అసలు సంగతి చెప్పడానికి కొంచెం యిబ్బంది పడ్డట్టుగా మౌనం వహించింది లక్ష్మీదేవమ్మ.
"పిల్లలకి పాఠాలు చెప్పడమేకదా నా జీవనం! ఇన్నాళ్ళ నా శ్రమకు ఫలితంగా ఈ వృద్ధాప్యంలో నానోటి ముందరి ముద్దతీసివేయడం మీకు భావ్యంకాదు" కృష్ణారావుకు ఆపుకోలేనంతగా దుఃఖం, దానివెంబడి దగ్గు తెర వచ్చాయి.
"మీరంటే మాకు అభిమానానికి తక్కువేమీ లేదు. మీరు కావాలంటే అబ్బాయి నడిగి పదో పాతికో అడిగి పట్టుకు వెళ్ళండి. కాని పిల్లల్ని మీదగ్గిరకి పంపటం వీలుకాదు మీకు టి.బి. అని విన్నాము. మిమ్మల్ని చూస్తుంటే ఆమాట అబద్దం కాదని..."
"నాకు టి.బి. అని చెప్పిన వాడెవడమ్మా? వారం రోజులు జ్వరంపడ్డాను. ఈ దగ్గు మొదలయింది, మీ అబ్బాయినడిగి పదో పాతికో పట్టుకుపోనా? ఇంత బ్రతుకూ బ్రతికినా శిష్యుల దగ్గరే నేను బిచ్చమెత్తుకోనా? వద్దమ్మా? మీ అభిమానానికి ఒక నమస్కారం!"
కృష్ణారావు కంపరంగా. ఆవేశంగా బయటికివచ్చాడు.
ఈ వీధిమలుపులోనే ఒక చిన్న హనుమాన్ ఆలయం ఉంది. వస్తూ ఆ ఆలయం సమీపంలో ఒక వీధిబడి క్రొత్తగా వెలియడం గమనించాడు కృష్ణారావు. అక్కడ తన చేజారి పోయిన పిల్లలంతా కనిపించారు.
తనకి టి.బి. అన్న పుకారు ఎవరు బయల్దేరదీశారో ఇప్పటికి అర్ధమైంది కృష్ణారావుకి.
"ఏం నాన్నా అలావున్నావు! ఏం జరిగింది"
కృష్ణారావు జోళ్లువిడిచి మంచంమీద కుప్పగ కూలిపోయాడు "అయిపోయిందమ్మా? మనం బ్రతకడం అయిపోయింది!"
పారిజాత ఆత్రుతగా "ఏం జరిగింది నాన్నా? పిల్లలు ఎందుకు రావడం లేదట?"
"టి.బి. పేషెంటుతో పాఠాలు యెవరు చెప్పించుకొంటారమ్మా?"
"టి.బి. పేషంటు ఎవరు నాన్నా?"
"కృష్ణారావు మాస్టారు టి.బి. పేషంటు అయ్యారుగా!"
పారిజాత వెలవెల బోయింది. "ఎవరు చెప్పారు నాన్నా నీకు క్షయ అని?"
"అలా అవతలికి వెళ్ళి అడుగమ్మా! అందరూ చెబుతారు?" కృష్ణారావు ఆపుకోలేని దుఃఖంతో తువాలు ముఖం మీద కప్పుకొన్నాడు.
7
రాత్రి ఎనిమిది గంటల సమయం.
మైన్ రోడ్డు విడిచి ప్రక్క సందులోకి నడిచింది పారిజాత. లైట్ స్తంభం క్రీ నీడలో ఉన్న ఒక ఆకారం గబుక్కున పారిజాత పైట లాగింది.
కెవ్వుమంది.
చలి విపరీతంగా ఉంది. ఆ సందులో వాళ్ళంతా తలుపులు, కిటికీలు బిగించుకొన్నారు. స్ట్రీట్ లైట్ వెలుగుతప్ప ఇళ్ళలోని వెలుగు బయటికి రావడంలేదు.
పారిజాత అరుపు ఎవరిళ్ళలోనూ దూరినట్టు లేదు! ఆ సందులో జనసంచారం కూడా లేదు. ఆ పిల్లకు భయంతో నోరు పిడచకట్టుకుపోయింది. ఇక అరవాలన్నా నోరు పెగలలేదు.
కాని అతడి చేతులమధ్య పెనుగులాడసాగింది.
సమీపంలో స్కూటర్ శబ్దం వినిపించింది.
అతడు ఆమెను వదిలేసి పారిపోయాడు.
పారిజాత దోసిట్లో ముఖం దాచుకొని ఏడవసాగింది.
స్కూటర్ వ్యక్తి తన వాహనం దిగి పారిజాతను సమీపించాడు.
"మనూ? నువ్వా?"
"ఎవరు? పారూ! ఏడుస్తున్నావా? ఇప్పుడు పరిగెత్తిన వాడెవడు?"
"ఎవరో తెలియదు."
"ఇంత రాత్రి బయటికి రావలసిన అవసరం ఏం కలిగింది నీకు?" అతడి గొంతులో ఇదివరకటి ఆశ్చరంయ మాయమై తీవ్రత చోటు చేసుకొంది."
"నాన్నకి సీరియస్ గా ఉంది. డాక్టరుని పిలుచుకు వద్దామని వచ్చాను, డాక్టరుగారు లేరు క్లబ్బుకు వెళ్ళారట".
