Previous Page Next Page 
తప్పు పేజి 17

 

    మరి రెండు రోజులకి రాధిక వెళ్ళి పోయింది. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ  అన్న గారిని పిలిచి 'నిజం వాడికి చెప్పి వాడి యిష్టం ఏవిటో కనుక్కో. లేదా యీ అబద్దాన్ని అంటే వాడు నీ కొడుకే అనే విషయాన్ని బయట పట్టకు. గంగకి ఉమేష్ ని చేసుకోవటం యిష్టం లేదు నాకు. వాడికి తల్లీ తండ్రీ యిద్దరూ వున్నారు. ఒకవేళ నీకంటూ యీ విషయం లో అభ్యంతరం అయితే నా బిడ్డ అవివాహితగా నైనా వుండి పోతుంది లేదా కాలం కలిసి వస్తే ఎవర్నో ఒకర్ని చేసుకుంటుంది. అంతవరకూ నిజం!' అనేసి రైలెక్కింది.
    కదిలే రైల్లోంచి గంగ చేతి రుమాలు వూపుతూనే వుంది. శ్రీకాంత్ తండ్రి వున్నాడని ఒక్కసారి మాత్రం గాలిలోకి చేతిని వూపి దింపేసుకున్నాడు. రైలు పొగ శ్రీకాంత్ ని , చటర్జీ ని, ఉమేష్ ని కప్పి వేసింది. చటర్జీ మనసుని రాధిక మాటలు అలాగే కప్పేశాయి. అతను ఆ పొగలోంచి రాలేనివాడిలా ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఫ్లాట్ ఫారం క్షణం లో ఖాళీ అయిపొయింది. అతను వాస్తవానికి వచ్చి స్టేషను బయటికి వచ్చాడు కారు స్టార్టు చేసేందకు.
    శ్రీకాంత్ కి ఆనందంగా వుంది. అతని ఆనందాన్ని పట్టలేక పోతున్నాడు. రాధిక అతన్ని గుండెల్లోకి తీసుకుని 'గంగ నిన్ను చేసుకోకపోతే అసలు పెళ్ళే చేసుకోదు. అది నీకోసం పుట్టిందిరా శ్రీ.' అన్నది. నంద గోపాల్ అక్కడే వున్నాడు అప్పుడు. అతను శ్రీకాంత్ చేతిలో చేతిని వుంచి ఆప్యాయంగా నొక్కి వదిలేశాడు.
    గంగ మాత్రం ...శ్రీకాంత్ యెన్నడూ లేనిది వూహాలోకం లో సంబరం విడిచిన పక్షిలా యెగిరి పోసాగాడు. గంగ అతని చేవిలోమాట చెబుతానని చెప్పి శాశ్వతంగా చెంప మీద సున్నితంగా పెదాలతో ముద్ర వేసింది. కుడి చెంపని యెడమ చేత్తో తడుముకుంటూ అవ్యాక్తానందం పొందసాగాడు.
    తండ్రి కొడుకు ముఖ కవళికల్ని క్రీ గంట గమనిస్తూనే వున్నాడు. ఉమేష్ రెండు మూడు సార్లు మోచేత్తో పొడిచాడు. తండ్రి చూస్తున్నాడని సంజ్ఞ చేస్తూ, కారు మలుపులు తిరిగి ఇల్లు చేరుకుంది.

                             *    *    *    *
    ఫైనల్ యియర్ పరీక్షలు చాలా తృప్తిగా రాశారు యిద్దరూ. ఆరోజు స్టూడెంట్స్ అందరూ రూమ్ లో నిలుచుని రాసిన పరీక్షల గురించీ, రాబోయే ఫలితాల గురించీ చర్చించుకుంటున్నారు. శ్రీకాంత్ కొద్దిగా దూరంగా నిలుచుని అందరి చర్చల్లోనూ సారాంశాన్ని మాత్రం వింటున్నాడు. అతనికి ఫరిక్షా ఫలితాల మీద అంత శ్రద్ధ లేదు. పరీక్షలు అటో యిటో గా రాసిన వాళ్ళకే అసమస్య. అతను పేపరు చూడకపోయినా తన నెంబరు ఎక్కడుంటుందో కూడా తెలిసి నంత బాగా రాశాడు. అందుకే ఆ బెంగ లేదు.
    దూరంగా టేబిల్ దగ్గర యిద్దరు అతనికి వినిపించీ వినిపించనంత స్థాయిలో అతని వైపు వుండి వుండి చూస్తూ మాట్లాడు కుంటున్నారు.
    'అదృష్టవంతుల్లో ప్రపంచాన్ని సైతం జయించగలవాడేవరురా.' అది మొదటి వాడి ప్రశ్న.
    'నాకేం తెలుసు?' కొంటెగా అర్ధం కాని వాడిలా రెండోవాడు మొదటి వాడినే అడుగుతున్నాడు.
    'నేను చెప్పనా,' మొదటి వాడు అడుగుతున్నాడు.
    'వూ, ఆలస్యం దేనికి?'
    'అందరికీ... అంటే సర్వ సాధారణంగా ఒక అమ్మ పొతే మరో అమ్మ సహజం లోకంలో. కొందరు అదృష్ట వంతులకి నాన్నపోతే మరో నాన్న ఆటోమేటిక్ గా వస్తాడు.'
    'అచ్చా! ' ఆశ్చర్యం ప్రకటించాడు రెండోవాడు.
    'ఇలాంటివి గొప్ప గొప్ప ఇళ్ళల్లో జరుగుతాయి. ధనం మూలం వెదవ జగత్ ...యిదం జగత్ కాదు సుమా.'
    'యేవరోయ్ అతను.'
    'ఈ వూళ్ళో న్యాయవాది.'
    'న్యాయవాదులు యీ వూళ్ళో తక్కువేం లేరు.'
    'పేరు చెప్పకూడదుటోయ్'.'
    'అతని పేరెందుకూ ఆ పిల్లడు మన క్లాస్ మెట్.'
    'అలాగా'
    'ఈ సంగతి తెలుసా అతనికి.'
    'మనం చెబితే తెలుస్తుంది.'
    'చెబుదాం అంటావా.'
    'మనకెందుకు లెద్దూ.'
    'అతనికి కారుంది. నాకిప్పుడు తెలుస్తింది. ఛ....'
    'ష్!' మొదటివాడు రెండోవాడి నోరు మూసేశాడు. యిద్దరూ చిత్రంగా చూస్తూ శ్రీకాంత్ వైపు వెకిలి నవ్వు నవ్వేసి రూమ్ లోంచి బయట పడ్డారు,  శ్రీకాంత్ పూర్తిగా ఆ యిద్దరి సంభాషణా విన్నాడు. గదిలో చాలామందే పిల్లలున్నారు. ఎవర్ని వుద్దేశించి అన్నట్లూ? ఛ....ఒకవేళ కొంపతీసి నాన్నగారిని గురించి కాదు కదా ...శ్రీకాంత్ బుర్ర చాకు మాదిరిగా పనిచెయ సాగింది. ఆవేళ....అతని దృష్టి కృష్ణ మోహిని మాటల మీదికి వెళ్ళింది. ఆయన మాత్రం....
    ఎండ వేడిమి కన్న పదునైన మాటలు కంపరం యెత్తిస్తున్నాయి. అతనికి క్షణం లోనో, అరక్షణం లోనో స్పృహ తప్పేట్లయింది. నెమ్మదిగా రూమ్ బయటికి వచ్చేశాడు. లేని వుత్సాహాన్ని తెచ్చుకుని అడుగులు ముందుకు వేయసాగాడు. మార్గమధ్యలో అతన్ని చాలా మందే పలకరించారు. తలెత్తాడు కానీ సమాధానం యిచ్చే స్థితిలో మాత్రం లేడు. అందరికీ అస్తవ్యస్తంగా సమాధానాలు యిచ్చేసి గేట్లోంచి బయటికి వచ్చేశాడు. రోడ్డు మీదికి వచ్చాక అనిపించింది అతనికి 'యిప్పుడు యెక్కడికి వెళ్ళాలి?' అని.
    సాయంత్రం నాలుగున్నర వరకూ అతనికి తెలిసిన ప్రదేశాలన్నీ పిచ్చివాడిలా తిరిగాడు. ఏమాత్రం సమయం దొరికినా అమూల్యమైన కాలాని చాపలు పట్టేందుకు ఉపయోగించేవాడు. అతనికి ఈస్ట్ కలకత్తా కెనాల్ కనిపించినా లక్ష్యంగా దాని వైపు చూడలేక పోయాడు. అతని దృష్టి చేపల మీద లేదు. ఏదో చేయాలి? ఏవిటో కనుక్కోవాలి? యెటు నుంచి నరుక్కు రావాలి. ఈ సమస్య తెగగొట్టాలంటే?
    ప్రొద్దు పడమర కి మళ్ళింది. అతను తిరిగి తిరిగి అలసిపోయాడు. కాళ్ళు పీక్కుపోతున్నాయి. ఆలోచనల వల్ల మెదడు మొద్దుబారింది. వొళ్ళు జ్వరం వచ్చినట్లు సలసలా కాగిపోసాగింది. గుండెలు బలహీనం కొట్టు కుంటున్నాయి. కాళ్ళూ చేతులు పటుత్వం తప్పినట్లయ్యాయి. ఈడెన్ గార్డెన్ నుంచి యింటికి వచ్చేసరికి బాగా చీకటి పడిపోయింది. తల్లి గుమ్మం లో యెదురు చూస్తోంది. తల తిరిగి పడిపోతానేమోనన్న భ్రమ అతనికి కలుగుతోంది. తాగిన వాడి మాదిరి మైకం క్రమం సాగింది. అడుగులు తడబడుతున్నాయి. పాదం తీసి పాదం వేసిందుకు శక్తి నంతా వినియోగించవలసి వచ్చింది. అతను గుమ్మం లోకి చేరుకున్నాడు. గోవింద చేతులు చాపక పోయినట్లయితే అమాంతంగా గుమ్మంలో పడిపోయేవాడు చెట్టు కూలినట్లుగా. గోవింద ఖంగారుగా వుమేష్ ని పిలిచింది. అన్న రాకకోసం తల్లికి కొంతదూరంలో నిలుచుని తమ్ముడు కూడా యెదురు చూస్తున్నాడు.
    చటర్జీ మేడమీద బాల్కనీ లో కనుచూపు మేర వరకూ దృష్టి ని నిలిపి కొడుకు రాలేదని ఖంగారు పడుతున్నాడు. గోవిందా ఉమేష్ యిద్దరూ జాగ్రత్తగా తీసుకు వస్తున్నారు శ్రీకాంత్ ని. చటర్జీ అది చూశాడు. రెండేసి అంగల్లో అతనూ హాల్లోకి వచ్చాడు. కొడుకుని అమాంతం లేవనెత్తుకుని భుజం మీద వేసుకుని మెడ మీదికి తీసుకువచ్చి తన పక్క మీద పడుకో బెట్టుకున్నాడు. గోవింద వైపు చూశాడు అతనిప్పుడు. గోవింద వస్తున్నా దుఃఖాన్ని పెదాలతో బిగిస్తూ లోలోపలికి పంపెస్తోంది గోవింద. అతను గోవింద భుజం మీద చేయి వేసి 'యిప్పుడు యేమీ కాలేదు. డాక్టరు కి ఫోను చెయ్యి. ఏడవ కూడదు. ఎండ యివాళ ఎంత విపరీతంగా వుందో చూశావా. వడదెబ్బ తగిలి వుంటుంది. వుమేష్ నువ్వెల్లి డాక్టర్ని పిలుచుకురా.' అన్నాడు కొడుకు వైపు తిరిగి. ఉమేష్ వెళ్ళిపోయాడు.
    గోవింద అతని గుండెల్లోకి దూరి యేడుస్తూ అన్నది! 'వాడు .....వాడు యేమైనా అయిపోతే యింకే మైనా వుందా.'
    'యేమీ కాదు' చటర్జీ నమ్మకంగా అన్నాడు.
    పది నిమిషాల్లో డాక్టరు వచ్చి పరీక్ష చేసి యింజక్షన్ యిచ్చాడు.
    యింజక్షన్ ఇచ్చాక తెలివి వచ్చింది శ్రీకాంత్ కి. అతను చుట్టూ చూశాడు. తల మీద చేయి వేసి ఆతృతగా చూస్తున్న తండ్రి కనిపించాడు ముందుగా అతనికి. తల పక్కకి తిప్పగానే తల్లి కాళ్ళకి కొంచెం యివతలగా కూర్చుని వుంది. యేడ్చిన కారణంగా ఆవిడ మొహం వాచిపోయింది. ఉమేష్ బిక్క మొహం వేశాడు అన్న వైపు చూస్తూ.
    "ఏం నాన్నా శ్రీ ఏం జరిగింది బేటా. యెందుకిలా అయిపోయావు.' యుగయుగాల ప్రేమని రంగరించి చటర్జీ అడుగుతున్నాడు.
    శ్రీకాంత్ కి సమాధానం చెప్పాలని పించడం లేదు. కళ్ళు మూసుకుని తిరిగి నిద్రలోకి జారిపోయాడు.
    శ్రీకాంత్ మరి యిరవై ఐదు రోజుల వరకూ తేరుకోలేదు. విద్యుదాఘాతం కన్నా యెక్కువగానే తగిలింది అతనికి మానసింగా బలమైన గాయం. టైఫాయిడ్ అతన్ని పీడించి పీల్చి పిప్పి చేసింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS