Previous Page Next Page 
కావేరి పేజి 16

       
    "రండి అన్నయ్యా! రా వదినా!...ఏమిటి ఇలా ఇద్దరూ కలిసి వచ్చారు?...ఇలా కూర్చోండి...!" అని వరండా అరుగు మీదనే చాప పరిచింది నవ్వుతూ.

    కామాక్షమ్మ నవ్వుతూ ఆహ్వానించే సరికి ఆ భార్యా భర్తలు ఒకరి వైపు ఒకరు విజయగర్వంతో చూసుకున్నారు. ఆ చూపుల్లో.

    "నా ప్రతాపం అంటే? నా ప్రతాపం." అని కనిపించాయి. ఒకరికొకరికి. తమ సుబ్బులు ఎంతో అదృష్టవంతురాలు అన్న భావం కలిగింది.

    "చినబాబు లేడా అక్కా!" అనడిగాడు వెంకయ్య అరుగుమీద కూర్చుని అటూయిటూ కలియజూస్తూ.

    "బజారులోకి వెళ్ళాడనుకుంటాను. కుర్రవాళ్ళు కదూ? ఈ వేళప్పుడేగా అందరు గుడి అరుగుల మీదకి చేరేది."

    "అవనవును!...పెళ్ళి చేసేస్తే బైటకే వెళ్ళకుండా వుంటాడక్కా!" తానేదో సమయానుకూలంగా అన్నందుకు మురిసిపోతు న్నాడు.

    "ఎవరితోను?" భావగర్భితంగా అడిగింది కామాక్షమ్మ.

    "అదేమిటి వదినా! అలా అడుగుతావు? వినాయకరావు నీకేమీ చెప్పలేదా?" అనడిగింది సీతమ్మ.

    "ఏ విషయం గురించి..."

    "మా సుబ్బులుని చేసుకోమంటే మా అమ్మని అడగమన్నాడు. తనకి మా సుబ్బులు మీద మనసు వుండబట్టే కదా! అలా అన్నాడు. నీతో చెప్పలేకపోయుండ వచ్చును"

    వినాయకరావు గుండెల మీద చేతులుంచుకున్నాడు. తన కావేరి వుండగా సుబ్బులును ఎలా కోరుకుంటాడు. తన కావేరి బంగారు సుద్ద...అప్సరస...నల్లగా తుమ్మ మొద్దులా వుండే ఆ సుబ్బులు తన కావేరి ముందు దిష్టిబొమ్మలాగా వుటుంది. అనుకున్నాడు. వెంకయ్య మాటలు వినిపించటంతో చెవిని అటూ వేశాడు.

    "మాకున్నంతలో కట్నకానుకలకి ఎలాంటి లోటూ రానివ్వను. నాకున్న నలుసు అదొక్కటి? నీలాంటి మంచి మనసున్న దాని చేతి క్రింద వేస్తే మాకు నిశ్చింత! మా కళ్ళ ముందే వుంటుందన్న ఆశ. నేను కష్టపడి సంపాదించింది కూడా నా బిడ్డ కోసమే అక్కా!..."

    "వెంకయ్యన్న! తారతమ్యాలు గుర్తించే మాట్లాడుతున్నావా? కిరాయికి ఎడ్ల బండి తోలుకుని బ్రతుకుతున్న నువ్వు ఈ కామాక్షమ్మతో అందునా ఈ ఊరికి పెద్ద రైతు నయిన నాతో వియ్యమందాలనుకోవటం ఆకాశానికి నిచ్చెన వేసినట్లే అవుతుంది. నా అన్న కూతురు కావేరి వుంది. అది ఆడపిల్లగా పుట్టిన మరుక్షణం నుంచే మా వినాయకరావుకి భార్య అయిపోయింది...నా మేనకోడలిని కాదనుకుని నీ కూతురిని చేసుకోవలసిన అగత్యం మాకు లేదు!..."

    "అది కాదక్కా!...చినబాబుకి...యిష్ట..."

    వెంకయ్యని మాట పూర్తి చేయనివ్వలేదు కామాక్షమ్మ.

    "చాలు చాల్లేవయ్యా....నువ్వు వాడిని అడిగినప్పుడే నీ తెలివి తక్కువ బైట పడింది....నా పెద్దరికం కోసం...సరయిన జవాబు నా చేతనే ఇప్పించాలని మా అమ్మని అడగమని చెప్పి వుంటాడు. దానికి ఉప్పొంగి పోతూ మీరిలా బయలుదేరి రావటం ఏం బాగోలేదు. నా మేనకోడలు వుంది. నన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకోగలదు.

    "మీరింక వెళ్ళవచ్చును!" సాధ్యమయినంత వరకు కోపాన్ని అదుపులో వుంచుకోగలిగే అంది.

    "నేను పెళ్ళి చేసుకోను. సినిమాల్లో చేరి వేషాలు వేస్తానన్నదట. నీ మేనకోడలు అందువలన ఆ కావేరి ఎలాగూ మీ వినాయకరావుని చేసుకోదు కదా అని మా సుబ్బులుని యివ్వాలని వచ్చాం. లేకపోతే మాకేమీ పనిలేక వచ్చామనుకుంటున్నావా?"

    అంత వరకూ బహువచనంతో మాట్లాడిన సీతమ్మ ఆ తిరస్కారం భరించలేక అమర్యాదగా మాట్లాడసాగింది.

    "పిల్లలు ఏదో తమ సంతృప్తి కోసం అలాగే మాట్లాడుకుంటారు. అవే నిజమని నమ్మటం, మీరు వచ్చి అడగటం ఏమిటి? మాకు యింతోటి సంబంధం రాదనా? ఇదిగో మీ బండి కిరాయి."

    రొంటిన దోపి వుంచుకున్న రెండుపదుల కాగితాలుతీసి వెంకయ్య ముందుకి విసిరి వేసి తను లోపలికి వెళ్ళిపోయింది కామాక్షమ్మ.

    "మా సుబ్బులుకి మాత్రం యింతకంటే మంచి సంబంధమే తెచ్చుకోగలము. కాని మీ అబ్బాయిని ఆ కావేరి చస్తే చేసుకోదు. దాని సోకులు దాని వయ్యారాలు! ఓలమ్మో!....నా నోటితో నేను అనటం దేనికిలే....నీకే తెలుస్తుందిలే కామాక్షమ్మా!" అంటూ సీతమ్మ భర్తను వచ్చేయమని విసవిసా వీధిలోకి వెళ్ళిపోయింది వెనుకగా తలవంచుకుని వెళ్ళాడు వెంకయ్య.

    సీతమ్మ అన్న మాటలకి జవాబు చెప్పాలనుకుని గబగబా బైటికి వచ్చిన తల్లిని వారించాడు వచ్చి.

    "వాళ్ళేదో అసూయ పట్టలేక అన్నమాటలను పట్టుకుంటావేమిటమ్మా! కావేరికి సినిమాలంటేను, సినిమా పుస్తకాలంటేనే యిష్టం....శుభ్రంగానూ వుంటుంది. అది కడుపు మంట సుబ్బులుకి! తనే చెప్పి వుంటుంది కావేరిమీద ....నన్ను అడగమని కూడా తనే చెప్పి పంపి వుంటుంది..."

    "ఈ మొహాలూ నాతో వియ్యమందాలనేవచ్చారు? ఎన్నిగుండెలు?" పళ్ళు పటపటలాడించింది కామాక్షమ్మ.

    ఆ ఉదయం తను కిరాయికిబండి కట్టమని చెప్పేటందుకు వెళ్ళితే సుబ్బులు ప్రదర్శించిన హావభావాలు గుర్తుకు వచ్చాయి వినాయకరావుకి?

    అందరూ ప్లాన్ వేసుకునే చివరికి ఈ నిర్ణయానికి వచ్చినట్లున్నారనుకున్నాడు. తన కావేరిని అంతంత మాటలు అన్నందుకు ఎంతో కోపం వచ్చింది. కాని తమాయించుకుని తల్లిని వారించాడు.

                                                                                 7

    వెంకయ్య దంపతులు వచ్చి అడిగి వెళ్ళిన తరువాత కామాక్షమ్మ ఆలోచనలో పడింది...ఈ వ్రత వూరంతా పొక్కకముందే తను జాగ్రత్తపడాలి....పడాలీ అంటే ఈ లగ్నాలలోనే వినాయకరావు కావేరిల వివాహం జరిపించాలి!...

    జరిపించాలీ అంటే పెద్దవాడు  శంకరం వుండగా చిన్నవాడికి పెళ్ళి ఎలా చేయటం? వాడు చదువూ చదువూ అని పట్టుకుని వేలాడుతున్నాడు. ఆ చదువు ఎప్పటికి పూర్తి అవుతుంది? ఉద్యోగం ఎప్పటికి వస్తుంది? వాడికి పెళ్ళి అయ్యేది ఎప్పుడు? అవన్నీ అయిన తరువాతనే వినాయకం పెళ్ళి అంటే ఎలా? యిప్పటికే ఈడు వచ్చేసింది....వాడికోసం ఆడపిల్లలు గల తల్లిదండ్రులు ఎంత ఆశ పడుతున్నారో? కొంతమంది ప్రత్యక్షంగా అడుగుతున్నారు....పరోక్షంగా అడిగించుతున్నారు. ముఖ్యంగా తన పెద్ద నౌకరు సోములుతో ఎంతమంది కబురు చేయటం లేదు. అయిదెకరాల మాగాణి భూమి యిస్తామని!...ఇంతమంది ఇన్ని రకాలుగా వత్తిడి చేస్తున్నా తాను లొంగలేదు....

    అందులో వెంకయ్య దంపతులు ప్రత్యక్షంగా రంగప్రవేశం చేశారు కాబట్టి తను అందుకు అంగీకరించలేకపోవటం అటుంచి-ఎన్నెన్ని రకాలుగా తన కొడుకుని గురించి తనను గురించీ కావేరిని గురించీ ప్రచారం చేస్తారో? అందునా ఆ సీతమ్మ ఎవరింట ఏ పని వున్నా డబ్బుకే చేస్తుంది గాని ఊరికే చేయదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS