ఉత్కృష్టమైనదో కాదో గాని అసలు ఈ జన్మించడమన్నది లేకపోతే పోయేదేమిటి?"
"ఓహ్! సర్వం మిధ్యంటూ మిధ్యామంత్రం పఠించే వాడివికదూ? అపర ఆది శంకరులు!" నవ్వింది. "వివేకానందుడు జ్ఞానయోగంలోనేమో అమరసుఖాలలో తేలియాడే అమరులు కూడా ముక్తినొందాలంటే మానవజన్మవల్లే అది సాధ్యమౌతుందని చెప్పాడు. అంత ఉత్కృష్టమైన మానవజన్మే లేకపోతే ఏమిటంటే ఏం చెప్పేది?" అన్నది. విచారం అభినయిస్తూ తిరిగి అన్నది.
"మెట్ట వేదాంతులతో మాట్లాడడమూ కష్టమే!"
"ఫిలాసఫీలో పి.హెచ్. డి. తీసుకొన్నాననే? మెట్ట వేదాంతి నయ్యానా, నీకు?" చమత్కారంగా నవ్వాడతడు. "మాట్లాడు వద్దంటానా?"
'ఏం మాట్లాడేది? మనసూ మమతాలేని మనిషితో?' పావురం రెక్కలు నిమిరి పైకి ఎగురవేస్తూ నిర్లక్ష్యంగా అన్నది దేవదాసి.
"ఉఁ. నీ అభియోగం నాకు తెలుసు. నీ అత్తామామల మీద కొడుకునై ఉండీ శ్రద్ధాభిమానాలు చూపడం లేదనేకదా?" మంద స్వరాన అన్నాడు. భార్గవరామ్ "ఒక సంగతి చెబుతాను వింటావా, దేవతా? ఈ పావురాలు నాన్న పెంచాడు, వీటియందు ఆయనకు ఎంత మక్కువో చెప్పలేం. ఈకారణంగా ఆయన ఎన్నోసార్లు దుఃఖాన్ని పొందవలసివచ్చింది. ఆయన చేతులతో ఎగురవేసే పావురాలు తిరిగి ఇల్లుచేరేవి కాదు, కొన్నిసార్లు ఎవరో వలపన్ని పట్టుకొనేవారు. నాన్న పట్టుదలగా వాటి జాడ తీసేవారు. అదివరకే ఆయన ప్రాణప్రదంగా పెంచుకొన్న పావురాలు వాళ్ళ కడుపుల్లో జీర్ణమయ్యాయని తెలిసేది. ఇహ చేసేదేమీ ఉండదుగాని నాన్న మూడు రోజులు అన్నం నీళ్ళు సహించక బాధపడేవారు. ఆ దుఃఖం ఎందువల్ల ప్రాప్తించిందంటావు?
"ఆ పావురాలు సాకమన్నదెవరూ? మమత పెంచుకోమన్నదెవరూ? దుఃఖపడమన్నదెవరూ? అంటావా? దుఃఖాన్ని హేయంగా చూచేకన్నా సుఖ దుఃఖాలను సమభావంతో చూడడమే మనిషికి ఒన్నత్యమనిపించుకొంటుందేమో? నిశివుంటేనే ప్రభవిలువ తెలుస్తుంది. ఒకప్పుడు లేమి అనుభమౌతేనే కలిమి విలువ తెలుస్తుంది. దౌష్ట్యం ఉంటేనే సత్యం విలువ తెలిసేది. దుఃఖం నుండి పారిపోయి ముముక్షువులు కానక్కర్లేదు.
"దుఃఖాన్ని ఆహ్వానిస్తూనే మోక్షగామి కావచ్చు. మామయ్య పెంచుకొన్న మమతలో దుఋఖం ఎంత ఉన్నదో అంత ఆనందం కూడా ఉంది. మనిషికి సుఖదుఃఖాలు సమంగా అనుభవమైతేనే జీవితం పరిపూర్ణత పొందేది. అన్ని యోగాలలో కర్మయోగం ఉత్తమమైనదిగా గీతాచార్యుడు చెప్పాడంటే ఇందుకే. అన్ని వాసనలకు దూరమైన సన్యాసికంటే అన్ని వాసనలు మనసునుండి దూరంచేసుకొని సంసారంలో తామరాకుపై నీటిబొట్టు చందంగా నిలువగల సంసారినే ఉత్తముడుగా పేర్కొన్నాడు.
మమతా వ్యామోహాలకు, కరుణ ప్రేమలకు అతీతమైన నిగ్రహంగల పురుషుడినని గర్వించడం కాదు సుఖ దుఃఖాలు సమ్మిళితమైన కర్మను ఆచరిస్తూన్న మామయ్యే నీకంటే ఉత్తమ పథగామి.
గున్నమావి కొమ్మమీద ఆగిన పావురాయిని పట్టుకొనడానికి పరుగెత్తింది దేవదాసి ప్రతివాదమేమీ చేయకుండా. వ్యక్తిత్వమన్నది లేని మూగబొమ్మలా స్తబ్ధంగా కూర్చుండిపోయాడు భార్గవరామ్. ఆ ముగ్ధయువతివంకే చూస్తూ ఇదివరకు బాహ్యసౌందర్యాన్ని చూచే అద్భుతమనుకొంటే, అపూర్వమైన ఆధ్యాత్మిక సంపద ఆ సౌందర్యానికి అంచులుగా మెరవడం చూచి ఆశ్చర్య విభ్రమాలకు అతడు లోనయ్యాడు.
ఇటువంటి తర్కవితర్కాలేవీ జరుగకుండానే తనకు కొన్ని పటిష్టమైన సిద్ధాంతాలు ఏర్పడలేదు. ఆమె అంత సునిశితంగా విమర్శిస్తూంటే ఎదురు చెప్పలేక అల్పుడివలె ఉండిపోయాడంటే తన శక్తియుక్తులను హరించే శక్తి ఏదో ఆమెలో ఉంది! ఆ స్త్రీ అయస్కాంత శక్తి అయితే తన పురుషత్వం ఒక ఇనుపముద్దవలె వ్యక్తిత్వం నిలుపుకోలేని బలహీనతకు లోబటి అటు ఆకర్షితమౌతున్నదేమో?
పావురాన్ని పట్టుకొని వచ్చింది దేవదాసి. ఇందాకా దానికోసం పరుగెత్తినందువల్ల కొద్దిగా అలుపువచ్చి ఉచ్ఛాస నిశ్వాసాలు వేగంగా వదులుతున్నది.
కొంచెం స్థిమితం చిక్కాక తిరిగి ప్రారంభించింది దేవదాసి. "ఒక అర్ధరాత్రి సమయంలో సిద్ధార్థుడు పురిటి మంచంలోని ఇల్లాలినీ. అప్పుడే కళ్ళు విచ్చిన తనయుడినీ, తనను అపురూపంగా ప్రేమించిన తండ్రినీ పరిత్యజించి. సమస్త సుఖభోగాలను తృణీకరించి ఇల్లువిడిచి బయల్దేరాడంటే, మానవాళికంతటికి దుఃఖాన్ని జయించే మార్గం కనుగొనాలన్న తపనవల్ల జరిగింది. యశోధరను విషాదంలో పడద్రోసినా, తండ్రికి పుత్రశోకం కలిగించినా, తన బిడ్డను తండ్రి లేనివాడిని చేసినా ఆయన చేసిన తపోసాధనతో బుద్ధుడై, లోకానికంతటికీ వెలుగు రేఖయై మానవాళిని సత్యపథంవైపు నడిపించాడు. ఆయన ఆత్మీయులకు కల్పించిన శోకం ఒక లెక్కలోకి రాదు.
