మనస్సును ఆహ్లాద పరచుకోవడం కోసమా? నా మనస్సుకు ఆహ్లాద మేమీ కలగలేదు. నేనూ మనస్సును ఆహ్లాద పరచుకోవాలనుకున్నాను."
చున్నీబాబు కొంత సేపటి దాకా అతడి ముఖం వైపు చూస్తూ వున్నాడు. తరువాత "దేవదాస్! నీ కేమయిందో స్పష్టంగా చెప్పు" అన్నాడు.
"ఏమీ కాలేదు."
"చెప్పవా?"
చున్నీలాల్ చాలా సేపటి తరువాత తల వంచుకుని "దేవదాసు, నా మాట ఒక్కటి దక్కిస్తావా?" అన్నాడు.
"ఏమిటి?"
"అక్కడకు నీవు మరోసారి రావలసి వుంటుంది. నేను మాట ఇచ్చాను."
"ఆరోజు వెళ్ళిన చోటకేనా?"
"అవును."
"ఛీ! అక్కడ నాకు నచ్చదు."
"నీకు ఏది నచ్చుతుందో అదే చేస్తాను."
దేవదాసు కొంచెం సేపు అన్యమనస్కుడు మాదిరిగా మౌనంగా వున్నాడు. తరువాత "సరే పద. నేను వస్తాను" అన్నాడు.
* * * *
పతనానికి పోయేదారిలో మరో మెట్టు దిగి చున్నీలాల్ ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. దేవదాసు ఒక్కడే చంద్రముఖి భవనంతో క్రింద భాగంలో కూర్చొని మధ్యం సేవిస్తూ వున్నాడు. దగ్గరే చంద్రముఖి విషణ్ణవదనంతో కూర్చొని చూస్తూ వుంది. "దేవదాస్! ఇక త్రాగవద్దు" అన్నది ఆమె.
దేవదాసు మధ్యం గ్లాసు క్రిందపెట్టి కనుబొమలు విరుస్తూ "ఎందుకు?" అన్నాడు.
కొద్ది రోజులనుంచే మధ్యం త్రాగడం ప్రారంభించావు....ఇంక భరించలేవు."
"భరించడం కోసం మధ్యం త్రాగడం లేదు. ఇక్కడ వుండడం కోసం మధ్యం సేవిస్తున్నాను."
ఈ మాట చంద్రముఖి అనేకసార్లు వినివుంది. ఎక్కడయినా గోడకు కొట్టుకుని రక్తం ప్రవహింపజేసి చనిపోడుగదా! అని ఒకటి రెండుసార్లు ఆమె అనుకున్నది. దేవదాసును ఆమె ప్రేమిస్తున్నది. దేవదాసు మధ్యం గ్లాసును పైకి ఎగరేశాడు. మంచం కోడుకు తగిలి అది ముక్కలు ముక్కలయిపోయింది. మళ్ళీ దిండు మీద వాలిపోయి తొట్రుపడుతున్న స్వరంతో అన్నాడు- "నాలో లేచే శక్తి లేదు. అంచేతనే ఇక్కడ పడి వుంటున్నాను. జ్ఞానం లేదు. అందుచేతనే నీ ముఖం వైపు చూసి మాట్లాడుతున్నాను. చంద....ర....అప్పుడు అజ్ఞానం వుండదు. కొంచెం జ్ఞానం వుంటుంది. నిన్ను తాకలేను, నాకు చాలా ఏవగింపు కలుగుతుంది."
చంద్రముఖి కళ్ళు తుడుచుకుని నెమ్మదిగా "దేవదాస్! ఇక్కడికి ఎంతో మంది మనుషులు వస్తారు. వాళ్ళు మధ్యాన్ని తాకను కూడా తాకరు" అన్నది.
దేవదాసు కళ్ళు తెరచి లేచి కూర్చున్నాడు. కొంచెం ఊగుతూ అటూ ఇటూ చేతులు విసరి "తాకను కూడా తాకరా? నా దగ్గర తుపాకి వుంటే కాల్చి పారేసేవాణ్ని. వాళ్ళు నాకన్నా ఎక్కువ పాపిష్టులు చంద్రముఖీ!"
కొంచెం సేపు ఆగి ఆలోచిస్తూ వున్నాడు. తరువాత అన్నాడు-ఒకవేళ ఎప్పుడయినా మధ్యం త్రాగడం మానివేస్తే-ఒకవేళ మానకపోయినా-అయినా మానను-మానితే ఇక్కడకు ఎప్పుడూ రాను. నాకు ఉపాయం తెలుసు. కాని వాళ్ళ స్థితి ఏమవుతుంది?"
కొంచెం ఆగి మళ్ళీ ప్రారంభించాడు...."చాలా దుఃఖంతో మధ్యాన్ని స్వీకరించాను. ఆపదలోనూ, దుఃఖంలోనూ నా సహచరి! ఇక నిన్ను ఎప్పటికీ విడువలేను" అని దేవదాసు దిండు మీద ముఖం రుద్దుకుంటూ వున్నాడు. చంద్రముఖి వెంటనే దగ్గరకు వచ్చి ముఖాన్ని పైకి లేవనెత్తింది. దేవదాసు కనుబొమలు విరిచి "ఛీ! తాకవద్దు! ఇంకా నాలో జ్ఞానం వుంది చంద్రముఖీ నీకు తెలియదు....నేను నిన్ను ఎంత అసహ్యించుకుంటున్నానో అది కేవలం నాకే తెలుసు. ఎప్పుడూ నిన్ను ఏవగించుకొంటాను! అప్పుడు కూడా వస్తాను, అప్పుడు కూడా కూర్చుంటాను. అప్పుడు కూడా మాట్లాడతాను. ఇది మినహా మరో ఉపాయం లేదు. దీన్ని మీరెవరైనా అర్ధం చేసుకోగలరా! హా...హా! జనం పాపాన్ని చీకట్లో చేస్తారు. నేను ఇక్కడ నిషాలో పడివున్నాను__అందుకు బాగా తగినచోటు. ఇంత తగిన చోటు ప్రపంచంలో మరెక్కడుంది. మరి మీరందరూ...."
దేవదాసు దృష్టిని సరి చేసుకొని కొంచెం సేపటిదాకా ఆమె విషణ్ణ వదనం వైపు చూసి "ఆహా! సహసశీలతకు ప్రతిరూపం! కళంకము, నింద, అవమానము, అన్యాయము,అత్యాచారం, ఉపద్రవం- వీటన్నిటినీ స్త్రీ సహించ గలదు. నీవే దీనికి ఉదాహరణగా వున్నావు!" అన్నాడు.
తరువాత వెల్లకిలగా పడుకొని నెమ్మదిగా అంటున్నాడు. "నన్ను ప్రేమిస్తున్నానని చంద్రముఖి అంటున్నది. నేను ఇది కోరుకోవడం లేదు. కోరుకోవడంలేదు....కోరుకోవడం లేదు. జనం నాటకాల వేస్తుంటారు, నాట్యం చేస్తుంటారు.ముఖానికి భస్మం పూసుకుంటారు. మసి పూసుకుంటారు. బిచ్చం అడుక్కుంటారు....రాజులవుతారు....ప్రేమిస్తారు. ఎన్నో ప్రేమ విషయాలు ముచ్చటిస్తారు!....ఎంతో రోదిస్తారు. అంతా సరిగ్గా వున్నట్లు, అంతా నిజం అన్నట్లు నా చంద్రముఖి నాట్యం చేస్తుంది. నేను చూసాను. కానీ అది ఎక్కువగా గుర్తుకు వస్తుందే, క్షణంలో అంతా అయిపోయింది. ఆమె ఎక్కడకు వెళ్ళింది? నేను ఏ దారిన ఇక్కడకు వచ్చాను? ఇప్పుడు నిషాతో నిండివున్న ఒక అభినయం ప్రారంభమయింది.ఇది ఘోరమయిన మత్తుతో నిండివున్న అభినయం....ఇదొక్కటే....కానివ్వు" అభ్యంతర మేముంది? ఆశలేదు. అదే విశ్వాసం....సుఖమూ లేదు, కోరికా లేదు....ఆహా! చాలా బాగుంది!
ఆ తరువాత దేవదాసు ప్రక్కకు పొర్లి ఏమిటో పలవరిస్తూ వున్నాడు. చంద్రముఖి ఆ ప్రలాపాలను అర్ధంచేసుకోలేకపోయింది. సేపటికే దేవదాసు నిద్రపోయాడు. చంద్రముఖి అతని దగ్గరకు వెళ్ళి కూర్చున్నది. చీర కొంగు తడిపి అతడి ముఖం తుడిచింది. తడిసిపోయిన దిండును మర్చి వేసింది. ఒక పంఖా తీసికొని కొద్దిసేపు విసిరింది. చాలా సేపటి వరకు తల వంచుకుని కూర్చున్నది. అప్పటికి రాత్రి ఒంటిగంట అయింది. ఆమె దీపం ఆర్పివేసి, తలుపులు మూసి గదిలోకి వెళ్ళి పోయింది.
12
సోదరు లిద్దరూ ద్విజదాసు, దేవదాసు-ఇంకా చాలా మంది గ్రామస్తులు, జమీందారైన ముఖోపాధ్యాయుని అంత్యక్రియలు పూర్తిచేసుకొని ఇంటికి తిరిగి వచ్చారు. ద్విజదాసు పిచ్చివాడిలాగా అరిచి రోదిస్తూ నిద్రపోయాడు. గ్రామస్తులు ఐదారుగురు కలిసి కూడా అతణ్ని పట్టలేకపోయారు. దేవదాసు శాంతంగా ఒక స్థంభం దగ్గర కూర్చొని వున్నాడు. నోటి నుంచి ఒక్క మాట రావడం లేదు. కళ్ళల్లో ఒక్క కన్నీటి చుక్క కూడా కన్పించడం లేదు. అతణ్ని పట్టుకొనడానికి ఎవ్వరూ రావడం లేదు. అతణ్ని ఎవ్వరూ ఓదార్చడంలేదు. కేవలం మధుసూధన ఘోష్ మాత్రం ఒకసారి దగ్గరకు వచ్చి, "తమ్ముడూ! ఇదంతా ఆ ఈశ్వరుని చేతిలోని విషయం ఇందులో...."
దేవదాసు చేతితో ద్విజదాసు వైపు చూపిస్తూ "అక్కడ చూడండి" అన్నాడు.
ఘోష్ మహాశయుడు నిశ్చేష్టుడై....అవును....అవును....ఆయన చాలా శోకంతో....అన్నాడు.
ఇలా ఏదో అంటూ అంటూ ఆయన వెళ్ళిపోయాడు. మరెవ్వరూ దగ్గరకు రాలేదు. మధ్యాహ్నం దాటిన తరువాత దేవదాసు స్పృహతప్పి పడివున్న తల్లి పాదాల దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు. అక్కడ చాలా మంది స్త్రీలు ఆమె చుట్టూ కూర్చొని వున్నారు. వారిలో పార్వతి నాయనమ్మ కూడా కూర్చొని వుంది. ఆమె పూడిపోయిన స్వరంతో, శోకంలో మునిగివున్న వితంతువైన తల్లితో "కోడలూ, చూడు! దేవదాసు వచ్చాడు" అన్నది దేవదాసు "అమ్మా!" అని పిలిచాడు.
ఆమె కేవలం ఒక్కసారి చూసి "దేవదాసు!" అన్నది. మళ్ళీ ఆమె కళ్ళ నుంచి బొటబొటా కన్నీళ్ళు కారాయి. స్త్రీలు కూడా విలపించారు. దేవదాసు కొంచెం సేపటివరకూ తల్లి పాదాలతో ముఖం కప్పుకొని కూర్చున్నాడు. మళ్ళీ లేచి తండ్రి పడకగదిలోకి వెళ్ళాడు. కంటతడి లేదు. ముఖం గంభీరంగానూ, శాంతంగానూ వుంది. ఎరుపెక్కిన కళ్ళను పైకి తెరచుకొని వెళ్ళి నేలమీద చతికిల బడ్డాడు. ఆ విగ్రహాన్ని ఎవరైనా చూస్తే బహుశా భయపడి పోతారు. రెండు కణతలు ఉబికి వున్నాయి. కాల్చిన బంగారంలాగా శరీరం రంగు మారి నల్ల బడిపోయింది. కలకత్తాలోని జఘన్య అత్యాచారాల మధ్య రాత్రులందు దీర్ఘమైన జాగరణలు చేశాడు. ఆ పైన ఇక్కడ తండ్రి మరణించాడు. ఒక సంవత్సరం క్రితం ఎవరైనా అతణ్ని చూసి వుంటే బహుశా ఇప్పుడు హటాత్తుగా చూసి గుర్తు పట్టలేరు కూడా. కొంచెం సేపటి తరువాత పార్వతి తల్లి అతణ్ని వెతుక్కుంటూ తలుపు నెట్టుకొని లోపలికి వచ్చి "దేవదాస్!" అని పిలిచింది.
"ఏమిటి పిన్నీ."
"ఇలా అయితే ఇక సాగదు."
దేవదాసు ఆమె ముఖం వైపు చూసి "ఏం చేసేది పిన్నీ!" అన్నాడు దేవదాసు.
పిన్నికి అంతా తెలుసు. కాని ఏమీ అనలేకపోయింది. దేవదాసు తల చేతితో నిమురుతూ_"దేవుడి లాంటి వాడివి నాయనా!" అన్నది.
"ఏమిటి పిన్నీ?"
"దేవిడివి."
ఈసారి దేవదాసు ఆమె ఒడిలో తన ముఖం దాచుకున్నాడు. కళ్ళ నుంచి రెండు వేడి వేడి అశ్రుబిందువులు రాలాయి.
పరివారమంతా శోకంతో మునిగిపోయిన రోజు ఏదో విధంగా గడిచిపోయింది. నియమిత రూపంతో ప్రభావిత మయ్యింది. రోదనలు, వేదనలు చాలా వరకు పరిమితమయ్యాయి. ద్విజదాసు క్రమంగా కుదుట బడ్డాడు. ఆయన తల్లి కూడా కొంచెం స్థిమితపడింది. కన్నీరు కార్చుకుంటూ, ముక్కు చీదేసుకుంటూ అవసరమైన పనులు అందుకుంటూనే వుంది. రెండు రోజుల తరువాత ద్విజదాసు, దేవదాసును పిలిచి దేవదాస్ నాన్నగారి శ్రాద్ధ కర్మలకు ఎంత ఖర్చు పెట్టడం ఉచితంగా వుంటుంది?" అని అడిగాడు.
