ఆ పనిమీద వెళుతూ పాదప్రక్షాళన చేసుకొని, దాహం తీర్చుకునే నిమిత్తం ఆయన కోనేరును సమీపించారు. "వాగ్దేవీ వుంభావమూర్తులకు నమస్సులు" అన్నాడు సోమదేవుడు. వేమాంబ ఆయన పాదాలకు ప్రణమిల్లి లేచింది. ఒక సీన పద్యంలో ఆశీర్వదించి వారిద్దరినీ ముగ్ధులను చేశాడు శ్రీనాధుడు. శ్రీనాధుడు శిలావేదికపై ఆశీనులు కాగా ఇద్దరూ చెరొకప్రక్కా నిలిచారు.
"తల్లీ! వేమాంబకా! నీవు భూరిసద్గుణనికురంబ అయిన సూరమాంబ కడుపున జన్మించావు ఆమె విదుషి. ఆమె సద్గుణాలను పుణికి పుచ్చుకుని నీవు యశోవి రాజితురాలిని కావాలి" అన్నారాయన.
"శ్రీనాథయ్యా! మీరింత చెప్పవలసినదేమున్నది? నా కర్తవ్యాన్ని నేను విస్మరించలేదు. నిర్వర్తించాను" అంటున్నప్పుడామె నేత్రాలు సజలాలయ్యాయి. ఆ అశ్రువులను చూచి శ్రీనాధుడు మహాస్ఫూర్తితో మరో పద్యం చదివాడు.
"తటాకంలో కలువలుండటం లోకరీతి. సౌందర్య పిపాశువులైన కవులకు అది స్ఫూర్తిదాయకమైన దృశ్యమే! కాని కలువలలో (కన్నులలో) కన్నీటి తటాకాలను చూచిన ఈ శ్రీనాధుడు ఆ కవులందరికన్నా ధన్యుడు" అని. ఆ పద్యానికి అర్థం. ఇక్కడ కవి సమయస్ఫూర్తి. ఆనందదాయకమైనదే కాని, ఆ భావం హృదయ విదారకమైనది. వేమ తల వంచింది.
"గురుదేవా! నేను మోటుపల్లి యుద్ధానికి వెళ్ళాలనే మీరూ సంకల్పించారా?" అని ప్రశ్నించాడు సోమదేవుడు. "నీవు విజయుడవై తిరిగి వస్తావు కనుక అది మహా యశోదాయకమే కదా?" అంటూ ప్రతి ప్రశ్న వేశాడు శ్రీనాధుడు.
సోమదేవుడు మిన్నకున్నాడు. వేమాంబ వంచిన తల ఎత్తలేదు. ఎందుకంటే ఆమె హృదయం ఆమె కన్నుల్లో ప్రతిఫలిస్తోంది. ఆ భావాలను సోమదేవుడు చదవరాదు.
"తల్లీ! రానున్న వంసంతోత్సవాలకు రాచకార్యాలన్నీ సానుకూల మౌతాయి. నీవు నిశ్చింతగా వుండవచ్చును. నీ సోమదేవుడు అభిమన్యుని వలె యశోవిశాలుడౌతాడు" అని నాలుక కరచుకున్నాడు. వాగ్దేవి దయ అలా వున్నది అని తలపోశాడాయన. తలవంచి ఆలోచనా నిమగ్నులయ్యారు, కనుకొలకుల నుండి ఓ బాష్పబిందువు జారి నేలపాలయింది.
వేమాంబ ఉబికివస్తున్న వెక్కిళ్ళను ఇక నిలువరించుకోలేనని తలపోసింది. చివ్వున వెనుదిరిగి అంతఃపుర ముఖంగా పరుగెత్తసాగింది. ఇద్దరూ నిశ్చేష్టులయ్యారు.
"శ్రీనాథయ్యా ఏమిటీ దుస్థితి" అన్నాడు సోమదేవుడు ఖిన్నుడై. "నాయనా! నీవు మహావీరుడవు, ధైర్యశాలివి. అతి స్నేహం పాపశంకీ" అనే సూక్తిని నీవు వినలేదా! ఈ విషయానికి అంతకుమించిన ప్రాముఖ్యత లేదు. కనుక నీవు నిశ్చింతగా సాగిపో!" అంటూ లేచారాయన.
సోమదేవుడాయనకు నమస్కరించి శలవు తీసుకున్నాడు. యుద్ధానికి వెళ్ళి విజయలక్ష్మిని చేపట్టాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగిపోయాడు. ఆరోజే కొండవీడు నుండి యక్కటి వీరులకి, జీతగాండ్రు (రోజువారి బత్తెములు తీసుకుని యుద్ధ సమయంలో అక్కరకు వచ్చే తాత్కాలిక సైనికులు) నగర రక్షక దళాల పటాలాలు బయలుదేరి మోటుపల్లి దిశ వెళ్ళిపోయాయి. ఆ పటాలాలకి నాయకుడు సోమదేవుడు.
ఉద్యానవనం నుండి మనసును పిండివేసే దుఃఖ భారంతో వెళ్ళిపోయిన వేమాంబ కొద్ది నిముషాలు తన మహలులో ఏకాంతంగా గడిపింది. కొన్ని రోజుల వరకూ తననెవరూ చూడటానికి వీలులేదని చెలికత్తెల ద్వారా కట్టడిచేసి ఆమె ఏకాంతంలో ఉండిపోయింది.
మరునాడు వేమాంబ అంతఃపురవాసం నుండి ఓ పదునారేళ్ళ యువకుడు సైంధవాశ్వం మీద నగరంలోని దారితీశాడు. అది వేకువ సమయం కావటాన వీధుల్లో జనసంచారం అట్టేలేదు. ఆ సైంధవాశ్వం అలా కొంతసేపు పరుగెత్తి నగరం వెలుపలనున్న బలిజవారి వీథిలోకి మలుపు తిరిగింది.
ఆ వీధి మలుపులో చాలామంది జనం గుమిగూడి ఉన్నారు. ఆ గుంపుకు కొద్ది దూరంలో రౌతును పోగొట్టుకున్న దానివలె ఒక గుర్రం నిలిచి వుంది. యువకుడు కుతూహలంతో ఆ ప్రాంతాన్ని సమీపించి అశ్వాన్ని దిగాడు. జరుగుతున్నదొక విషాదకరమైన కథలాంటి దృశ్యం.
ఆ గుంపు మధ్యలో దారుణంగా హత్య చేయబడిన ఒక యువకుని శవం పడివుంది. ఆ యువకుడింకా ముక్కుపచ్చలారని వాడుగా కనబడుతున్నాడు. ఓ ముదుసలి ఆ శవం మీద పడి హృదయ విదారకంగా శోకిస్తోంది. ఆ గుంపులో చేరివున్న జనం జరిగిన విషయాన్ని ఏమీ వ్యాఖ్యానించకుండా చూస్తూ నిలబడ్డారు!
అప్పుడే సైంధవాశ్వాన్ని దిగిన యువకుడు ఒకణ్ని చేరువకు పిలిచి విషయం తెలుసుకున్నాడు.
రాచవేముడు ఇక కొద్ది రోజులకు రాజుకానున్నాడు. కటకం వరకూ వ్యాపించి ఉన్న కొండవీడు సామ్రాజ్యానికి అతడు కానున్న ఏలిక.
