Previous Page Next Page 
చీకట్లో నల్లపులి పేజి 17

    "ఏమో మరి...ఈన కళ్ళు మెరుస్తున్నాయి. జుత్తు నుదుటి మీద పడ్తోంది....

    "అలాగా? సరే?" అంటూ పక్కకి తిరిగాడు వీరప్ప.  "అతను మా స్టాఫ్ మెంబర్." అన్నాడు నవ్వుతూ, కొన్ని క్షణాల ఏమో ఆలోచించి-రాజారామ్ గారూ-రేపు మీ అమ్మాయిని పోలీస్ కంట్రోలు రూంకి తీసుకెళ్దాం. అక్కడా కొన్ని ఫోటోలు చూపిద్దాం. రేపు ఉదయం తొమ్మిదిన్నరకి రానా?" అనడిగాడు.

    రాజారామ్ తలూపాడు.

    "ఇదిగో కృష్ణారావు ఇలారా!" అంటూ పోలీస్ కమిషనర్ అతన్ని పిలిచాడు...కృష్ణారావు నాలుగడుగులు ముందుకు వేసి అతని మొహంలోకి సూటిగా చూశాడు.

    "అమ్మాయి నిన్ను ఐడెంటిఫై చెయ్యలేదు.  బతికిపోయావు. కాని ఈ విషయం చెప్పు సుందరి అనే అమ్మాయిని ఆఖరు సారిగా నువ్వెప్పుడు చూశావ్?"

    "శుక్రవారం రాత్రి. అంతే. ఆ తరువాత మరి నాకు కనిపించలేదు."

    "ఉద్యోగం మానేస్తున్నానని చెప్పిందా?"

    కృష్ణారావు తల అడ్డంగా ఊపాడు. "ఎవరినో పెళ్ళి చేసుకున్నట్టు తరువాత నాకు తెలిసింది" అన్నాడు.

    "ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు?"

    "మా మాసేజ్ పార్లర్ లోని అమ్మాయిలు అనుకుంటుంటే విన్నాను.

    "ఎవర్ని పెళ్ళి చేసుకుందో తెలుసా?"

    "తెలీదు."

    "సరే, నువ్వెళ్ళు."

    కృష్ణారావు వెళ్ళిపోయాడు. గదిలో ఓ కుర్చీలో రాజేశ్వరి కూర్చుని ఉంది. ఆమె ఒడిలో తల పెట్టుకుని రమణి నిద్రపోతోంది.

    "కమిషనర్ గారూ, ఇంక మేం వెళ్తాం" అంటూ రాజారామ్ రాజేశ్వరికి సైగ చేశాడు.

    రమణిని ఎత్తుకుని రాజారామ్ ముందు నడవసాగాడు. రాజేశ్వరి అతన్ని అనుసరించింది. కారెక్కుతూంటే- మరిచిపోకండి. రేపు తొమ్మిదిన్నర" అన్నారు సబ్ ఇన్స్ పెక్టర్ మహావీర్.

    కారు ముందుకు సాగింది.

    "రాజారామ్ గారూ, ఇప్పుడేం జరుగుతుంది?"

    "నేనూ రమణీ- రేపు దొంగలు, హంతకులు ఫోటో ఆల్బం చూస్తాం. ఈ లోగా రమణిని మాత్రం ఒంటరిగా వదలకూడదు."

    "నా ఫ్రీ టైమంతా రమణి దే. అన్నట్టు రమణి మర్చిపోయావా, రేపు....నువ్వూ నేనూ షాపింగ్ కి వెళ్తున్నాం," అంది రాజేశ్వరి.

    నిద్రపోతున్న రమణి కొంచెం కళ్ళు తెరిచి"లేదు. ఆంటీ...నువ్వు కూడా.....మర్చిపోవద్దూ?" అని మళ్ళీ నిద్రలో మునిగి పోయింది.

    "రేపు మధ్యాహ్నం రమణిని ఆఫీసుకు తీసుకురండి, ఏం?" అంటూ రాజారామ్ ని చూసింది రాజేశ్వరి.

    "అలాగే"


                                  0    0    0


    మర్నాడు ఉదయం తొమ్మిదిన్నర అయ్యేసరికి పోలీస్ కమీషనర్ వీరప్పా, సబ్ ఇన్స్ పెక్టర్ మహావీర్ రాజారామ్ ఇంటికి వచ్చారు. అంతా కలిసి జీపులో పోలీస్ కంట్రోలు రూం కి బయలు దేరారు.

    "రాత్రల్లా నాకు నిద్ర పట్టలేదు. చాలా సేపు ఈ కేసు మీద వర్క్ చేశాను కాని క్లూ ఏమీ దొరకలేదు. సుందరి కోసం సెర్చ్ మరింత ఇంటెన్సివ్ చేశాం కాల్చిపారేసిన సిగరెట్ తప్ప వాడు గదిలో ఇంకేం మిగల్చకుండా జాగ్రత్త పడ్డాడు. పోలీస్ లాబ్ లో దాన్ని ఓ పట్టుపడ్తున్నారు. తర్వాత కొన్ని వేలి ముద్రలు కూడా ఆ గదిలో దొరికాయి. కాని అవేమీ మా పోలీస్ రికార్డుల్లో లేవు!" అన్నాడు వీరప్ప దార్లో.

    "బహుశః నా వేలి ముద్రలు కూడా అక్కడా ఉంది ఉంటాయి. ఎంచేతంటే సుమిత్ర రమ్మంటే నేనా గదిలోకి వెళ్ళాను." అన్నాడు రాజారామ్.

    "ఐసీ, సుందరి చాలా హడావుడిగా గది ఖాళీ చేసి వెళ్ళిపోయి ఉంటుంది. కళ్ళారా హత్య చూసింది కనుక మరింత కంగారు పడి వుంటుంది. తన వెంట ఏమీ తీసుకోకుండానే వెళ్లిపోయింది." అన్నాడు వీరప్ప.

    రాజారామ్ సాలోచనగా తల ఊపాడు. అంతలో పోలీస్ కంట్రోల్ రూం వచ్చింది. అంతా దిగారు. రమణి ముందు కట్టలు కట్టలు ఫోటోలు పడేశారు. అన్ని ఓపిగ్గా చూసింది. పెదిమ విరిచింది.

    "మనకిప్పుడు రెండే క్లూలు దొరికాయి. వాడు తెల్లపాంటూ, తెల్ల షర్టూ తొడుక్కుని ఉన్నాడు. వేలికి అతని ఇనీషియల్స్ ఉన్న ఉంగరం ఉంది" అన్నాడు వీరప్ప దీర్ఘంగా నిట్టూర్చి.

    రాజారామ్, రమణి అక్కడికి దగ్గర్లోనే ఉన్న ఓ హోటల్లో భోజనం చేశారు. ఆఫీసుకు వెళ్ళబోతూ విజయనగర్ కాలనీలో ఉన్న 'ఫ్యాన్సీ కార్నర్' ముందాగారు. వీరయ్య రాజారామ్ ని చూస్తూనే హడావుడిగా లేచి ముందుకు వచ్చాడు.

    "సారీ సార్ కవర్ని తలుపుసందులోంచి తోస్తుందేమో ననుకున్నాను. అమ్మాయిగార్ని అలా పంపించడం నాది బుద్దిపొరపాటేనండీ."

    "సరే దాన్దేముంది?"

    "సార్....అన్నట్టు ఇంకో విషయం సార్!"

    "ఏమిటది?"

    "ఈ ఫోటో చూడండి సార్!" అంటూ 'ఆంధ్రా టైమ్స్' పేపర్ని రాజారామ్ కి ఇచ్చాడు.

    అది ఆరోజు పేపరు. అందులో అప్పారావు, సింగిల్ కాలం ఫోటో ఉంది. కొత్తగా ఎడిటరైనట్టూ, క్లుప్తంగా అతని జీవిత విశేషాలు దాని కింద రాశారు.

    "పొరబాటైతే కావచ్చు గాని.... ఈన గారితో సుందర్ని ఓసారి చూసినట్టు జ్ఞాపకం వస్తోందండి..."

    "సుందరితోనా? అప్పారావునా? నమ్మలేనట్లు చూశాడు రాజారామ్.

    నాకు బాగా జ్ఞాపకం సార్. ఆ మొహం ముక్కూ నోరూ ఇప్పుడు గుర్తొస్తున్నాయి."

    సుందరితో నువ్వు మరెవరినో చూసి ఉంటావు. ఇతనయ్యే అవకాశం లేదు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS