కూతురు భవిష్యత్తు మీద విశ్వాసాన్ని కలిగించే అతని వ్యక్తిత్వం తెలుసుకున్న తరువాత సుమిత్ర కూడ విడిచి పెట్టకుండా ఆలోచిస్తోంది.
"మమ్మీ! ఏవైనా చిన్నపాటి అభ్యంతరాలు తల ఎత్తినా ఈ సంబంధం పోనివ్వకండి! అక్కకు కూడ యిష్టమే!" అంది ఆమని!
"అలాగేనమ్మా! నేను కూడ అదే ఆలోచనలో ఉన్నాను. అవునా గాయత్రీ" అంటూ కూతురు వంక చూచింది సుమిత్ర.
గాయత్రి పూర్తిగా గడ్డం గుండెల మీదికి ఆనుకునేలా తలదించుకుంది!
"మీ ఇష్టం అమ్మా! మీ కన్నా నాకు ఎక్కువేం తెలుసు!" అంది కాని ఈ సంబంధం తప్పిపోకూడదు అనే ప్రార్ధన ఉన్నదా స్వరంలో.
ముగ్గురుదీ ఒకే అభిప్రాయం అయింది కాబట్టి ఆ యింటికి సంబంధించి వాల్మీకి వరుడుగా నిశ్చయం అయిపోయాడు.
తన మాటను వేద వాక్కులా పాలించేందుకు తీవ్రమయిన కృషి చేసే పెద్దలు చాలామంది ఉన్నారు. వారి ద్వారా అతన్ని ఒప్పించి పెళ్ళి చూపులకు రప్పించాలి. ఈ సంబంధం ఖాయపర్చాలి అనుకుంది సుమిత్ర.
అతను కూడ సుమిత్రాదేవి పట్ల తండ్రిలాగా కృతజ్ఞతాబద్ధుడే!
కాబట్టి ఒప్పుకుంటాడని ఆమని విశ్వాసం.
అంతటితో వారి చర్చలు ముగిశాయి.
వర్దనిని పిలిచింది సుమిత్ర. పాయసం తెప్పించి కూతుళ్ళు ఇద్దరి చేత తన ఎదుట త్రాగించింది.
"ఇవాళ విశేషం ఏమిటో గుర్తుందా?" అని అడిగిందామె!
"ఏమో మమ్మీ! మాకేం తెలుసు?" అమాయకంగా ముఖం పెట్టి అంది ఆమని.
"చిన్న పిల్లవులే నీకెలా తెలుస్తుంది?" అంటూ చిన్న కూతురు చుబుకాన్ని పుణికి మురిపం చేసింది తల్లి.
"ఇవాళ దొంగల దోపిడి అమ్మగారూ!" అంది వర్ధని ఘల్లుమనే స్వరంతో.
"మెయిన్ గేటు వేయించావా?"
"అవును అమ్మగారూ వేయించాను. అయినా మన ఇంటికి ఎవరూ రారు లెండి. మొత్తం ఊరు ఊరంతటిని పీకి పాకాన పెడతారు. మీరంటే గౌరవం ఉందిలెండి! అయినా నా జాగ్రత్తలో నేను ఉన్నాను" అంది వర్ధని!
"అమ్మా! మీరు కూడ వెళ్ళి పడుకోండి. అక్క పెళ్ళి చూపులకు వెంటనే అవకాశం దొరికితే తప్పకుండా వస్తావా ఆమనీ!"
"పరీక్షలు అడ్డురాకుండా ఉంటే వస్తాను" అంది. వారిద్దరు తల్లి పాదాలకు నమస్కారం చేశారు. బిడ్డలిద్దరినీ ఆశీర్వదించి వెలుపలకు పంపింది సుమిత్రాదేవి! తన పనులు చూచుకునేందుకు హడావిడిగా వెళ్ళింది వర్ధని.
రాత్రి ఎనిమిది గంటలు దాటిపోయింది.
దొంగల దోపిడికి సిద్ధమవుతున్న యువ సమూహాల ఈలలు కేకలు చప్పుళ్ళు అందరికి వినిపిస్తున్నాయి. కిటికీ తెరలు తొలగించి చూచింది గాయత్రి! పందిళ్ళ క్రింద గ్రూపులుగా చేరిన యువకులు ఎవరేం చేయాలనే అంశం మీద చర్చలు చేసుకుంటున్నారు.
ఒక్కొక్కరు యధాశక్తి ఓ కొంటె కోణంగి కార్యక్రమాన్ని రూపొందించుకుంటున్నారు. కొంతమంది యువకులు సరసాన్ని ముదురు పాకాన పట్టిస్తారు. అయినా పెద్దలు వారిని తెల్లవారి ఉదయం క్షమించేస్తారు.
హాయిగా కనుమపండుగ చేసుకుని ఈ అయిదు రోజుల అలసటని మర్చిపోతారు. కాని ఈ రాత్రి గడవటమే కష్టం!
సరిగ్గా తొమ్మిది గంటలు అయిం తరువాత పిల్లిలా నడుచుకుంటూ తల్లి గది ముందు నిలబడింది ఆమని! తల్లి పడుకుంది. మరింక ఆమె నాలుగున్నర వరకూ లేవదు. ఈలోగా తన ఇష్టారాజ్యమే.
ఆమె అక్క గది ముందుకు వచ్చింది.
గాయత్రి చదువుతోంది. అది చాలా చిత్రమయిన విషయంగా భావించి లోపలకు వెళ్ళింది ఆమని! "అక్కా ఏమిటి చదువుతున్నావు?" అంది.
గాయత్రి పుస్తకం తలగడ క్రిందికి నెట్టేసింది.
"ఎందుకు అంత కంగారు? ఏమిటా పుస్తకం?" అని అడిగింది చెల్లి!
"నీకెందుకు? ఇంకా నిద్రపోలేదా?"
"అదేదో రహస్యం అన్నమాట!? అయితే చూచి తీరవలసిందే!" అంటూ అక్కమీద కలియబడి దిండు క్రింది పుస్తకం లాగేసుకుంది.
బొమ్మల భాగవతం అది. చిన్నపిల్లల పుస్తకం!
ఆమెకు హఠాత్తుగా చదువు మీద యింత ఆసక్తి ఎందుకు కలిగింది. అందులోనూ ముసలివాళ్ళు చిన్న పిల్లలు చదువుకునే పుస్తకంమీద పేజీలు తిరగేసింది ఆమని!
క్లాస్ టీచర్స్ ని డుమ్మా కొట్టించేందుకు తానుకూడ ఇలా మంచి మంచి పుస్తకాలు వారికి కన్పించేలా పట్టుకునేది. దానిలోపల వేరే తనకు యిష్టమయిన పుస్తకాలుండేవి.
మిక్కీమౌస్, మిరాండాలాంటి బొమ్మల కధల పుస్తకాలు!
అక్కకూడా అలాంటి కార్యక్రమం ఏదయినా మొదలెట్టిందా? అని అనుమానించి పేజీలు అన్నీ త్రిప్పి చూచింది.
కాని అలాంటివేమీ లేవు! కేవలం భాగవతమే!
"అక్కా! ఈ పుస్తకం మీద నీకు ఇంత ప్రేమ పుట్టుకొచ్చిందేమిటీ!"
"అందులో ఒక కధ చదువుదామని తెప్పించాను! నాది నా కివ్వు"
"ఇస్తాకాని అసలు విషయం కక్కు ముందు బయటికి. ఏమిటా కధ? ఏమా కధ? చెప్పు! ప్లీజ్ చెప్పవే!"
"ఎందుకలా వెంటపడి వేధిస్తావు? రుక్మిణీ కల్యాణం చదువుదామని తెప్పించాలే!" అంది గాయత్రి.
"ఓహో అదా సంగతి! దీని మీద ఎందుకు అంత ప్రేమ పుట్టింది"
"ఒకసారి నువ్వే అన్నావు గుర్తుందా? పెళ్ళి కావలసిన ఆడపిల్లలందరూ రుక్మిణీదేవిలాంటి వారయితే ఈ దేశం ఎప్పుడో బాగుపడేది అని! రుక్మిణీదేవి కన్యగా ఉండగా ఏమి చేసిందో తెలుసుకుందామని తెప్పించానంతే!" అంది గాయత్రి.
"కధ అంతా చదివావా?" గంభీరంగా అడిగింది ఆమని.
"చదివాను. చాల బాగుంది"
"నువ్వు కూడా ఆమెలానే చేస్తావా?"
"ఆమెలాగా అంటే ఏమిటి?"
"ప్రేమించిన కధానాయకుడిని ప్రియుడి ద్వారా పిలిపించుకుని ఊరి బయట ఆలయంలో కాపు కాచి రధ మెక్కి వెళ్ళిపోవటం! అలాంటి కార్యక్రమం ఏదైనా ప్లాన్ చేస్తున్నావా?"
"ఛీపాడు! అలాంటిదేమీ లేదు. కాని కధ చదివాను. చాల బాగుంది" అంది గాయత్రి!
"శ్రీకృష్ణ పరమాత్మలాంటి మొగుడే కావాలనుకుంటున్నావా?"
"ఆయనకేం? దేవుడు! దేశాల్ని ఉద్ధరించాడు"
"దేశాల సంగతి కాదు. భార్యల్ని ఉద్ధరించాడా?"
"తప్పు అలా అనకూడదు చెల్లి. కళ్ళుపోతాయి. ఎనిమిది మంది అష్టర్యులు ప్రేమించి వరించి వచ్చిన వాళ్ళు! పదహారు వేలమంది భార్యలు కూడా కాళ్ళా వ్రేళ్ళాపడితే నరకాసురుడి చెర వదిలించి కట్టుకున్నాడట! భార్య లెంతమంది అని కాదు.
కాని కృష్ణుడు స్త్రీలను ఆదరించటమే కాదు. గౌరవించాడు!"
"శ్రీకృష్ణ పరమాత్మ గురించి పరిశోధన చేశావన్నమాట?"
"పరిశోధన కాదు. భక్తిగా చదివాను"
"సరే! నీకు కూడ ఓ సత్యభామ వస్తే ఏం చేస్తావు?"
"కర్ర పుచ్చుకుని వెంటపడతాను. ఊరుకుంటానా?"
"ఆ సత్యభామ నేనే అయితే ఏం చేస్తావు?" అంది ఆమని!
గాయత్రి చివాలున మంచం దిగివచ్చి ఆమె నోరు మూసింది!!
"అలాంటి మాటలు అనకు చెల్లీ! నేను వినలేను! దయచేసి ఇంకెప్పుడూ అలా అనకు. నీకు మరొకరి భర్తను కట్టుకోవాల్సిన ఖర్మం ఏమిటి, నాకోసం అని కాదు. నువ్వు ఎన్నో కలలు కంటున్నావు.
కలెక్టర్ కావాలని! ఆ కలలు పండాలని! అందుకోసం కావలసినదంతా చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం.
నువ్వు కలెక్టర్ కావాలి! జిల్లా యంత్రాంగాన్ని ఆజమాయిషీ చేస్తున్నప్పుడు ఒక్కసారయినా నేను వచ్చి నిన్ను నా కళ్ళతో ఆ కుర్చీలో తనివితీరా చూచుకోవాలి.
తమాషాకయినా ఇలాంటి జోక్సు వేయకు!" అంది.
ఆ మాటలు అంటున్నప్పుడామె బాగా ఎక్సయిట్ అయిపోయినట్లుగా కనిపించింది. కంఠస్వరం మారింది. కళ్ళు తడితడిగా తరళించినాయి.
"తమాషాగా అన్నందుకే అంతలా ఇదయిపోయా వేమిటి? సరే మనం ఇప్పుడు బయటకు వెళ్ళాలి" అంది ఆమని.
గాయత్రి కళ్ళు పెద్దవి చేసి గోడ గడియారం వంక చూచింది. తొమ్మిదింపావు అయింది సమయం!
"అమ్మో! ఇప్పుడే!?" అన్నదామె విస్మయంగా.
అవతల దొంగల దోపిడి మొదలయింది. ఇప్పుడు కాక ఇవాళ కూడా పగలు వెడతారా? ఎంజాయ్ మెంట్ ఏముంటుంది?" అంది.
"చాలా సాహసం! నేను చేయలేను బాబూ!"
"మనం కలిసి పెరిగాం అక్కా! కలిసి వుండే చివరి సంవత్సరం ఇది! ఈ రెండు రోజులు అందమయిన జ్ఞాపకాలతో మనసంతా నిండిపోవాలి! రావా! ప్లీజ్! నా కోసం!"
