.jpg)
13
కొత్త ఇంట్లో ప్రవేశించి ఆరేడు నెలలు గడిచి పోయాయి. ఆ ఇల్లు గాంధీ నగరం లో ఉంది. ఆ పేట నివాస యోగ్యంగా మారాలంటే నిజంగా గాంధీ గారి లాంటి వ్యక్తీ అవతరించాల్సిందే . అందుకే ఆ పేరు పెట్టారేమో ననిపిస్తుంది. శ్రావణ మాసమోచ్చింది . వర్షాలు విపరీతంగా కురవటం మొదలెట్టాయి. ఆపేట అసలే పల్లంలో ఉంది పై నున్న మరి రెండు పేటల్లోని నీరు ఏకమై చిన్న నదీ ప్రవాహం లా ఈ పేట లోంచే ఊరు బయటకు పోతూ వుంటాయి. ఆ పేట అంతటికి చిన్నదైన రాజు ఉండేదే కాస్త 'ఇల్లు' అనిపించుకుంటుంది. కాని గాలి వెల్తురనేవీ భూతద్దం పెట్టి వెతికినా కనిపించవు. మిగిలిన ఇళ్ళన్నీ కూలి నాలి చేసుకునే పేద జనాలవి. పగలంతా పొట్ట కూటికి పడే అవస్తల తోనే సరిపోతుంది. శుచి శుభ్రతలకు టైము చాలదు. దానికి తోడు, కోళ్ళు, పందులు యేదేచ్చగా విహరిస్తూ ఉంటాయి. ఇరవై నాలుగు గంటలూ ముక్కు పుటాలను బ్రద్దలు చేసే దుర్ఘంధంతో చావులూ, రోగాలకూ తక్కువేమీ ఉండదు. తిండికి పోను ఏ కొంచెమో మిగిల్తే సారాయి కి , కల్లుకూ తగలేస్తూ ఉంటారు. రాత్రి పొద్దుపోయే వరకూ పోట్లాటలూ, తిట్లూ, సారాయి నిషాలో పోట్లాటలూ నానా గందర గోళంగా ఉంటుంది. మానవుడు పరిసరాలకూ పరిస్థితుల కనుగుణంగా ఎంత తొందరగా మారిపోతాడో, ఆ పేట కొచ్చిన కొద్ది రోజులకే రాజుకు తెలిసిపోయింది. ఇప్పుడు గాంధీ నగరం సుందర దృశ్యాలు, సుగంధ పరిమళాలు బాగా అలవాటై పోయాయి. సంవత్సరం క్రితం విశాఖ పట్నం లో తన స్థితినీ, ఈనాటి స్తితితో పోల్చి చూసుకుంటే తనే విధంగా ఈ పేటలో ఉండ గలుగుతున్నాడో తనకే అర్ధం కాకుండా పోయింది. అప్పుడేవరైనా ఈ పేట పరిస్థితిని విపులంగా వర్ణించి చెప్పి ఉంటె, అటువంటి స్థితిలో మనుషులు మనుషులుగా బ్రతకటం అసంభవమని వాదించి వుండేవాడు కాని ఇప్పుడు కళ్ళారా చూస్తూనే వున్నాడు. తనివి తీరా అనుభవిస్తున్నాడు. అయినా తాననుకొన్నట్లే ప్రళయం ముంచుకు రాలేదు. సూర్యుని ఉదయస్తమాయాలు సక్రమంగా జరిగిపోతూనే వున్నాయి. కార్లలో పోయే అదృష్ట వంతులు సుఖంగా పోతూనే ఉన్నారు. మలమల మాడే తారు రోడ్ల మీద, ఆరి కాళ్ళు బొబ్బలెక్కుతూ పనులు చేసే నిర్భాగ్యులు చేస్తూనే ఉన్నారు. కాలం తనకేమీ పట్టనట్లు తనదారిన తను పోతూనే ఉంది.
కారు అమ్మగా వచ్చిన డబ్బూ, అంతకు ముందు బాంకులో నిల్వ ఉన్న రొక్కం అంతా కలిపి రాజు వచ్చేప్పుడు చాలా డబ్బే తెచ్చాడు. కాని అంతా హారతి కర్పూరం లా హరించుకు పోయింది. కొత్త ఇంట్లోకి వచ్చాక మూడు నాలుగు నెలలు ఓ మాదిరిగా గడిచి పోయాయి. ఆ నాలుగు నెలలైనా ఎలా సర్దు కొచ్చిందో వనజకే తెలియాలి. రాజేప్పుడూ దాన్ని గురించి అంతగా ఆలోచించ లేదు. తర్వాత కొన్నాళ్ళు కొన్న సామానంతా ఒకదాని తర్వాత ఒకటి అమ్ముకొంటూ -- గడిపారు. వాళ్ళింటి పక్కనే ఒక కారు డ్రైవర్ కాపుర ముండేవాడు. అవసరమై నప్పుడల్లా ఒక్కో వస్తువు పట్టుకెళ్ళి బజార్లో అమ్మి డబ్బు తెచ్చిస్తూ సహాయపడే వాడు. మరీ ఒక నేలరోజుల్నూంచి చాలా కష్టంగా వుంది. అమ్ముకోవటానికి సామానేమీ మిగల్లేదు. మొదట్లో -- డబ్బు చేతి నిండా వున్న రోజుల్లో వనజ చిన్నవీ, పెద్దవీ చాలా నగలు చేయించుకొంది. రాజు అటువంటి విషయాలు గమనించే అలవాటు లేదు గాని, ఇప్పుడు వనజ వంటి మీద అవీ లేకుండా పోయాయి.
రాజును మళ్ళీ వాళ్ళ వాళ్ళతో కలపాలనీ వనజ చాలా ప్రయత్నం చేస్తుంది. అయినా వాళ్ళతో బేధాభిప్రాయాలు ఎన్నాళ్ళో ఉండవు. అదీగాక లోకంలో ఎంతమంది వర్ణాంతర వివాహాలు చేసుకోవడం లేదు? వాళ్ళందర్నీ తల్లిదండ్రులు వదిలేస్తున్నారా? రక్త సంబంధాలు నిశ్చింతగా తెంచి వేసుకోగలిగినంత బలహీనమైనవా? ఇటు వంటి వనజ వాదాలు రాజు మీద ఏమి ప్రభావాన్ని చూపలేదు. కాని ఏదో విధంగా రాజును ఈ విషయంలో ఒప్పించగలిగితే తనకు భవిష్యత్తు, జీవిత ధ్యేయం నెరవేరటమూ జరుగుతుంది. కాని చతుర్విధోపాయాల్లో ఏదీ కూడా రాజు మీద పని చేసేటట్లు లేదు. "నేనిక ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇంటి కెళ్ళడమంటూ జరుగదు. నా కాళ్ళ మీద నేను నిలబడగలననే ధైర్యం నాకుంది. ఈ విషయంలో ఇంకెప్పుడూ నన్ను ఒత్తిడి చెయ్యద్దు అన్నాడు రాజు నిశ్చయంగా. అతడు పేదరికానికి, కష్టాలకూ నమ్మశక్యం కానంత త్వరగా అలవాటు పడిపోయాడు. వనజ మాత్రం అలవాటు చేసుకోవటానికి ఏ కాస్త ప్రయత్నమూ కూడా చేయలేదు.
రాజుకి ఇంకా ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. అందుకు ప్రయత్నలోపమేమీ లేదు. ప్రతి రోజూ ఉదయాన్నే నాలుగు మెతుకులు నోట్లో వేసుకోవటం ఆఫీసుల చుట్టూ తిరగటం అతనికి దిన చర్యగా మారింది. చాలా రోజుల నుండి ఉద్యోగ ప్రయత్నంలో తిరగటం తో ఇద్దరు ముగ్గురు గుమాస్తాలు పరిచయమయ్యారు. వారిలో కృష్ణమూర్తి ఒకడు. అతను మొన్నమొన్ననే ఉద్యోగం సంపాదించుకోగలిగాడు. అందువల్లనేమో నిరుద్యోగుల అవస్థలు ఇంకా మర్చిపోలేదు. రాజు ఎన్నడూ దాపరికమనేది ఎరుగడు. అతని చరిత్రంతా విన్నాక కృష్ణమూర్తికి రాజంటే ఎంతో సానుభూతి ఏర్పడింది. ఆరోజు మధ్యాహ్నం రాజు కనిపించగానే "ఏమండోయ్ ఇవ్వాళ మీకో శుభవార్త తెచ్చాను." అన్నాడు.
"ఏమిటి?"
"శ్రీశైలం ప్రాజెక్టు కింద కొత్త వర్క్స్ డివిజన్ ఒకటి తెరుస్తున్నారు. దాంట్లో చాలా ఖాళీలున్నాయట."
"ఖాళీల కేం లెండి మనం చూడటం లేదూ? వస్తూనే ఉన్నాయి! భర్తీ ఔతూనే ఉన్నాయి. మనకు రికమెండేషన్ లేదుగా?"
"యేమో మీ అదృష్టం అప్లై చేయండి" అన్నాడు కృష్ణమూర్తి అప్పటికప్పుడే ఒక కాగితం మీద అప్లికేషన్ టైపు చేసి, కవర్లో పెట్టి మరీ ఇచ్చాడు.
తలవొంచుకొని నడుస్తున్న రాజుకు వెనక నుంచి ఎవరో పిలిచినట్లనిపించింది. వెనక్కు తిరిగి చూశాడు. వెల్ కం హోటలు ముందు నిలబడి ఆ కుర్రవాడు చెయ్యి ఊపుతూ పిలుస్తున్నాడు. రాజు నిర్ఘాంత పోయాడు. పేరు గుర్తు లేదు గాని ఆ కుర్రావానిది అక్కగారి ఊరు. బావగారికీ, వారికీ ఏదో దగ్గర సంబంధం కూడా ఉన్నట్లు గుర్తు. రాజు కిప్పుడు తప్పించుకునే మార్గమేమీ కనిపించలేదు, నిజమే ప్రపంచం చాలా చిన్నది.
కుర్రవాడు ఎంతో ఆప్యాయంగా పలుకరిస్తూ "మీరిక్కడే వుంటున్నారా? రండి కాఫీ తాగుదాం.' అన్నాడు.
మధ్యాహ్నం కావటం వల్ల హోటల్లో రద్దీ లేదు. ఒక మూల ఖాళీగా ఉన్న టేబులు ముందు ఫాను కింద కూర్చున్నారు. ఆ కుర్రవాడు ఎంతో ప్రియమైన ఆత్మబంధువు ను కలుసుకోన్నట్టు అతి సంతోషం కనపరుస్తున్నాడు. చాలా పదార్ధాలకు ఆర్డరిచ్చాడు.
"మీరిక్కడే ఉన్నారని నాకు తెలియదు సుమా? నేను ఇంజనీరింగ్ కాలేజీ లో చేరి మూడు నెలలైంది. మీరెప్పుడూ కనిపించలేదు" అన్నాడు హాయిగా నవ్వుతూ. రాజుకు తళుక్కున గుర్తొచ్చింది ఆ అబ్బాయి ఎవరైంది. ఆ కుర్రవాడు తండ్రీ, పద్మ తండ్రి దాయాదులు. బావ నవ్వినా, పద్మ నవ్వినా ఎంతో హాయిగా వుంటుంది. రాజు తన అక్కగారి ఊరెళ్ళి అక్కడున్నన్ని నాళ్ళూ రాజు వెనకే తిరుగుతుండేవాడు. అప్పుడు చాలీ చాలని నిక్కర్లు, మాటి మాటికి పైకి లాక్కుంటూ . హైస్కూల్లో చదువుకొనే వాడు. ఎందుకో తనంటే ఆ కుర్రవాడికి తగని అపేక్ష ఏర్పడింది.
"నీ పేరు భాస్కరం కదూ!"
"ఔనండి. మీరూ, నేనూ పద్మక్కా కలిసి మామిడి తోటలో కాయలు కోసుకొని తింటుండే వాళ్ళం. మీకు అదంతా గుర్తుందా?"
"ఎందుకు లేదూ. ఉన్నది. అప్పుడు నన్ను రాజు బావ అని పిలుస్తుండేవాడివి. ఇప్పుడు అండీ గిండీ అంటున్నావెం?"
భాస్కరం ఆడపిల్లలా సిగ్గుపడుతూ తల ఊపాడు. అప్పుడు రాజు మెట్రిక్ కాబోలు చదువుతున్నాడు. ప్రతిసారి సెలవలకూ అక్కగారి ఊరు తప్పక వెళ్తుండేవాడు. "ఒరే భాస్కరం , రాజు బావను అలా మామిడి తోటలోకి తీసుకు పోరాదూ?' అనేది అక్క. బస్తీలో పెరిగిన వాడు కావటం వల్ల రాజుకు చేట్లేక్కడం చేతగాదు. పద్మ తెగ వేళాకోళం చేసేది. భాస్కరం చెట్లెక్కి కాయలు కోసి =కిందకు వేస్తుంటే పద్మా రాజు కింద నిలబడి పళ్ళు పులిసిపోయేదాకా తింటుడేవాళ్ళు . "రాజూ, ఆ మామిడి తోట నీదేరా, నీకు కట్నం కింద ఇచ్చేది అదే!' అనేది అక్క. "పద్మని నేను అసలు చేసుకొంటే గదా నువ్వు కట్న మిచ్చెది . దాన్నేవరు చేసుకొంటారు? అది ఒట్టి కోతి" అనేవాడు రాజు.
"నువ్వు చేసుకోకపోయినా అదే నిన్ను చేసుకొంటుంది లే. ఇప్పట్నుంచే నువ్వంటే పడి చస్తుంది తెలుసా?"
రాజుకు క్షణంలో అటువంటి మధుర స్మృతులేన్నో కళ్ళ ముందు రూప కల్పన చేసుకొన్నాయి. మనసంతా ఏమిటోలా అయిపొయింది.
"నేనప్పుడే దోసె కూడా తినెసాను. మీరింకా స్వీటు లోనే ఉన్నారు." అన్నాడు భాస్కరం. రాజు లోలోపల సిగ్గుపడిపోయినా పైకి మాత్రం గంబీర్యం వహించి "మా బావగారు , అక్కా బావున్నారా?' అని అడిగాడు.
"బాగానే ఉన్నారు. మీరుప్పుడు అక్కడకు వెళ్ళటం లేడను కొంటాను?"
"లేదు" రాజు సమాధాన మిచ్చాడు. తమ విషయం భాస్కరాని కెంతవరకు తెలుసో రాజు ఊహించ లేకపోయాడు. "మా నాన్నగారి సంగతులేమైనా తెలుస్తున్నాయా?" అడిగాడు.రాజు కాస్త సంకోచ పడుతూ.
"ఎందుకు తెలియదు. వారిప్పుడు ఎక్కువగా మా ఊర్లోనే ఉంటున్నారు. కాని సుఖంగా ఉన్నారని మాత్రం చెప్పలేను."
'జబ్బెమైనా చేసిందా?"
"లేదు. జబ్బేమీ చేయలేదు. కాని....." భాస్కరం ఏదో చెప్పబోయి ఆగిపోయాడు.
దానితో ఆ కుర్రవాడికి తనను గురించి అంతా తెలుసునని గ్రహించాడు రాజు. "భాస్కరం నువ్వేదో చెప్పబోతూ మానేశావ్. బాధపడెంత సున్నిత హృదయం లేదు నాకిప్పుడు . కాబట్టి ఏమీ సంకోచించకుండా అంతా చెప్పు." అన్నాడు. అతని కంఠస్వరం లోని దైన్యం భాస్కరం హృదయాన్ని కదిలించి వేసింది. "అబ్బే అదేమీ లేదు . మీ గురించి దిగులు వల్లనే వారలా అయ్యారని అనుకొంటుంటే విన్నాను. సరే, మీ నాన్నగారి సంగతి మీకు తెలియందేముంది. మాములుగా వారెంత సౌమ్యులో, పట్టుదల వస్తే అంత మూర్ఖులు." అన్నాడు.
చాలా సేపటి వరకు రాజు మాట్లాడలేక పోయాడు. కుతకుతలాడిపోతున్న అంతర్వేదనను పైకి కనుపించనీయకుండా వ్యర్ధ ప్రయత్నం చేస్తూ "నిజమే భాస్కరం . బహుశా నీకు అంతా తెలిసే ఉంటుంది. నేను చేసింది మంచి పని కాదు' అన్నాడు గాద్గాదిక స్వరంతో.
