ఇప్పుడెట్లా?" అంది సృష్టి భయంతో అతనికి బాగా దగ్గరగా జరుగుతూ. ఆమెలో అపారమైన విజ్ఞానం ఉంది -- గాని అతనిలో ఉన్న దైర్యసాహసాలు వున్నట్లుగా లేదు.
ఆమెకి ధైర్యం చెబుతున్నట్లు వెన్ను నిమిరాడు రాజు.
మంటలు వాళ్ళని సమీపిస్తున్నాయి.
'అమ్మయ్యో!" అంది సృష్టి.
ఆమెని ఇంకా దగ్గరికి తీసుకున్నాడు రాజు.
నెమ్మదిగా అంది సృష్టి.
"ఇలా ఈ జీవితపు చివరి క్షణాలు మీలాంటి మంచి వ్యక్తీ సాన్నిధ్యంలో గడిచిపోవడం దేవుడిచ్చిన వరం అనుకుంటాను ."
"చివరి క్షణాలని మనం చివరి క్షణం దాకా అనుకోకూడదు " అన్నాడతను.
అతని ఆశావాదం ఆమెకి ఆశ్చర్యాన్ని కలిగించింది.
అతని నిరంతర ఆశావాదానికి ప్రకృతి కూడా అతని పక్షం వహించినట్లుగా -- క్షణాలలో ఆకాశం కాస్తా కారు మబ్బులతో నల్లగా అయింది.
రాక్షసుల సైన్యం ఆకాశాన్ని ఆవరించుకున్నట్లుగా --
చిత్రాతి చిత్రమైన ఆకారాలలో ఉన్న దట్టమైన నల్లటి మబ్బులు -- ఆకాశం అంతటా అలుముకున్నాయి.
మరుక్షణంలో -
ఆకాశానికి కోటాను కోట్ల చిల్లులు పద్దట్లుగా భోరున వర్షం . హోరున గాలి.
ఖాండవ దహనంలా సాగుతున్న మంటలు కాస్త చల్లగా చప్పున ఆరిపోయాయి.
హోరు గాలి సృష్టి షర్టుని తడిపేసి అందాలని దగనివ్వడంలేదు.
సిగ్గుగా తలెత్తి రాజు వైపుకి చూసింది సృష్టి.
సాటి ప్రాణి అన్న అభిమానమే తప్ప ఒక అందమైన ఆడపిల్ల తన కౌగిట్లో వుందన్న తలపు అతని తలలో మేదుల్తున్నట్లుగా లేదు.
ఆ భావన కలగగానే అతనికి మరింత దగ్గరిగా జరిగింది సృష్టి. అతని స్పర్శతో ఆమె ఒళ్ళు వేడిగా అయిపోయినట్లయింది.
"నిప్పు గురించి మీకు తెలుసా ?" అంది సృష్టి.
"నీకు నాకన్నా ఎక్కువే తెలిసి ఉండాలిగా -- నువ్వు చెప్పు " అన్నాడు రాజు నవ్వుతూ.
"ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మానవుడి నాగరికతకి బొటనవేలు ఎంత ముఖ్యమో, నిప్పు తయారీ కూడా అంతే ముఖ్యం."
"అంటే?"
"మనిషి ఒకప్పుడు తన ఆహారాన్ని వండుకోకుండానే పచ్చివిగానే తినేవాడు. ఆ తర్వాత తర్వాత , నిప్పులో కాలినవి ఎక్కువగా రుచిగా వుంటాయని గ్రహించాడు. పైగా నిప్పు దగ్గరుంటే క్రూరజంతువులూ భయపడి దగ్గరికి రావని కూడా తెలిసింది. కానీ, నిప్పు తయారుచేయడం మాత్రం తెలియదు -- ఇట్లాగే , అడవిలో ఎండు చెట్లు ఒకదానికి ఒకటి రాసుకుని నిప్పు రాజుకునేటప్పుడు దాన్ని వాడుకునేవాడు. ఆతర్వాత తర్వాత , తనే ఒరిపిడితో నిప్పు తయారుచేయటం నేర్చుకున్నాడు. నిప్పు కావాలనుకున్నప్పుడు చేయగలిగిన ప్రాణి మనిషి ఒక్కడే!
ఆ తర్వాత బండి చక్రం తయారీ మొదలయింది. ఎలెక్ట్రానిక్స్ యుగం వచ్చేదాకా బండి చక్రం దగ్గర్నుంచీ గడియారంలో పార్ట్స్ దాకా అన్నీ చక్రాలే గదా!
ఆ విధంగా బొటనవేలు రివర్సులో ఉండడం, నిప్పు తయారుచేయడం, చక్రం తయారు చేయడం -- ఈ మూడు మనిషి నాగరికతలో ముఖ్య ఘట్టాలు. అదిసరే , నిప్పు అంటే అగ్ని -- రకరకాలుగా వుంటుంది గదా. అడవుల్ని మండించే దావాగ్ని, సముద్ర గర్భంలో ఉండే బడబాగ్ని వగైరా వగైరా .......వంట్లో ఉండే తాపాన్ని ఏమంటారు రాజ్?"
కాస్త అలోచించి "జ్వరం!' అన్నాడు రాజు.
పట్టలేనంత నవ్వొచ్చింది సృష్టికి -- అతని భుజం మీద ఒక్క దెబ్బ వేసి ,, "నువ్వెక్కడో నిజంగా త్రేతాయుగంలో పుట్టాల్సిన వాడివే -- అపర శ్రీరామచంద్రుడు" అంది.
ఇద్దరూ చెట్టు దిగి కిందికి వచ్చారు.
ఇంతలో పెద్ద రొప్పు వినబడింది.
రొప్పుతో బాటే పాదాల కింద ఆకులు నలుగుతూన్న శబ్దం -- అడుగుల చప్పుడు !
ఇద్దరూ అలర్టుగా అయి, అటువైపు చూశారు.
అక్కడ ఒక చిత్రమైన దృశ్యం కనబడింది.
ఒక యువకుడు చాలా ప్రయాసపడుతూ భుజం మీద ఒక కావడి మోసుకుంటూ వస్తున్నాడు.
ఆ కావడిలో కుండలు లేవు, బిందెలు లేవు. మరే సరంజామా కూడా లేదు.
కానీ --
కావడిలో ఇద్దరు వృద్దులు కూర్చుని ఉన్నారు. ఒక స్త్రీ -- ఒక పురుషుడు.
ఆ వృద్దులు ఇద్దరికీ కళ్ళు లేవు. అంధులు.
రాజుని చూడగానే ఆ యువకుడు ఉస్సురంటూ కావిడిని కిందికి దింపి నుదుట వున్న చెమటని తుడుచుకున్నాడు.
"అన్నా! రాముడి మడుగు ఇంకెంత దూరం?" అన్నాడు ఆయాసపడుతూ.
"రాముడి మడుగా-- రాముడి మడుగుని గురించి వినడమే తప్పా ఎప్పుడూ చూళ్ళేదు -- దారి నాకూ సరిగ్గా తెలియదు -- సారీ బ్రదర్ ' అన్నాడు రాజు.
"రామాపురంలో రాములోరి గుళ్ళో జాతరకి వచ్చినోళ్ళు అడవిలో ఉన్న రాముడి మడుగులో స్నానం చేస్తే పుణ్యం వస్తుందంటారు. అమ్మా నాన్నల్ని జాతరకి తీసుకొచ్చి మడుగులో స్నానం చేయిస్తే తల్లిదండ్రుల ఋణం తీర్చేసుకున్నట్లుగా వుంటుంది. రాముడి మడుగు అంటే పెట్రేయిలంకకి దగ్గరేగా -- ఇటే అయుండాలి. వెళ్ళొస్తా ...పళ్ళెమన్నా తింటావా అమ్మా! బీడీ కాల్చుకుంటావా నాన్నా!" అన్నాడు అతడు.
"మాకేం వద్దురా నాయనా! రాముడి మడుగులో స్నానం చేయిస్తానన్నావు మా ప్రాణాలు గుటుక్కుమనేలోగా ఆ తీర్ధంలో స్నానం చేసి పుణ్యం మూట గట్టుకోవాలని ఉందిరా మా తండ్రీ!' అన్నారు ఆ వృద్ద దంపతులు.
మళ్ళీ కావడిని భుజాన వేసుకుని, "వెళ్ళొస్తానన్నా" అని చెప్పి , భారంగా అడుగులు వేస్తూ సాగిపోయాడు ఆ యువకుడు.
"రాముడి మడుగా ? ఇక్కడంతా రామమయంలాగా వుందే!" అంది సృష్టి ఆశ్చర్యంగా.
"పైగా , ఆ రాముడి మడుగు పెట్రాయిలంక పక్కనట -- రాముడు - రాక్షసుడు -- లంక తలుచుకుంటే చిత్రంగా లేదూ?" అన్నాడు రాజు సాలోచనగా.
"కొతులు కూడా " అంది సృష్టి.
అంతలోనే --
ఒక మొగ కోతి - అది తన గుంపుకి లీడరయి వుండవచ్చును -- ఒక చెట్టు చిటారు కొమ్మ మీద నుంచి డేంజరు సిగ్నలు ఇస్తున్నట్లుగా అరుస్తోంది. దానికి తోడుగా చెట్ల మీది పక్షులన్నీ కలవరంగా అరుస్తూ గాల్లోకి లేచాయి.
కోతులు , పక్షుల కలవరం పెద్ద పులి రాకకి సంకేతం అని రాజుకి తెలుసు.
"పెద్ద పులి !' అన్నాడు రాజు. "సృష్టీ! చెట్టేక్కేయ్! క్విక్!"
అతని మాట పూర్తీ కాకుండానే పొదల్లోంచి లంఘించింది పులి.
