Previous Page Next Page 
యుద్దక్షేత్రం పేజి 17



    అక్కడ నుంచి ముందుకి కదిలాడు.

    రాజేష్, వికాస్ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.

    "మనకెందుకొచ్చిన గొడవ గురూ! దాని వాలకం చూస్తుంటే గురుడిమీద మోజు కలిగిందేమో అనిపిస్తోంది!" అన్నాడు రాజేష్.
        
                                                                             8

    ఆ సాయంత్రం....

     మాధురి, ప్రశాంత్ కలిసి నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే... రాజేష్ అన్నాడు వికాస్ తో.....
    "రోజూ కార్లో  వెళ్లే మాధురి, ఈరోజు తన డ్రయివర్ ని వెళ్లిపోమని చెప్పి... .మనవాడితో వెళ్తోంది... కథ మంచి రసపట్టులోకి వచ్చేటట్లుంది కదూ?" అని.

    కానీ.....
 
    వాళ్లిద్దరూ మూడే మూడు రోజులు ఎంతో సన్నిహితంగా తిరిగారు.

     "యు ఆర్ వెరీ బ్యూటీఫుల్!" అన్నాడు ప్రశాంత్.

     "థాంక్యూ" అంది.

    "నీ గొంతు అధ్బుతం" అన్నాడు.

    "థాంక్స్" అంది.

     ఐస్ క్రీమ్ పార్లర్ లో ఐస్ క్రీమ్ తింటూ... "ఐ లవ్ యూ" అన్నాడు ప్రశాంత్.

     ఆమె నవ్వి ఊరుకుంది.

     ముహూర్తం అదే కాదేమోనని ఆగాడు. ఆమె ప్రశాంత్ ని చూస్తే చాలు మెలికలు తిరుగుతోంది. రోజుకో రకం ముస్తాబులో అతని కలలకి... ఆమె స్క్రీన్ ప్లే అవుతోంది.

    అతని గుండెల్లో గూటుకట్టుకుంటోంది మాధురి.

     ఆమె అందచందాలు అతనికి స్వప్నంలో విందు చేస్తున్నాయి.

     వాస్తవంలో వాటికి ప్రాణం పొయ్యాలనే  నిశ్చయానికి వచ్చి.....

    ఆమెకరు ప్రేమలేఖ రాయటానికి సంసిద్దుడయ్యాడు.

    రాత్రంతా కష్టపడి సుమారు పాతిక కాగితాలు చింపిపారేసి, అందమైన ప్రేమలేఖ తయారుచేసాడు.

     కాలేజీకి  రాగానే ఆమెకు నోటుబుక్ ఇస్తూ నవ్వాడు ప్రసాంత్ .

     ఆ నోట్ బుక్ లో ప్రేమలేఖ ఆమె చూసింది.

     ఆతృతగా తెరిచింది!

     ఆమె పెదవుల పైన చిరునవ్వు చూసి ప్రశాంత్ పరవశించిపోయాడు.

     ఇంగ్లీష్ లెక్టరర్ క్లాసులోకి వచ్చాడు.

     ఆమె లేచి నిల్చుంది.

     ఆయన దగ్గరకి వెళ్లింది.

     అతనితో ఏదో చెప్పటం ప్రశాంత్ చూసాడు.

     ఆయన కాస్సేపు ఆశ్చర్యపోయాడు.

     ఆ తర్వాత తల వూపాడు.

     ఆమె బోర్డు దగ్గరకెళ్లి నిల్చుంది.

     క్లాసులో సుమారు అరవైమంది స్టూడెంట్స్ వున్నారు.

    "డియర్ ఫ్రెండ్స్!" మాధురి కంఠస్వరం వినిపించగానే నిశ్శబ్దం ఆ క్లాస్ రూం లో మరింత చిక్కబడింది.
     అందరూ కుతూహలంగా చూస్తున్నారు.

     "ఇప్పుడు మీకొక స్కౌండ్రల్ రాసిన ప్రేమలేఖ చదివి వినిపిస్తాను" అంది.

     రుక్మిణి ఆందోళనగా చూస్తోంది.

     ప్రశాంత్ ఖంగుతిన్నాడు.

     ఆమె కాగితం తెరిచింది.

     "మైడియర్ మాధురీ!...." చదువుతోందామె.

     "నువ్వంటే నాకు ఎంతో ఇష్టం. ఐ లవ్ యు నీ దివ్య స్వరూపం నా కళ్ళముందు నాట్యం చేస్తోంది.రాత్రీ పగలు నీ గురించిన ఆలోచనలే. నువ్వు నవ్వితే... నామీద మల్లెలజల్లు కురిసినట్లుంటుంది. నువ్వు మాట్లాడితే... సరస్వతీ దేవి వీణా వాయిద్యం గుర్తుకొస్తుంది. నువ్వు నడుస్తుంటే రాజహంస కులుకులు... "అంతే.

     మాధురి ఆగిపోయింది.

     ప్రశాంత్ గుండె ఆగినంత పనయ్యింది.

     ఆమె ఎందుకలా ప్రవర్తిస్తోందో, అతనికి బోధపడలేదు.

    "ఆడది చనువుగా మాట్లాడితే చాలు, కలల్లో సాక్షాత్కరించే గంధర్వ కన్య అయిపోయింది. ఇలాంటి రాస్కెల్స్ కి 'ప్రేమ' అనే పదానికి అర్దం ఏం తెలుస్తుంది. నన్ను ప్రేమించడానికి ఎన్ని గుండెలు అతనికి. మా ఇంటి కుక్కకున్న స్టాటస్ లేని మనిషి నాకు ప్రేమలేఖ రాస్తాడా?  సర్! అతని మీద తగిన చర్య తీసుకోవలసిందిగా కోరుతున్నాను.....

     అన్నట్లు.... చెప్పలేదు కదూ? ఈ ఉత్తరం రాసిన ఇడియట్ పేరు... ప్రశాంత్...." అంది ఆమె.

     నెత్తిమీద పిడుగు పడినట్లు అదిరిపడ్డాడు ప్రశాంత్.

     స్టూడెంట్స్ అంతా తనవైపే చూస్తున్నారు.

     నిశ్శబ్దం అంతా... ఆవిరైపోయింది. అందరూ గుసగుసలాడుకుంటున్నారు. తల తీసేసినంత అవమానంగా వుంది ప్రశాంత్ కి.

     "మాధురీ!" అరుస్తూ లేచి నిల్చున్నాడు.

     "మిస్టర్ ప్రశాంత్! ఇది క్లాస్ రూం... మైండిట్!' అరిచాడు ఇంగ్లీష్ లెక్చరర్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS