Previous Page Next Page 
అనాథ మహిళా సదన్ పేజి 17


    "సారీ మౌనికగారూ! ఆ విషయం తెలియక వుండిపోయాను. ఇక వెళ్ళిపోతాను" అని ముందుకు కదలబోయాడు తరుణ్.

 

    "ఎక్కడికి?"

 

    "ఎక్కడికయినా. ఇక్కడే వుండి నీకు రిస్క్ యివ్వటమెందుకు?" అన్నాడు.

 

    "బయటికి వెళితే మీరు రిస్క్ లో పడతారు"

 

    అతనికి అర్థమైంది.

 

    ఈమెకి ఏదో కొత్త విషయం తెలిసింది.

 

    "ఎందుకు?" అని అడిగాడు.

 

    "ఇక్కడే మిమ్మల్ని చంపాలనుకుంటున్నవాళ్ళు తిష్ట వేసుకున్నారు గనుక" అని ప్రారంభించి విమలాబాయి కుటీరానికి తను వెళ్లడం దగ్గరనుంచి గణపతిరాజు తనను గేటు దగ్గర ఆపడంవరకూ అన్నీ చెప్పింది.    

 

    "ఇదేదో తేలికగా తీసుకునే విషయంలా లేదు. ఇక్కడికి వెతుక్కుంటూ వచ్చి, మరికొన్ని రోజులపాటు యిక్కడే వుంటారంటే పని ముగించుకుని తప్ప వెళ్ళరన్న మాట."

 

    "వాళ్ళ వాలకంబట్టి చూస్తే అలాగే వుంది మరి. మీరు యిప్పుడు గనుక బయటికి వెళ్ళారంటే పులిబోనులో తలదూర్చడమే అవుతుంది"

 

    "మరి ఇక్కడ్నుంచి వెళ్ళాలి కదా? ఇప్పటికే మీకు చాలా కష్టం కలిగించాను" అన్నాడు నొచ్చుకున్నట్టు.

 

    "నిజమేననుకోండి. కానీ..." అంటూ ఆగింది.

 

    "ఇక్కణ్నుంచి బయటపడటమంటే డైరెక్ట్ గా వాళ్ళను ఎదుర్కోవడమే. ఈ దాగుడుమూతలు నా వల్లకాదు" అన్నాడు తరుణ్.

 

    "అలాంటి నిర్ణయాలు తీసుకోకండి. మీరు ఇక్కడే కొన్నిరోజులపాటు వుండిపొండి"

 

    అతను ఆమెనుంచి అలాంటి మాటలు ఊహించలేదు. అందుకే ఆశ్చర్యపోతూ అడిగాడు "ఇక్కడా?"

 

    "ఆఁ. మీరిక్కడ వుండటం మహిళాసదన్ నియమాలకు విరుద్ధమే. కానీ మీరున్న పరిస్థితులలో మిమ్మల్ని బయటికి పంపలేకపోతున్నాను" అంది.

 

    అతనేమీ మాట్లాడలేకపోయాను. అది మాటలకందని అనుభూతి. మనిషికీ మనిషికీ మధ్యనున్న ఈ అభిమానాన్ని ఏమనాలో తెలియడంలేదు.

 

    మనిషిలో ఎంత క్రూరత్వం వుంటుందో అంత మంచితనం వుంటుంది.

 

    ఒక స్త్రీ తనను నిర్ధాక్షిణ్యంగా చంపమని మనుషుల్ని పురమాయిస్తే మరో స్త్రీ తనను కాపాడడానికి ఎంతటి రిస్క్ తీసుకోవడానికయినా వెనుకాడడం లేదు.

 

    "ఇది ఒకటి రెండురోజుల్లో తేలే విషయంలా నాకనిపించడం లేదు" అన్నాడు.

 

    "నిజమేననుకోండి. కానీ మీరన్నట్లు రెండు రోజుల్లో ఎన్ని జరక్కూడదు?"

 

    ఆమె ఎంత తెలివయిందో ఆ మాటలతో అర్థం చేసుకున్నాడతను. అవసరం వచ్చినప్పుడు మన పాఠాలను మనకే చెప్పి నోరు మూయించే నేర్పు వుండడం తెలివయినవారి లక్షణం.   

 

    ఇక అతను ఏమీ ఎదురుచెప్పలేదు. ఒకటి రెండు రోజులక్కడే వుండి పరిస్థితులన్నీ గమనించాక ఏం చేయాలో నిర్ణయించుకోవచ్చని అనుకున్నాడు.

 

    సరేనన్నట్లు తల మాత్రం వూపాడు.

 

    "మీరు రెండు రోజులుగా ఏమీ తిన్నట్టు లేదు - ఆకలిగా లేదూ?" అని అడిగింది.

 

    "ఆకలి అని అరిచీ అరిచీ పేగులు స్పృహ తప్పినట్లున్నాయి. అందుకే ఆకలి వేయడంలేదు" అన్నాడు.

 

    "ఉండండి ఇప్పుడే వస్తాను" అని ఆమె గదిలోనుంచి బయటికి వచ్చింది.

 

    అమ్మాయిలు చాలామంది అప్పటికే టిఫిన్ ముగించుకుని వస్తున్నారు. కైవల్య కనబడగానే దగ్గరకు రమ్మన్నట్లు పిలిచింది.

 

    "టిఫిన్ కి రాలేదా?" అన్నది ఆమె మౌనికను సమీపిస్తూనే.

 

    "లేదు. ఒళ్ళంతా వెచ్చగా వుంది. భోజనశాలకు వెళ్ళి నా టిఫిన్ పట్టుకొస్తావా? ఇలా పనులు చెబుతున్నందుకు ఏమీ అనుకోవద్దు."    

 

    దానికేం వుంది - ఉండు యిప్పుడే వస్తాను."

 

    కైవల్య తిరిగి వచ్చేవరకూ అక్కడే వుండిపోయింది మౌనిక. కైవల్య లోపలికి వస్తే తరుణ్ కనపడిపోతాడు. ఈ తప్పును మొదట తనే చెప్పాలి. అంతవరకూ యిది రహస్యంగానే కొనసాగాలి.

 

    కైవల్య ప్లేటులో నాలుగు ఇడ్లీలు తెచ్చింది.

 

    దాన్ని తీసుకుంటూ మౌనిక "చాలా సహాయం చేశావు కైవల్యా" అని కృతజ్ఞతాపూర్వకంగా చూసింది.

 

    కైవల్య చిన్నగా నవ్వి అక్కడ్నుంచి వెళ్లిపోయింది.  

 

    ఆమె తన గదిలోకి వెళ్ళేవరకూ అక్కడే వుండి, అప్పుడే తన గదిలోకి నడిచింది.

 

    "ఇదిగోండి టిఫిన్. వీటితోనయినా మీ పేగులు స్పృహలోకి వస్తాయేమో చూడండి" అని ప్లేటును ముందు పెట్టింది.

 

    "మరి మీకు?"

 

    "నా టిఫిన్ మీకిస్తున్నది. మీరు తినండి"

 

    "అలా కాదు. ఎంత ఆకలిగా వున్న మిమ్మల్ని వదిలి తినలేను.

 

    "ఈ పూటకి తినండి" అంది క్లుప్తంగా.

 

    మిమ్మల్ని వదిలి తినలేను అని అతను అనడం ఆమెకు చాలా బావుంది. తనని ఒకరు అంతగా అభిమానించడం ఎవరికయినా ఆనందాన్నిస్తుంది.

 

    వీటన్నిటికీ దూరంగావుండాలని సంవత్సరంనుంచి ప్రయత్నిస్తున్నా బేసిక్ గా ఆమె మనిషి.

 

    అభిమానించడం, అభిమానాన్ని ఎదుటి వ్యక్తి నుంచి కోరుకోవడం మనిషి సహజ లక్షణం.

 

    ఇక తప్పదని అతను ప్లేటును ముందుకు లాక్కుని ఇడ్లీని తుంచి చట్నీలో అద్దుకుని నోట్లో పెట్టుకున్నాడు. ఆకలి రుచి ఎరుగదు అనడం ఎంత అబద్ధమో తెలిసింది. నోట్లో ఇడ్లీ పెట్టుకున్నాక అతని ముఖంలో వచ్చిన మార్పుల్ని చూసి ఆమెకు నవ్వొచ్చింది.

 

    అతను అతి కష్టంమీద ఇడ్లీ ముక్కను దిగమింగి "మౌనికగారూ! నామీద కోపముంటే రెండు తిట్టండి. లేదా మూడు దెబ్బలు కొట్టండి. అంతేగానీ ఇలాంటి శిక్ష వేయకండి" అన్నాడు వేడుకోలుగా.

 

    ఆమెకంతా అర్థమైంది.

 

    "ఇక్కడ భోజనాలు, టిఫిన్లు అలానే వుంటాయి. అంతా సాత్వికాహారం" అంది.

 

    "ఉప్పూ కారం లేకుండా తినడం ఏమిటండీ? ఇలాంటి తిండి తింటే శక్తి చాలక జబ్బులొస్తాయి. అంతే తప్ప ఇలాంటి తిండివలన ప్రయోజనం వుండదు"

 

    "మహిళాసదన్ లో ఇట్లానే పెడతారు"

 

    "ఇలాంటి తిండి తినడంవల్ల జిహ్వచాపల్యం ఛస్తుందని మీ నమ్మకం కాబోలు. బతకడంకోసం తినాలిగానీ తిండికోసం బతక్కూడదని నేనూ అంగీకరిస్తాను గానీ ఇలా రుచీపచీ లేకుండా తినడం ఏం ఆదర్శమో నాకు అర్థంకావడం లేదు. ఇంత బలవంతంగా ఎందుకు బతకడం?" అని ఆపైన మాట్లాడడం బావుండదని ఆగిపోయాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS