Previous Page Next Page 
లేడీ కమెండో పేజి 17

ఉన్నచోటనుంచే కదలకుండా కుడికాలు లేపి వెనుకవేపునుంచి వస్తున్న ఇద్దరి గూబ గుయ్ మనిపించింది, కళ్లు బయర్లుకమ్మిన ఆ ఇద్దరూ తమకు ఏం జరిగిందో అర్ధం కాలేదు.
చిరుతపులిలా వెనదిరిగిన ధీరజ రెండు పిడికిళ్ళు  బిగించి తల దగ్గరనుంచి పొట్టవరకూ వెంటవెంటనే పంచ్ లతో ఇద్దరి శరీరాలను హూనం చేసింది.
ఆ ఇద్దరూ ముక్కుతూ మూలుగుతూ నేలపైకి జారిపోయారు.
ఆ దృశ్యం చూడడంతో కంగారు పడిపోయిన మిగిలిన ముగ్గురూ ఒక్కసారిగా పరుగులు దీశారు.
కనురెప్ప మూసి తెరిచేటంతలోజరిగిపోయిందా సంఘటన!
అటుగా వెళ్ళే ఆటోను పిలిచి ఆ ఇద్దరినీ మూటలు పడేసినట్లు దానిలో పడేసి హోండా స్టార్ట్ చేసింది ధీరజ
ఏసిపి వీరేష్ కు ఆ ఇద్దర్నీ అప్పజెప్పి... అతనిచేత అందమైన చీవాట్లు తిని, తనలో తనే ఆనందంగా నవ్వుకుంటూ వెనదిరిగిమ్ది డేరింగ్ లేడీ ధీరజ!
   
                      *    *    *    *
ఏసిపి వేరేష్ స్టూడియో లోపలకు అడుగు పెట్టిన తర్వాత ఉన్నచోట నిలబడే చుట్టూ పరిశీలనగా చూశాడు.
అంగుళం మందాన పేరుకు పోయిన దుమ్ము దూళిలో బూట్ల అడుగు జాడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మోకాళ్ళపై వంగి ఏమయినా ఆధారాలు లభిస్తాయేమోనని వెదుకుతున్న వీరేష్ కళ్ళకు సగం కాల్చి పారేసిన సిగరెట్ పీకలు కనిపించాయి అక్కడ!
వాటిని భద్రంగా హాండ్ కర్చీప్ తో అందుకున్నాడు.
అవి త్రిబుల్ ఫైవ్ సిగరెట్స్.
అంతేకాదు... ప్రతి సిగరెట్ సగం వరకు మాత్రమే కాల్చి పారేసి వుంది.
అక్కడ వెయిట్ చేసిన వ్యక్తికి అలాంటి అలవాటు వుంది వుంటుందని వీరేష్ కి అర్దమయింది.
సుమారు పదిమందయినా అక్కడ తచ్చట్లాడి ఉంటారని గజిబిజిగా వున్న బూట్ల ముద్రలను బట్టి ఊహించాడతను.
ఇంకేమయినా దొరుకుతాయేమోనని చూసిన వేరేష్ కళ్ళు మిలమిల మెరిశాయి.
యూనిఫారమ్ కు వుండే స్టార్ ఒకటి కింద పడివుంది.
దానిని భద్రంగా తీశాడు వీరేష్. ఇంకొకచోట రక్తం ఎండిపోయిమట్టితో కలిసి స్పష్టంగా కనిపించడంతో అంతవరకూ అతనిలో వున్న సందేహం పటాపంచలయింది.
ఎండిపోయిన మట్టితో కూడిన రక్తాన్ని కూడా గీకి పొట్లంకట్టాడు.
చతుర్వేది యూనిఫామ్ కు వున్న స్టార్స్ లో ఇది ఒకటి అని తేలితే తప్పకుండా అతని మరణం యిక్కడే సంభవించింది అన్న విషయం తేలిపోతుంది.
ఫోరెన్సిక్ లాబ్ కు పంపితే ఎండిపోయిన రక్తాన్ని బట్టి అది చతుర్వేదిది అవునో కాదో తెలుసుకొనవచ్చు.
అతనిని చంపిన స్థలం ఇదేనని నిర్దారణ అయినపుడు_ ఆ చంపిన వ్యక్తులు ఎవరో తెల్సుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు.
ఆలోచిస్తూ గేటు వేపు అడుగులు వేస్తున్న వీరేష్ కాళ్ళకు ఏదో వస్తువు మెత్తగా తాకడంతో కిందకు వంగి చూశాడు.
ఏవో బట్టలు వున్న కవర్ అది...
చేతిలో అందుకుని పరిశీలనగా చూశాడు.
డ్రైక్లీనింగ్ షాపు నుంచి బట్టలు తెచ్చుకున్న కవర్ అది... దానికి రశీదు కూడా పిన్ చేయబడి వుంది... ఏ రోజు ఆ బట్టలు వేసిందీ... తీసుకున్నదీ... స్పష్టంగా వుంది తప్ప రశీదుపై ఆ బట్టలు ఎవరివో పేరు మాత్రం వ్రాసి లేదు.
అంటే ఆ డ్రైక్లీనింగ్ షాపు వాళ్ళకు ఈ బట్టలు వేసే వ్యక్తి ఎవరో బాగా తెలిసి వుండాలి.
అందుకే రశీదుపై పేరు వ్రాయలేదు. అలాంటప్పుడు ఈ బట్టలను చూస్తే ఎవరివో కూడా స్పష్టంగా చెప్పగలడు.
బహుశా చతుర్వేదిని చంపిన వ్యక్తుల్లో ఒకడివి అయి వుండవచ్చు.
ఆ హడావుడిలో మరచిపోయి వుండాలి...
దీని ఆధారంతో అతను ఎవరో తెలుసుకోవచ్చు!
స్టూడియోలో నుంచి బయటకు వచ్చి అంబాసిడర్ ను స్టార్ట్ చేసి ముందుకు దూకించాడు.
సాయత్రం ఐదు గంటలు__
యూనిఫారమ్ మార్చుకుని వెళదామని హెడ్ క్వార్టర్స్ వేపు కాకుండా ఇంటికి బయలుదేరాడతాను.
వీరేష్ వుండే కాలనీలోకి అతని కారు ప్రవేశించిన మరుక్షణం ఒక ఇంటి చాటున అంతవరకూ పొంచివున్న వ్యక్తి తన దగ్గర వున్న వాకీటాకీలో సిగ్నల్స్ ఇచ్చాడు.
మరుక్షణం ఏసిపి వీరేష్ ప్లాట్ లోపల అతని కోసం కాచుకుని వున్న ఆగంతుకులు అలర్ట్ అయ్యారు.
ఇది ఏమీ తెలియని వీరేష్... కారుని బయట ఆపి గేటు వైపు అడుగులు వేశాడు.
 
                     *    *    *    *
అది ఒక దినపత్రిక కార్యాలయం!
రీడర్ షిప్ బాగా వున్న ప్రముఖ పత్రిక అది...
ధీరజ ఆ పత్రికకే తను తీసిన ఫోటోలను, వ్రాసిన వార్తలనూ పంపుతూ వుంటుంది.
ఆ ఆఫీసులో పాతికమంది వరకూ పనిచేస్తున్నారు.
తాజా రాజకీయాల మీద వార్తలు సేకరించి పత్రిక ద్వారా ప్రజలకు తెలియజేయడమే వారి డ్యూటీ... ఏదయినా ఘోరం జరగినప్పుడు ఆ వార్త ఆ రోజు ప్రముఖంగా చోటుచేసుకుంటుంది. రెండవ రోజు నుంచీ ఆ సంఘటన పాతబడిపోతుంది.
అన్ని పత్రికలలోనూ జరుగుతున్నది ఇదే....
నేరం జరగడానికి దారితీసిన పరిస్థితులు... ఎవరు ఎవరివల్ల ఏమేం జరిగిందో పరిశోధించి పత్రికల ద్వారా ప్రజలకు తెలియజెప్పే జర్నలిస్టులు కరువైపోయారు.
ఆ ఒరవడిని తప్పించి పత్రికా రంగాన్ని మేల్కొల్పాలని ధీరజ సీరియస్ గా ఆలోచిస్తుంది.
తను అందరిలా గోళ్ళు కొరుక్కుంటూ కూర్చోకూడదు.
ప్రతి వార్తనూ ఆది నుంచి అంతం వరకూ ప్రజలకు తెలియచేయాలి.
ఈ మధ్య జరిగిన సంఘటనలలో ఆనందరావు చేయించిన హత్య సంచలన వార్త అయింది. ఆ తరువాత ఆ విషయాన్ని మరచిపోయినట్టున్నాయి పత్రికలు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS