"మేం అంటే ఎవరేమిటి?" అని ప్రశ్నించాడు.
"నేను మా అక్క గాయత్రి!"
"ఆమెను కూడా తీసుకువస్తారా! బాగుండదేమో!"
"మీ మగాళ్ళింతే! పెళ్ళికాకముందే ఇల్లు దాటకుండా చేయాలి అని"
"నా అభిప్రాయం అది కాదు. మీరు అపార్ధం చేసుకుంటున్నారు"
"ఒక రహస్యం చెప్పనా?"
"చెప్పండి! మనకి ఇంకా రహస్యాలేమిటి?"
"పెళ్ళిచూపులకు ముందే అక్క మిమ్మల్ని చూడాలనుకుంటోంది" అతను నవ్వాడు!!
6
ఉత్సవాలలో మరో రెండు రోజులు గడిచాయి.
ఆఖరు రోజు వచ్చింది. ఆరోజే దొంగల దోపిడి!
నాలుగు గంటలకు రధం ఊరేగింపు ఉత్సవం! ఎనిమిది గంటల నించి యువకుల సామ్రాజ్యం అది. అందులో ఎవరికివారే చక్రవర్తులు.
స్వైర వివాహం చేస్తారు. గ్రామాన్ని పీకి పాకాన పెట్టేస్తారు.
సాయంత్రం రధోత్సవం బయలుదేరిన తర్వాత స్వామిని దర్శించుకుని పరాయి గ్రామాల వారు చాలామంది వెళ్ళిపోయారు.
ఈ నాలుగు రోజులుగా కొంతమంది పందిళ్ళలో బస చేశారు. కాని ఈ రాత్రికి అలా బస చేయటం మంచిది కాదు. మిడిమేళపు కుర్రాళ్ళు వస్తువులతో పాటు ఒంటి మీద బట్టలు కూడా వలుచుకు పోయి కుప్పపెట్టి తగలెట్టేస్తారు. ఏమీ అనేందుకు కాని ఎవరితో అయినా చెప్పుకునేందుకు కాని వీలుకాదు.
చీకటిపడే సమయానికి ఊరేగింపు ముగిసింది. చాలామంది పరాయి గ్రామాల వారు తిరుగుముఖం పట్టారు. అయితే ఉత్సాహంగా దొంగల దోపిడిలో పాల్గొనేందుకోసమే వచ్చిన యువకుల కోలాహలం మాత్రం ఎంత అయినా తగ్గలేదు. గ్రామం పందిళ్ళు సందడిగా ఉన్నాయి.
చీకటిపడిన తర్వాత సాంప్రదాయం ప్రకారం కూతుళ్ళనిద్దరిని పిలిచింది సుమిత్ర. వర్ధని చేత వారి చెంపలకు గులాము రాయించింది. "ఈ పండుగలు పవిత్రమయినవి. ఈ ఆచారాలు అర్ధవంతమయినవి. వీధులలో వసంతాలు పుచ్చుకుని వీర విహారం చేస్తేనే పండుగ అని భావించుకోకూడదు.
ఈ గులాముతో ఈ ఏటికి వసంతోత్సవం మన యింటిలో కూడ పూర్తి అయింది. ఈ సంవత్సరంతో నా బాధ్యతలు చాలావరకు దింపేసుకుంటున్నారు. ఇకనించి ఈ బాధ్యతలు నీవు నిర్వహించుకోవాలమ్మా గాయత్రీ!" అంటున్నప్పుడు రాణి సుమిత్రగారి కంఠస్వరం జీరపోయింది. కన్నులు కూడ ఆర్ధ్రం అయినాయి.
ఒక తరం ముగిసిపోతున్నది అని ప్రకటించే సమయాన చిప్పిల్లిన విషాదం అది. "ఇక వెళ్ళి తలంటు చేయండి. రేపు కనుమ పండుగ ఎవరూ గ్రామం పొలిమేరలు దాటి వెళ్ళరాదు. ఎల్లుండి ఆమని ప్రయాణం వింటున్నారా?" అన్నదామె అధికారం ధ్వనించే కంఠస్వరంతో.
"వింటున్నాం" అంటున్నట్లు వారు తలలు ఊగించారు.
"తలంటు అయిన తరువాత కొత్త బట్టలు కట్టుకుని ఇద్దరూ నా గదిలోకి వచ్చి కన్పించాలి" అని ఆదేశించింది.
కొద్దిసేపటి తర్వాత తలలు ఆర్పుకున్నారు. ఎవరి గదిలో వారికి తల్లి పంపించిన బట్టలున్నాయి.
గాయత్రికి బంగారు జరీపూలు కుట్టిన పట్టు చీర!
అమనికి పాంటు జర్కన్ దాని మీదికి రోబ్ ఢిల్లీనించి తెప్పించినవి కొన్నచోటు షాపు బిల్లులు తేదీలతో సహా టేబిల్స్ మీద సిద్ధంగా వున్నాయి. వాటిని చూచి ఎవరికివారే అబ్బుర పడిపోయారు.
మమ్మీ సాంప్రదాయంలో జీవిస్తారే కాని ఆమెకు అన్నీ తెలుసు. అధునాతనమయిన కోర్కెల్ని వారు అర్ధం చేసుకోగలరు అని చాలా సంబర పడిపోయింది ఆమని.
డ్రసప్ అయి బొట్టు కూడ పెట్టుకుని చాలా బుద్ధిమంతురాల్లా తల్లి గదిలోకి వచ్చింది. అప్పటికి అక్క కూడ అక్కడే ఉండటంతో గడియారం వంక చూస్తూ భయంగా నిలబడింది.
"అయిదు నిముషాలు ఆలస్యం చేశావు" అంది సుమిత్రాదేవి.
అది నిజమే! చెప్పేందుకు సమాధానం ఏమీలేదు కాబట్టి గునియకుండా వచ్చి అక్క ప్రక్కన కూర్చుంది ఆమని.
అక్క పెళ్ళి విషయం అతనితో మాటాడించాను."
"ఏమన్నారు మమ్మీ!" ఆసక్తిగా అడిగింది చెల్లి.
"ఏవో కొన్ని అభ్యంతరాలు చెప్పాడట! అవి మనం అధిగమించలేనివి ఏమీ కాదు. చాల మంచివాడని అర్ధమయింది. గాయత్రి అదృష్టవంతురాలు అనిపిస్తోంది!" అంటూ వారిని పిలిచిన కారణం బయట పెట్టింది సుమిత్రాదేవి.
"ఏమిటా అభ్యంతరాలు?"
"గాయత్రి ఇక్కడే ఉండి మన యింటి సాంప్రదాయాలకు వారసురాలుగా అన్నీ చూసుకోవాలని నేను అన్నాను. రెండు తరాలు ఆడ రెక్కల మీద కాపాడుకున్న ఈ వ్యవస్థ అంతా గాయత్రికి పుట్టే మగ బిడ్డకు అప్పగించి కన్నుమూయాలి. అదే నా కోరిక!
కాని అతనికి నగరంలో ఉండాలని ఏవో వ్యాపారాలు చేయాలని అతని అభిప్రాయం అని మన ప్రతినిధులుగా వెళ్ళిన పెద్దలతో చెప్పాడట.
మన వారసుడు మన ఇంటిలో పుట్టాలనే ఆలోచన సాధ్యపడదని అతను అన్నాడట!
మన ఇంటిలో ఉండటం అంటే అది ఇల్లరికం అనే మాటను ధ్వనిస్తూంది కదా! దానికి అతడు వ్యతిరేకం అన్నమాట!" అంటూ వివరించింది సుమిత్రాదేవి.
ఈ మాటలు విని బేలగా చూసింది గాయత్రి!
"మమ్మీ! పూర్తి వ్యతిరేకంగా వున్న ఈ రెండు అభిప్రాయాలను మీరు ఎలా సమన్వయించ గలుగుతారు. అతని వంక చాలా బలగమూ బంధుత్వాలు ఉన్నాయి. మనకు వ్యవస్థ వుంది."
ఈ రెండింటికి వారసుడు కావలసిన వ్యక్తి గొప్పవాడు కావల్సిందే! మన రెండు కుటుంబాల సంపదల్నికాదు ఈ రెండు కుటుంబాల సాంప్రదాయాల్ని కూడా కాపాడేవాడు కావాలి!
ఈ విషయంలో వాల్మీకి అభిప్రాయాన్ని మనం గౌరవించాలి" అంది ఆమని! చిన్న కూతురు ఇచ్చిన పెద్ద సలహా విని ఉలికిపడి చూచింది సుమిత్ర. గాయత్రి మాటాడ దలుచుకోలేదు.
"నిజమే! అతన్ని అభిప్రాయాలను మనం గౌరవించాలి! మన సాంప్రదాయాన్ని మనం విడుచుకోలేం! ఈ రెండు ఒకేసారి సాధ్యపడతాయంటావా?" అని ప్రశ్నించింది సుమిత్ర.
సాధ్యమే మమ్మీ! అతడు పట్నంలో ఉండవచ్చు! మన వారసుడు మన ఇంటిలో పుట్టవచ్చు. మీరు ఇక్కడ అన్నీ చూచుకుంటూ ఉంటే అక్కా బావ పట్నంలో మన ఇంటిలో ఉంటారు.
నెలకు పదిహేనువేలు అద్దెలు వస్తున్నాయనుకోండి! ఇప్పుడు అవి రాకపోతే ఏమవుతుంది? మన రెండు కుటుంబాల మధ్య అడ్డుగా నిలిచిన సమస్య తొలగిపోతుంది కదా?
పట్నంలో మన ఇల్లు ఖాళీ చేయించి ఆ యింటిలో వీరు ఉండేలాగ ఏర్పాటు చేద్దాం! మీకు బాధ్యతలు చూచుకోలేనినాడు వచ్చే సమస్యలు అప్పుడు చూచుకుందాం!
ఇల్లరికం ఇప్పుడు వస్తే అవుతుంది. ఆ రోజు ఆస్థి వారసత్వం బాధ్యతల కోసం బావగారు యీ వూరు వచ్చి ఈ ఇంటిలో వున్నా అది ఇల్లరికం కాదు కదా! అతనికి మనకి ఆస్తులు ఇక్కడే ఉన్నాయి. వాటిలో మరొకరు తలదూర్చే అవకాశం లేకుండా అంతా బావగారే చూచుకుంటారు అంది ఆమని.
చిన్నపిల్ల అనుకుంటున్న ఆమని అంత బాధ్యతగా ఆలోచించగలదని కాని అంత సులభంగా సమస్యని పరిష్కరించగలదని కాని గాయత్రి సుమిత్రలు అనుకోలేదు. తల్లికి చాలా ఆనందంగానే ఉంది.
"ఈ సమస్యకి నువ్వు సూచించిన పరిష్కారం బాగానే ఉందమ్మా! బహుశా అతడు ఒప్పుకోవచ్చు! అతని స్వభావం ఇక్కడ అందరికి తెలిసిందే! క్రొత్తగా సమస్యలు తల ఎత్తే అవకాశం లేదు.
ఇప్పుడు నేనుండగా ఈ యింటి తీరు ఎలా నడిచిందో శాశ్వతంగా అలాగే ఉండాలని నా కోరిక! అది గాయత్రి వల్ల తీరాలి! తీరుతుందో లేదో చూద్దాం! మరోసారి పెద్దల ద్వారా రాయబారం పంపుతాను అంది.
గాయత్రి కూడ చెల్లెలి వంక ప్రసంశగా చూచింది.
కొద్ది క్షణాలు సమస్య విన్న తరువాత ఆమె గుండె దడదడలాడింది. ఈ పని తప్పిపోకూడదు అని వెయ్యి దేవుళ్ళకి మ్రొక్కుంది.
మొదటిసారిగా మనసులో పడిన మాటను మర్చిపోలేరు ఆడపిల్లలు. వాల్మీకితో పెళ్ళి అనే మాటలు తమ ముందు జరిగాక ఇంక ఆ ఆలోచనను మర్చిపోలేక పోతూ ఉంది గాయత్రి. ఒకవేళ ఏదైనా కారణంవల్ల ఈ ఆలోచన మార్చుకోవాల్సి వస్తే బాగా డీలా పడిపోతుంది అని ఆమని కూడ గ్రహించింది.
ప్రతిష్ట కలిగిన రెండు కుటుంబాలు కలియటం! పుట్టే వారసుడు రెండు కుటుంబాలకు వారసుడుగా ఉండాల్సి రావడంలాంటి ప్రముఖమైన సమస్యలు అందరి మనసుల్లో పనిచేస్తున్నాయి.
