"ఇందిర ఎవరు?" అడిగాడు జగన్నాథం సాలోచనగా.
"మరి నా కిష్టమైన పిల్లతోనే వివాహం నిర్ణయించారన్నారు? ఎవరా అమ్మాయి?"
"ఇంకెవరు! మన రజని!"
రవి పిచ్చివాడిలా తండ్రి ముఖంలోకి చూశాడు.
"రజనీ నువ్వూ ఎంతో అన్యోన్యంగా వుంటారు. చిన్నప్పటినుంచీ కలిసి పెరిగారు. రజని మంచిపిల్ల! సౌందర్యవతి అందుకే..."
"నాన్నా! ఏమిటి నువ్వంటున్నది? రజనీతో నాకు పెళ్ళా?" షాక్ తిన్నవాడిలా అయిపోయాడు రవి.
జగన్నాథం రవి ముఖంలోకి చూస్తూ వుండిపోయాడు. రవి ధోరణి అతనికి అర్థం కావటం లేదు. రవి రజనీ ప్రేమించుకుంటున్నారనే అనుకున్నాడు. కొడుకు మనసు తెలుసుకొన్నాననే అనుకున్నాడు. అందుకే కొడుకు తిరిగి వచ్చేటప్పటికి ముహూర్తం నిశ్చయించారు.
"రజనీ నేను కలిసి పెరిగాం! నేను రజనీని నా చెల్లెలిలా అభిమానించాను."
"రవీ!" దాదాపు అరిచినట్టే అన్నాడు జగన్నాథం.
"అవును నాన్న! రజనీ నాకు చెల్లెలు. నాకు తమ్ముళ్ళూ, చెల్లెళ్ళూ లేని కొరత తీర్చింది. ఆమెను మరో దృష్టితో ఎన్నడూ చూడలేడు. రజనీని నా భార్యగా ఊహించుకోలేను. ఈ పెళ్ళి జరగటానికి వీల్లేదు. నేను మరొక అమ్మాయిని ప్రేమిస్తున్నాను."
జగన్నాథం వెర్రి చూపులు చూస్తూ వుండిపోయాడు.
"తల్లీ, తండ్రీ నువ్వే అయి నన్ను పెంచావు. జన్మ జన్మలకూ నీ రుణం తీర్చుకోలేను. నీకు కష్టం కలిగించే ఏ పనీ నేను చెయ్యకూడదనే ప్రతీ నిమిషం ఆలోచించాను. నన్ను క్షమించు నాన్నా! రజనీని నేను భార్యగా స్వీకరించలేను. నన్ను అర్థం చేసుకో నాన్నా!" ఉద్రేకంగా తండ్రికి రెండు చేతులూ జోడించాడు.
జగన్నాథం కుర్చీలో కుప్పగా కూలబడ్డాడు. ఇద్దరి మధ్య మాటలు లేవు చాలాసేపటివరకూ మౌనం రాజ్యం చేసింది.
"బాబూ నీ మీదే అన్ని ఆశలూ పెట్టుకొని పెంచాను. నా జీవితాన్నంతా నీ చుట్టూ పెనవేసుకున్నాను. నీ కోసమే ఇంతకాలం బతికి వున్నాను! రజనీని నువ్వు ప్రేమిస్తున్నావని భ్రమపడ్డాను. నువ్వు ట్రైనింగ్ అయి వచ్చేటప్పటికి నీకు అమూల్యమైన కానుకను అర్పించాలని ఆరాటపడ్డాను! మూర్తి కూడా మీరిరువురూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారనే అనుకున్నాడు! మూర్తి నాకు మరో ప్రాణం కష్ట సుఖాల్లో నాకు అండగా నిలిచిన వ్యక్తి. అతనికి మాట ఇచ్చాను. అతను ఎంతో పొంగిపోయాడు! శుభలేఖలు కూడా అచ్చు అయ్యాయి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఈ వివాహం జరగదని నేను చెప్పను! రజని జీవితం ఏమవుతుంది? ఆ అమ్మాయి నీమీద ఎన్ని ఆశలు పెంచుకుందో? తనను తనే సంజాయిషీ ఇచ్చుకుంటున్నట్టు మంద్రస్థాయిలో అన్నాడు జగన్నాథం బరువుగా.
రవి కర్తవ్యం తోచని వాడిలా చూస్తూ వుండిపోయాడు.
"నీకు ఇష్టంలేని వివాహం నేను బలవంతంగా చెయ్యలేను. నువ్వు మరో అమ్మాయిని ప్రేమిస్తున్నావని చెబుతున్నావు! ఇలాంటి పరిస్థితిలో ఏం చెయ్యాలో నాకు తోచకుండా వుంది. నీకు ఏది భావ్యం అని తోస్తే అదే చెయ్యి! ఒక నిర్ణయం తీసుకోబోయే ముందు తాపీగా ఆలోచించు. ఈ సమస్యను పరిష్కరించే బాధ్యత నీకే వదిలేస్తున్నాను." అంటూ కళ్ళు మూసుకొని కుర్చీలో వెనక్కు వాలాడు.
రవి తండ్రికేసి చూస్తున్నాడు. తండ్రీ కొడుకులు అలా మౌనంగా కొంతసేపు ఒకరి ఎదురుగా ఒకరు కూర్చున్నారో వారికే తెలియదు.
"నాన్నా!" ఏదో నిర్ణయానికి వచ్చినట్టు పిల్చాడు రవి.
జగన్నాథం అలసటగా కళ్ళు తెరిచాడు.
"నేను ఇప్పుడే మూర్తిగారి ఇంటికి వెళుతున్నాను. రజనీతో మాట్లాడి వస్తాను" అన్నాడు లేచి నిల్చుంటూ.
"నీ ఇష్టం అంటూ!" మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు జగన్నాథం.
గబగబా బయటికి వెళ్ళిపోతున్న రవి, పనులు చేస్తున్న వాళ్ళు ఎక్కడి పనులక్కడ ఆపేసి, తనకేసి వింతగా చూడటం గమనించాడు.
16
"నేను ఈ వివాహం చేసుకోను! అంతకంటే నాకు ఇంత విషమిచ్చి చంపెయ్యండి" రజని వెక్కిళ్ళ మధ్యలో అంది.
"నోర్ముయ్! అంతా నీ ఇష్టమేనా" ఎప్పుడూ పల్లెత్తు మాట అనని మూర్తి కూతుర్ని గద్దించాడు.
రజని కళ్ళల్లో నీరు గిర్రున తిరిగింది. పెల్లుబికి వస్తున్న దుఃఖాన్ని కంఠంలోనే అణుచుకుంది.
"రవికంటే అందగాడూ, మంచివాడూ, హోదాగల వాడూ, యేడేడు పుటాలు వేసి వెతికినా మళ్ళీ నీకు భర్తగా దొరకడు. నీ మంచి చెడ్డలు ఆలోచించే ఈ వివాహానికి అంగీకరించాను! ఇంకా నేను బతికే వున్నాననే విషయం గుర్తుంచుకో!" ఆవేశంగా అన్నాడు మూర్తి.
"నాకు తగిన భర్త ఎవరో నిర్ణయించుకోవాల్సింది నేను" మొండిగా అన్నది రజని.
"ఊహు! అంతదాని వయ్యావన్నమాట."
"అది కాదండీ! అది ప్రకాశ్ ను..."
"నువ్వు నోరు మూసుకుని లోనికెళ్ళు" గుడ్లు ఉరిమాడు మూర్తి భార్య "నా రాత! నా ఖర్మ" అంటూ లోపలకు వెళ్ళిపోయింది.
"ప్రకాశ్ ను చేసుకుంటావా? ఆ వెధవను? వాడు రవి కాలి గోటికి కూడా సరితూగడు! వాడు నాకు అల్లుడా?"
"నాన్నా ప్రకాశ్ కు నీ అల్లుడయ్యే అర్హత లేకపోవచ్చును. కాని నాకు భర్త..."
"నువ్వు నోరు మూసుకుంటావా లేదా?"
రజని కోపంతో దుఃఖంతో ఊగిపోయింది.
"అసలు నిన్నింత గారాబంగా పెంచడమే తప్పు! నీ స్వేచ్చకు అడ్డు రాకుండా నిన్ను స్వతంత్రంగా ఇంతకాలం వదిలేయటం మరో పెద్ద తప్పు." కంఠం బరువుగా ఉంది.
