Previous Page Next Page 
వాసన లేని పూలు పేజి 16

 

                                                   12
    రాజు ఉద్యోగ ప్రయత్నమేమీ మానుకోలేదు. ప్రతిరోజూ అదే పనిగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాడు. కాని ఎక్కడా దొరకలేదు. కేవలం నూరు, నూట యాభై రూపాయల ఉద్యోగం కోసం ఇన్ని అవస్థలు పడవలసి ఉంటుందని అతను కలలో కూడా అనుకోలేదు. కాని ఒకందుకు మాత్రం రాజు సంతోష పడుతున్నాడు. అదృష్టవశాత్తూ ఈ దూర దేశంలో తెలిసిన వాళ్ళెవరూ లేరు. తన పూర్వపు స్థితిని , ఆత్మాభిమానాన్ని చంపుకొని ఎవరి ముందైనా ప్రాధేయ పడటానికి తాను సంకోచించవలసిన అవసరమేమీ లేదు. తన హీన స్థితి తనవాళ్ళ చెవుల బడుతుందనే భయమూ లేదు. అదే అతని సంతృప్తి. కాకపోతే కొన్ని సుఖాలను వదులుకొని, కొన్ని కష్టాలకు లోను గావలసి ఉంటుంది. దానికి రాజు ఇప్పుడు సిద్దంగానే ఉన్నాడు. వనజ ఉదయమే అల్టిమేట్టం ఇచ్చింది. ఇవ్వాళ కొట్టువాడికి డబ్బివ్వక పొతే మాట దక్కదని. అందుకని ఆ వేళ మరీ పట్టుదలతో ఆఫీసుల చుట్టూ తిరిగాడు. కొన్ని చోట్ల అసలు ఖాళీలే లేవు. మరికొన్ని చోట్ల ఉన్నవాళ్ళనే ఊస్టూ చేస్తున్నారు. ఒకచోట మాత్రం ఒకటి రెండు నెలల్లో ఖాళీలు రావచ్చునని ఆశ పెట్టారు.
    మధ్యాహ్నానికి అలిసిపోయిన శరీరంతో, వాడిపోయిన ముఖంతో హాస్పిటలు రోడ్డు వెంట ఇంటి దోవ పట్టాడు. కడుపులో ఆకలి మండి పోతుంది. హోటలు కెళ్ళటానికి జేబులో డబ్బు లేదు. అలాగే చెమటలు కక్కుకొంటూ మండు టెండలో తారు రోడ్డు వెంట తల వొంచుకొని నడుస్తున్నాడు. అంతలో వెనక నుంచి వేగంగా ఒక కారు వచ్చి రాజును దాటి కొంచెం దూరం పోయి, కీచు మంటూ ఆగిపోయింది. రాజు తలెత్తి చూసేసరికి విశాఖపట్నం లోని పూర్వ స్నేహితుడు రెడ్డి కారును పక్కకు తీసి, డోర్ తెరిచి కిందికి దిగుతున్నాడు. రాజు మనసు తీక్షణంగా పని చేసింది. వెంటనే జిల్లా పరిషత్ కాంపౌండు లోకి దూరి, దాని వెనుక ఉన్న అసంఖ్యాకమైన పూరి గుడిసెల్లో మాయమైపోయాడు.
    రామేశ్వరం పోయినా శనేశ్వరుడు వదలడన్నట్టుగా. ఉన్న ఊరు వదిలి ఇంత దూరం వచ్చినా సన్నిహితుడైన స్నేహితుడు కనిపించటం తో అంతవరకూ ఉన్న ఆత్మశాంతి కూడా లేకుండా పోయింది. రెడ్డిని కలుసుకునే ఆత్మస్థైర్యం ఇప్పుదతనిలో లేదు. మొదట ఎంత ఆత్మ బలంతో అన్నింటినీ త్యజించి వనజతో వచ్చి వేశాడో ఆ బలం ఇప్పుడు సన్నగిల్లి పోయింది. అవ్యక్తమైన ఆవేదనతో, బరువెక్కిన హృదయం తో ఇంటి కొచ్చేసరికి మరొక ఘోరమైన దృశ్యం కంట బడింది. ఇన్స్ పెక్టర్ గారి మొండమోపి వదిన వనజ తో పోట్లాడుతుంది. ఆవిడ పెద్దగా గొంతంతా చించుకుంటూ అరుస్తుంది. వనజ ముఖం కోపంతో ఎర్రబడి పోయింది. వనజ సమాధానం చెప్తూనే ఉంది గాని ఆవిడ గారి గర్జన ముందు నిట్టూర్పు ల్లా అవి ఎవరికి వినిపించడం లేదు. మిట్ట మధ్యాహ్నం , ఎండ తీవ్రంగా ఉండటం వల్ల అమ్మలక్కలెవరూ పోగు కాలేదు. రాజును అంత దూరంలో చూడగానే వనజ లోపలి కెళ్ళి పోయింది.
    లోపలి కొచ్చి "యేమిటి వనజా, ఈ గొడవ?" అడిగాడు రాజు. వనజ పేలవంగా నవ్వటానికి ప్రయత్నిస్తూ "ఏదో మా ఆడవాళ్ళ గొడవ లెండి. మీరు ముందు కాళ్ళు ముఖం కడుక్కుని రండి. భోజనం వడ్డిస్తాను." అంటూ మరో ప్రశ్నకు తావీయకుండా వంట గదిలోకి దారి తీసింది.
    ముందు గదిలో బట్టలు మార్చు కొంటున్న రాజుకు ఆ ముండ మోపావిడ గొంతు లౌడు స్పీకరులా వినవస్తూనే ఉంది..... అన్నీ భోగం వేషాలూ, కులుకులూ, ఎక్కడెక్కడ లేచి వచ్చిన వాళ్ళంతా ఈ బజార్లో చేరారు. ఇక మగాళ్ళు భార్యలతో కాపరాలు చెయ్యమంటే ఎలా చేస్తారు? ఆడదై పుట్టాక కాస్త మానం, మర్యాద ఉండాలి. చదువు కొన్నారట -- ఎందుకు గంగలో కలపనా? ఇదే చెప్తున్నాను-- అటువంటి వేషాలు వేస్తె ఇక్కడ సాగవు. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మసిల్తే మర్యాద దక్కుతుంది. లేకపోతె" --చదువూ, సంస్కారం గల ఉద్యోగస్తుల ఆడవాళ్ళు ఉపయోగించ వలసినది కాదు ఆ భాష. రాజు వినలేక చెవులు మూసుకున్నాడు. అసలు తగాదా ఎందుకు వచ్చిందో రాజుకు బోధపడలేదు. భోజనం దగ్గర అతను అడగనూ లేదు. వనజ చెప్పనూ లేదు. కాని "ఆ ముండమోపావిడ మాటలు " మాత్రం అతన్ని శూలాల్లాగా బాధిస్తూనే ఉన్నాయి. గబగబా నాలుగు మెతుకులు నోట్లో వేసుకుని ఇంట్లోంచి బయట పడ్డాడు. వనజ ఎక్కడకని అడుగలేదు. అసలీ మధ్యా -- రాజు ఉద్యోగ ప్రయత్నం మొదలెట్టిన దగ్గర్నుంచీ -- వనజ ఏదో ముభావంగా ఉంటోంది. ఇద్దరి మధ్య ఇదివరకున్న అన్యోన్యత ఇప్పుడు లేదు.
    రాజు హృదయ భారంతో ఎక్కడెక్కడో తిరిగాడు. హీన కులస్తులలో , సంస్కార రహితుల నోటంట వినవలసిన మాటలు ఇవ్వాళ మర్యాదస్తులనుకొన్న వారి నుంచి విన్నాడు. అదే అతన్ని ఎక్కువగా బాధిస్తోంది. ఆవిడ మాటల్లో పోలీసు వాళ్ళమనే అహంకారం అధికార దర్పం స్పష్టంగా కనపడుతూనే ఉంది. ఐనా తను అసమర్ధుడై నోరు మూసుకోవలసి వచ్చింది.

                 
    సాయంత్రం తిరిగి వస్తుంటే హాస్పిటల్ మీంచి కూరగాయలు తెస్తూ, ఇన్స్ పెక్టర్ గారి ముసలి నౌకరు గంగన్న కనిపించాడు. కొత్తలో రెండు కుటుంబాలు బాగా స్నేహంగా ఉన్నప్పుడు ఈ ముసలి గంగన్నే  తమ ఇంట్లో పనులు కూడా చేసి పెడుతూండే వాడు. మనిషి మంచివాడే. కాని ఇన్స్ పెక్టర్ గారింటికి సంబంధించిన ప్రతివారి మీద యిప్పుడు రాజుకు శత్రు భావమేర్పడి పోయింది. అందుచేత ఆ ముసలి వాణ్ణి ఆత్మీయంగా పలుకరించ లేకపోయాడు. కాని వాడు ఎంతో నమ్రతగా నమస్కరించి "బాబూ నేను అంతా విన్నాను. మీరేమీ బాధ పడనక్కర్లేదు. అది వట్టి గయ్యాళి ముండ బాబూ" అన్నాడు.
    వాడితో మాట్లాడటం రాజు కిష్టం లేక పోయినా, ఉత్కంట అణుచుకోలేక అడిగాడు 'అసలేం జరిగింది గంగప్పా?"
    "బాబూ, వారి ఉప్పూ పులుసు తింటున్న నేను యివన్నీ మీతో చెప్పకూడదు. కాని మీ ముఖం చూస్తుంటే చెప్పాలని పిస్తుంది. ఏముంది బాబు -- ఆ ఎదవ ముండ లేదూ -- మా అయ్యగారికి వదిన -- అది తన స్వంత చెల్లెలికే ద్రోహం తలపెట్టింది. చెల్లెల్ని అమాయకురాలిని చేసి అయ్యగారితో సంబంధం పెట్టుకొంది. యిప్పుడు యింటికి యజమానురాలైపోయింది. తనది కాని ఆ స్థానం తనకు కాకుండా పోతుందేమోనని దాని అనుమానం. అంతే బాబూ."
    అది రాజుకు తెలియని కొత్త సంగతేమీ కాదు. ఐతే యివాల్టి తగాదాకు దానికీ ఉన్న సంబంధం మాత్రం బోధపడలేదు. ఆ సంగతి నాకు తెలుసు కానీ దానికి, దీనికీ సంబంధ మేమిటి?" అన్నాడు.
    గంగన్న తమాషాగా నవ్వాడు 'అదేంటి బాబూ! మొకానికి ఎంత పౌడర్లూ, స్నో లు పూసుకుంటే మాత్రం అది ముసలదై పోతున్నది గదా? కాస్త వయసులో ఉండి, అందంగా ఉన్న అమ్మగార్ల నేవర్ని చూసినా అంతే. గిల్లీ కజ్జా పెట్టుకొంటుంది. అందరూ తనలాంటి వాళ్ళే నని దాని అనుమానం. ఒక్క మన వనజమ్మ గారి తోనే కాదు-- ఆ బజార్లో అందరితో అంతే పోట్లాట పెట్టుకొంటుంది. దాని బుద్దే అంత. మీరేం బాధపడకండి బాబూ"
    "ఐతే మాత్రం అందరి మీదా అలా అనుమానాలు పెట్టుకోవటం ఎలా వుంటుంది?"
    "బాగుండదనుకొండి" అసలు అయ్యగారు మంచోడైతే అనుమానాలేందుకు?" అన్నాడు గంగన్న
    ముసలి గంగన్న మాటలు రాజుకు కొంత ఊరట కలిగించినా అది తాత్కాలికమే అయింది. పూర్తిగా మనసును స్థిమిత పర్చుకోలేక పోయాడు. అది బజారన్న సంగతిని, వచ్చి పోయే జన వాహశ్యాన్నీ గమనించలేనంత గాడంగా ఊహ లోకంలో పడిపోయాడు. గంగన్న మాటల్ని బట్టి వాడు కల్ల కపట మెరుగని అమాయకుడనుకోవాలో, గొప్ప 'డిప్లామాట్" అనుకోవాలో తేల్చుకోలేక పోయాడు రాజు. ఆలోచించిన కొద్ది ఆ ముసలి వాడి మాటల్లో తన కింతవరకూ బుర్ర కేక్కని సూచన ఏదో ఉన్నదని పిస్తుంది. కాని ఎంత గింజుకున్నా అదేమిటో స్పష్ట పడటం లేదు. బుర్ర వేడెక్కి పోయింది. భరించరాని తలనొప్పి తో, కణతలు గట్టిగా నొక్కుకుంటూ నడవ సాగాడు. ఇల్లు దగ్గర కొచ్చేసింది. హటాత్తుగా రాజుకోక పాత సామెత గుర్తొచ్చింది. నిప్పు లేనిదే పొగ రాదు. ఔను -- ఏదో కారణ ముండి తీరాలి. ఏమీ లేకుండా ఇంత రాద్దాంతమేలా జరుగుతుంది? కాని వనజ -- అలా చేస్తుందా?అంత నీచురాలా? అదే నిజమైతే తన ఈ త్యాగానికి , బాధలకూ అర్ధమేమిటి? ఏమో-- చూడాలి. కొంత కాలం పరీక్షిస్తే , ఎప్పుడో ఆజాగ్రత్తగా ఉన్న సమయంలో అంతా బయట పడక మానదు. దొంగతనం, రంకుతనం ఎన్నాళ్ళని దాగుతాయి!
    వనజ టీ తెచ్చి ఇచ్చింది. రాజు ఆమె ముఖం కేసి చూడకుండా తల వొంచుకొని చప్పరిస్తూ "ఈ ఇల్లు మార్చేద్దాం. తక్కువ అద్దెలో గాంధి నగర్ లో మరొక చిన్న ఇల్లు చూసి వచ్చాను. ఏమంటావ్?' అన్నాడు సాలోచనగా.
    "మంచి పనే చేశారు. పీడ వదిలి పోయింది. లేకపోతె మనకెందు కండీ ఇంత పెద్ద ఇల్లు?" అన్నది వనజ.
    ఆమె సమాధానం అతనికి ఆశ్చర్యాన్నే కలిగించింది. ఇల్లు మార్చటానికి వనజ కూడా తొందర పడుతున్నదన్నమాట. ఆ ముండ మోపావిడ ఆరోపణలే నిజమైతే ఇల్లు మార్చటానికి వనజకి తొందరెందుకుంటుంది? అతని మనసు స్వాంతం చెందసాగింది. వేడి వేడి టీ అందుకు మరికొంత సహాయపడింది. ఛీ, ఛీ అసలు తనకీ అనుమాన మెందుకు వచ్చింది? మధ్యాహ్నం జరిగిన సంఘటన వలన మనసు వికలమై పోయింది. బహుశా అదే కారణం కావచ్చు. వనజ నిష్కళంక. అంత నీచానికి దిగాజారదు. అన్ని కేవలం నిరాధారమైన అనుమానాలే!
    రాజు ఇప్పటికీ మెల్లగా తలెత్తి ఆమె కళ్ళలోకి చూస్తూ "కొత్త ఇంటికి రేపు అడ్వాన్సు ఇచ్చి వస్తాను. ఎల్లుండి మారుద్దాం సామాను సర్ది ఉంచు" అన్నాడు ప్రశాంత స్వరంతో.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS