"ముందు తినండి. తరువాత తీరిగ్గా మా మహిళాసదన్ ఆచార వ్యవహారాలను విమర్శిద్దురుగానీ."
ఇక తప్పదన్నట్లు అతను మెల్లగా తిన్నాడు.
ఆ కార్యక్రమం పూర్తయ్యాక అతను కిటికీ అంచుమీద కూర్చున్నాడు.
ఒక వ్యక్తితో మాట్లాడడం హాయిగా వుంది. అందుకే ఆ సమయంలో జ్ఞాన సముపార్జన కోసం లైబ్రరీకి వెళ్ళాలన్న విషయం మరిచిపోయింది.
అతను రిలాక్స్ డ్ గా కూర్చున్నాక "మీరు అవతల గదిలోంచి ఇవతలకి వచ్చి మాట్లాడుతూనే ఒక్క క్షణం భయపడ్డాడు. దానికి కారణం మీరు వెళ్ళిపోయారానే అనుకున్నాను"
"కొంపదీసి దెయ్యం అనుకున్నారా ఏమిటి? దెయ్యం భయంవల్ల మా ఆనందరావు ఇప్పటికీ బయట పడుకోలేకపోతున్నాడు.
"ఆనందరావా? ఎవరతను?" అంటూ కుతూహలంగా అడిగింది మౌనిక.
"ఆనందరావు నాకు అన్నయ్య వరసవుతాడు. మేం అప్పుడు రాజు కండ్రిగలో వుండేవాళ్ళం. అప్పుడు జరిగింది ఈ దెయ్యం ప్రహసనం"
ఆమెకి అదంతా వినాలని వుంది. కానీ చెప్పండి అని అడగటానికి మనసు రావడం లేదు. అతను మాత్రం ఇంట్రెస్టింగ్ గా చెప్పుకుపోతున్నాడు.
"రాజులకండ్రిగ పగలు ఎంత బావుంటుందో, రాత్రయితే అంత భయానకంగా వుంటుంది. మెయిన్ రోడ్డుకి ఆనుకుని వున్నా చుట్టూరా అడవి. ఆ రూట్ లో వాహనాల రాకపోకలు కూడా చాలా తక్కువ. పారిస్ లో లైఫ్ రాత్రి పదిగంటలకు స్టార్ట్ అవుతుందట. అయితే ఆ పల్లెలో రాత్రి ఏడుగంటలకే లైఫ్ స్టాప్ అయిపోతుంది. చలికాలమైతే ఇంకా అరగంటకుముందే ఊరి జనం దుప్పట్లు ముసుగేస్తారు.
ఆ ఊర్లో రమణి అనే ఓ అమ్మాయి వుండేది. పాతికేళ్ళలోనే కష్టాల్నంతా చవిచూసేసింది. పెళ్ళయిన అర్నెల్లకే కట్టుకున్న మొగుడు గుండెజబ్బుతో చనిపోయాడు. పుట్టింట్లోనూ తిండికి గడవని స్థితి. అందుకే భర్త పోయినా అత్తగారింట్లోనే వుండిపోయింది. మామ రామయ్య మరో చండశాసనుడు. తన కుటుంబ పరువుప్రతిష్టలన్నీ కోడలు ప్రవర్తనమీదనే ఆధారపడి వున్నట్లు ఆమెను ఇరవై నాలుగ్గంటలూ కాచుకుని వుండేవాడు. చివరకు బావి దగ్గరకు నీళ్ళకెళ్ళినా వెనకే బయల్దేరేవాడు.
ఐదూ ముప్పావు అడుగుల పొడుగుతో, చామనఛాయలో అందంగా వుండే రమణి అంటే వూర్లోని మగకారంతా వెర్రెక్కిపోయేది. ఈమెతో పడకటింట్లో ఓడిపోతేనే రంజుగా వుంటుందని ఏ మగాడికైనా అనిపిస్తుంది. పడుకుంటే మంచానికి సరిపోదని నమ్మకంగా అనిపించే ఎత్తుతో, మామూలు కళ్ళతో చూసినా భూతద్దంలో చూసినట్టు భారీ అవయవ పుష్టితో కనబడే ఆమెకోసం ట్రై చేయని మగాడంటూ ఆ ఊర్లో లేకపోయాడు.
కానీ ఆమెకి మాత్రం పక్కింటి ఆనందరావంటే ఇష్టం ఏర్పడింది. అలాగని ఆనందరావంటే చాలా గొప్పవాడనుకుంటే పొరబాటే. వ్యవసాయం చేసేవాడు. తనకన్నా పెద్దవాళ్ళయిన ఇద్దరు అక్కయ్యలకు తనే పెళ్ళి చేశాడు. ఇక మిగిలింది తనొక్కడే.
రమణి అతన్ని ఇష్టపడిందిగానీ అతనితో మాట్లాడే ధైర్యం చేయలేకపోయింది. మామూలుగానే నెమ్మదస్తురాలు. అంతకుమించి బెరుకు. అప్పటికీ అప్పుడప్పుడూ ఇన్ డైరెక్టుగా తను ఇష్టపడుతున్నారన్న సంగతి చెప్పేది. కానీ ఆనందరావుది మట్టిబుర్ర. ఆమె మనసేమిటో కనుక్కోలేకపోయాడు.
డిశంబర్ నెల వచ్చింది. గాలికి ఫ్లూ జ్వరం వచ్చినట్లు మెల్లగా తగులుతోంది.
కడుపులో కూడా చలి మొదలైనట్లు జనం ఆరుగంటలకంతా తలుపులు బిగించేస్తున్నారు.
ఓ రోజు ఆ ఊరికి దుప్పట్లు వేలం వేసేవాళ్ళు వచ్చారు. రెండు సైకిళ్ళ వెనక పెద్ద మూటలు వేసుకుని ఇద్దరు దిగారు. రాత్రికి దేవాలయం దగ్గర దుప్పట్లు వేలం వేస్తున్నామని సాయంకాలమే వీధుల్లో తిరుగుతూ చాటింపు వేశారు.
వేలంలో అయితే చౌకగా వస్తాయని జనం వీళ్ళకోసమే చూస్తుంటారు. చలికాలం దుప్పట్లు అందరికీ అవసరమే కదా.
ఎనిమిది గంటలకి వేలంపాట ప్రారంభమౌతుందనగా రమణి మామ రామయ్య ఏడున్నరకే డబ్బులు బొడ్లో దోపుకుని దేవాలయానికి బయల్దేరాడు.
ఆనందరావు తల్లి సరస్వతమ్మ కూడా వేలం పాటకి పోతూ - "ఆనందా! నేనెళ్ళి దుప్పట్లు కొనుక్కొస్తాగానీ మెలకువగా వుండు. పెళ్లిగాని కుర్రాడికి అంత నిద్రేమిటిరా చోద్యం గాకపోతే" అని చెప్పడం రమణి వింది.
ఆనందరావు అప్పటికే భోజనం ముగించి మంచాన్ని చూరుకిందకి లాక్కుంటున్నాడు. అతనంతే ముద్ద నోట్లో దిగగానే నిద్దట్లోకి వెళ్ళిపోతాడు.
ఆనందరావును కలుసుకోవడానికి ఇది మంచి సమయమని అన్పించింది రమణికి.
ఇంతకాలం గుండెల్లో ఓ మూల ఒదిగివున్న కోరిక రెక్కలు విప్పుకున్నట్లయింది. ఏదో కావాలన్న తపన శరీరాన్ని ముద్దగా నలిపేస్తోంది. చాలారోజుల తరువాత అవయవాలన్నీ ఎప్పుడో రుచిచూసిన అనుభవానికి అర్రులు చాస్తున్నాయి.
ఎంతో కొంత ధైర్యం చేస్తే తప్ప ఆనందరావు ఇటు మొగ్గేటట్లు లేడని ఆమెకి అర్థమై చాలాకాలమైంది. ఇంతకుమించిన సమయం రాదనుకుంది. అయినా ఓసారి వేలంపాట దగ్గరికి వెళ్ళి పొజిషన్ చూసి రావాలని బయల్దేరింది.
దేవాలయం దగ్గర అప్పటికే జనం బాగానే పోగై వున్నారు. చీకటి నుదుటున ఎర్రటి నామాలు తీసినట్లు రెండు కిరసనాయిలు దీపాలు వెలుగుతున్నాయి. వేలంపాట పాడేవాళ్ళు తమ మూటల్ని విప్పి దుప్పట్లను జనం ముందుకి విసిరారు.
జనం దుప్పటి నాణ్యతను పరిశీలిస్తున్నారు.
వేలంపాటదారు అందుకున్నాడు. "ఇది షోలాపూర్ దుప్పటండీ. ఈ దుప్పటి దగ్గరుంటే భార్యకు భర్త అక్కర్లేదు. అలాంటి దుప్పటండీ ఇది. చలి లోపలికి దూరదు. మంచు శరీరాన్ని అంటదు. అందుకే పాడండి. మీ ఇష్టమొచ్చినంత పాడండి. మీరు పాడిన పాటకి దుప్పటిని ఇవ్వని పక్షంలో ఇదిగోండి - ఈ దువ్వెన, ఈ సబ్బుపెట్టె, లేదా అగ్గిపెట్టె ఏదో ఒకటి మీకిస్తాం. దుప్పట్ల కోసం కాకపోయినా వీటికోసమైనా పాడండి"
పాట మొదలైంది.
"దేవుడి పాట పదిరూపాయలు... పదిరూపాయలు..." అన్నాడు వేలంపాటదారుడు.
ఎవరో అడ్డు తగిలారు 'పదకొండు'
వేలం పాటదారు దానిని గుర్తించి 'పదకొండు... పదకొండు....' అంటున్నాడు.
పాట ఇరవై వరకు వెళ్ళి ఆగింది.
ఆ తరువాత ఎవరూ పాడలేదు.
