ఆ సంఘటనను ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకొనలేదు.
పోలీసులు కూడా పట్టించుకోని ఆ హత్య గురించి పరిశోధించాలనే దృఢ నిశ్చయానికి వచ్చింది ధీరజ.
ఆ హత్య జరిగినప్పుడు తను అక్కడే వుంది. ఫోటోలు కూడా తీసింది.
కానీ , దేనిలోనూ హంతకుడి ముఖం స్పష్టంగా తెలియడంలేదు.
ఒడ్డూ, పొడుగూ తెలుస్తుంది తప్ప ఆ ఫోటోలనుబట్టి హంతకుడు ఎవరో గుర్తించడం కష్టం.
పోలీసులు ఏమో రవితేజ నేరం చేశాడు అంటున్నారు...
కానీ , తనకే నమ్మకం కలగడంలేదు.
అలా అని ఆర్గ్యూ చేయడానికి ప్రస్తుతం ఆధారాలు తన దగ్గర ఏమీలేవు.
అందుకే ధీరజ మవునం వహించింది.
గెలిచింది అధికార పార్టీ అభ్యర్ది...
అతను మరణిస్తే ఎవరకి లాభమో లాజిక్ గా ఆలోచిస్తేనే అర్ధం అవుతుంది.
కానీ, చట్టానికి కావలసింది లాజిక్ లూ.... ఊహలూ కాదు.... సాక్ష్యాలు!
అందుకే ఆ హత్య వెనక అసలు హస్తం ఎవరిది వుందో కూపీ తెయాలని ధీరజ నిశ్చయించుకుంది.
'ఎన్ని ఆవంతరాలు ఎదురు అయినా తన పరిశోధన ఆగకూడదు... ఆ హత్య వెనక రహస్యాన్ని చేధించి వాస్తవాన్ని ప్రజలకు తెలియచెప్పాలి.
తన పరిశోధకు సహకరించమని రిక్వెస్టు చేయడానికి చీఫ్ ఎడిటర్ గదిలోకి వెళ్ళింది.
చీఫ్ ఎడిటర్ ఆమెవైపు అదోలా చూశాడు.
ధీరజ వచ్చిందంటే ఆయనకు అది ఒక రకమైన భయం.
ప్రతి చిన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి... అనుమానాలతో ప్రశ్నించి ప్రాణం తీస్తుంది. అందుకే ఆమెతో సాధ్యం అయినంత క్లుప్తంగా మాట్లాతుతుంటాడు ఆయన.
"మిస్ ధీరజా... రాజధానిలో తాజా వార్తలు ఏమైనా ఫోటోలు తీశావా!"
"వాటిని సేకరించడానికి రిపోర్టర్లు చాలామంది వున్నారుసర్.... నేను ఒక ముఖ్యమైన విషయంపై మీ సలహా తీసుకొనడానికి వచ్చాను. మీకు ఏమీ అభ్యంతరం లేదుగా!"
"అబ్బెబ్బే... అలాంటిది ఏమీ లేదు.... నిరభ్యంతరంగా అడగవచ్చు"
అన్నాడన్న మాటేకానీ ముళ్ళపై కూర్చున్నట్టుంది ఆయన పరిస్థితి.
ఆయన భయం ఆయనది!
"ఎలక్షన్లకు ముందు జరిగిన హత్యకు ఎవరో పకడ్బందీగా అల్లిన హత్యగా చెప్పుకోవచ్చు. ఆ హత్య జరిగిన ప్రదేశంలోనే వున్న నాకు అక్కడ కల్పించబడిన పరిస్థితులు చూశాక నా అనుమానం మరింత బలపడుతుంది.అందుకే ఆ హత్యా రహస్యాన్ని చేధించాలనుకుంటున్నాను... అందుకు మీ సహకారం కావాలి"
"చూడు ధీరజా... అటువంటి విషయాలు చర్చించే సమయం కాదు ఇది...మన పత్రిక ఎలాంటి రిస్క్ లేని వార్తలనే ప్రచురిస్తుంది. ఎందుకో తెలుసా... మన పత్రిక అధికార పార్టీకి చెందిన ఒక రాజకీయ నాయకునిదని నీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటాను...."
"నిజాన్ని దాచిపెట్టి గ్యాసిప్స్ తో పత్రికలను అమ్ముకునే దౌర్బాగ్య స్థితిలో వున్నామాసర్ మనం... అదే నిజమయితే ఇక రిపోర్టర్లతో పనేముంటుంది సర్..."
"ఆ హత్యను ప్రధానంగా అందరికంటే ముందుగా వివరాలతో ఎస్టాబ్లిష్ చేసి వ్రాసింది మన పత్రికేకదా... హంతకుడు ఆనందరావు కొడుకు రవితేజ అని ఫోలేసులు నిర్దారించుకుని, అతనని అరెస్ట్ చేశారు. ఇంకా ఏం నిరూపిద్దామనుకుంటున్నావు నువ్వు" అసహనంగా అన్నాడు ఆయన.
"నిరూపించవలసింది కోర్టులో... మీరు అందరికంటే ముందుగా న్యూస్ ప్రిపేర్ చేయించారు. ఆ హత్య జరుగుతుందని మీకు ముందే తెలుసా?" ధీరజ ప్రశ్నించింది.
"మిస్ ధీరజా... ఎక్కువగా మాట్లాడుతున్నావు.... మిగలిన పత్రికలకన్నా ఎవరికీ వారే ముందు ప్రచురించాలి అనుకోవడం తప్పుకాదు"
హంతుకుడు రవితేజ అని స్పష్టంగా వ్రాసింది మీరుమాత్రమే.... అతనే హంతకుడు అని మీకు ఖచ్చితంగా ఎలా తెలుసు సర్... స్పాట్ లో వున్న నేను ఆ హత్యను గూర్చి మీకు ఎలాంటి రిపోర్ట్ చేయక ముందే మీరే స్వయంగా ఆ న్యూస్ ఐటమ్ ఎక్కించారు. ఎలా తెలిసింది మీకు."
ముఖంమీద పట్టిన చిరు చెమటను చీఫ్ ఎడిటర్ కర్చీఫ్ తో అద్దుకున్నాడు.
"రాజకీయ అవగాహన వున్న జర్నలిస్టులు ఎవరు అయినా హంతకుడు రవితేజ అనే వ్రాస్తారు. లోగడ జరిగిన సంఘటనలను బట్టి పోలీసులు కూడా అదే నిర్దారించి చెప్పారు."
"అతను హంతకుడు కాదు అనడానికి నా వద్దా సాక్ష్యం వుంది సర్."
చీప్ ఎడిటర్ నవ్వాడు.
"అది నిరూపించడానికి చట్టం వుంది.... కోర్టులు వున్నాయి... ఆ విషయం గురించి రిస్క్ తీసుకోవలసిన అవసరం నాకు లేదు... ఇంకేమైనా మాట్లాడవలసి వుందా!"
కోర్టులు చట్టాలు వున్నప్పటికీ మనకు తెలిసిన మార్గంలో ప్రయత్నిస్తే తప్ప ఏముంది సర్... ఆ హత్య వెనుక నిజాలను వెల్లడి చేసేవరకూ నాకు మనశ్శాంతి వుండదు. మోసంతో గెలిచిన నాయకుల బండారం బయట పడుతుంది. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి న్యాయం జరుగుతుంది సర్"
"నో... ఈ విషయంలో నా నుంచి నీకు ఎలాంటి సహకారం లభించదు. ఐ కాంట్ హెల్ప్ యూ" చీఫ్ ఎడిటర్ చిరాగ్గా అన్నాడు.
"అర్ధం అయింది సర్....మీరు కొన్ని ఒత్తిడులకు లొంగిపోయారు."
"మిస్ ధీరజా__ ప్లీజ్...డోన్ట్ మిస్ అండర్ స్టాండ్ మీ... నా అసహాతను అర్ధం చేసుకో... నా పరిధులు నాకు వున్నాయి__ ఇక నువ్వు వెళ్ళవచ్చు" సీట్ లోనుంచి పైకి లేచాడు ఆయన.
ధీరజ సైలెంట్ గా బయటకు వచ్చేసింది.
"ధీరజ అసాధ్యురాలు... అన్నంతపనీ చేస్తుంది... ఆమెను ఆపడం ఎలా?"
చీఫ్ ఎడిటర్ లో అందోళన ఎక్కువ అయింది.
వెంటనే ఫోన్ ముందుకు లాక్కుని... రింగ్ చేయసాగాడు చీఫ్ ఎడిటర్.
* * * *
