Previous Page Next Page 
ఏటిలోని కెరటాలు పేజి 17


    నువ్వు! దుఃఖం నుండి పారిపోయే పిరికివాడిని తప్ప అటువంటి మహోద్దేశాలేమైనా ఉన్నాయా, చెప్పు? మిధ్యావాదివి? అటువంటి ఉద్దేశ్యాలేమీ ఉండవు. అమ్మ మీద అనురాగం లేదనుకొనడం గొప్ప అనుకొంటావు. నాన్నను బాధ్యతలనుండి విముక్తిచేసి భగవన్నామస్మరణకు అవకాశం కల్పించే యోగ్యుడవయ్యీ; నిర్మోహివిగా నిర్లిప్తుడివిగా ఉండిపోవడంతో నిగ్రహం సాధించాననుకొంటావు. కరుణ ప్రేమలు లేకపోవడం జ్ఞాని లక్షణమనుకొంటావు.

    ఎవరికీ పనికిరావు. దైవానికీ పనికిరావు. నీకొక సాధనాలక్ష్యం ఉన్నట్లుకూడా కనిపించదు. అంతా మాయ అనే మనిషివి కదా?" కొంచెం చిలిపితనం తెచ్చుకొని నవ్వింది.

    "మాట్లాడలేకపోతున్నాను. ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడలేకపోతున్నాను. నా సర్వశక్తులూ అధీనంలోకి తీసుకొనే యమపాశం వంటిదేదో నీదగ్గరుంది. దేవదాసీ! లోలోన గొణుగుకొన్నాడు భార్గవరామ్.

    చిలిపితనం చీకటిలో మాయంచేసి గంభీరంగా అన్నది దేవదాసి "పంచభక్ష్య పరమాన్నాలు మెక్కిన రాజు తిండయినా, పేదవాడు తినే మిరపముద్ద జొన్నకూడు తిండి నా కడుపులో ఏకరూపమై విసర్జింపబడి చివరికి మారేది మట్టిగానే; మనం ఏ విధంగా బ్రతికినా అందరమూ కలిసేది మట్టిలోనే. ఈ మూణ్నాళ్ళ ముచ్చటకోసం నీసిద్ధాంతాలకూ. ఆలోచనలకూ అత్తయమెందుకు ఉసురుపెడతావు బావా?'

    అతడి మంత్రం అతడికే ఉపదేశించి, చేతిలో పావురాన్ని అంబరంలోకెగురవేసి కన్నుమూసి తెరిచేలోగా కనుమరుగైపోయింది దేవదాసి.

    "ఒహ్! నన్నేమైనా భ్రాంతిలో పడద్రోస్తున్నావా, దేవదాసీ నిజంగా నా నిజస్వరూపం బయటపెట్టావా? విరాగి జీవితం నువ్వు చెప్పినంత నిష్ర్పయోజనమా? అయితే భోగికంటే యోగి ఉత్తముడుగా చెప్పబడుతున్నాడెందుకు'? చుట్టుకు వస్తూన్న చీకట్లో ఎంతసేపు కూర్చుండిపోయాడో తెలియదు. గూళ్ళకు చేరిక పక్షుల సద్దుమణిగాక లేచి మెల్లగా తన గదిచేరాడు భార్గవరామ్.

   
       
                                    4


    "భోజనానికి రావూ?" దేవదాసి గదిలోకి వచ్చింది.

    'ఆకలిగా లేదు' అన్నాడు భార్గవరామ్. తలగడలోంచి ముఖం పైకెత్తి.

    'ఎందుకూ? సాయంత్రం నేను పెట్టినవేమైనా పొట్టబరువెక్కించాయేమిటి?' అతడికేమైనా కోపం వచ్చిందేమోనని పరిశీలనగా చూస్తూనే కొంటెగా నవ్వింది.

    'అదేం కాదు. పొద్దుపోయి తిన్నానుకదా? ఆకలిగా లేదు.

    'ఉట్టిగానే పడుకొంటావా? ఏమి తినవూ?'

    'ఏమక్కర్లేదు.'

    'పోనీ కాస్త ఫలహారం చేసి పడుకో. ఉప్మా చెయ్యమని చెబుతాను సుబ్బయ్యగారికి. ఏం?'

    "నీ యిష్టం!"

    "తినేది నువ్వా, నేనా!"

    'సరే. ఏదో ఒకటి చేయించు ఫో.' ఆకసురుకోవడంలో ఏదో హాయి అనిపించి తలగడలో ముఖం దాచేసుకొన్నాడు. అతడి నిర్వికార హృదయంలో వారింపబడని ఒక రాగభావంతో పాటు మరెన్నో చిలిపి గుణాలు ఉత్పన్నమౌతున్నాయి!

    చిన్నగా నవ్వివెళ్ళిపోయింది దేవదాసి.

    'సుబ్బయ్యగారూ బావ భోజనం చెయ్యడట, కాస్త ఉప్మా చెయ్యండి.'

    పదినిమిషాలు మించకుండానే 'సిద్ధం. అమ్మా' అని చెప్పాడు సుబ్బయ్య.

    పీటవాల్చి. చెంబుతో నీళ్ళూ గ్లాసూ పెట్టి, పిలువడానికి పైకి వెళ్ళింది దేవదాసి. 'ఇక పద బావా, తయారైంది.'

    చొక్కావిడిచి హేంగర్ కు తగిలించి తువాలు భుజాలమీద కప్పుకొని దేవదాసిని అనుసరించాడు భార్గవరామ్. పాదప్రక్షాళనానికి అతడు పెరట్లోకి దారితీయగా దేవదాసి అతడి వెంటేవెళ్ళి నూతి నుండి నీళ్ళు తోడి అందించింది బాల్చీ. నీళ్ళు పాదాలమీద గుమ్మరించుకొని వచ్చి పీటమీద కూర్చున్నాడు అతడు. వేడి వేడి ఉప్మాప్లేటు అతడి ముందుంచింది దేవదాసి.

    'నువ్వు భోజనం చేశావా'

    'ఉహుఁ. నీది కానీ.'


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS