Previous Page Next Page 
ప్రసన్నకుమార్ సర్రాజు కథలు 2 పేజి 17


    "కావాలంటే లగేజీ కొట్టుకోవమ్మా ఇస్తాం...." అని నిర్లక్ష్యంగా జేబులో చెయ్యి పెట్టాడు.
    వెంటనే ఆమె "వద్దులే వద్దులే" అని వెళ్ళిపోయింది.
    ఓ పదేళ్ళ కుర్రాడు ఎలా ఎక్కాడో .... డోర్ దగ్గర నిల్చుని , షర్ట్ విప్పేసి అట్నించి కింద శుభ్రం చేసుకుంటూ రావడానికి ఉపక్రమించాడు. కోళ్ళ ఆసామిని విసుక్కుని ఆటేపోచ్చిన ఎయిర్ హోస్టెస్ తలపట్టుకుని "ఒరేయ్! దిగిపో. విశాఖపట్నం లో క్లీన్ చేసే వాళ్లోస్తారు. దిగుతావా లేదా" అని గద్దించింది.
    'అక్కా అక్కా.... ప్లీజ్ ఈ ఒక్కసారికీ తుడవనీ అక్కా ...." అని బ్రతుమిలాడాడు వాడు. అయినా వాణ్ణి బలవంతంగా నిచ్చెన మీంచి దింపేసింది.
    అప్పుడే లోపలికొచ్చిన పైలట్ డోర్ దగ్గర నిల్చుని "వైజాగ్..... వైజాగ్..." అని అరిచాడు. ఎయిర్ హోస్టెస్ వైపు తిరిగి "ఎన్ని టిక్కెట్లు తెగాయ్" అని అడిగాడు.
    "ఇంకా పన్నెండు టిక్కెట్లున్నాయ్]" చెప్పింది . మళ్ళీ "వైజాగ్..... వైజాగ్..." అని అరవసాగాడు.
    వెనకాల్నుంచీ అరడజను విమానాలు పెద్దగా హారను కొట్టుకుంటూ దూకుడుగా ముందుకొచ్చేస్తున్నాయ్. అవి వేరే కంపెనివి.
    "ఆ...ఆ .... అరేయ్ జాగ్రత్త... రెక్కకి తగుల్తుంది ఛీ....నీ...." అని తిట్టి తుపుక్కుమని ఉమ్మేసి "నిచ్చెన తీసేయండ్రా" అని అరిచి ఎయిర్ హోస్టెస్ ని డోర్లు వేసేయమని చెప్పి కాక్ పిట్ లోకి వెళ్ళిపోయాడు పైలట్.
    "ఈ హరన్లెప్పుడూ ఇదివరకు లేవే...." అన్నాడు పెదరాయుడు.
    విమానం కదిలే లోపల కార్పోరేట్ కంపెనీల ప్రభావం గురించి పెదరాయుడికి వివరించాడు బావమరిది.
    పక్కనే మూడో సీటులో కూర్చున్న వ్యక్తీ "ఎస్.... ఎస్" అంటూ ఏకీభవించాడు. తనను సర్జెన్ గా పరిచయం చేసుకున్నాడు. మాటల సందర్భంలో 'ఆ మధ్య తానొక లేడీకి యుటేరస్ ఆపరేట్ చేశానని, గర్భ 'సంచీ' మీద 'విసృతమైన మా అవుట్ లెట్లలోనే సరుకులు కొనండి ' అని యాడ్ ఉందనీ ఈ కార్పోరెట్లు వ్యాపార ప్రకటనలు ఎక్కడెక్కడ చేస్తున్నారు! అని తాను చాలా సర్ ఫ్రైజ్ అయ్యాననీ చెప్పాడు. పెదరాయుడు ఆశ్చర్యపోయాడు.
    విమానం టేకాఫ్ అయ్యే ముందు సుబ్బరత్తో జిలేలే తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ తెలుగులో చెప్పింది మైకులో.
    తర్వాత లోపల్నుంచీ పైలెట్ చెప్పాడు. విమానం బయల్దేరబోతుందనీ , అంతా ఒకసారి "గోవిందా" కొట్టండని.
    అంతా ఒక్కసారిగా "గోవిందా గోహోవిందా" అంటూ అరిచారు.
    విమానం గాల్లోకి లేచింది.
    పది నిమిషాల తర్వాత ఇద్దరు ఎయిర్ హోస్టెస్ లు క్యాటరింగ్ కార్ట్ తోసుకుంటూ రావటం చూసిన పెదరాయుడు "ఆకలి దంచేస్తోంది బావా ..... మధ్యాహ్నం లంచ్ కూడా చెయ్యటానికి టైం లేకపోయింది" అన్నాడు.
    వాళ్ళు నెమ్మదిగా బండి తోసుకుంటూ వీళ్ళ దగ్గరకొచ్చారు.
    సుబ్బరత్నం వీళ్ళ వంక పలకరింపుగా చూసి ఒక బిస్కెట్టు ప్యాకేట్టూ ఒక జీడిపప్పూ ప్యాకేట్టూ ఇచ్చింది.
    "అదేంటమ్మాయ్@! కమ్మగా ఇడ్లీలో, కట్ లేట్లో పెట్టకుండా ఇదేంటీ!" అన్నాడు పెదరాయుడు.
    "అంతేలే బావా! కాసేపు ఆకలికి ఓర్చుకో.... ఈలోగా ఇవి తిను" అని రెండు ప్యాకెట్లూ పెదరాయుడికి కిచ్చి , యాభై రూపాయలు సుబ్బరత్నానికి ఇచ్చాడు. పక్కనున్న అమ్మాయి అది షర్ట్ జేబులో పెట్టుకుని పది రూపాయలు తిరిగిచ్చింది.
    బండి తోసుకుంటూ ఇద్దరూ ఎదరకెళ్ళారు.
    పెదరాయుడు తెల్లబోయాడు. "అదంతే బావా. ఇలాంటి ఎయిర్ లైన్స్ లో పచ్చి మంచినీళ్ళు కూడా ఫ్రీగా ఇవ్వరు." అన్నాడు చినరాయుడు.
    ఆ యిద్దరు ఎయిర్ హోస్టెస్ లూ విమానం ఈ చివరినుంచీ ఆ చివరి వరకూ తిరిగొచ్చారు నిరాశగా.
    పైలెట్ కాక్ పీట్ లోంచి తలుపు తీసుకుని తల బయట పెట్టి... ఎన్ని పాకెట్లు సేలయ్యాయని అడిగాడు ఆత్రంగా. వీళ్ళిద్దరి మొహాలు చూసి, సీరియస్ గా "ఇలా అయితే ఎలా" అని మళ్ళీ లోపలికి తలని లాక్కున్నాడు.
    ఓ పది నిమిషాల తర్వాత ఒక పాత ఫేమస్ తెలుగు పాట మొదలయ్యింది. సుబ్బరత్నం, ఆ రెండో అమ్మాయి ఎంకి వేషాలేసుకుని "రండి బాబూ రండి .... తేగలూ, జంతికలూ, నూజీడీలూ , అప్పాలూ , " అని గెంతుకుంటూ డాన్స్ చేస్తూ మళ్ళీ విమానంలో తిరిగారు. ఈసారి సరుకు మొత్తం అమ్ముడయింది. ఇద్దరూ ఆనందంగా పైలట్ కి చెప్పి, మళ్ళీ వాళ్ళ యూనిఫారాల్లోకి మారారు.
    తొమ్మిదో వరసలో కిటికీ దగ్గర కూర్చున్న ఓ పెద్దావిడ సుబ్బరత్నాన్ని కేకేసి, "అమ్మాయ్ .... మీ డ్రయివర్ తో చెప్తావా కొంచెం అన్నవరంలో ఆపమని?" అంది.
    సుబ్బరత్తో జిలేలే తెల్లబోయి "అలా కుదరదు మామ్మగారు! సరాసరి విశాఖపట్నం;లోనే దిగుతుంది" అంది.
    "అయ్యో నా తల్లీ! అన్నవరంలో మొక్కుందమ్మాయ్. ఓ పది నిమిషాలు అపమను కొండమీద. శ్రమపడి పైకెక్కాలా ఏం? గాల్లోనేగా పోతోంది! ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా ఆస్వామి దర్శనం చేసుకుని" అంది. పక్కనున్న వాళ్ళెవరో ఆమెకి సర్ది చెప్పారు.
    కాస్సేపయ్యాక ఇంకో ఐదు నిమిషాల్లో విశాఖపట్నం చేరుతున్నామని ఎనౌన్సు చేశారు. ఐదు కాదు పది కాదు అరగంటయింది. విమానం గాల్లో చక్కర్లు కొడుతూనే ఉంది. చాలామంది ఖంగారు పడి , "విమానం ట్రబులిచ్చిందా? కొంచెం కిందస్తుగా పోనీయండి. మా గొడుగులు మాకిస్తే కిందకు దూకేస్తాం" అని గోలగోలగా అడుగుతున్నారు.
    పైలట్ క్యాబిన్ లోంచి బయటికొచ్చి , మైకులో 'ఖంగారు పడాల్సిందేమీ లేదని, ఓ అరగంట క్రితం విశాఖపట్నంలో కొంచెం వర్షం పడిందనీ, ఎయిర్ పోర్టు రన్ వే మొత్తం మునిగిపోయిందనీ, ఆ నీళ్ళన్నీ బయటకు తోడే దాకా కిందకి దిగటం కుదరదనీ , అందుకని హైదరాబాదు తిరిగి వెళ్ళిపోతున్నామనీ' చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. జనం అందరూ గొణుక్కుంటూ కూర్చున్నారు.
    పెదరాయుడు నిట్టూర్చాడు. "రామిసుబ్బారెడ్డి గారింట్లో పెళ్ళికి ఇంకేం అందుకుంటాం?" ఏదో సాకు చెప్పాల" అన్నాడు.
    "బాగా కుదిరింది . ఆ సత్యన్నారాయణ స్వామి బాగా బుద్ది చెప్పాడు. కొంచెం ఆపవయ్యా నాయనా అంటే ఆ డ్రయివరు ఓ .... తెగ నీలిగాడు" మెటికలు విరిచింది మామ్మగారు.
    "అమ్మా .....అయ్యకి సెప్పవే ఈ సారన్నారైల్లో పోదామే..... ఎప్పుడూ ఇమానం , ఇమానం అంటాడు ...." కుర్రాడి సణుగుడు.....

                                        *  *  *  *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS