అతనోసారి చుట్టూ చూసి భారతి కెదురుగా వచ్చి నించున్నాడు.
"నన్ను గుర్తుపట్టలేదా! మనోహర్ని" అన్నాడు.
చుట్టుపక్కలందరూ తననే చూస్తున్నారు. ఇక అక్కడ అతనితో మాట్లాడకపోతే అందరూ వింతగా చూస్తారు. అదీగాక తను ఏదో ఒకటి మాట్లాడితే తప్ప అతను వదిలి పెట్టేలా కనబడలేదు.
"లేకేం..... బాగా గుర్తున్నారు" అంది.
"థాంక్యూ వెరీమచ్. అందమైన ఆడపిల్లబాగా గుర్తుపెట్టుకొందంటే చాలా అదృష్టవంతుడ్నే అన్నమాట" అన్నాడ మనోహర్.
"అవున్నిజమే. అదృష్టవంతులు కనకే బయట తిరగ్గలుగుతున్నారు" అంది భారతి కాస్త వెటకారంగా.
ఆమె మాటల్లోని అంతరార్ధం అతనికి అర్థం అవలేదు.
"కరెక్టు భారతీ. తిరిగే వయసులో కాకపోతే బయట ముసలివాడినయ్యాక తిరుగుతానా! పద..... కాలేజీ దగ్గర డ్రాప్ చేస్తాను" అన్నాడు చాలా ఈజీ ధోరణిలో మనోహర్.
"ఈ డ్రాప్ లూ, లిఫ్టులూ నాకలవాటు లేదు. మీ దారిన మీరు వెళ్ళొచ్చు."
"ఈ మాత్రానికేనా! దీనికో ప్రిన్సిపుల్ అవసరమని నేను అనుకోవడంలేదు."
"ఈజిట్! అయితే మీ అక్కనో చెల్లినో ఎవరైనా ఇలాగే అడిగితే మీరేం చేస్తారు!" భారతి సాధారణమైన ధోరణిలోనే అడిగింది.
దానికి మనోహర్ తమాషాగా నవ్వేశాడు.
"నాకు అక్కలూ, చెల్లెళ్ళూ ఎవరూ లేరు. ఒకవేళ ఉండివుంటేవాళ్ళ స్వేచ్ఛకి మాత్రం నేను అడ్డుపడేవాడిని కాను. అది నా ప్రిన్స్ పుల్" చెప్పాడు మనోహర్.
అతనిచ్చిన సమాధానం విన్నాక ఏం మాట్లాడాలో ఆమెకు తోచింది కాదు.
తరువాత మెల్లగా అంది.
"మా అమ్మ మాత్రం తోలు తీసేస్తుంది. నన్నేకాదు, కారెక్కించుకున్నవాడిని కూడా"
మనోహర్ చిత్రంగా నవ్వి "ఆంటీ అంత పవర్ ఫుల్ లేడీ అన్నమాట. వెరీగుడ్"
భారతి మొహం కందగడ్డలా తయారైంది. వెర్రికోపంతో చూసిందతన్ని.
"భారతీ ప్లీజ్, అందరూ మననే వింతగా చూస్తున్నారు. కారెక్కు"
"సారీ, నేనెక్కను"
"నీతో నేను చాలా మాట్లాడాలి"
భారతి తమాషాగా నవ్వేసింది.
"వండర్ ఫుల్ నాతో చాలా మాట్లాడాలా! నాతో మాట్లాడ్డానికి అన్న మాటలెక్కడ్నుంచి వూరాయి"
"నీకెలా చెబితే అర్థం అవుతుందో"
"నాకు ఎలాచెప్పినా అర్థం కానవసరం లేదు. ప్లీజ్ ఇక నన్నింబ్బంది పెట్టక వెళ్ళండి"
మనోహర్ ఏమనుకున్నాడో వెంటనే వెనక్కి తిరిగాడు. రెండడుగులు వేశాడో లేదో భారతి అతన్ని పిలిచింది.
"మిష్టర్ మనోహర్?" ఆ పిలుపుతో అతనిలో ఆశ జనించింది.
"వస్తున్నావా!" అడిగాడు.
భారతి తల అడ్డంగా వూపింది.
"మరోసారి నన్నిలా ఇబ్బంది పెట్టకండి. ఆ మాట చెప్పాలనే పిలిచాను" అంది.
మనోహర్ మాట్లాడలేదు. మౌనంగా వెళ్ళి కారెక్కి స్టార్ట్ చేశాడు.
భారతి తేలిగ్గా ఊపిరి తీసుకొంది.
"అదే నేనైతే ఎగిరి గంతేసి మరీ ఆ కారెక్కేవాడిని"
ఆ మాటలకి వెనక్కి చూసింది. బోసుబాబు వెనకే నిలబడి ఉన్నాడు. రాస్కెల్" అన్నీ విన్నాడన్నమాట.
"ఫూల్" అంది కోపంగా.
"మహా ప్రసాదం" అన్నాడు బోసుబాబు.
13
అవంతి బయలుదేరబోతుంటే రమణి అడిగింది.
"నన్ను తోడుగా రమ్మంటావా?" అని.
"వద్దు మనోహర్ని రమ్మని ఫోన్ చేశాను" అంది అవంతి.
"వస్తానన్నాడా?"
"వస్తాడు" అంది.
అవంతి బయటకు వచ్చి మెల్లగా నడవడం మొదలు పెట్టింది. సాయంత్రం ఆరు అయింది చల్లగాలి ప్రారంభం అయింది.
ఆటోగాని, రిక్షాగానీ ఎక్కాలనిపించలేదు. వారాసిగూడలో నర్సింగ్ హోమ్ ఉంది. అక్కడికి రెండు కిలోమీటర్లు దూరం ఉంటుంది. నడిచే వెళ్ళాలని నిశ్చయించుకొని నడవడం మొదలుపెట్టింది.
"తను చేయబోతున్న పని ఎంత వరకు సమంజసం!"
ఆమె ఆలోచనలు మళ్ళీ మొదటికి వచ్చాయి.
కాని పని చేస్తున్నానన్న భావన ఆమె మనసుని తొలుస్తోంది.
ఎంత ఆలోచించినా, తర్కించినా అబార్షన్ తప్పదు.
ఈ పాపం మళ్ళీ తనని వెంటాడదు కదా అన్న భయం ఓ పక్కన ఆమెని పీడిస్తూనే వుంది.
అదే ఆలోచనలతో నర్సింగ్ హోం దగ్గిరగా వచ్చేసింది.
మనోహర్ కోసం చూసింది. అతనింకా వచ్చిన జాడ కానరాలేదు. అతను ఖచ్చితంగా వస్తానని చెప్పాడు. మాటిస్తే తప్పకుండా వస్తాడతను. ఆ సంగతి అవంతికి బాగా తెలుసు.
నెంబరు తీసుకొని బల్లమీద కూర్చుంది. తను త్వరగా రావడం చేత అక్కడ రద్దీగా అనిపించలేదు. సాధారణంగా ఏడు దాటిన తరువాత చాలా పెద్ద క్యూ తయారవుతుందక్కడ.
తను తెలిసిన వాళ్ళెవరన్నా అక్కడగానీ వున్నారా అన్న అనుమానంతో చుట్టూ పరికించి చూసిందోసారి.
ఎవరూ లేరని నిర్ధారించుకొన్నాక ఊపిరి పీల్చుకొంది.
