Previous Page Next Page 
మూసిన తలుపులు పేజి 17


                                     12
    కాలేజీ ఆవరణలోకి అడుగు పెడుతున్న రాజ్ కు ఎదురుగా ఒక కారు సడన్ బ్రేక్ తో నిలిచింది. ఎవరా అని చూశాడు. ఆనందరావు గారి కారది. కారులో నుండి దిగిన రంగన్న "బాబూ , అయ్యగారికి చాలా ప్రమాదంగా ఉంది. అమ్మాయి గారు సెలవు చీటీ యిచ్చి రమ్మంటే యిచ్చి పోతున్నాను."
    కలవరపడ్డాడు రాజ్ ఆ వార్తా విని.
    "ఎప్పటి నుండి రంగన్నా?" అని అతని జవాబుకు ఎదురు చూడకుండా "పద" అని కారులో కూర్చున్నాడు.
    "రాత్రి జబ్బు తిరగబెట్టింది, బాబూ! రాత్రంతా డాక్టరు గారు అయన దగ్గరే ఉన్నారు."
    "అంతగా ప్రమాదం సంభావించటానికి కారణం?"
    'ఏముంది , బాబూ? అమ్మాయి గారి ప్రవర్తనే. ఆమె పై ఎవరో ఏదో చెప్పారట. రాత్రి ప్రొద్దుపోయి ఇంటి కొచ్చిన ఆమె గారిని నోటి కొచ్చినట్లు తిట్టి రక్త పోటు తిరగ బెట్టగా పడిపోయారు."
    ఆందోళన పడ్డాడు రాజ్. ఛ! తండ్రికి శాంతి నివ్వలేని ఈ బిడ్డల్ని దేవుడెందుకు ప్రసాదిస్తాడో/ ధనం, గుణం, పరోపకార బుద్ది కలిగిన అటువంటి వారికి లోటును ఎందుకు కలిగించావు దేవుడా అనుకొంటుండగా కారు బంగళా లోకి ప్రవేశించింది.
    ఒక్క ఊపులో లోపలికి పోయాడు రాజ్. ఆనందరావు గారు పడుకోనున్నారు. వారి ప్రక్కన నౌకరు, వసంత, డాక్టరు నిలబడి ఉన్నారు.
    వారి ఫామిలీ డాక్టరు కేశవరావు గారు రాజ్ ను చూసి చిరునవ్వుతో "మీరిక్కడుండడం చాలా అవసరం" అన్నాడు.
    'ఆలాగేనండి. తప్పకుండా ఉంటాను" అన్నాడు రాజ్.
    మందులు, మాత్రలు ఎలా ఇవ్వాలో వివరంగాచేప్పి డాక్టరు వెళ్ళిపోయాడు. డాక్టరు ను బయటి వరకూ సాగనంపాడు రాజ్.
    "చూడండి. వాళ్ళమ్మాయి ని సాధ్య మైనంత వరకూ వారికి దూరంగా ఉంచండి." అని చెప్పి పోయాడు డాక్టరు.
    "డాక్టరు గారేమన్నారండీ" అంది వసంత తిరిగి వచ్చిన రాజ్ తో.
    "మరేం ఫరవాలేదన్నారులే" అని అక్కడే కూర్చున్నాడు.
    ఆనందరావు గారు అటూ ఇటూ కదిలారు. కళ్ళు తెరిచి ప్రక్కనే ఉన్న వసంత ను చూసి తిరిగి బాధగా కళ్ళు మూసుకున్నారు.
    'ఇక నువ్వెళ్ళు , వసంతా. అంతా నేను చూసుకుంటాను." అన్నాడు రాజ్. అర్ధం చేసుకొని వెళ్ళిపోయింది వసంత.
    కళ్ళు తెరిచి 'నువ్వు వచ్చావా , శేఖరం' అన్నారు ఆనందరావు గారు మెల్లగా.
    "మీరు మాట్లాడకుండా పడుకొని విశ్రాంతి తీసుకోండి."
    "ఏం విశ్రాంతో! చచ్చిపోయిన తర్వాతనే ఈ జీవికి విశ్రాంతి." అని కళ్ళు మూసుకుని ఒక ప్రక్కకు తిరిగి పడుకొన్నాడు ఆనందరావు గారు.
    రాజ్ రాత్రి గదికే రాలేదని తెలుసుకొన్న రజియా కాలేజీ లో విచారించింది. అతను కాలేజీ కి కూడా రాలేదని విని ఆశ్చర్యపోయింది. ఆ సాయంకాలం విచార వదనంతో కూర్చొని ఉండగా కారాగిన చప్పుడయి ఎవరా అని చూసింది. ఎదురుగా చిరునవ్వులతో సరోజినీ దేవి ప్రత్యక్ష మైంది. ఆమెను చూసి తన దుఃఖాన్ని మరిచిపోయి ఉత్సాహాన్ని తెచ్చుకొంది రజియా.
    బయట కారాగిన చప్పుడు విని 'ఎవరమ్మా రజియా' అని లోపలి నుండి వచ్చిన ఖాన్ గారు "సరూ, నువ్వా! చాల రోజుల కొచ్చావే!" అన్నారు పైప్ నోట్లోంచి తీసి చేతిలో పట్టుకొని.
    చిరునవ్వుతో జవాబు చెప్పింది సరోజినీ దేవి. నౌకరు తెచ్చిన టీ త్రాగిన తర్వాత 'అమ్మాయిని మా మహిళా మండలికి తీసుకెళ్లడాని కొచ్చాను. పంపిస్తావా , ఖాన్" అందామె.
    'అలాగే. అమ్మాయి యిష్టపడితే తీసికెళ్ళు."
    రాజ్ వస్తాడేమోనని ఎదురు చూస్తూ నిరాశ లో ఆశను పెంచుకొంటున్న రజియా "ఏం రజియా ' అని సరోజినీ దేవి అడగ్గానే ఇబ్బంది లో పడి ఒప్పేసుకొని లేచింది.
    కాలేజీ నుండి వచ్చి దుస్తులు కూడా మార్చుకోలేదు రజియా. "ఈ డ్రెస్ బాగులేదు. నేను అలంకరిస్తాను. రా" అని లోపలికి తీసుకు పోయింది సరోజినీ దేవి.
    కాసేపటికి బయటికి పోతున్న వారిద్దరినీ చూసి నిర్లిప్తంగా నిట్టూర్చడం మినహా మరేం చెయ్యలేక పోయారు ఖాన్ గారు.
    మహిళా మండలి లోపలికి ప్రవేశించగానే వారికి మరో ఇద్దరు స్త్ర్తీలు ఎదురయ్యారు. వారిలో ఒకరిని జడ్జి గారి భార్యగా గుర్తించగలిగింది రజియా.
    "ఈ అమ్మాయి నీ కూతురా, సరోజా!" అడిగిందామె సరోజినీ దేవిని.
    ఆ హటాత్ ప్రశ్నకు తల ఊపేసింది సరోజినీ దేవి.
    'అదేమిటే నీకింత కూతురుందని మాకెప్పుడూ చెప్పలేదేం" అంది మరోకావిడ. సరోజినీ దేవి తల ఊపడం చూసి ఆశ్చర్యపోయింది.
    అప్పుడే రజియా ను తనివితీరా చూసి తృప్తి పడుతున్న సరోజినీ దేవి ఆవిడ మాటలు విని 'సారీ. ఈ అమ్మాయి మా స్నేహితురాలి కుమార్తె. వీళ్ళ తల్లి , నేను బాల్య స్నేహితులం." అంది. మనసులో ఉబుకుతున్న దుఃఖాన్ని పైకి కనబడకుండా ఉండాలని ప్రయత్నిస్తుంది ఆమె. అది గమనించింది రజియా. బహుశా తన తల్లి చనిపోయిందనే దుఃఖం ఆమెలో ప్రబలిందేమోనని అనుకొంది.   
    సరోజినీదేవి వారిని రజియాకు పరిచయం చేయాలనుకొన్న విషయమే మరిచిపోయి అక్కడ ఎక్కువసేపు ఉండలేక రజియాను తీసుకొని లోపలికి పోయింది.
    సరోజినీ దేవి రజియాను మహిళా మండలిలోని ఒక్కొక్క చోటికి తీసుకెళ్ళి అన్నీ చూపించింది. ఒక చోట కుట్టుమిషన్ మీద పని నేర్పుతున్నారు. స్వంతంగా కుట్టు మిషన్ పెట్టుకొని తమ పనులు నిర్వర్తించుకొనేందుకేమో ఆ పని నేర్పుతున్నారు. అందరో ఆ విధంగా చేస్తే మరి టేయిలర్లు జీవనోపాధి లేక మాడిపోరూ?
    మరోచోట సంగీత శిక్షణ నిస్తున్నారు. ఎవరి కిష్టమైన విధంగా వారికి ఆ సంగీతాన్ని నేర్పుతున్నారు. ఎవ్వరూ నిరుత్సాహపడకూడదు. అందరకీ ఉత్సాహాన్నీ, ప్రోత్సాహాన్నీ ఇచ్చి కష్టపడుతున్నారు ఆయా వృత్తులకు నియమింప బడిన ఇన్ ప్రక్తర్లు. వారికి వేతనాలు. అదే కాదు. అల్లిక పనులు, కుట్టు పనులు మొదలగునవెన్నో నేర్పుతుంటారు. ఆటలకు ప్రోత్సాహము, శిక్షణా విరివిగా ఉంటాయి. దానిలో పలే చదువు కొనడానికి లైబ్రరీ ఉంది. వివిధరకాలైన ఆటలు ఆడుకోవచ్చు.
    మహిళామండలి మొత్తం మీద ఒక అభివృద్ధి సూచక సంస్థ అని చెప్పక తప్పదు దీని ఉద్దేశ్య మేమిటి? వెనుకబడి ఉన్న స్త్రీ జాతిని పునరుద్దరించడమే! మహిళలు అన్ని రంగాల్లో ముందంజ వేయాలి. మగవారికి ఎందులోనూ తీసిపోకూడదు. వారితో సమానమైన స్థానాన్ని సంఘం లో సంపాదించు కోవాలి. స్త్రీ అంటే ఆబల కాదు , సబల అని ఈ ఆధునిక జీవితంలో నిరూపించుకోవాలి. స్త్రీ విద్యా విహీనురాలు కాదు. విజ్ఞాన వంతురాలు అని లోకానికి చూపాలి. గౌరవం లేకుండా బ్రతుకుతుంది స్త్రీ జాతి. ఎందుకు? ఏమీ చేతకానిదనా? ఎందుకూ కొరగానిదనా? కాదు. అమెకన్నీ చేతనవును. ఆమెకు తగిన గౌరవం ఇవ్వాలి. అందుకే కంకణం కట్టుకొంది స్త్రీ జాతి నుద్దరించడానికి ఈ మహిళా సమాజం.
    చదువు రానివారికి చదువు నేర్పించడం, విజ్ఞానాన్ని బోధించడం లాంటి పనులు చేస్తుంటుంది. సభ్యత సంస్కారాలు అలవరచు కొనే విధం నేర్పుతుంది. పదుగురి లో మెలగవలసిన విధానాన్ని ఇక్కడ నేర్చు కొంటారు స్త్రీలు. ప్రతి విద్యలోనూ కాకపోయినా ఒక విద్యలో నైనా ప్రావీణ్యాన్ని గడించు కొమ్మంటుంది. సంసార జీవితానికి అవసరమైన నడవడికను నేర్చుకో గలదు ఆడది. తమ బాల్యం లో చదువు కోవడానికి గానీ, విజ్ఞానాన్ని అలవరచు కోవడానికి గానీ వీలుపడని సంసార స్త్రీలకూ ఇవి మరొక అపూర్వ అవకాశం లాంటిది. ఉదయం నుండి భర్తతోనూ, బిడ్డలతోనూ విసిగిన స్త్రీకి ఇది కొంచెం విశ్రాంతి నిచ్చి స్వేచ్చ వాయువులను పీల్చుకొనడానికి అవకాశానిస్తుంది. కాలక్షేపానికి ఉపయోగించుకొనే వాళ్ళూ లేకపోలేదు. తోటి స్త్రీలతో కలసి పిచ్చాపాటీ మాట్లాడుకునే అవకాశం లభిస్తుంది. జీవనోపాధి వృత్తుల నభ్యసించుకొనే ఉద్దేశం కూడా కొందరికి ఉండక పోదు. కొందరికి జీవనోపాదు లను కలిగించే ఈ మండలి అందరి మన్ననలకూ పాత్రమవుతుంది.
    కానీ మానవత్వానికి కొన్ని చెడ్డ గుణాలు ఉన్నాయి. అవి అప్పుడప్పుడు వారిని పెడదారిని పట్టిస్తుంటాయి. ఇక్కడికి వచ్చే స్త్రీలలో స్వార్ధం, గర్వం, అసూయ, పరస్పర విభేదం ఎక్కువగా కనిపిస్తాయి. ధనవంతుల మనే గర్వం, ఆఫీసర్ల భార్యలమనే ఠీవి ఎక్కువగా ఉంటాయి. మంచి మనసుతో ఇతరుల నర్దం చేసుకొని సభ్యత సంస్కారాలు అలవరచు కొనేవారు చాలా అరుదు. ధనవంతులకు పేదవారి పై చులకన. వారు తమతో బాటు మండలికి వస్తారే అనే భావం వారిలో మెదలుతుంటుంది. వారూ తమ వలె మనుష్యులే , వారికీ తమ వలెనె ఎన్నో కోరికలు ఉంటాయన్న విషయం విస్మరించి అవహేళనగా మాట్లాడతారు. వారిలో వారికి అసూయా, పరస్పర విభేదాలు ఎప్పుడూ మసలుతుంటాయి. ఒకరి పై మరొకరికి మనసుల్లో కోపమూ, జుగుప్సా కారణం లేకుండానే కలుగుతుంటాయి. ఆఫీసర్ల భార్యలూ తమకన్నా తక్కువ వారితో మాట్లాడడానికీ , వారితో కలిసి పోవడానికీ భయపడి, అది తమ కవమానమని భావిస్తారు. అది వీరి తప్పు కాదు. మానవ సహజమైన దుర్గుణాలను వారు ఆచరిస్తున్నారు. అలాగని మంచి నడత తో పెదలనే భావం లేక హెచ్చు తగ్గుల తారతమ్యం లేక అందరిలో కలిసిపోయే మహానుభావురాళ్ళు ఉండక పోలేదు.
    పేదలకు తమ లేమి పై కోపం, అందవికారులకు తమ కటువంటి రూపాన్నిచ్చిన దేవుని పై కోపం, తక్కువ కులస్థులకు , తమ కులం పైన అసహ్యం. మండలి లో సామాన్య దృష్టి లో కులమతాలకు పట్టింపులు లేకపోయినా వ్యక్తిగతంగా వీటికి ఎక్కువ ప్రాధాన్యం ఉంది. మనం సృష్టించుకొన్న ఈ మతాలను చూసి మనం భయపడుతుంటే దేవుడు సృష్టించిన మనలను, మనలోని దుర్గుణాలను చూసి ఎవరు భయపడతారు? అది కూడా మనమే భరించ వలసి ఉంటుంది. ఎప్పుడు పుడతామో, ఎప్పుడు చచ్చి పోతామో తెలియని మనం ఆ చావు బ్రతుకుల మధ్య కాలంలో ఎన్ని పనులు చేస్తుంటామో! ఎన్ని పనులు చేయాలని ఆత్రుత పడుతుంటామో! ఎందుకో ఆ ఆవేదన? ఎందుకో ఆ ఆత్రుత? జీవితం బుద్బుద ప్రాయమని తెలిసినా ఈ ఆవేదన నుండి, ఈ కష్టాల నుండి మనం విముక్తులం కాలేకున్నాము.
    సరోజినిదేవి తన టేబుల్ ముందు కూర్చొని ఏదో పైలు తిరగ వేస్తుంది. రజియా అక్కడే బీరువా లో నున్న పుస్తుకాలను చూడసాగింది. అవి చూడడం ముగించి గోడల కున్న ఫోటోలను చూస్తూ ముందుకు పోయింది. ఆ గోడలకు ఎన్నో ఫోటోలు. ఆ ఫోటో లలో ఎందరో వ్యక్తులు. ఎవరు వారంతా? బహుశా అక్కడ ఉండి సరదాగా జ్ఞాపకార్ధం గ్రూపుగా తీయించు కొన్న ఫోటో లేమో. కలిసి కట్టుగా నున్నప్పుడు ఆప్యాయతను, అభిమానాన్ని ఒలక బోస్తారు. దూరమైతే ఎవరికి వారే! మరి ఎందుకీ తతంగ మంతా అని నవ్వుకొంది రజియా. అక్కడే గోడలకు కొన్ని చిత్ర లేఖనాలు ఉన్నాయి. మొదట అవి ఫోటోలా అని భ్రమ పడ్డది రజియా . కానీ ఆ తర్వాత కాదని తెలుసుకొంది. బాపూజీని, దేశ నాయకుడు నెహ్రూ గారిని అతి నేర్పుతో చూపరులనే మెప్పింప బడే విధంగా చిత్రించిన ఆ చిత్ర కారులేవరో పుణ్యాత్ములు అనుకొంది.
    మరి కొన్ని చిత్రాలు చూసింది. అన్నిటికన్నా ఒక చిత్రం ఆమెను ఎక్కువగా ఆకర్షించింది. అది ఒక నగ్న రూపమైన స్త్రీ చిత్రం. కళను అర్ధం చేసుకొని , తనలోని హావ భావాలను చూపించి లోకపు చీకటి తెరలను తన శక్తి తో తొలగించి లోకానికొక దివ్య సందేశాన్నివ్వాలని అతి కష్టంతో , ప్రయాస తో చిత్రకారుడు నిర్మించిన జ్యోతి. నగ్న రూపమని తెలియని వారు అసహ్యించు కోవచ్చు. కానీ కళాకారులకు, కళా హృదయాలకు దేనిపై దృష్టే పోదు. ఆ నగ్న రూపం వెనుక దాగిన సత్యాన్ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు వారు.
    స్త్రీ దుస్తులు ధరించి ఉన్నప్పుడు అందంగా కనబడుతుంది. కోరికలను కలిగిస్తుంది. అదే రూపాన్ని నగ్నంగా చూసినప్పుడు అసహ్యించు కొంటాం. ఆ ఆకర్షణ అనేది అంతా ఉత్త భ్రమే నన్న నిజాన్ని చెపుతుంది. ఆ స్త్రీ సృష్టికి అర్ధం తెలుసుకొన్ననాడు ఆమె నగ్నరూపం మాత్రమే మసకగపడి ఇదొక భ్రమ అనే సందేశాన్నివ్వవచ్చు. లేదా ఇదొక మహత్తర శక్తి అనే సత్యాన్ని తెలుపనూ వచ్చు. అలాగే జీవితపు విలువలను, ప్రపంచపు బూటకాన్నీ అలోచించి అవగాహన చేసుకోగలిగిననాడు లోకం మాయ అనే భావమే కాక అర్ధం కాని అద్భుత శక్తిగా కనబాడుతుంది. అది తెలుసుకోన్నవారు జీవితాన్ని త్యజించి మహాత్ములుగా , విభాగులుగా మన కళ్ళ ముందు నిలిచారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS