Previous Page Next Page 
కావేరి పేజి 17

   
    ఎడ్లబండి లేని వాళ్ళకి వెంకయ్య బందే శరణ్యం! అలా ఆ ఇద్దరికీ తెల్లవారగట్ల నుంచీ ఊరి వాళ్ళతో సంబంధాలు ఎక్కువగా వుంటాయి. వాళ్ళ నోళ్ళకి హద్దూ పద్దూ వుండదు. కావేరిని గురించి వాళ్ళు చేసిన వ్యాఖ్యానం తలుచుకుంటూంటేనే వళ్ళు మండిపోతోంది కామాక్షమ్మకి.

    అందరి ఆడపిల్లల కంటే కూడా అందమయినది. తెలివయినది. కంటకి నదురుగా కనిపించేసరికి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. రెండు వారాల క్రితమే శంకరం నుంచి ఉత్తరం వచ్చింది. "తను వీలు చూసుకుని వస్తానని, ఫైనల్సు దగ్గిర పడటం వలన చదువుకోవలసినది ఎక్కువగా వుందని!"

    ఇప్పుడు మరలా ఉత్తరం రాస్తే విసుక్కుంటాడు.

    ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. సోములుతో ఆలోచించింది.

    "పెద్దవాళ్ళకి అవకుండానే చిన్నవాళ్ళకి పెళ్ళి చేయటం అనేది తప్పు కాదండీ!....ఆయనేమో బస్తీలో వుంటున్నారు ఈ బాబు ఇక్కడ వుంటున్నాడు....ఊరిలోనే అమ్మాయిగారు వుంటున్నారు. చినబాబు గారిని చూస్తే కళ్ళు కుడుతున్నాయి అందరికీను....ఎవరినయినా సిద్దాంతిగారిని పిలిపించి అడగండి!

    "పెద్దవాడికి వివాహం చేయకుండా చిన్నవాడికి వివాహం చేయవచ్చునా? అని...ఆ సిద్దాంతిగారు ఏం చెప్పితే అది చేయండి!"

    సోములు యిచ్చిన సలహా ఎంతో నచ్చింది కామాక్షమ్మకి!

    రామాలయం పూజారిని రమ్మనమని చెప్పమంది సోములునే!

    అటు వెళ్ళినప్పుడు తను రమ్మనమని చెప్పమంది పూజారికి

    సోములు వచ్చి చెప్పగానే గబగబా పై కండువా వేసుకుని కామాక్షమ్మ గారింటికి వచ్చాడు.

    "రండి! రండి పూజారిగారూ! కూర్చోండి!..." అని చాప వేసింది హాలులో అదే యింకెవారయినా అయితే లోపలికి రానివ్వదు. వరండా అరుగుమీదనే చాపవేసి కూర్చోబెడుతుంది. పూజారి కావటం వలన లోపలికి తీసుకువచ్చి సగౌరవంగా కూర్చోపెట్టింది.

    "తీర్ధం తీసుకుంటారా పూజారిగారూ?"

    "వద్దమ్మా! నేను వద్దన్నానని మీరుమరోలా భావించకండి!

    "మీకోసం కబురుచేసింది ఓ అతి ముఖ్యమయిన విషయం మాట్లాడాలని! తమరి సలహా తీసుకోవాలని! మీరు ఏది చెప్పితే ఆ విధంగా చేయాలని!...." వినయంగా చెప్పింది.

    "అలాగేనమ్మా! మీ సమస్య నా సమస్యగా భావించి నాకున్న స్వల్ప పరిజ్ఞానాన్ని ఉపయోగించి చక్కదిద్దగలనని భావించుచున్నాను!"

    గుమం అవతలగా నిలబడివున్న సోములుకి అర్ధం అయింది ముందే! యజమానురాలు ఏం చెప్పుతుందోనన్న ఆరాటం కలుగలేదు!

    "పెద్దకొడుక్కి వివాహం చేయకుండా చిన్నకొడుక్కి వివాహం చేయటం శాస్త్రరీత్యా ఏదయినా అశుభం జరుగుతుందా పూజారిగారూ?" అనడిగింది.

    ఆలోచించి ఆలోచించి అన్నాడు- "అలాంటి దోషం ఏమీలేదు గాని, ఈ కారణంచేత పెద్దకొడుక్కి వివాహం కాలేదన్న ఆలోచన కలుగుతుంది ఇతరులకి! శాస్త్రరీత్యా స్వల్పదోషం వున్నా అవి అంతగా పరిగణలోకి తీసుకోవలసిన విషయాలు కాదు! అవసరార్ధం అబద్దం ఆడవచ్చునన్నాడు మహర్షి! అవసరార్ధం గాడిద కాళ్ళు బట్టుకోవటంలో తప్పులేదన్నవి మన పురాణాలు! పెద్దకొడుకు వివాహానికి అర్హుడయినా కాకపోయినా కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు. శుభస్య శీఘ్రం!....కానివ్వడమ్మా! యిలా చేయటంలో దోషం వుండదు."

    "అయితే లగ్నాలు ఎప్పటికి వున్నాయి పూజారిగారూ!"

    "ధనుర్మాసం వెళ్ళిన తరువాత పుష్యమాసం! మాఘమాసం! ఈ రెండు మాసాలలో మీ వీలునిబట్టి లగ్నం పెట్టించవచ్చును."

    "చాలా సంతోషకరమయిన మాట చెప్పారు పూజారిగారూ! మా పెద్దబాబు పట్నంలో చదువుతున్నాడు. వెంటనే రమ్మనమని ఉత్తరం వ్రాస్తాను. తన సలహా కూడా తీసుకున్న తరువాత ఓ మంచిరోజు చూసి ముహూర్తం మీ చేతులమీదుగానే జరిపించితే యింకాసంతోషించుతాను." వినయంగా అంది కామాక్షమ్మ.

    "అమ్మా! నేను మీ సేవకుడిని! మీ ఉప్పూ పులుసూ తింటున్న వాడిని! మీ ఆదరాభిమానాలే ఊపిరిగా బ్రతుకుతున్నవాడిని! ఎన్నో పెళ్ళిళ్ళు ఈ చేతులమీదుగా జరిపించినవాడిని! మీ చినబాబు పెళ్ళి నిర్విఘ్నంగా జరిపించుతాను. శాస్త్రోక్తంగా సమస్త దేవతాధి దేవుళ్ళు ఆశీస్సులు నూతన వదూవరులకి అందగలిగే చందాన చేయించటం నా ధర్మంగా, నా కర్తవ్యంగా భావించుచున్నాను. మీరు కాకితో కబురు చేస్తే వచ్చి మీ ముంగిట వాలుతాను. అమ్మా! నాకింకా సెలవు ఇప్పించుతారా?..." అంటూ లేచాడు.

    పూజారికి నమస్కరించింది కామాక్షమ్మ.

    "సోములూ! పూజారిగారిని రామాలయం వరకూ సాగనంపిరా!"

    యజమానురాలి ఆజ్ఞమేరకు చేతికర్ర తీసుకుని వెనుకవైపు నుంచి వీధిలోకి వచ్చి పూజారిముందు నడుస్తుంటే వెనుకగా నడవసాగాడు. అలా ఆ యిద్దరూ నడవటం చూసిన గ్రామస్థులు ఏదో విశేషం వుందని అర్ధం చేసుకున్నారు. తిరిగివస్తున్న సోములుని నిలేసి విశేషం ఏమిటని అడిగారు. యిలాంటి వాటిల్లో గ్రామస్తులకి ఆసక్తి ఎక్కువ! ఎవరింటిలో ఏం జరుగుతుందోనన్న కుతూహలం.

    "చినబాబుగారికి కావేరమ్మగారికీ వివాహం చేయాలని మా అమ్మ గారు అనుకున్నారు. పెద్దవాళ్ళకి కాకుండా చిన్నవాళ్ళకి పెళ్ళి చేయవచ్చునో? లేదో తెలుసుకోవాలంటే వచ్చారు."

    "ఏమన్నాడు?"

    "చేయవచ్చునట!"

    "అదెలా? అరిష్టం అని అంటారుగా?" తల పండిన ఓ వృద్దుడు వెంటనే అందుకున్నాడు.

    'అదేమీ వుండదని పూజారిగారు సెలవిచ్చారు. పెదబాబుగారిని రప్పించి మాట్లాడిన తరువాతచేత్తారట!..."

    తను చెప్పటం అయిపోయిందన్నట్లుగా యింక అక్కడ వుండకుండా వెళ్ళిపోయాడు సోములు!

    ఈ వార్త అప్పటికే అక్కడ కూర్చున్న వారందరికీ చర్చనీయాంశమయింది. ఏ చిన్న విషయమయినా గ్రామస్థుల నోటిలో నలిగి నలిగి చివరివరకూ చర్చలతోనే ముగుస్తుందిగాని, యిలా అయితే ఫరవాలేదు! ఎవరి అవకాశాన్ని బట్టి వారు చేసుకుంటారని అనుకోరు! అంచెలంచెలుగా విస్తృత పర్చటమే వారి అభిమతం.

    వెంకయ్య సీతమ్మా వచ్చి అడిగిన సంగతి ఆ యింటిలోని వారికి నౌఖరయిన సోములుకి తప్ప యింకెవ్వరికీ తెలియదు.

    ఆ విషయం చర్చకు రాలేదు. వినాయకరావుకీ కావేరీకి వివాహం త్వరలో జరుగుతుందన్న వార్త ఆ రాత్రంతా అందరి నోటా నలిగి నలిగి చివరికి ఆ గ్రామమంతా తెల్లవారేసరికి తెలిసిపోయింది. కొందరు పనిలేని అమ్మలక్కలు బుగ్గలు నొక్కుకున్నారు! ఇదెక్కడి విడ్డూరం అన్నట్టుగా చెప్పుతున్నారు.

    "పెద్దకొడుక్కి చేయకుండా చిన్నకొడుక్కి ఏమిటి? ఆ ఇంటికి ఎంత అరిష్టం ?" అన్నారు వృద్దురాళ్ళయిన కొందరు.

    "ఇంటిగల పెద్దాయన పోయాడనేగాని, వాళ్ళకేమి లోటు వున్నది? పచ్చగా వున్న యింటికి అరిష్టం తెచ్చుకోబోతున్నది కామాక్షమ్మ!" అని మరికొందరు. తలా ఒక రకంగానూ వ్యాఖ్యానించుకోవటంతోనే సరిపోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS