Previous Page Next Page 
చీకట్లో నల్లపులి పేజి 16

    "ఎందుకై ఉంటుంది?"

    కమిషనర్ కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు తర్వాత వంచిన తల ఎత్తి రాజారామ్ ని చూశాడు.

    "చూడండి రాజారామ్ గారూ మీరు జర్నలిస్టు. అవునా?"

    తలూపాడు రాజారామ్.

    "ఇప్పుడు నేను చెప్పబోయేదంతా "ఆఫ్ ద రికార్డ్"! అలా అయితేనే చెప్తాను."

    "ఓకే-చెప్పండి"

    "మీకు తెలుసుకునే హక్కు ఉంది కనుక చెప్తున్నాను. ఇదంతా మీ మనస్సులోనే ఉంచుకోండి మేము చాలా కాలంగా 'శ్రీ కృష్ణా మాసేజ్ పార్లర్నీ' ఓ కంట కనిపెడ్తున్నాం. మాసేజ్ పార్లర్ ముసుగులో పెద్ద ఎత్తున గంజాయి రవాణా, కాల్ గర్ల్ రాకెట్ సాగుతున్నాయక్కడ. మీరు చెప్పినా మిస్సింగ్ గర్ల్ సుందరి ఈ మాసేజ్ పార్లర్ లో పనిచేసేది. గంజాయి రవాణాలో ఆ అమ్మాయి చాలా పెద్ద పాత్రే అయివుంటుంది. హోల్ సేలర్ దగ్గరకొనితేవడం. రిటెయిలర్లకి అందజేయ్యడం ఆ అమ్మాయి డ్యూటీ అయి వుంటాయి ఈ ప్రయత్నంలోనే ఆ అమ్మాయి ఏదో వూరు వెళ్ళి వచ్చినట్టుంది. కూడా 'అతను' కూడా వున్నాడు. 'అతనే' రింగ్ లీడర్ అని మా అనుమానం. సుమిత్ర కాకతాళీయంగా ఈ గొడవలోకి వచ్చి పడింది. రహస్యం బయట పడింది. ఆమె నోరుముయ్యాలంటే చంపక తప్పదు. అదే చేశాడు అతను"

    "ఎంతయినా చూస్తూ కజిన్ సిస్టర్ని__"

    "మీకు తెలీదు సార్ వీళ్ళ సంగతి అడ్డం వస్తే కన్నా కొడుకు నైనా సఫా చేసి పారేస్తారు. మాఫియాగాంగ్ కి దీనికి ఏం తేడా లేదు. చెప్పవచ్చేదేమంటే-ఆ కిల్లర్ని మీ అమ్మాయి స్వయంగా చూసింది. కాలనీలో బీటు మీదున్న కానిస్టేబుల్ మీ అమ్మాయి మేడ మీది గదిలోకి వెళ్ళడం చూశాడు. ఒక వ్యక్తిని చూసినట్టూ, సుమిత్ర సోఫాలో పడుకొని కనిపించిందని మీ అమ్మాయి చెప్పింది. సుమిత్ర మకలాగే కన్పించింది. అఫ్ కోర్స్ బై దట్ టైం షీయీజ్ ఆల్రడీ డెడ్! అంచేత ఆ వ్యక్తే హంతకుడు. అందులో సందేహము లేదు. అతనే మనకి కావాలిప్పుడు. వాణ్ని పట్టుకోకుండా వదిలేస్తే నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తాడు. మీ అమ్మాయి ప్రాణాలు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. అంటూ ఆగాడు వీరప్ప.

    రాజారామ్ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. "ఇప్పుడు పరిస్థితి అర్ధమయింది." అన్నాడు.

    "కొందఱు మనుష్యుల్ని తీసుకువస్తానిప్పుడు వాళ్ళని రమణి చూసిన తరువాత మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు." అంటూ లేచాడు పోలీస్ కమిషనర్ వీరప్ప.

    రాజారామ్ ముందుగదిలోకి వెళ్ళాడు. సబ్ ఇన్ స్పెక్టర్ మహావీర్ నవ్వుతూ, నవ్విస్తూ, రమణిని ఏవేవో ప్రశ్నలు వేస్తున్నాడు. రమణి ఓపిగ్గా చెబుతోంది. వాళ్ళిద్దర్నీ చోద్యంగా చూస్తూ ఓ కుర్చీలో కూర్చుంది రాజేశ్వరి.

    "నీ చేతిలో ఓ కవరుంది. సుమిత్ర గారికి ఇద్దామని వెళ్లేవు. గుమ్మం మీదున్న కాలింగ్ బెల్ స్విచ్ నోక్కావు. తలుపు కొద్దిగా తెరుచుకుంది. 'ఎవరది' అన్న మగ గొంతు వినిపించింది. ఇప్పుడు చెప్పు, క్విక్, నీకేం కన్పించింది?" అన్నాడు సబ్ ఇన్ స్పెక్టర్ మహావీర్.

    రమణి కళ్ళు పెద్దవిగా చేసుకుంటూ "అతనిచేతి వేలికి పెద్ద బంగారం ఉంగరం ఉంది. అది కన్పించింది నాకు" అంది.

    "ఉత్తి ఉంగరమేనా? దానికేమయినా రాయి గాని, వజ్రంగాని ఉన్నాయా?

    "అవేం లేవుగాని, ఏవో అక్షరాలున్నాయి దాని మీద!"

    "అవేంటో చెప్పగలవా?"

    రమణి తల అడ్డంగా ఊపింది. అంతలోనే మహావీర్ మరో ప్రశ్న వేశాడు. "మరి, నువ్వతని మొహం కూడా చూశానన్నావుగా! క్విక్!! ఎలా ఉంది అతని మొహం?" అన్నాడు.

    "చీకట్లో ఉన్నాడుగా అతను! ఒక్కసారి చూసేసరికి అతని కళ్ళు పులి కళ్ళలా మెరుస్తూ కన్పించాయి"

    "ఇంకా....?"

    "మొహం మీదికి జుత్తు పడి ఉంది."

    "అందులో కొన్ని పండు వెంట్రుకలున్నాయి...."

    "ఊఁ....ఇంకా?"

    "అతను తెల్లని పాంటు, తెల్లని బుష్ షర్టూ వేసుకుని ఉన్నాడు."

    సబ్ ఇన్ స్పెక్టర్ మహావీర్ కాసేపు ఆలోచనలోపడ్డాడు. "అతని మొహంలో ఏదైనా గమ్మత్తుగా అన్పించిందా" అన్నాడు.

    "అంటే?" అంటూ ప్రశ్నార్ధకంగా చూసింది రమణి.

    "అంటే-పొడుగు ముక్కు చప్పీ ముక్కు...ముక్కు మీద పుట్టుమచ్చ లాంటివి...."

    రమణి కాసేపు ఆలోచించింది. తల గోక్కుంటూ "ఊఁ హూ....నాకాలాగేం అన్పించలేదు." అంది.

    అంతలో పోలీస్ కమీషనర్ గదిలోకి వచ్చాడు. పాపా...ఇప్పుడు నీకు కొందరు పెద్ద మనుష్యుల్ని చూపిస్తాను. నాతో రా...ఏం?" అన్నాడు. అంటూ తన కుడిచెయ్యి చిటికెన వేలు చాచాడు. రమణి లేడి పిల్లలా టేబిలు మీంచి కిందకి గెంతి కమీషనర్ చెయ్యి పట్టుకుంది. నిర్బయంగా అతని వెంట నడవసాగింది. అంతా కలిసి ఓ గదిలోకి వెళ్ళారు. ఆ గదిలో ఆరుగురు మనుష్యులు వరసాగ్గా నిలబడి ఉన్నారు. మొదట నిలబడి ఉన్న వ్యక్తి 'శ్రీ కృష్ణా మాసేజ్ పార్లర్' ప్రొప్రయిటర్ కృష్ణారావని చూడగానే గ్రహించాడు రాజారామ్. తుమ్మ మొద్దులా నల్లగా ఉన్న కృష్ణారావు రాజారామ్ కేసి హుంకరించి చూస్తున్నాడు.

    "రమణి...వాళ్ళని చూడు. వాళ్ళలో ఎవర్నయినా చూశావేమో గుర్తు చేసుకో..." అంటూ వీరప్ప వాళ్ళని చేత్తో చూపించాడు.

    రమణి అందరి మొహాల్ని మార్చి మార్చి దీక్షగా చూసింది. అయిదు నిమిషాలయ్యాక "ఒక్కరు మాత్రం అతన్లా కన్పిస్తున్నారు!" అంది.

    "ఎవరు?"

    "అదిగో...ఆ చివరన ఉన్నాయన!"

    "ఎంచేత చెప్పగలవా పాపా?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS