"ఉపన్యాసం అయిపోయిందా, ఇంకా ఏమైనా ఉందా?"
"నువ్వలా చిరుకోపం తెచ్చుకొంటే నా హృదయం లో పూల వర్షం కురిసినట్లుంటుంది."
"అయితే నిజంగానే కోపం తెచ్చుకుంటాను."
"అంత పని మాత్రం చేయకు. నాలొ అగ్ని జ్వాలలే ఆవిర్భవించి దహించి వేస్తాయి."
ఇంతలో ఒక అల వారి దగ్గరగా వచ్చి పోయింది.
"రజీ, సముద్రుడొక సందేశాన్ని పంపినాడు."
"ఏమిటో అ సందేశం!"
"మన మాటలన్నీ తనలో దాచుకొన్నాడట."
"అతడికి అంతకన్నా మరేం పని లేదా?"
"ఏం చెప్పమంటావు" అన్నట్లు సముద్రం వైపు చూశాడు రాజ్. సముద్రుడు హోరు మన్నాడు.
"ఉందట. కానీ అన్ని పనులూ విడిచి మన దగ్గరకే వచ్చాడట."
"ఎందుకో అతని కంత ఆత్రుత?"
ఒక అల వచ్చి వారి కాళ్ళను తాకింది.
"ఈ అందాల రాణిని ఈ ఏకాంతం లో నేనేం చేస్తానో అని భయపడి చూడటానికి, కాపలా కాయడానికి వచ్చాడట." నవ్వాడు రాజ్.
ఆ నవ్వులోని అర్హమేమిటో! అదే అర్ధం కాదు. "నీ కొంటె మాటలతో నా నిగ్రహాన్ని కోల్పోతున్నాను, రాజ్" అని రజియా లేచి అతన్ని అనుకోని కూర్చున్నది.
ఆ మాటలు విని రాజ్ సంభాషణ ఆపివేసి ఇసుకతో ఆడుకోసాగాడు. అది చూసి నవ్వింది రజియా. ఆమె గ్రహించిందని అతనికి తెలుసు.
"నువ్వు సముద్రం తో మాట్లాడడం ఎప్పుడు నేర్చుకోన్నావు, రాజ్?"
"నీతో స్నేహమైనప్పటినుండి."
"అంతకు మునుపు?"
"అప్పుడు ఈ ఆనందం దరిదాపులకే వచ్చే వాడిని కాదు. జీవితం లో పుట్టి నందుకు గాను బ్రతుకుతున్నాను అనుకొనే వాడిని. నే పెరిగిన పరిస్తితు లటువంటివి. కడుపు నిండా తిండి లేక గడిపిన రోజులున్నాయి. అసలు జీవితానికి సుఖం, సౌఖ్యం , భోగం, భాగ్యం , ఇవన్నీ అవసరమని నాకు తెలియదు. ఒక యంత్రం లా బ్రతుకును ఈడ్చుకొని పోతుండగా, ఏ దేవుడో దయతలచి పంపిన దేవతలా నా దారిలో నిలిచి నన్ను ఆహ్వానించావు. ఎందుకో నిరాకరించ లేక నివాడినయి పోయాను. ఆ అంధకారాన్ని నీ వెలుగుతో రూపు చూసి నాకు ఆనందాన్ని చవి చూపించావు. మ్రోడు పోయి ఉన్న నా హృదయాన్ని చిగురింప జేసి ఒక దారి చూపించావు. ఆనాడు సంతోషము, సంతృప్తి అంటే ఎరుగని నేను ఈనాడు ఎనలేని ఆనందాన్నీ, సౌఖ్యాన్నీ అనుభవిస్తున్నాను. ఈ జీవితానికీ భాగ్యం చాలు."
* * * *
"ఆనంద్ ఉన్నాడా, అరుణా!" లోపలికి పోతూ అక్కడ ఉన్న అరుణ నడిగాడు రాజ్.
"లోపలిన్నాడన్నయ్యా !" అంది అరుణ.
'ఆనంద్" అంటూ ఆనంద్ గదిలోకి వెళ్ళాడు రాజ్.
ప్రక్కపై పడుకొని ఏదో ఆలోచనలలో మునిగి తేలుతున్న ఆనంద్ లేచి కోపంగా చూశాడు.
"నిన్ను ఇక్కడి కెవరు రమ్మన్నారు?"
"అదేమిట్రా అనవసరంగా అంత కోపం తెచ్చు కొంటావు? ఈ మధ్యేమైన అమ్మ ఉప్పూ కారం ఎక్కువ పెడుతోందా?' అంటూ చిరు నవ్వుతో అతని ప్రక్కనే కూర్చున్నాడు, రాజ్.
"మిస్టర్ రాజ శేఖరం! మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో. లేకుంటే అనవసరంగా నా కోపాన్ని రెచ్చగొట్టినట్లవుతుంది" అని లేచి ప్రక్కకు పోయి నిలబడ్డాడు ఆనంద్.
'అసలు నీ కోపానికి కారణ మేమిట్రా? రెండు రోజుల నుండి కాలేజీ కి రాలేదు. ఒంట్లో బాగులేదా?" అని అతడి నుదుటి పై చెయ్యి వెయ్యబోయాడు , రాజ్.
"మహా బయలుదేరావు లేవోయ్; మిత్రుడి సౌఖ్యాన్ని కోరేవాడివి!" అని ఆ చేతిని విసిరి కొట్టాడు ఆనంద్.
నిష్కారణమైన ఆ కోపాన్ని చూసి ఆశ్చర్య పోయాడు రాజ్. అతడి భుజాలు పట్టుకొని తన వైపుకు త్రిప్పుకొని "ఆనంద్! నా మొహం లోకి చూసి నేను నీకు ఏం అపకారం చేశావో చెప్పు" అన్నాడు.
రాజ్ కళ్ళలోకి ఒక్క క్షణం చూసిన ఆనంద్ తల త్రిప్పేసుకుని బాధగా 'రాజ్! నా ముందు నుండి వెళ్ళిపో. నాకెవరూ ఏ అపకారమూ చేయలేదు. విదే నా పై వక్రించింది. ఎన్నో కలలు కన్న నా భవిష్యత్తు అంధకార బంధురమై పోయింది." అన్నాడు.
ఆనంద్! నా మాట విను. నీ బాధేమిటో నాతొ చెప్పు. ఎందుకు నీలో నువ్వే కుమిలి పోతావు? అదేదో నాతొ చెప్పరా."
"రాజా! నేనేం చెప్పే పరిస్థితులలో లేను. దయచేసి నన్ను ఒంటరిగా ఉండనివ్వండి."
"ఒంటరితనం నీలోని బాధను ద్విగుణీకృతము చేస్తుంది కానీ తగ్గించదు."
"నీతో చెప్తే ఆర్చగలవా, తీర్చగలవా?"
"ఎంత మాట అన్నావురా! నాకున్న మిత్రులు మీరిద్దరే. ఒకవేళ నేను పేదవాడినే కావచ్చు కానీ మీరు కోరితే ఆకాశం పై నున్న నక్షత్రాలనే కాదు కౌస్తుభాన్ని గూడా సాధించి తెగలను."
"నాదనుకొన్న వస్తువు నీదైంది. దాన్ని నాకివ్వగలవా?"
"ఇంత మాత్రానికే ఇంత రాద్దాంతం చెయ్యాలా! స్నేహితుడు కోరిన కోరికను తీర్చలేని వాడు ఆ స్నేహానికే అర్ధం లేదు."
"పూర్తిగా విను. నాదనుకున్న రజియా ను నువ్వు ఎగరేసుకు పోతున్నావు."
"ఆనంద్!" ఆశ్చర్యపోయాడు రాజ్.
"ఏం? భయపడుతున్నావు కదూ! కోరరాని కోరిక కోరుతున్నానంటావు కదూ! రజియాను వదులుకోలేనంటావు కదూ!"
"కాదురా! నువ్వింత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావె అని బాధపడుతున్నాను."
"అంటే?"
"నువ్వు నీ కోరికను ఇన్నాళ్ళుగా నీలోనేఉంచుకొని నాతొ వైరుద్యం పెట్టుకున్నావు. నీ తెలివి తక్కువ వల్ల ఎంత అనర్ధం జరిగిందో నీకు తెలియదు. నువ్వు రజియాను ప్రేమిస్తున్నావా?"
"ఔను."
"మరి ఆమె నిన్ను ప్రేమించిందా?"
"అనే భావించాను. నువ్వు ఆమె జీవితం లో ప్రవేశించక మునుపు ఆమె ఇక్కడి కోస్తుండేది. నాతొ చనువుగా మాట్లాడుతూ ఆనందాన్ని చేకూర్చేది. నన్ను ప్రేమిస్తున్నానని ఏనాడూ చెప్పలేదు. కానీ నా భవిష్యత్తు కు పునాదులు వేసుకొనేందుకు అస్మారాన్నిచ్చింది. ఎన్నో కలలు కన్నాను. కానీ ఈనాడు ఆమె దర్శనమే కరువైంది. నా కలలన్నీ కరిగి పోతున్నాయి. నా ఆశలు గాలి మేడలై కూలిపోతున్నాయి. ఆమె ఇక ఎప్పుడూ ఈ వైపుకు రాదు."
"ఎందుకు రాదు?"
"హు. అందుకని అడుగుతున్నావా? నీ సాహచర్యం లాభించిన నాడు, నీ హృదయం లో స్థానం సంపాదించుకొన్న ఏ స్త్రీ కానీ స్వర్గ సౌఖ్యాలను సైతము కాలితో తన్ని వేస్తుందన్న సత్యం నీకు తెలియదేమో!"
"నువ్వు అది నా తప్పేనంటే అంగీకరిస్తాను. కానీ నువ్వు రజియాను ప్రేమించిన విషయం నాకు ఒక్కసారి చెప్పలేక పోయావా? నాకు తెలియజేసి ఉంటె ఈనాడు నేను నీముందు ఒక మిత్ర ద్రోహి గా నిలబడి ఉండను."
"నేనేమైనా కలగన్నానా నువ్వు ఆమెను స్వంతం చేసుకుంటావని?"
"నేనూ అదే ప్రశ్న నిన్ను అడుగగలను. విచిత్రమైన పరిస్థితులలో ఆమె జీవితం లోకి ప్రవేశించాను. నువ్వీ విషయం చెప్పడానికి చాలా ఆలస్యం చేశావు. కనీసం రెండు మూడు రోజుల క్రిందట ఈ విషయం చెప్పి వుంటే పరిస్థితులింత విషమించి ఉండేవి కావు. ఇప్పుడు నన్నేం చేయమంటావు? రజియా ప్రేమను నిరాకరించి ఆమెను త్యజిస్తాను . సంతోషిస్తావా?"
"నువ్వు నా దారికి అడ్డు తొలిగితే అంతే చాలు."
"సరే. నీ ఇష్ట ప్రకారమే చేస్తాను. అంతే కాదు. నీ ప్రయత్నానికి సహాయపడేందుకు ప్రయత్నిస్తాను. ఇప్పుడైనా నామీద కోపం పోయింది గదా? ఇక ఆ విషయం మరిచిపోయి సంతోషంగా మాట్లాడు."
కానీ ఆనంద్ తిరిగి కూడా చూడలేదు. ఒక నిట్టుర్పు విడిచి బయటికి వచ్చాడు. గది ప్రక్కనే నిలబడి ఉన్న అరుణ ను చూశాడు.
తన గది చేరుకొన్నాడు. ఆలోచనలు గజిబిజీగా ఉన్నాయి. రజియా రూపం కళ్ళలో మెదిలింది. ఆ దీనపు చూపులు తన గుండెల్ని పిండి చేస్తున్నాయి. మరోవైపు ఆనంద్ క్రూరంగా చూస్తున్నాడు. ఆ చూపుల్లో మాటకు కట్టుబడలేని వాడవనే అసహ్యం కనబరుస్తున్నాడు. తల తిరిగిపోతుంది. "హి భగవాన్! నువ్వెక్కదున్నావు? ప్రశాంతంగా సాగిపోతున్న ఈ జీవితంలో ఈ కలకలాన్ని ఎందుకు కలిగించావు? నా జీవితానికి ఎనలేని ఆనందాన్ని ప్రసాదించావని సంతోషించానే! ఇంతలోనే అంతకు మించిన దుఖాన్ని ఎదుర్కొమ్మని అంటున్నావు. ఇది నీకు న్యాయమా? అది నాకు సాధ్యమా? ఇది నీకు న్యాయమై నప్పుడు నాకంత శక్తిని గూడా ప్రసాదించడం నీకు ధర్మం' అని ప్రార్ధించాడు.
మరునాడు రాజ్ కోసం ఎదురుచూసిన రజియాకు ఆశా భంగమైంది. ఆ సాయంకాలం కూడా రాజ్ కనిపించలేదామెకు. అతని గదికి వెళ్ళింది. గదికి తాళం వేసి ఉంది.
"సుగుణా, మీ అన్నయ్య ఇంకా కాలేజీ నుండి రాలేదా?"
"తెలియదండి! ఉదయం నుండి కనిపించ లేదు." అక్కడే కూర్చుంది రజియా.
'అది కాదురా! వాడేదో మూర్ఖంగా మాట్లాడితే నువ్విలా ప్రవర్తించడం ఏం బాగు లేదు. ఆ అమ్మాయి నీకోసం ఎంతగా బాధపడుతుందో ఆలోచించావా?" అంటున్నాడు అదే సమయంలో ఎదురుగా దిగులుపడి కూర్చొనున్న రాజ్ తో గోపీ.
"మరేం చెయ్యమంటావు, గోపీ! రజియాతో కలిస్తే ఆనంద్ బాధపడడూ? మాట నిలబెట్టు కోలేని వాడినని నిందించడూ?"
"ఏడిశాడు . వాడేదో పిచ్చిపిచ్చిగా వాగితే స్నేహధర్మం అంటూ నువ్విలా ప్రవర్తిస్తావా? వాడి చేత కాని తనానికి నువ్వా బాధ్యుడివి? పోనీ, నీతో ఏనాడైనా ఆ విషయం చెప్పాడా? ఈనాడు లతలా పెనవేసుకున్న ఆమె ప్రేమను విడదీయడానికి నీకేం అధికారముంది?వాడికేం హక్కుంది? మీ ఇద్దరి మధ్యనా ఆమె జీవితం నలిగి పోవాలా?"
"ఏం చెయ్యడానికి పాలుపోవడం లేదురా! ముందు చూస్తె నుయ్యి, వెనుక చూస్తె గొయ్యి లా ఉంది నా పరిస్థితి. ఎవరినీ బాధించ లేను."
"వారికన్నా నీ బాధ ఎక్కువైంది. నువ్వు తలుచుకుంటే ఇవేమీ ఉండవు. వాడేమైనా ఏడిచి చావనీ, ఆ అమ్మాయి మనసు మాత్రం కష్ట పెట్టకు."
"అది నాచేత కాదురా! ఇప్పుడిప్పుడే ఈ సమస్య తెగేది కాదు. రెండు రోజులు ఆ గదికి కూడా వెళ్ళకూడదనుకొన్నాను."
"పోనీలే, ఇక్కడే ఉండిపో. పద. మా మామయ్యా తో పరిచయం చేస్తాను. ఆ విషయాలు మరిచిపో."
రాజ్ ను తమ యింటికి పిలుచుకు పోయాడు గోపీ.
రాజ్ ను చూసిన గోపీ వాళ్ళ మామయ్య "నువ్వా, అబ్బాయ్! రా కూర్చో" అన్నాడు.
రాజ్ ఆయన్ను ఆనందరావు గారి బాల్య స్నేహితుడుగా గుర్తించాడు. ఆనందరావు గారింట్లో నే ఆయనతో పరిచయమైంది.
"అదేమిటి , మామయ్యా! అతడు నీకు తెలుసా?' ఆశ్చర్యంతో అడిగాడు గోపీ.
"నా సంగతి సరే. ఇతడు నీకలా తెలుసోయ్?' తిరిగి ప్రశ్నించాడు ముకుందయ్య.
"వీడు నా ప్రాణ మిత్రుడు, మామయ్యా!"
"ఇతడు నా బాల్య స్నేహితుడి కి ఆప్తుడు."
"ఆ" అన్నాడు గోపీ.
ఇంతలో అక్కడికి ముకుందయ్యా కూతురు శారద వచ్చింది.
"మా అమ్మాయి శారద' అంటూ పరిచయం చేశాడు ముకుండయ్య.
శారద బావ చెప్పుతుండగా రాజ్ ను గురించి విన్నది. ఇప్పుడు ప్రత్యక్షంగా చూసింది. బావ చెప్పిన దానిలో అసత్యమేమీ లేదనిపించింది. అటువంటి స్నేహితుడిని సంపాదించుకొన్న బావను అభినందించకుండా ఉండలేక పోయింది.
