రమణి జాలిగా చూసింది.
"ఓసారి నువ్వన్నావు. మనందరం ఓ పడవపైన ప్రయాణం చేస్తున్నామని. అయినా ఆ పడవ నీళ్ళలో మునిగిపోతున్నాప్పుడు ఎవరి ప్రాణాలు కాపాడుకోడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారే తప్ప పక్కవారిని పట్టించుకోరు. కానీ నువ్వు అలాంటి దానివి కాదు. నీకు స్వార్థంలేదు. అందుకే మళ్ళీ జన్మంటూ ఉంటే నీకు చెల్లెలిగా పుట్టాలనిపిస్తోంది."
ఆ మాటలంటున్నప్పుడు రమణి కళ్ళనుంచి కన్నీటిబొట్లురాలాయి.
అవంతి మెల్లగా ఆమెని దగ్గరగా తీసుకొని గట్టిగా కౌగిలించుకుంది.
రమణి నుదిటి పైన ముద్దు పెట్టుకుంది అవంతి.
"ఐ లవ్ యు డియర్!" అంది ప్రేమగా అవంతి.
"పద ఆకలేస్తోంది. మెస్ కెళదాం. శ్యామలా, కుసుమా నిన్ను చూసి బెదిరిపోయారు. నువ్విప్పుడు నవ్వుతూ కనబడితే తప్ప వాళ్లు తిరిగి మనుషులు కాలేరు!" అంది రమణి.
"అలాగే, నువ్వెళ్ళి వాళ్ళని తీసుకురా. ఈలోగా నేను తయారవుతాను" అంది అవంతి.
"ఓ.కే." అంటూ రమణి గదిలోంచి బయటకి పరుగుతీసింది.
ఆ క్షణం ఎందుకోగానీ పెద్ద రిలీఫ్ గా అనిపించిందామెకి.
రెండు క్షణాలపాటు కళ్ళు గట్టిగా మూసుకొంది.
తలుపుల్ని చేరగిల వేసి గబగబ సూట్ కేసు దగ్గరకి నడిచింది. చేతులు వణికాయి తను చేయబోతున్న పని గుర్తుకొస్తేనే ఒళ్ళు జలదరించింది.
సూట్ కేసు లోంచి ఓ చీరని తీసింది.
పైన గిరగిరమని తిరుగుతోన్న సీలింగ్ ఫాన్ కేసి ఓసారి చూసి స్విచ్ ఆఫ్ చేసింది అవంతి.
- పావుగంట తర్వాత,
తలుపును తోసుకుంటూ రమణి ఆమె వెనుకగా శ్యామల, కుసుమ గదిలో అడుగుపెట్టి నిర్ఘాంతపోయారు.
మూడురోజులుగా లేని మార్పు ఒక్కసారిగా అవంతిలోకెలా వచ్చిందో ఆమె స్నేహితురాళ్ళకి అంతు చిక్కలేదు.
ఆమె అవంతేనా? అన్న అనుమానం కలిగేలా ముస్తాబయింది.
వాళ్ళని చూసి అవంతి హాయిగా నవ్వింది.
"అబ్బ బతికించావే. మూడ్రోజులుగా నీ మొహం చూడలేక చచ్చాం" అంది కుసుమ.
"ఇప్పుడు మేడం షోకిలారాణిలా వుంది. ఇంద్రుడు చూసినా మోజు పడతాడే దాన్ని" అంది కుసుమ.
"అయిన కడుపుని దించుకోగలిగితే చాలు, ఎవడు మోజు పడనక్కర్లేదు" అంది నవ్వుతూ అవంతి.
గదికి తాళంవేసి వాళ్ళథో బయలుదేరింది అవంతి.
"అప్పుడే ఏం తింటాం. కాస్సేపలా వెళ్ళి వస్తే రిలీఫ్ గా ఉంటుంది. వెళదామా!" అడిగింది రమణి.
"నాకైతే అభ్యంతరం లేదు. నేను రెడీ" అంది అవంతి.
"ఛస్తామా, మేము వస్తాం, పదండి" అంది కుసుమ.
నలుగురూ హాస్టలు నించి బయటకొచ్చారు.
"ఎక్కడికెళదాం" అవంతి అడిగింది.
"జస్ట్ అలా కొంతదూరం వాకింగ్ కెళదాం"
"ఓ.కే"
యూనివర్శిటీ మెయిన్ రోడ్డుమీదికి వచ్చి మెల్లగా నడవడం మొదలుపెట్టారు వాళ్ళు వాళ్ళ మనసిప్పుడు ప్రశాంతంగా వుంది. ఆహ్లాదకరమైన వాతావరణం ఎంతో హాయిగానూ, తియ్యగానూ అనిపిస్తోంది వాళ్ళకా క్షణంలో.
"జస్ట్ అలా కొంతదూరం వాకింగ్ కెళదాం."
"ఓకె."
యూనివర్శిటీ మెయిన్ రోడ్డుమీదికి వచ్చి మెల్లగా నడవడం మొదలుపెట్టారు వాళ్ళు. వాళ్ళ మనసిప్పుడు ప్రశాంతంగా వుంది. ఆహ్లాదకరమైన వాతావరణం ఎంతో హాయిగానూ, తియ్యగానూ అనిపిస్తోంది వాళ్ళకా క్షణంలో.
12
ఫియట్ కారు వచ్చి తన ముందున ఆగడం భారతి గమనించింది.
ఆ కారు ఎవరిదో, తన ముందు ఎందుకోసం ఆగిందో భారతికి బాగా తెలుసు.
ఇప్పుడే వో సమస్యని ఎదుర్కోవలసి వస్తుందని ఆమె కలవరపడింది.
బస్ స్టేజీలో చాలామంది జనం వున్నారు.
రోడ్డు రద్దీగా వుంది. బస్సులు ఆగకుండా వెళ్ళిపోతున్నాయి.
చూడకూడదనుకుంటూనే కారు వేపు చూసింది.
మనోహర్ విండోలోంచి తనని చూస్తూ చిన్నగా నవ్వి "కమాన్ భారతీ!" అన్నాడు.
భారతి చురుగ్గా ఓసారి అతన్ని చూసి మొహాన్ని తిప్పేసుకొంది బస్సుగానీ వస్తుందేమోనన్న ఆశతో చూపుని సారించి చూసింది. కానీ నిరాశే ఎదురయింది.
అయినా అయితే మనుకొంటున్నాడు!
కారు ఆపి ఎక్కమనగానే ఎక్కేస్తానని అనుకొంటున్నాడా! కారు మొహం అతనికే కాదు తనకీ తెలుసు.
ఆరోజు అతని కారెక్కడమే పెద్ద బుద్దిలేని పని చేసింది. అవంతి బలవంతంపైన తప్పలేదు.
అతని పేరు మనోహర్.
అతని కారణంగా కొన్నాళ్ళక్రితం యూనివర్శిటీ ఎలక్షన్లలో జాన్సన్ అనే విద్యార్థిని హత్యచేశారంటారు. అతనికి విలాసాలన్నా ఆడవాళ్ళన్నా కోరికెక్కువని తెలుసుకొంది.
ఇవన్నీ తెలిశాక అతనంటేనే ఓ విధమైన ఏవగింపుని పెంచుకొంది భారతి.
మనోహర్ కారుదిగి తనకేసి వస్తున్నాడు.
ఆమె ఇబ్బందిగా కాస్త పక్కకి తప్పుకొని నిలుచుంది.
"భారతీ?" అతను పిలిచాడు. ఆ పిలుపు మెత్తగా ధ్వనిస్తుంది. ఆ పిలుపుకి మరొకరైతే వెంటనే తలతిప్పి అతన్ని చూశేవారే.
కానీ భారతీ తనని కాదన్నట్లుగా విని వూరుకొంది.
