ఆ స్థితిలో స్త్రీ సంతానం కోసం సూరమాంబ శ్రీశైలస్వామికి మ్రొక్కుకున్నది. ఆ తరువాతనే ఆమె గర్భం ధరించటం కూడ జరిగింది. ఇటు సూరమాంబ ప్రసవించి వేమాంబగా నామకరణం చేయటమూ, అటు కొండవీటి రాజకీయాలు పరిపక్వ దశకు చేరి వేముడు రాజధానిని చందవోలు నుండి కొండవీటికి మార్చటమూ జరిగాయి. ఆ సంతోష సమయంలో సూరమాంబ స్వామి మ్రొక్కు చెల్లిస్తూ "సంతాన సాగరం" పేరుతో పెద్ద చెరువు త్రవ్వించింది. దానితోపాటు రాణివాసానికి సౌకర్యం కోసం అందమైన కోనేరు కూడా త్రవ్వించింది.
ఆ కోనేటిలో కలువపూల సౌందర్యాన్ని పరామర్శిస్తూ కూర్చుని ఉన్నది వేమాంబ. ఆమె మధ్య మధ్య తలెత్తి నిరీక్షణ దృక్కుల్ని ప్రసరిస్తోంది.
అదే సమయాన దూరం నుండి గుర్రపు డెక్కల సవ్వడి వినరావటంతో ఆమె మనసు పులకించింది. ఆమె ముఖ ముద్రలో వున్న సన్నని విషాదచ్ఛాయ రవ్వంతసేపు మాయమైంది. సమున్నత కాయుడైన ఒక వీర యువకుడు ఆమెకు చేరువలో అశ్వాన్ని నిలిపివేశాడు.
వేమాంబ స్వాగత చిహ్నంగా లేచి నిలిచి అథోవదన అయింది. ఆ యువకుడు గుర్రంమీద నుంచి చెంగున క్రిందకి ఉరికాడు. గంభీరమైన శైలిలో అడుగులు వేస్తూ వేమాంబను సమీపించాడు. ఆమె చుబుకం పుచ్చుకుని పైకెత్తి ఆమె కన్నుల్లో ప్రేమ నిండిన చూపుల్ని వర్షించాడు.
"వేమా! ఆలస్యం జరిగినందుకు కోపగించావా?" నేను సిగ్గుతో ముడుచుకు పోయింది. మణిమేఖల నుండి కుచ్చులు వ్రేలాడుతున్న ముత్యాన్ని త్రుంపి వాడిపోయిన ఓ కలువ మీదకు విసిరింది. అది గమనించిన ఆ వీరకిశోరం మధురమైన చిరునవ్వు నవ్వి "జాణవే సుమా!" అన్నాడు.
"సోమదేవా! ఆ కలువ ఒకనాడు కోరకయే అది వికసించి వాడిపోయింది. సిగ్గూ, అభిమానము కలిసి ఆమె కంఠ స్వరాన్ని ఒణికిస్తున్నాయి. కంఠంలో నుండి వెలువడిన ఆ లజ్జాభరితమైన స్వరం ప్రస్తారం ముగించిన తరువాత వీణా తంత్రులు చేస్తున్న శబ్దాన్ని పోలివుంది సోమదేవుడు ఖిన్నుడయ్యాడు.
"యువరాణీ, సోమదేవుని ముఖం చూస్తూ నీవిలా మాట్లాడటం వీర మర్యాద కాదు" అన్నాడు. ఇప్పుడు ఆమెలోని రాజరక్తం మేల్కొంది.
"ప్రియా సోమదేవా! నీవు దాక్షిణాత్యులకు అభిమన్యుడనే కావచ్చు. నీ పరాక్రమం అజేయమైనదే! అయినా నేను స్త్రీని. అందునా రాచబిడ్డను అన్నది.
"వేమా! నీవు ఏదైనా ఒకే అభిప్రాయం మీద స్థిరపడు. తరువాతనే యుద్ధ విషయం ఆలోచించవచ్చును.
"నీమీద నాకున్న ప్రేమ ఎంత అచంచలమైనదో యుద్ధ విషయంలో నా అభిప్రాయం కూడ అంతే సుస్థిరమైనది. నీవు మోటుపల్లి యుద్ధానికి వెళ్ళాలనే నేను కోరుకుంటున్నాను. అందునా వచ్చినవాడు చౌండప నాయకుడు. అఖండ విజయనగర సామ్రాజ్య సేనాని. అతనిని ఎదిరించగలవారు కొండవీడులో ఉన్నది ఒక్క సోమదేవుడేనని ప్రజలు చెప్పుకోవటం నేను విన్నాను. వీరపత్ని కావాలనుకున్న రాచకన్యకు అంతకన్నా అమోఘమైన విషయమేమున్నది" అని తన అభిప్రాయాన్ని తేటతెల్లం చేసిందామె.
"కాని, నగరంలో నేను లేకపోతే తురగారాముని అకార్యాలు పెచ్చరిల్లుతాయి, ఇప్పటికే ప్రజలకు ప్రభువుల మీద మనసు విరిగిపోయి వున్నది. యువరాజు రాచవేముల ప్రవర్తన విమర్శకులకు, ఊహలకు అందనిదిగా వున్నది. తురగా రామయ్య వానినేమి చేస్తాడో!
వెలుపల నుండి వచ్చే ఆటుపోటులను తట్టుకోటానికే కొండవీడు తన సర్వశక్తులూ సమీకరించుకొన వలసి వస్తోంది. ఇక అంతః కలహాలు బయలుదేరితే చెప్పవలసిన పనిలేదు. ఎట్లా జరగనుందో!
మరొకవంక సవరం ఎల్లయ్య తన ప్రజ్ఞా పాటవం యావత్తు వినియోగించి విప్లవకారుల్ని సమీకరిస్తున్నాడు. ఈ స్థితిలో నేను కొండవీడు విడిచి మోటుపల్లి వెళ్ళిపోవాలని నీవు కోరుతున్నావు.
నీవు ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చి వున్నట్లయితే నేను వెళ్ళి నీ కోరిక తీర్చటానికి సిద్ధంగా ఉన్నాను."
"సోమదేవా! ఈ వివరాలు నేనూ విన్నాను. కాని, మోటుపల్లి వద్ద కొండవీడు, విజయనగర ప్రభువుల ప్రతిష్ఠలు తేలిపోగల యుద్ధం దాపురించింది. కనుక వీటికన్న అది ముఖ్యమైన విషయంగా నా మనసు నిర్ణయించింది" అన్నది వేమాంబ. వాస్తవానికి సోమదేవుడు నగరులో లేకపోతే తురగా రామయ్య పెచ్చరిల్లు తాడని ఆమెకూ తెలుసు. కాని ఇది కొండవీటి ప్రభువుల ప్రతిష్ఠా సమస్య. అంతటితో రాజకీయ చర్చ ముగిసింది.
గృహరాజ సౌధాన్ని పూర్తిచేయాలన్న ధృడ దీక్షతో పనిచేస్తున్న రోజులవి. రాజమండ్రి యుద్ధంలో కాటయవేముడు విహతుడయ్యాడు. యుద్ధ సంరంభం ఇంకా చల్లారలేదు. అల్లాడరెడ్డి కాటయవేమునితోన నున్న వియ్యాన్ని పురస్కరించుకొని రాజమండ్రిలో అల్లర్లు లేవదీస్తున్నాడు.
ఇన్ని గందరగోళ పరిస్థితుల మధ్య సాగుతున్నది గృహరాజ సౌధ నిర్మాణం. ఆ నిర్మాణంలో శిల్పాలకు కావ్య సౌందర్య విషయంలో సలహాలిచ్చే పని శ్రీనాధయ్య మీద పడింది. దానిని ఆయన శ్రద్ధాళువై నిర్వహిస్తున్నారు.
