21 వ. సర్గ
సీత రావణునితో :
1. నిరతము పతినే - మనమున దలచుచు
క్షణమొక యుగముగ - కాలము గడపుచు |
రావణ గర్వమ | దంబుల ద్రుంచు
రాముని శౌర్య ధై | ర్యముల దలచుచు |
శోక తప్తయై - శిరమును వంచి
తృణమును ద్రుంచి - తన ముందుంచి |
మారు బల్కె సీ | త దీన స్వరమున
తృణముకన్న రా | వణుడే హీనమన ..... ||శ్రీ||
2. "నను కామించుట - మహా పాపము
నీ కాంతలతో - పొందుము సుఖము |
నీ కాంతలు పరు | ల పాలైనపుడు
యోచించుము నీ - మనసెంటులుండు ?
నీ సతులందున - తనివి నొందిక
పరకాంతల ఆ | శించి నశించకు |"
అని పల్కె సీత - దీన స్వరమున
తృణముకన్న రా | వణుడే హీనమన .... ||శ్రీ||
3. "తెలివి బల్కెదవు - అతి వినయముగా
హితులే లేరా - నిజము దేలుపగా ?
సత్యవాక్కు నీ | కు హితము గాదని
| విభీషణాదులు - మిన్నకుండిరా ?
| నీ వంటివాడు | రాజయ్యనేని
సర్వనాశము | కాకుండునేమి ?"
అని పల్కె సీత - దీన స్వరమున
తృణముకన్న రా | వణుడే హీనమన .... ||శ్రీ||
4. "రవి లేని కాంతి | ఎటులుండగలదు ?
సీతారాముల - విడదీయ వలదు |
రామచంద్రుని - ప్రియసతి నేను
నను కోరుకొని - పొందకు హాని |
శ్రితజన పాలుని - నా స్వామిని
శరణు వేడుము - మన్నింపుమని |"
అని పల్కె సీత - దీన స్వరమున
తృణముకన్న రా | వణుడే హీనమన .... ||శ్రీ||
5. "రామ లక్ష్మణులు - లేని సమయమున
అపహరించితివే - నను ఆశ్రమమున |
పురుష సింహముల - గాలికి బెదిరి
పారిపోతివి - శునకము మాదిరి |
యమ కుబేర ఇం | ద్రాది దేవతల
గెలిచిన నీకీ - వంచన లేల ?"
అని పల్కె సీత - దీన స్వరమున
తృణముకన్న రా | వణుడే హీనమన .... ||శ్రీ||
6. "ఓయి రావణా! నా మాట వినుము
శ్రీరామునితో - వైరము మానుము |
శీఘ్రముగా నను - రాముని జేర్చుము
త్రికరణ శుద్ధిగా - శరణు వేడుము |
నిను మన్నించి అ | నుగ్రహింపుమని
కోరుకొందు నా - కరుణామూర్తిని |"
అని పల్కె సీత - దీన స్వరమున
తృణముకన్న రా | వణుడే హీనమన .... ||శ్రీ||
__: 21 వ. స. సంపూర్ణము :__
.jpg)
రావణుండు కామాంధుడై నిలిచె
నోటికి వచ్చినదెల్ల పలికె
మారుబల్కె సీత దీనస్వరమున
తృణముకన్న రావణుడే హీనమున!
22 వ. సర్గ
రావణుడు సీతతో :-
1. "ఓ సీతా! నీ వెంత గడసరివే
ఎవరితో ఏమి - పల్కుచుంటివే |
ఎంతటి కర్ణ క | ఠోర వచనములు
ఎంతటి ఘోర అ | సభ్య దూషణలు |
నీపై మోహము - నను బంధించెను
లేకున్న నిను వ | ధించి యుందును |"
అని గర్జించెను - ఘనతరగాత్రుడు
క్రోధోద్దీప్తుడై - దశకంఠుడు ... ||శ్రీ||
2. "నీ కొసగిన ఏ | డాది గడువును
రెండు నెలలలో - తీరిపోవును |
అంతదనుక ని | న్నంటగ రాను
ఈ లోపున బా | గోగులు కనుగొను |
నను కాదను నిను - కనికరించను
పాక శాలకే - పంపించెదను |"
అని గర్జించెను - ఘనతరగాత్రుడు
క్రోధోద్దీప్తుడై - దశకంఠుడు ... ||శ్రీ||
