదా!" అన్నాడు అప్పన్న ముసి ముసిగా నవ్వుకుంటూ.
    "పెళ్ళా? ఎవరికి? నాకా?"
    "ఏం బాబూ అట్టా అడుగుతారు. మీకు కాక ఇంకెవరికి ఈ ఇంట్లో పెళ్ళవుద్ది!"
    రవి అన్నం పళ్ళెంలో చెయ్యి కడిగేసుకుని దిగ్గున లేచాడు. అప్పన్న తెల్లబోయి చూస్తూ వుండిపోయాడు.
    రవి వాకిట్లోకి వచ్చాడు. షామియానా వేసేవాళ్ళతో జగన్నాధం ఏదో మాట్లాడుతున్నాడు.
    "నాన్నా!" కారిడార్ లో నిలబడి గట్టిగానే పిల్చాడు రవి.
    "ఏమిటి బాబూ!" అంటూ జగన్నాథం రవి దగ్గిరకు వచ్చాడు.
    "ఏమిటిదంతా? షామియానా ఎందుకు?" విసుగ్గా అడిగాడు రవి.
    "ఈ నెల కాకపోతే మళ్ళీ రెండు నెలల దాకా ముహూర్తాలు లేవు. అందుకే ఇంత హడావిడిగా___"
    "నన్ను అడగకుండానే నా వివాహానికి ముహూర్తం పెట్టించారా?" రవి కంఠంలోని తీవ్రతకు జగన్నాథం చివ్వున తలెత్తి కొడుకు ముఖంలోకి చూశాడు.
    "నిన్ను అడిగి ముహూర్తం నిశ్చయించాల్సిన అవసరం ఉందని వూహించలేక పోయాను" దెబ్బతిన్న వాడిలా అన్నాడు జగన్నాథం.
    "అదికాదు నాన్నా! వివాహం నూరేళ్ళు పంట అంటారు. నా ఇష్టా ఇష్టాలు కనుక్కోకుండా పెళ్ళేమిటి? నాకు కాబోయే భార్య ఎవరో కూడా నాకు తెలియనక్కరలేదా?" అన్నాడు రవి బాధగా.
    "అంత నీ మనస్సు తెలుసుకోలేని వాణ్ననుకున్నావా రవీ! నీకు ఇష్టంలేని పిల్లతో నీ పెళ్ళి నిర్ణయిస్తానని ఎలా అనుకున్నావు? నీవు కోరుకునే పిల్లే నీ జీవిత భాగస్వామిని కాబోతోంది.
    రవి ఓ క్షణం అయోమయంగా తండ్రి మొహంలోకి చూశాడు. తను కోరిన పిల్లా? ఎవరు? ఇందిరా? ఇందిర, తల్లికి రాసి వుంటుంది. ఆమె నాన్నగారితో సంప్రదించి వుంటుంది. ఇందిర గట్టిదే! లాయరనిపించింది.
    రవి ముఖం ప్రసన్నం అవడం చూసిన జగన్నాథం రిలీఫ్ గా ఫీలయ్యాడు.
    "ఇందిర అమ్మగారు నిన్ను కలిశారా నాన్నా!" అన్నాడు ఉత్సాహంగా రవి.
    జగన్నాథం ఓ క్షణం రవి ముఖంలోకి లోతుగా చూశాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS