ఉదయమే లేచి పొలం సెల్లుతున్న పరంధామయ్యని రచ్చబండ దగ్గిర కూర్చుని వేపపుల్లలతో పళ్ళు తోముకుంటున్నవాడల్లా ఆపి-
"ఏం పరంధామయ్యా! యింత ప్రొద్దున్నే పొలం బయలుదేరావు?" కావాలనే పలుకరించి ఆపేశారు ఆయనకంటే పెద్దవాడయిన ఆ ఊరి మునసబు.
"చేలో పనివున్నా లేకపోయినా చూసుకోనిదే తృప్తి వుండదు. నాలుగుగింజలు ఎక్కువరాలతాయన్న ఆపేక్ష!"
"అవునులే! కూతురుపెళ్ళి ఊరంతా పప్పన్నం పెట్టవద్దూ?"
"చూద్దాం! ఆ ఘడియ రావాలిగా?"
"నువ్వు ఆ ఘడియ రావాలనుకుంటూ కూర్చో! నీ చెల్లెలు కామాక్షమ్మ రాత్రే పూజారిగారిని పిలిపించి అడిగిందట!"
"పెద్దవాడు శంకరం పెళ్ళి గురించి అడిగి వుండవచ్చునేమో?"
"మేమూ అంతే అనుకున్నాం. కాని శంకరం తన చదువుపూర్తి కానిదే చేసుకోనన్నాడట! వినాయికానికయినా చేసేస్తే తనకి కొంత ఆసరాగా వుంటుందన్న ఆలోచన కలిగివుంటుంది. ఎంతయినా కామాక్షమ్మ దూరంగా ఆలోచించగల తెలివిగలది. ఎవరో చెప్పితే మేము ఎందుకు నముతాము? సోములే చెప్పాడు! ఎంత అదృష్టవంతుడివయ్యా! ఆడపిల్ల తండ్రివయి వుండి అల్లుడుకోసం నువ్వు వెతుక్కోవలసింది పోయి అల్లుడే నీ కూతురిని వెతుక్కుంటూ వస్తుంటేను!..." వరుస అయినా ఆయన సరసమాడాడు.
పరంధామయ్యకి "యిది నిజమా?" అన్నంత సంభ్రమాశ్చర్యం కలిగింది. శంకరానికి అవకుండా వినాయకానికి పెళ్ళి చేయాలనుకుంటున్న చెల్లెలి ఆంతర్యం ఏమిటో అర్ధం కాలేదు. ఒక్కసారయినా తనతో మాటమాత్రంగా చెప్పలేదు. రాత్రికిరాత్రే నిర్ణయించుకోవటంలో గల కారణం ఏమిటో అర్ధం కాలేదు. సోములుని అడిగితే అసలు విషయం తెలుస్తుంది. అన్న భావంతో గబగబా తన చెల్లెలి పొలంవైపుకి బయలుదేరాడు.
నీళ్ళు చేలోకి రాకుండా అడ్డకట్టవేస్తున్న సోములుని చూసి అటూ మరలాడు పరంధామయ్య.
"సోములూ!" దగ్గిరకు వెళ్ళి పిలిచాడు.
చేస్తున్న పని ఆపి గట్టుమీదకి పారని వుంచి నిటారుగా లేచి నిలబడి "ఏందయ్యగారూ! యిలావచ్చారు?" అనడిగాడు.
"నేనొక విషయం విన్నాను. అదేమిటో ముందు నీనుంచి తెలుసుకోవాలని యిలా వచ్చాను."
"ఏ విషయంబాబూ!..." అర్ధం కాలేదు సోములుకి.
"అదే! వినాయకరావుకి పెళ్ళి చేయాలని మా కామాక్షి పూజారిని రాత్రి పిలిపించిందటగా?"
"ఈ విషయం మీ దాకా వచ్చిందాబాబూ!...."
"ఇది పల్లెటూరు! నోటిలోని మాట పెదవిదాటి రావటం ఆలస్యం! పేటలే దాటిపోయేరోజులు! మనగ్రామం సంగతి తెలియనిదేమున్నది? నోటి దురద తీరేవరకూ చెప్పుకోవటం అలవాటేగా? అసలేంజరిగిందిరా!" గట్టుమీద చతికిలపడ్డాడు పరంధామయ్య.
"ఆ క్రితం రోజు రాత్రి బండి వెంకయ్యగారూ సీతంమగారూ వచ్చి వారమ్మాయి సుబ్బలక్ష్మిని వినాయక బాబుకి చేసుకోమని అడిగారు. దానికి అమ్మగారికి కోపం వచ్చింది. నా మేనకోడలు కావేరీ వుండగా మీ అమ్మాయిని ఎలా చేసుకుంటాం! అదీగాక మీ అంతస్తు ఎక్కడ? మా అంతస్థు ఎక్కడ? అని కేకలు వేశారు. వాళ్ళకి కోపం వచ్చి ఏమేమిటో అనుకుంటూ వెళ్ళారు అలా ఒక్క వెంకయ్యగారే కాదు! ఆడపిల్లలు గల ప్రతీ తండ్రీ వచ్చి అడుగుతుంటే కోపం వస్తోంది. శంకరం బాబుగారు తన చదువయితేనే గాని చేసుకోనంటున్నారు. వీళ్ళ పోరు పడలేక పెద్దవాళ్ళకి చేయకుండా చిన్న వాళ్ళకి చేయటంలో ఏమన్నా దోషం వున్నదేమోనని పూజారిగారిని పిలవనంపారు."
"ఆయన ఏమని చెప్పారు?" ఆత్రత ధ్వనించింది.
"చేయవచ్చును! అదేమీ దోషం కాదని చెప్పారు!"
పరంధామయ్య మనసు ఆరాటం నుంచి తేరుకున్నది. తానయి ఎప్పుడూ చెల్లెలి దగ్గర తన కూతురు పెళ్ళి విషయం అడగగలిగే సాహసం లేకపోయింది. కారణం! ఆర్ధిక పరమయిన చిక్కులు! పెద్ద కూతురు పార్వతి వివాహానికని తీసుకున్న డబ్బులు ఇంకా కొంత బాకీ వున్నాడు. పంటలు సరీగ్గా పండక పోవటం, అడపా తడపా అల్లుడు "నాలుగు వందలు, అయిదు వందలూ కావాలని" ఉత్తరం వ్రాయటం! అల్లుడికి ఎక్కడ కోపం వస్తుందోనన్న భయంతో పంపటంతో చెల్లెలి బాకీ తీర్చలేకపోయాడు. అందుకు కామాక్షమ్మ కూడా ఏమీ అనుకోలేదు...అడగను కూడా అడగలేదు! తన కూతురిని చేసుకోమని అడగలేక పోయాడు. తను ఎక్కువ కట్నం యివ్వలేడని తెలుసు! తన మీద సానుభూతి వుంటే తన చెల్లెలే అడుగుతుందని తను ఊరుకున్నాడు. అందుకనే వినాయకం కావేరీ ఎంతో చనువుగా వుండటంలో ఆటంకం పెట్టలేదు. వారిద్దరి మధ్యా హద్దులు ఏర్పరచలేదు. ఇలాగాయినా దగ్గిర అయితే కామాక్షి కాదనదన్న ఆశ వుండేది. తాను అడిగి కాదనపించుకోకుండా సమస్య ఇంత తేలికగా పరిష్కారం అయినందుకు మనసులోనే ఎంతో సంతోషించాడు.
"మీరొకసారి అమ్మగారికి కనిపించక పోయారా?"
"ఆఁ-ఆఁ...నా చెల్లెలి ఇంటికి నేను వెళ్ళటానికి నాకేమిటిరా సోములూ? అసలు విషయం ఏమిటో నిన్ను అడిగితే తెలుస్తుందని ఇలా వచ్చాను. నా కూతురు కంటే ఆ వెంకయ్య కూతురిని నా చెల్లెలు తన కోడలిగా చేసుకుంటుందనే వచ్చాడా ఆ బద్మాష్ గాడు? ఎంత ధైర్యం? కిరాయికిబండి తోలుకుని బ్రతికే ఆ వెంకయ్యకి అలా వచ్చి అడిగే ధైర్యం ఎక్కడనుంచి వచ్చింది?"
అని ఇంకా అక్కడ వుండకుండాను, తన చేలోకి వెళ్ళకుండానూ తిరుగు ముఖం పట్టాడు పరంధామయ్య ...ఆ వెళ్ళటం వెళ్ళటం సరాసరి చెల్లెలి ఇంటికి వెళ్ళాడు.
పెరటి దొడ్లో కూర్చుని గోడ్లచావిడి అంతా ఊడిపించుతున్న కామాక్షమ్మ అన్నగారిని చూడగానే ముఖం వికసించింది.
"రా అన్నయ్యా!...రా...!" అంది అరుగుమీద ఓ పక్కకి జరిగి చోటు చూపించుతూ.
పరంధామయ్య నవ్వుతూ వచ్చి కూర్చున్నాడు ఆ అరుగుమీద, చెల్లెలి పక్కనాను.
"ముఖం కడుక్కున్నావా అన్నయ్యా!"
"ఆఁ కడుక్కునే బయలు దేరాను."
"వుండు ఇప్పుడే వస్తాను."
అని లోపలికి వెళ్ళి గ్లాసు నిండా పాలు నింపుకుని పంచదార వేసి స్పూనుతో తిపుతూ అక్కడికి వచ్చి అన్నగారి ముందు పెట్టింది.
"ఇప్పుడు ఎందుకమ్మా! ప్రొద్దున్నే ఇంటివద్ద త్రాగి అలాపొలం వెళ్ళి వస్తూ వస్తూ నిన్ను చూసి పోదామని వచ్చాను అన్నట్టు వినాయకం లేడా?"
"అలా వీధిలోకి వెళ్ళాడు. అటునుంచే పొలం వెళతాడేమో?"
"నేను అక్కడ నుంచేగా వచ్చిందమ్మా!"
"నువ్వేదారిన వచ్చావో? వినాయకం ఏ దారిన వెళ్ళాడో? ఈ విషయం విన్నావా అన్నయ్యా!"
"ఏమిటమ్మా!...."చెల్లెలు చెప్పబోయేది ఏమిటో కొంతవరకూ అర్ధం అయింది పరంధామయ్యకి.
"బండి వెంకయ్య లేడూ?...ఆయన మిడిసిపాటు ఏమిటో గాని ఈ మధ్య పగలూ రాత్రిళ్ళు కూడా కిరాయితొలి సంపాదించినట్లున్నాడు. తన కూతురు సుబ్బలక్ష్మిని నా కోడలిగా చేసుకోమని అడిగేటందుకు పెళ్ళాన్ని వెంటవేసుకుని వచ్చాడు."
"నువ్వేమన్నావమ్మా!"
"నేను ఏమంటానో నీకు తెలియదా అన్నయ్యా? ప్రత్యేకించి అడుగుతున్నావు? ఈమధ్య పాలెంనుంచి కూడా మునసబుగారమ్మాయిని యిస్తామని కబురు చేశారు. ఆరు ఎకరాలు మాగాణి కట్నంగా యిస్తామన్నారు. ఈ ఆరు ఎకరాలు మనకీ లేకనా? కొరివిపాడు నుంచి షావుకారు తిమ్మయ్య కూడా కబురు చేశాడు. పొలం కావాలంటే ఎనిమిది ఎకరాలు యిస్తాడట! డబ్బుగా కారాలంటే యాభై వేలు కట్నం యిస్తాడట! మన వినాయకానినే చేసుకోవాలట! ఇవన్నీ వింటుంటే నాకు చిరాకుగా వుటుంది....యింత కాలం వరకూ శంకరం చదువు అవ్వాలి! పెళ్ళి అవ్వాలి. ఆ తరువాత వినాయకానికి పెళ్ళి చేయవచ్చుననుకున్నాను. అంతవరకూ నన్ను ఓర్పుగా వుండనిచ్చేటట్టులేరు. ఈ ఆడ పిల్లల తండ్రులు! వినాయకమయినా ఏమనుకుంటాడు? సంబంధాలు వస్తుంటే పెళ్ళి చేసుకోవాలన్న కోరిక ప్రారంభమవుతుందా? అందులో ఈడు వచ్చినవాడయ్యే! అందువలన నేనొక నిర్ణయానికి వచ్చాను."
"ఏమిటమ్మా ఆ నిర్ణయం?"
'అదే!....వినాయకానికి కావేరీకి ఈ పుష్య మాసంలో పెళ్ళి జరిపించాలని! పెద్దవాడికి చేయకుండా చిన్నవాడికి చేయటంలో తప్పు లేదని కళ్యాణ ఘడియ వ్రాసి వున్నందున అలా అవ్వాలని వుండటం వలన యిలా జరుగుతోంది! కానివ్వమని చెప్పారు! శంకరానికి ఈ పూట ఉత్తరం వ్రాయించుతాను."
"ఎటూ కాని టైంలో పెళ్ళి అంటే?..." సందేహంతో ఆగిపోయాడు.
