రకరకాల బహుమతుల ప్యాకెట్లతో బల్లంతా నిండుగా వుంది. స్నేహితులు రజనీని పాట పాడమని బలవంతం చేశారు. చివరకు ప్రకాశ్ మాట కాదనలేక రజని పాట పూర్తి అవగానే కరతాళ ధ్వనులతో ఇల్లంతా దద్దరిల్లిపోతోంది.
జగన్నాధాన్ని మూర్తి ఎదురు వెళ్ళి ఆహ్వానించాడు. జగన్నాధానికి రజని నమస్కరించింది. మనసారా దీవించి చేతిలో వున్న బహుమతిని అందించాడు. అట్టపెట్టె తెరిచి రజని కళ్ళు పెద్దవి చేసి చూస్తూ వుండిపోయింది.
"మనలో మనకి పార్మాలిటీస్ ఏమిటోయ్" అన్నాడు మూర్తి.
జగన్నాధం చిరునవ్వు నవ్వాడు.
రజని పెట్టె తండ్రి చేతికి అందించింది. అందులో వున్న ఖరీదైన నెక్లెస్ చూసి మూర్తి అవాక్కయి పోయాడు.
"ఏమిటలా చూస్తావు? అమ్మాయిని పెట్టుకోమను!" అన్నాడు జగన్నాథం.
"నీకేమైనా మతి పోయిందా జగన్నాథం! ఇంత ఖరీదైన నగ తెచ్చావెందుకూ?"
"ఆ సంగతి తర్వాత చెబుతాను. ముందు అది రజని చేతికివ్వు. పెట్టుకో తల్లీ. నువ్వా నగ పెట్టుకుంటే చూడాలని వుంది" అన్నాడు జగన్నాథం.
మూర్తి నగను రజనీకి అందించాడు. రజని మెళ్ళో పెట్టుకోవడానికి సందేహిస్తుంటే_
"సరే! పెట్టుకో తల్లీ! జగన్నాథం పరాయివాడు కాదు" అన్నాడు మూర్తి.
రజని స్నేహితురాళ్ళంతా ఆ నగను తెగ పొగిడేశారు, రజని నెక్లెస్ మెడలో అలంకరించుకుంది. అది చూసి ప్రకాశ్ నొసలు చిట్లించాడు. ఆ విషయం రజని గమనించక పోలేదు. అయినా మెళ్ళో నుంచి ఆ నగను తీసెయ్యలేకపోయింది. నగ అలంకరించుకుని రజని జగన్నాథం పాదాలకు నమస్కరించింది. జగన్నాథం దీవించాడు.
అతిధుల్లో గుసగుసలు ప్రారంభం అయ్యాయి.
"అంత ఖరీదైన నగ ఊరికే ఎవరిస్తారు?" ఒకావిడ భర్త చెవులో అన్నది.
"బహుశా కొడుక్కి చేసుకుంటాడేమో?" అన్నాడు భర్త కొంచెం బిగ్గరగానే.
"అవును! రవి ట్రైనింగ్ లో వున్నాడు. మూర్తి అదృష్టవంతుడు. చాలా తేలిగ్గా అల్లుడ్ని సంపాదించుకున్నాడు"
"మూర్తీ, జగన్నాథం స్నేహితులు. నిజంగా స్నేహం అంటే అలా వుండాలి"
ప్రకాశ్ అందరి మాటలు వింటున్నాడు. కడుపులో ఏదో దేవినట్టుగా వుంది. రక్తం వేడెక్కుతూంది. అక్కడ నిల్చోలేకుండా వున్నాడు. రజనికేసి కోపంగా చూశాడు. రజనీ వెళ్ళిపోతున్న వాళ్ళను సాగనంపుతూ వుంది. ప్రకాశ్ కేసి చూడలేదు. రజని మెడలో తళతళలాడుతున్న నెక్లెస్ ప్రకాశ్ కళ్ళకు మిసమిసలాడుతున్న తెల్ల త్రాచులా కన్పించసాగింది.
అతిధులంతా ఒక్కొక్కరే వెళ్ళిపోయారు. ప్రకాశ్ రజనీకి చెప్పకుండా బయటికి నడిచాడు. సర్వస్వం కోల్పోయిన వాడిలా డీలా పడిపోయి నడుస్తున్నాడు. రజని అతని వెనకే వెళ్ళి ప్రకాశ్ ను కలుసుకుంది.
"ఏమిటి ప్రకాశ్! అలా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతున్నావు? ఇవ్వాళ నన్ను సినిమాకు తీసుకెళతానన్నావ్?"
"నాతో సినిమాలు షికార్లూ ఎందుకూ? అంతంత పెద్ద బహుమతులు ఇచ్చేవాళ్ళుండగా?" విసురుగా అన్నాడు.
రజని ఓ క్షణం ప్రకాశ్ ముఖంలోకి చూసింది.
"ఏమిటి నువ్వనేది? జగన్నాథంగారు నాకు తండ్రిలాంటివారు"
"తండ్రిలాంటివారా, మామలాంటివారా? ఇంకా నన్నెందుకు మభ్యపెడ్తావు!"
"అంటే?"
"అంటే ఏముంది? నిన్ను కోడల్ని చేసుకోవాలని ఆయన అభిప్రాయం అయి వుంటుంది. మీ నాన్నగారికి కూడా ఇష్టమే అయి వుండాలి. అందుకే అంత ఖరీదయిన నగను స్వీకరించారు. బహుశా రవిని చేసుకోవడం నీకూ ఇష్టమే అనుకుంటా! రవి నాకంటే అందగాడు, పెద్ద హోదా గల ఉద్యోగం..."
"ప్రకాశ్ !" రజని దాదాపు అరిచినట్టే అన్నది.
ప్రకాశ్ మౌనంగా నిల్చున్నాడు.
"నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? నీకు మనసిచ్చి హోదా కోసం రవిని వివాహం చేసుకుంటానని ఎలా అనుకున్నావు?" అన్నది రజని ప్రకాశ్ చెయ్యి పట్టుకుంటూ.
ప్రకాశ్ విసురుగా చెయ్యి లాక్కున్నాడు.
"మీరిద్దరూ చిన్నప్పటి స్నేహితులు!"
"అవును! ఇద్దరం దాదాపు కలిసే పెరిగాం! కానీ రవిని నేను ఎప్పుడూ ఆ దృష్టితో చూడలేదు.
నీకా దృష్టి లేకపోవచ్చు. రవికి వుండివుండొచ్చుగా? ఐ.పి.యస్. ఆఫీసరు అల్లుడుగా వస్తుంటే వద్దని మీ నాన్న నిన్ను నాకిచ్చి వివాహం చెయ్యడానికి అంగీకరించడు. మన స్నేహానికి ఇక్కడే ఫుల్ స్టాప్ పెట్టడం మంచిది. నాలో మళ్ళీ ఆశల్ని రేకెత్తించకు" అన్నాడు ప్రకాశ్.
"రవి సంగతి నాకు అనవసరం! నేను మాత్రం నీ దాన్నే! నేను వివాహం చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. లేదా జీవితమంతా కన్యగానే వుండిపోతాను" ఖచ్చితంగా పలికింది రజని.
ప్రకాశ్ కళ్ళలో రజని నిజాయితీ తళుక్కుమంది.
"మీ నాన్నగారు ఒప్పుకుంటారనే నమ్మకం నాకు లేదు."
"నేను ఒప్పించడానికి ప్రయత్నిస్తాను. పిల్లల మనసుల్ని అర్ధం చేసుకోకుండా మూర్ఖంగా ప్రవర్తించే పెద్దల అభిప్రాయాలను నేను అట్టే గౌరవించను. నేను ఇంట్లో నుంచి వచ్చేస్తాను, రిజిష్టర్ మారేజ్ చేసుకుందాం!" అన్నది రజని.
