"ఆడపిల్ల ఇలా వంటరిగా రాత్రిపూట బయటికి రావడం తప్పు కదూ?"
"ఇంకెవరున్నారు నాకు? రంగనాధం మామయ్య కూడా లేడు. నువ్వు ఊరునుండి ఎప్పుడు వచ్చావు మనూ?"
"సాయంకాలం. మాస్టారుకి ఏమైంది?"
"మనోవ్యాధితో మంచం పట్టాడు నాన్న. అసలే ఆయన ఆరోగ్యం అంతంత మాత్రం! ఈమధ్య ఆయన దగ్గర చదువుకోడానికి పిల్లలు రావడంలేదు. ఎవరో ఆయనకి క్షయ అని పుకారు బయల్దేర దీశారు. ఇక బ్రతకడం ఎలాగన్న బెంగతో ఆయన మంచంపట్టాడు."
ఈ మధ్య పదిహేనురోజులుగా మనోహర్ ఇక్కడ లేడు. మేనమామ ఊరికి వెళ్ళాడు!
"స్కూటర్ ఎక్కు పారూ! నిన్ను ఇంటివద్ద దించేస్తాను. మాస్టారుని చూసి డాక్టరు అవసరం ఉంటే నేను మరో డాక్టర్ని తీసుకు వస్తాను!"
గేటు ముందే స్కూటర్ దిగి గబగబా ముందు పరిగెత్తింది పారిజాత. మనోహర్ వెనుకనడిచి వెళ్ళాడు.
కృష్ణారావుకు అప్పుడప్పుడే కాస్త ఆయాసం తగ్గింది కళ్ళు మూసుకు పడుకున్నాడు. గదిలో అడుగుల సవ్వడి విని కళ్ళు తెరిచి" "ఎక్కడికెళ్ళావమ్మా?" అని అడిగాడు.
తండ్రి దగ్గి దగ్గి ఆయాసపడిపోతుంటే ఏ క్షణంలో ఆయన ఊపిరి ఆగి పోతుందోనని భయమేసి ఆయనకి చెప్పకుండానే డాక్టరు కోసం పరిగెత్తింది పారిజాత.
"ఎలా ఉంది మాస్టారూ?"
"నువ్వా మనోహర్? రా బాబూ! ఎలా ఉందని అడుగుతున్నావుకదూ? కూర్చో, చెబుతాను. నేను ఎందరికో విద్యాదానం చేశాను. నేనూ, నా కూతురూ బ్రతకడానికి అవసరమైనంతవరకే వాళ్ల దగ్గర డబ్బు తీసుకొన్నాను. ఎక్కువ ఎవరినీ పీడించలేదు, నా శ్రమకు ఫలితంగా నేను బ్రతికి ఉండగానే నాకు సమాధి కట్టరు బాబూ వీళ్ళు! నాకు క్షయట. నా దగ్గర చదవడానికి పిల్లల్ని పంపడం మానేశారు!" ఆక్రోశం ధ్వనించింది కృష్ణారావు గొంతులో.
"మీరు అధైర్య పడకండి, మాస్టారూ! ముందు మీ ఆరోగ్యం చక్కజేసుకోండి పిల్లల్ని నేను కుదిర్చిపెడతాను. చిన్న తరగతులకు మీ రెంత చక్కగా చెబుతారో ఈ ప్రాంతంలో వారికంతా తెలుసు!"
"క్రింద మృత్యులోయ అగుపిస్తోందినాకు. కొట్టుకుపోతున్నాను. ఏ క్షణాన దాని అడుగున పడిపోతానో? నాకిప్పుడే చచ్చిపోవాలని లేదు. మనోహర్! బ్రతకాలనీ, సంపాదించాలనీ, నా కూతురికి పెళ్ళి చేయాలనీ, దాని పిల్లల్ని ఎత్తాలనీ ఉంది. నా కలలన్నీ కల్లలుగా మిగిలిపోయాయి. దాన్ని ఎవరిచేతిలో పెట్టకుండా ఒంటరిగా వదిలేసి పోవాల్సి వస్తున్నందుకు నాకెంత దుఃఖంగా ఉందో చెప్పలేను"
పారిజాత గోడకు ముఖంపెట్టి వెక్కి వెక్కి ఏడవసాగింది.
"మీరింత నిరాశగా మాట్లాడకండి, మాస్టారూ? మీ మాటలకు పారు ఏడుస్తోంది!" మనోహర్ ఆర్ద్రకంఠంతో అన్నాడు. "నిజంగా మీరు చనిపోవడమే జరిగితే మీ అమ్మాయి ఒంటరిది ఎంత మాత్రం కాదు. ఈ కాంపౌండ్ లో పారు అంటే అందరికీ మక్కువే పారు ఒంటరిది ఎంత మాత్రంకాదు."
పారిజాత దుఃఖం ఉతమైంది.
పారు అలా ఏడుస్తూంటే మనోహర్ మనసు కరుణతో నిండిపోయింది. ఆ పిల్లను గుండెలకు అదుముకొని "ఏడవకు, పారూ! నీకు నేనున్నాను" అని చెప్పాలని పించింది. కాని, బిగుసుకు పోయినట్టుగా, కొయ్యబొమ్మలా చూస్తూ కూర్చున్నాడు. తనకీ పారిజాత కీ మధ్య ఉన్న అంతస్తు భేదం గుర్తువచ్చింది. ఆ అంతస్తుమీద నిల్చున్న తన తల్లి గుర్తువచ్చింది. ఆమె పారిజాతను కోడలిగా ఎంత మాత్రం స్వీకరించదన్న సంగతి గుర్తువచ్చింది. తన తల్లి కోడలిగా స్వీకరించని పిల్లను తను భార్యగా పొందలేడు. పారిజాత మీద తన కెంతజాలీ, ప్రేమా ఉన్నా అవి తన తల్లికి విరుద్ధంగా నడిపించలేవు!
ఆనాడు తను ప్రదర్శించిన ప్రణయ ఘట్టం గుర్తుకు వచ్చినప్పుడల్లా మనోహర్ మనస్సు సిగ్గుతో కుంచించుకు పోతూంటుంది! ప్రణయోన్మత్తుడై వంటరిగా చిక్కిన ఆడపిల్లను స్పర్శించాడు. వక్షానికి అదుముకున్నాడు. అధరాల్ని చుంబించాడు.
ఒక అమాయకురాలైన ఆడపిల్లలో ఆశలు రేగడానికి ఇంతకంటే ఏం కావాలి? తనిప్పుడు ఏమాత్రం దయ కనబర్చినా ఆ పిల్ల తనమీద నమ్మకాన్ని, కొండంత ఆశనూ ఏర్పరచుకొంటుంది. ఒకసారి చేసిన పొరపాటు మరోసారి చేయగూడదు తను!
"నేను డాక్టర్ని తీసుకువస్తాను?" పారిజాత కేసి చూడకుండానే వెళ్ళిపోయాడు మనోహర్.
