3. "నను పతిగా వ | రింపని నిన్ను
పాకశాలలో - తరిగించెదను |
రుచులు రుచులుగా - వండించెదను
నోరూరగ విం | దారగించెదను
నాతో సుఖమో - లేక మరణమో
కోరుకొనుము నీ | కేది మోదమో |"
అని గర్జించెను - ఘనతరగాత్రుడు
క్రోధోద్దీప్తుడై - దశకంఠుడు ... ||శ్రీ||
4. రావణుడాడిన - కఠీనోక్తులు విని
రాణులందరు - నివ్వెరబోయిరి |
దేవగంధర్వ - కాంతలెందరో
తమలోతాము - భీతి జెందిరి |
కను సైగలతో - ముఖభంగులతో
వైదేహినెంతో - ఊరడించిరి |
| శోభిల్లు శింశుపా - శాఖలందున
మంటల గ్రక్కుచు - మారుతి గాంచెను .... ||శ్రీ||
సీత రావణునితో :-
5. "ఓ రావణా! నీ - క్రోవ్విన నాలుక
గిజగిజలాడి - తెగిపడదేమి ?
కామాంధుడా ! నీ - క్రూర నేత్రములు
గిరగిర తిరిగి - రాలిపడవేమి ?
పతి ఆజ్ఞ లేక - ఇటులుంటిగాని
తృటిలో నిన్ను ద | హింపనా ఏమి ?"
అని పల్కె సీత - దివ్య స్వరమున
తృణముకన్న రా | వణుడే హీనమన ..... ||శ్రీ||
6. క్రోధాగ్ని రగుల - రుసరుసలాడుచు
కొరకొర జూచుచు - నిప్పులు గ్రక్కుచు |
తన కాంతలెల్ల - కలవర మొందగ
గర్జన చేయుచు - దిక్కులదరగ |
సీత నెటులైన - ఒప్పించుడని
ఒప్పుకొననిచో - భక్షించుడని |
రావణాసురుడు - ఆజ్ఞాపించెను
కావలియుండిన - అసుర వనితలను .... ||శ్రీ||
7. శృతిమించి పలుకు - లంకేశుని గని
ధాన్య మాలిని - పతిని జేరుకొని
కోరకయున్న - సీత యెందుకని
కోరికయున్న - తనను బొందుమని |
వలపు లొలుకగా - పలుకులు పలికి
తెలివిగ పతిని - మరలించుకొని |
సతులందరితో - వెడలెను హాయిగ
దివ్య భవనము - సుఖముల దేలగ .... ||శ్రీ||
__: 22 వ. స. సంపూర్ణము :__
23వ. సర్గ
రాక్షస వనితలు సీతతో :_
1. "చతుర్ముఖ బ్ర | హ్మ మానస పుత్రుడు
చతుర్ధ ప్రజా | పతి పులస్త్యుడు |
పులస్త్యుని సుతు | డు విశ్రవసుడు
తేజోవంతుడు - ఋషి సత్తముడు |
విశ్రవసుని సుతు | డు రావణుండు
మహాబాహుడు - దశకంఠుడు |
అంతటి యశో వి | శాలుని గొను" మని
రాక్షస వనితలు - వేచిరి సీతను .... ||శ్రీ||
2. "దేవేంద్రాదులు - దిక్పాలకులు
లంకేశునాన - మీరజాలరు |
సూర్యుడు తగుసరి - ఎండగాయును
వాయు మెల్లగ - చల్లగ వీచును |
వరుణుడడలి స | మ వృష్టి నొసగును
ఋతువులు నిత్య వ | సంతములీనును |
అంతటి యశో వి | శాలుని గొను" మని
రాక్షస వనితలు - వేచిరి సీతను .... ||శ్రీ||
3. "రాణులందరిలో | మహారాణిగ |
రాణింపుము లం | కేశుని రాణిగ |
మండోదరి క | న్న నిన్ను మిన్నగ
రాక్షసేంద్రుడు - ప్రేమించునుగ |
దశకంఠుడు నిను ప్రియతమ భార్యగ
భావించుటయే - నీ భాగ్యముగ |
అంతటి యశో వి | శాలుని గొను" మని
రాక్షస వనితలు - వేచిరి సీతను .... ||శ్రీ||
__: 23 వ. స. సంపూర్ణము :__
