Previous Page Next Page 
ప్రతీకారం పేజి 18


    "రజనీ!" అంటూ రజని చేతిని మృదువుగా పట్టుకున్నాడు ప్రకాశ్.
    "మరి సినిమాకు వెళదామా?" అడిగింది రజని.
    "పద! వెళదాం" అన్నాడు ప్రకాశ్.
    "ఒక్క క్షణం వుండు ఇప్పుడే వస్తాను."
    "మళ్ళీ ఇంట్లోకి ఎందుకు?"
    "ఈ నగ నా మెళ్ళో వుండటం నీకు ఇష్టం లేదుగా తీసి వస్తాను" అంటూ లోపలకు వెళుతున్న రజనీని సంతృప్తిగా చూస్తూ నిలబడ్డాడు ప్రకాశ్.
    జగన్నాథం, మూర్తీ చెస్ బోర్డు ముందు కూర్చుని వున్నారు.
    "అదేమిటి జగన్నాథం! అంత ఖరీదైన నెక్లెస్ ఎందుకు కొన్నావ్?" నొచ్చుకుంటూ, ఆ విషయాన్ని మర్చిపోలేని వాడిలా మళ్ళీ అడిగాడు మూర్తి.
    "కొనలేదు" ఏనుగును జరిపాడు జగన్నాథం.
    "కొనలేదా?" చివ్వున తలెత్తి ప్రశ్నించాడు విస్మయంగా మూర్తి.
    "అది మా అమ్మ నగ. ఆమె తన కోడలి మెళ్ళో పెట్టింది. అది మళ్ళీ మా ఇంటి ఆనవాయితీ ప్రకారం, మా కోడలి మెడను అలంకరించండి" అన్నాడు జగన్నాథం.
    మూర్తి జగన్నాథం ముఖంలోకి చూస్తూ వుండిపోయాడు. జగన్నాథం మాటలు వెంటనే అర్థం చేసుకోలేకపోయాడు. తను పొరపాటుగా వినలేదు కదా?
    "ఏం మూర్తీ! అలా మౌనంగా వుండిపోయావేం? ఫర్వాలేదు. నీకు ఇష్టం లేకపోతే చెప్పు! నేను నిన్ను అపార్థం చేసుకోను. రవి, రజనీకి తగిన వరుడేనని భావించాను! వాళ్ళిద్దరూ కలిసిమెలిసి పెరిగారు. ఎంత చనువుగా ఉంటారో నీకూ తెలుసుగా?"
    మూర్తి ఏదో అనబోయాడు. మాటలు రానివాడిలా అయిపోయాడు. హృదయంలోని భావాన్ని మాటల్లో వ్యక్తం చెయ్యడం మూర్తికి సాధ్యం కాలేదు. ఒక్కసారిగా లేచి జగన్నాథం రెండు చేతులూ పట్టుకొని_ "జగన్నాథం!" అని మాత్రమే అనగలిగాడు.
    "రజని నా ఇంటి కోడలు కావడం నా అదృష్టం మూర్తీ" అన్నాడు జగన్నాథం.
    "కాదు. రావిలాంటి అల్లుడు దొరకటం నా అదృష్టం! ఎన్నోసార్లు రవిని నా అల్లుడుగా ఊహించుకున్నాను. మళ్ళీ అత్యాశకు పోతున్నానేమో అనిపించేది" అన్నాడు మూర్తి సంతోషంగా ఉక్కిరి బిక్కిరి అయిపోతూ.
    జగన్నాథం చిరునవ్వు నవ్వాడు.
    "ఇరవై సంవత్సరాలు పోలీసుశాఖలో ఉద్యోగం చేశాను. కిందినుంచి పైకి దేక్కుంటూ అతికష్టం మీద డిప్యూటీ సూపర్నెంటు అయ్యాను. సూపర్నెంటు కావాలనే కోరిక తీరకుండానే రిటైర్ అయ్యాను. కాని నా అల్లుడు పోలీసు సూపర్నెంటు. పోలీసుశాఖలో వాళ్ళు ఇప్పుడు నాకు సలాం కొట్టటం మానేశారు. మరోసారి చూపిస్తాను నా తడాఖా!" ఉత్సాహంగా అన్నాడు మూర్తి.
    జగన్నాథం నవ్వుతూ "ఊఁ కానియ్!" ఎత్తువెయ్యి!" అన్నాడు.

                                              14

    "మీకోసం ఎవరో వచ్చారమ్మా!" అన్నాడు ప్యూన్ ఇందిర దగ్గరకొచ్చి నిలబడి.
    ఇందిర తలెత్తి బంట్రోతు ముఖంలోకి చూసింది. ఫైళ్ళు మూస్తూ "ఎవరూ?" అన్నది.
    "పేరు చెప్పలేదు. విజిటర్స్ రూంలో కూర్చున్నారు."
    ఏదో కొత్త కేసు వచ్చిందనుకొని విజిటర్స్ రూంకు వచ్చిన ఇందిరకు రవి కనిపించాడు. ఇందిర గుండెలు గబగబా కొట్టుకున్నాయి. ముఖంలో ఎంతో వెలుగు అలుముకుంది. మనసు మల్లెపందిర అయింది.
    'అల్లరివాడు!' మనసులోనే అనుకుంది.
    "ఎప్పుడొచ్చారు?" ఏదో అనాలి కనుక అన్నది.
    "అబ్బే డైలాగు బొత్తిగా చప్పగా వుంది. ఇటువంటి సన్నివేశాల్లో కథల్లో హీరోయిన్ లా మాట్లాడాలి! మీరు తెలుగు నవలలు ఎక్కువ చదవరనుకుంటాను?"
    ఇందిరకు చెంపలు కెంపులయ్యాయి. కళ్ళు రెండూ రెండు బల్బుల్లా వెలిగిపోతున్నాయి. ముఖంలో దాచాలన్నా దాగని సంతోషం!
    "ఉత్తరం రాస్తానని రాయలేదేం! నన్ను పూర్తిగా మర్చిపోయారనుకున్నాను."
    "అందుకేనా పాపం అంతగా చిక్కిపోయారు?" అన్నాడు రవి నవ్వుతూ.
    "నేనెవరికి చిక్కిపోలేదు!"
    "నాట్ బ్యాడ్! అప్పుడప్పుడు బాగానే మాట్లాడతారు?"
    "మీ అంత బాగా కాదులెండి!" అన్నది నవ్వుతూ.
    "ఇందిర మధ్యాహ్నం నుండి సెలవు పెట్టి వచ్చేసింది. ఆ తర్వాత వారం రోజులు సెలవు తీసుకుంది. ఇద్దరు ఎక్కడెక్కడో తిరిగారు. ఎన్నెన్నో కబుర్లు చెప్పుకున్నారు. ఆ ఏడు రోజులూ ఏడు నిముషాల్లా గడిచిపోయాయి.
    ప్లాట్ ఫారం మీద దిగాలుబడి నిలుచున్న ఇందిర చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు రవి.
    "మళ్ళీ దర్శనం ఎప్పుడు?" ఇందిర కంఠం బరువుగా వుంది.
    "చెప్పనా?" అంటూ సైగతోనే, మంగళ సూత్రం కట్టేప్పుడు అన్నట్టు చూపించాడు.
    "ఛీ! పో! నీకు అసలు సీరియస్ గా వుండటమే తెలియదు. ఎప్పుడూ అల్లర్లే!" అన్నది ఇందిర చిరుకోపంతో.
    "నా అల్లరి మాటలకేగా నువ్వు నన్ను ప్రేమించావు? ఆ రోజు రైల్లో నేను సీరియస్ గా కూర్చుంటే, ఈ రోజు ఇక్కడ ఉండేవాళ్ళమా?" అన్నాడు.
    ఇందిర మూతి సున్నా చుట్టింది.
    "కోపంలో ఎంత అందంగా వున్నావో తెలుసా? ఎప్పుడూ ఇలా కోపంగానే వుండకూడదూ...ముద్దొస్తూ."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS