దేవదాసు అన్న ముఖం వైపు చూసి "మీకు ఉచితమనిపించినట్లుగా ఖర్చు పెట్టండి." అన్నాడు.
"అలా కాదు తమ్ముడూ, కేవలం నేను ఉచితమనుకుంటే చాలదు. ఇప్పుడు నీవు కూడా పెద్దవాడివయ్యావు. నీ అభిప్రాయం తెలుసుకోవడం కూడా అవసరం."
"రొక్కం ఎంత డబ్బుందీ?" అడిగాడు దేవదాసు.
"నాన్నగారి లెక్కలో లక్షన్నర రూపాయలు నిలువ వున్నాయి. నా అభిప్రాయం ప్రకారం పదివేల రూపాయలు ఖర్చు పెడితే చాలనుకుంటాను. ఏమంటావు?"
"నా కెంత లభిస్తుంది?"
ధర్మదాసు కొంచెం అటూ ఇటూ జరిపి "నీకు కూడా సగం లభిస్తుంది. పదివేలు ఇప్పుడు ఖర్చయితే డెబ్బదివేలు నీకూ, డెబ్బది వేలు నాకూ లభిస్తాయి."
"అమ్మకు ఏమి లభిస్తుంది?"
"అమ్మ నగదు తీసుకొని ఏం చేసుకొంటుంది? ఆమె ఎటూ ఇంటికి యజమానురాలే. ఆమె ఖర్చు మనం భరించుదాం."
దేవదాసు కొంచెం సేపు ఆలోచించి "నా అభిప్రాయం ఏమిటంటే మీ వాటానుంచి అయిదు వేల రూపాయలు ఖర్చు పెట్టండి. నా వాటా నుంచి పాతికవేల రూపాయలు ఖర్చు పెట్టండి. మిగిలిన పాతికవేల రూపాయలు అమ్మ పేరున జమ చేసి వుంచండి. మీ అభిప్రాయం ఏమిటి?" అన్నాడు.
మొదట ద్విజదాసు కొంచెం సిగ్గుపడ్డాడు. తరువాత "సరే మంచిది, నీకు తెలుసుగదా? నాకు భార్య, కొడుకు, కూతురు వున్నారు. వాళ్ళ అధ్యయనాలకు, ఉపనయనాలకు, వివాహాలకూ, చాలా ఖర్చు పెట్టవలసి వుంటుంది. అంచేత ఈ అభిప్రాయమే బాగున్నది." అని మళ్ళీ కొంచెం ఆగి "ఇలా అని కొంచెం వ్రాసి యిస్తావా?" అన్నాడు.
"వ్రాతకోతలతో పనేమిటీ? ఆ పని అంత బాగుండదు. ప్రస్తుతం డబ్బు విషయం రహస్యంగా వుండటమే మంచిదని నా అభిప్రాయం."
"అయితే మంచిదే. కాని నీకు తెలియదు తమ్ముడూ...."
"సరే నేను వ్రాసే ఇస్తాను" అని ఆ రోజే దేవదాసు వ్రాసి ఇచ్చాడు.
రెండవ రోజు మధ్యాహ్నం పూట దేవదాసు మెట్లమీదుగా క్రిందికి దిగి వస్తున్నాడు. మధ్యలో పార్వతిని చూసి ఆగిపోయాడు. పార్వతి అతడి ముఖం వైపు చూసింది_చూసి గుర్తుపడుతూ వుండగానే ఆమెకు దుఃఖం కలుగుతూ వుంది. దేవదాసు గంభీరంగానూ, శాంతంగానూ "ఎప్పుడొచ్చావు పార్వతీ?" అన్నాడు.
అదే కంఠస్వరం మూడు సంవత్సరాల తరువాత ఈ రోజు వింటున్నది. తల వంచుకొని పార్వతి "ఈ రోజు ఉదయమే వచ్చాను" అన్నది.
"చాలా రోజుల నుంచి చూడలేదు. బాగున్నావు గదా?"
పార్వతి తల వంచుకొని వుంది.
"చౌధరి మహాశయుడు బాగున్నాడా? అబ్బాయిలూ, అమ్మాయిలూ అందరూ బాగున్నారా?"
"అందరూ బాగానే వున్నారు" అని పార్వతి ఒకసారి ముఖం వైపు చూసింది. కాని ఒక్కమాట కూడా అడగలేకపోయింది. ఆయన ఎలా వున్నాడు, ఏం చేస్తున్నాడు మొదలయిన విషయాలు ఏవీ అడగలేక పోయింది.
"ఇంకా ఇక్కడ కొన్నాళ్ళు వుండవలసి వుంటుంది గదా?" అన్నాడు దేవదాసు.
"అవును!"
"అయితే ఇంకేం?" అని దేవదాసు వెళ్ళిపోయాడు.
శ్రాద్ధకర్మలు సమాప్తమైపోయాయి. దానిని వర్ణించడం కోసం చాలా వ్రాయవలసి వుంటుంది. అంచేత అదంతా చెప్పవలసిన అవసరం ఏమీలేదు. శ్రాద్ధం పూర్తి అయిన మరుసటి రోజు పార్వతి, ధర్మదాసును ఒంటరిగా పిలిచి అతడి చేతిలో ఒక బంగారు హారాన్ని వుంచి "ధర్మా! దీన్ని మీ అమ్మాయికివ్వు. మెళ్ళో వేసుకుంటుంది" అన్నది.
ధర్మదాసు ఆమె ముఖం వైపు చూసి ఆర్ద్రనేత్రాలతో, జాలిగొలిపే కంఠస్వరంతో "నిన్ను చాలా రోజులనుంచి చూడలేదు. అంతా క్షేమంగా వున్నారా?" అన్నాడు.
"అందరం క్షేమంగానే వున్నాం. మీ అబ్బాయిలూ, అమ్మాయిలూ బాగున్నారా?"
"అవును పత్తో, అంతా బాగానే వున్నారు."
"నీవు బాగున్నావా?"
ఈసారి దీర్ఘమైన నిట్టూర్పు విడిచి ధర్మదాసు "ఏం బాగున్నానమ్మా? ఇప్పుడు ఈ జీవితం భారంగా కనిపిస్తున్నది__యజమానే వెళ్ళి పోయాడు...." ధర్మదాసు శోకాతిశోకంతో ఇంకా కొంత చెప్పదలచుకొని వున్నాడు. కాని పార్వతి అడ్డుపడింది. ఈ మాటలన్నీ వినడం కోసం ఆమె హారాన్ని ఇవ్వలేదు.
"ఇదేమిటి ధర్మదాస్! నీవు వెళ్ళిపోతే దేవదాసును ఎవరుచూస్తారు?" అన్నది పార్వతి.
"చిన్న పిల్లవాడుగా వున్నప్పుడు చూడవలసిన అవసరం వుండేది. ఇప్పుడు చూడకుండా వుంటేనే బాగున్నాడు" అన్నాడు ధర్మదాసు.
పార్వతి మరింత దగ్గరగా వచ్చి "ధర్మా! ఒక మాట అడుగుతాను, ఉన్నదున్నట్లు నిజం చెబుతావా?" అన్నది.
"ఎందుకు చెప్పను పత్తో?"
"దేవదాసు ఈ సమయంలో, అంటే ఇప్పుడే ఏం చేస్తూ వున్నాడో నిజం చెప్పు!"
"నా తలకాయ చేస్తుంటాడు. ఇంకేం చేస్తూ వుంటాడు?"
"ధర్మదాస్! స్పష్టంగా చెప్పవేమిటీ?"
ధర్మదాసు తల బాదుకొంటూ "స్పష్టంగా ఏం చెప్పేది? అది చెప్పుకోదగిన విషయమా? ఇప్పుడు యజమాని కూడా లేడు. దేవదాసు చేతికి అమితంగా డబ్బు అందింది. ఇంకా ఏం చేతికొస్తాడు?" అన్నాడు.
పార్వతి ముఖం అమాంతంగా మలిన పడిపోయింది. ఆమె అస్పష్టంగా ఏదో కొంత విని వుంది. బాధపడుతూ అడిగింది "ఏం చెపుతావు ధర్మదాస్? మనోరమ వ్రాసే ఉత్తరాల ద్వారా ఇటువంటి సమాచారం అందుతూ వుంటే విశ్వసించేది కాదు. ధర్మదాసు తల వంచుకొని చెపుతూ వున్నాడు. "తినడం లేదు, త్రాగడం లేదు, నిద్రపోవటం లేదు. కేవలం మధ్యం బాటిల్ మీద బాటిల్-మూడేసి రోజులు, నాలుగేసి రోజులు ఎక్కడుంటాడో కూడా తెలియదు. ఎంతో డబ్బు ఊది పారేస్తున్నాడు. అనేక వేల రూపాయల సొమ్ములు కూడా చేయించాడని వింటున్నాను."
పార్వతి ఆపాద మస్తకం కంపించిపోయింది. "ధర్మదాస్! ఏమిటి నీవు చెప్పేది? ఇది పూర్తిగా నిజమేనా?"
ధర్మదాస్ తన మనసులో అనుకున్నాడు__బహుశా నీ మాట వింటాడేమో! నీవు ఒక్కసారి వారించి చూడు. ఎటువంటి శరీరం ఎట్లా అయిపోయింది? ఇలా నిగ్రహం కోల్పోతే, అత్యాచారాలకు గురయితే ఎంత కాలం జీవిస్తాడు? ఈ విషయం ఎవరితో చెప్పేది? తల్లీ, తండ్రీ, అన్న లాంటి వాళ్ళతో ఇటువంటి విషయాలు చెప్పలేం" ధర్మదాసు మళ్ళీ ఆలోచించి "విషం పుచ్చుకొని చచ్చిపోదాం అనిపిస్తుంది. ఇక ముందు బ్రతకాలనే కోర్కె కూడా లేదమ్మా!" అన్నాడు.
పార్వతి లేచి వెళ్ళిపోయింది. నారాయణబాబు చనిపోయాడనే సమాచారం తెలిసి బయలుదేరి వచ్చింది. ఈ ఆపద సమయంలో దేవదాసు దగ్గరకు వెళ్ళడం అవసరమని ఆలోచించింది. అయితే తనకు అత్యంత ప్రియుడయిన దేవదాస్ స్థితి ఇలా వుంది. ఎన్నో విషయాలు ఆమె మనసులో మెదులుతూ వున్నాయి. ఆమె దేవదాసును ఎంత ధిక్కరించిందో అంతకు వేయిరెట్లు తనను తాను ధిక్కరించుకున్నది. తాను వుంటే ఆయన ఇలా చెడిపోయి వుండేవాడు కాడని ఆమె మనసులో వేయిసార్లు అనుకున్నది. మధ్యలోనే ఆమె తన కాళ్ళమీద తాను గొడ్డలి వ్రేటు వేసుకున్నది. కాని ఆ గొడ్డలి ఆమె తలమీద పడింది. తన దేవదాసు ఇలా అయిపోతున్నాడు. ఈ రకంగా నష్టపోతున్నాడు. తానేమో మరొకరి సంసారం నిలబెట్టడంలో నిమగ్నమై వుంది. పరులను తన వాళ్లుగా భావించి నిత్యం భోజనం పంచుతూ వున్నది. ఇక్కడ తన సర్వస్వం అయినవాడు ఆకలితో అలమటించిపోతున్నాడు. ఈరోజు దేవదాసు పాదాల వద్ద తల పగలగొట్టుకుని ప్రాణాలు త్యజిస్తానని పార్వతి ప్రతిజ్ఞ చేసింది.
సాయంత్రం కాబోతూ వుంది. పార్వతి, దేవదాసు గదిలోకి ప్రవేశించింది. దేవదాసు మంచంమీద కూర్చొని లెక్క చూస్తూ వున్నాడు. ఇటు చూశాడు_పార్వతి నెమ్మదిగా తలుపు వేసివచ్చి నేలమీద కూర్చున్నది. దేవదాసు తలెత్తి నవ్వి ఆమె వైపు చూశాడు. ఆమె వదనం విషాదంతో నిండి వుంది. అయితే శాంతంగా వుంది. అమాంతంగా కుతూహలంతో "ఒకవేళ నేను నీ మీద అపనింద వేస్తే?" అన్నాడు.
పార్వతి సిగ్గుపడుతూ నీలి కమలాల్లాంటి రెండు కళ్ళతో ఒకసారి అతడివైపు చూసింది. తరువాత కళ్ళు వాల్చుకుంది. దేవదాసు అన్నటువంటి ఆ మాట ఆమె హృదయంలో జీవితాంతం ఉండేటట్లుగా ముద్ర బడిపోయిందని చక్కగా తెలియచేసింది. ఆమె దేవదాసుతో ఎన్నో విషయాలు చెప్పాలని వచ్చింది. కాని అన్నీ మరచిపోయింది. ఒక్కటి కూడా చెప్పలేకపోయింది. దేవదాసు మళ్ళీ నవ్వి "నాకు తెలుసు, నాకు తెలుసు. సిగ్గువేస్తుంది కదూ?" అన్నాడు. అప్పుడు కూడా పార్వతి ఏ మాటా చెప్పలేకపోయింది. "ఇందులో సిగ్గుపడవలసినది ఏముంది? నేనూ, నీవూ ఇద్దరమూ బాల్యంలో ఒకచోట తోడు తోడుగా లేస్తూ, కూర్చుంటూ, ఆడుతూ పాడుతూ తిరిగాము. ఈ కాలంలోనే మధ్యలో ఒక గందరగోళం జరిగింది. కోపం వచ్చి నీ యిష్టం వచ్చినట్లు మాట్లాడేశావు. నేను కూడా నీ తలమీద గుర్తుగా ఈ మచ్చ వేశాను. ఎలా వుంది?" అన్నాడు దేవదాసు.
దేవదాసు మాటలో శ్లేషగానీ, విడ్డూరంగానీ లేశ మాత్రం గూడా లేదు. నవ్వుతూ నవ్వుతూనే పూర్వం జరిగిపోయిన దుఃఖగాథను చెప్పి వినిపించాడు. అది విని పార్వతి హృదయం పగిలి బ్రద్దలై పోయింది. నోటికి చీర చెంగు అడ్డం పెట్టుకుని, ఓ దీర్ఘమయిన నిట్టూర్పు విడిచి మనసు లోపలనే అనుకున్నది_"దేవదాదా! ఈ మచ్చ మాత్రమే నా ఓదార్పుకు కారణంగా వుంది. ఇది ఒక్కటే నా ఏకైక సహచరి. నీవు నన్ను ప్రేమించేవాడివి. అందుకు నామీద దయతలచి మన ఇరువురి బాల్య చరిత్రను ఈ రూపంలో ఈ లలాటంమీద ముద్రించావు. దీనికి నేను సిగ్గుపడటం లేదు. ఇది నాకు కళంకం కాదు. ఇది నా గౌరవ చిహ్నం!"
