8
వారం రోజులూ నిమిషాల్లా దొర్లిపోయాయి. ఉపేంద్ర గానీ, భార్య గానీ కృష్ణ మోహిని వాళ్ళతో కలిసి వెళ్ళేందుకు అభ్యంతరం చెప్పలేదు. చటర్జీ సంబంధానికి వోప్పుకోనంత మాత్రాన ఒక ఆడపిల్ల మగపిల్లాడూ కలిసి షికార్ల కి వెడితే అది వేరే మాటా. నలుగురూ వున్నారు. స్నేహానికి గిరిగీసే తత్త్వం కాదు భార్య భర్తలిద్దరిది.
సాయంత్రం కాళ్ళు యీడ్చుకుంటూ యింటికి రాగానే కృష్ణ మోహినికి కూడా కాఫీ ఫలహారాలు అందేవి. గంగ కి టీ యిష్టం వుండదు. గంగతో బాటు అందరికీ కాఫీలు అందేవి.
చూడవలసిన ప్రదేశాలన్నీ చూడడం అయిపొయింది. నంద గోపాల్ కూతురి వైపు చూస్తూ "అయిందా నాన్నా చూడడం .' అని అడిగాడు ప్రేమగా. గంగ తరువాత యిద్దరు మగపిల్లలు పుట్టి పోయారు రాధిక కి. ఆ తరువాత చాలా యేళ్ళకి వినోద్ పుట్టాడు. అతడిని తాతగారూ, నాయనమ్మే చూసుకుంటున్నారు. యిప్పుడు వాడు పదేళ్ళ వాడు. ఆ వృద్దులిద్దరూ కొడుకుతో అన్నారు: "వీడు పెద్దయాక నీ దగ్గరికి వస్తాడు. మేమూ ఒక్కళ్ళమే. మీకెలాగూ గంగ వుంది, మా దగ్గర వుంచేయి.' అని.
రాధిక వోప్పుకుంది. ఎన్ని చదువులు చదువుకున్నా సెంటిమెంటల్ గా రాధిక కి మనసులో అనిపించేది . "మగపిల్లలు నా దగ్గర వుండడం వల్ల బ్రతకడం లేదో ఏమో. యెక్కడో వో చోట చల్లగా వుంటే అంతే చాలును,' అని.
ఆ తరువాత గంగ ని నంద గోపాల్ పిలిచేప్పుడు 'నాన్నా! ' అనడం అలవాటై పోయింది. గంగ సోఫా లో కూర్చుండి పోయింది. తండ్రికి సమాధానం యిస్తూ "అన్నీ చూశాం నాన్నగారూ. యింక వెళ్ళిపోదాం.' అన్నది.
నందగోపాల్ మరి రెండు రోజుల కన్నా యెక్కువ వుండనన్నాడు. చటర్జీ బలవంతంగా ఐదు రోజులకి వాయిదా వేశాడు.
పిల్లలిద్దరూ కాలేజీ లకి వెళ్ళారు. గంగ కృష్ణ మోహిని సెలవు పెట్టిన కారణంగా నార్కెల్ డాంగా వెళ్ళింది. గోవింద క్రింది హల్లో కుట్టు మిషను దగ్గర కూర్చుని రాధిక కి, గంగ కి తనకీ జాకెట్లు కుడుతోంది. నంద గోపాల్ వుదయం పది గంటలకే బజారు లోకి వెళ్ళాడు అలా తిరిగి వస్తానంటూ.
యిన్నాళ్ళకి చటర్జీ కి చెల్లెలితో ఏకాంతంగా మాట్లాడేందుకు అవకాశం కలిగింది. అతను చెల్లెల్ని పిలిచి చాలా నెమ్మదిగా అన్నాడు: "నీతో చాలా ముఖ్యం అయిన విషయం మాట్లాడాలి రాధీ. అలా నా గదిలోకి వస్తావా'
రాధిక తలెత్తి అన్న వైపు అర్ధం కాని దానిలా చూసింది. చటర్జీ చెల్లెల్ని వెంట బెట్టుకుని తన గదిలోకి తీసుకు వెళ్ళాడు.
"ఏవిటన్నయ్యా అంత రహస్యం . ఏం మాట్లాడాలను కుంటున్నావు.' అని అడిగింది కుతూహలం అణుచుకోలేక.

చటర్జీ ఐదు నిమిషాలు శూన్యం లోకి చూస్తుండి పోయాడు. ఆ తరువాత యిలా అన్నాడు: శ్రీకాంత్ ని నేనెంత ప్రేమగా చూశానో అదృశ్యరూపుడైన ఆ దైవానికి తెలుసును. యేళ్ళు గడుస్తుంటే గోవిందమనసు నొప్పించకుండా వాడికి బాధ కలగకుండా యెంతో జాగ్రత్తగా వుంటూ వచ్చాను. ఉమేష్ పుట్టాడు. తెలిసిన వూళ్ళో అయితే అందరి ఎదుటా వాడికి తన బ్రతుకు వెనక చరిత్ర తెలిసిపోతుందని కావాలనే కలకత్తా లో సెటిల్ అయిపోయాను.'
'లోకానికి వెరిచి చేసిన యే పనుల కైనా విజయం లభిస్తుందని యిన్నేళ్ళ అనుభవం లోనూ గ్రహించాను. నా యెదుట కాకపోయినా చాటుమాటుగా ఎందరో యెన్నో మాటలన్నారు. యిప్పటికీ అంటున్నారు. బాగా తెలిసిన వాళ్ళు వెలివేసినట్లు యింటికి రావడమే మానుకున్నారు.'
ఆనాడు....చటర్జీ కళ్లల్లో నిస్సహాయతని చూపిస్తూ కన్నీరు ప్రవేశించింది. అతను తిరిగి ప్రారంభించాడు చెప్పడం "నేను వాడి వెనుక కొద్ది గజాల దూరంలో నడిచి వస్తున్నాను. మా యిద్దరికీ మధ్య కొందరు కలకత్తా లో నాకు బాగా తెలిసిన వాళ్ళూ, మంచి పలుకుబడి కలవాళ్ళూ అదే దారిన నడుస్తున్నారు.
'వాడు మన చటర్జీ కొడుకు కదూ' అన్నాడు అందులో ఒకతను.'
'అలాగే అందరి కళ్ళూ కప్పాడు. హైదరాబాదు లో యేవతి నో వెంట బెట్టుకుని వూళ్లు తిరిగి యెరగని వూరు కదా అని ఈ వూరు వచ్చి స్థిర పడ్డాడు. పెళ్లి కాని క్రితం ఏడో హిస్టరీ వుందిలే' రెండో అతను అన్నాడు.
'ఛ! మీరంతా అపార్ధం చేసుకున్నారు అతన్ని. అతను సంఘ సంస్కరణ చేశాడు. విడో ని కొడుకు వుండగానే పెళ్లి చేసుకున్నాడు. అతని అసలు కొడుక్కీ వీడికి పోలికలు కంచుకాగడా వేసి వెతికినా కనిపించవు.'
"అంటే....?
"అదంతేలే. యిప్పుడు ఆ ఉపేంద్ర రోజూ సాయంకాలం పూట యెందుకు వెడుతున్నాడంటావు ? కూతుర్ని చిన్న వాడికి యిచ్చేందుకు . అప్పుడు సరీపోతాయి సంప్రదాయాలు. కులం తక్కువ పిల్లకీ యిలా సంఘ సంస్కరనొద్దరణ చేసిన పిల్లాడికీ.'
'ఉపెంద్రుని బ్రాహ్మణులూ యెవరూ రానివ్వడం లేదు. ఆ పిల్లని చేసుకుంటే రేపు చటర్జీ ని కూడా వెలివేయరూ.'
'యెందుకు వేయరూ? ఈ సంగతి నలుగురికో ఐదుగురికో తెలుసు. అతను లక్షాధికారి కావడంతో ధైర్యంగా యెవరూ ముందు అనడం లేదు. రేపు ఉపేంద్ర కూతుర్ని చేసుకుంటే అతని లక్షలకి గోలీ కొట్టి అతన్ని కులం లోంచి తప్పించేస్తారు.'
'మరి ఉపెంద్రుడి ఆశ నెరవేరి నట్లేనా.'
'శ్రీకాంత్ ని యిస్తే సరి. గంతకు తగ్గ బొంత.'
' ఆ మాటలు విన్నాక నా కాళ్లు తడబడినాయి. నేను అక్కడే కళ్ళు తిరిగి పడిపోను కదా అనిపించింది. నేను పెళ్లి చేసుకునే ముందు యెన్నో అనుకున్నాను. ఛట్! సంఘానికి దేనికి దడవడం అని. కానీ యీ సంఘమే యెద్దు మీద పుండు ని కాకి దొలిచినట్లుగా పీల్చి పిప్పి చేస్తుంటే తలెత్తు కోలేకుండా వున్నాను. తల పైకెత్తి బజార్లో నడవడం గగనమై పోతోంది. డబ్బు వుంటే చాలు ప్రపంచాన్ని చిటికెన వ్రేలి మీద ఆడించవచ్చును అనుకున్నాను. కానీ యీ డబ్బు నాకు కావలసిన రీతిగా గొడుగు పట్టడం లేదు. మన సంప్రదాయాలు యేమిటో యిప్పుడు అర్ధం అయాయి.
రేపు శ్రీకాంత్ ని కూతుర్ని చేసుకుంటే వాళ్ళూ ఈ సమస్యల్నే యెదురుకోవాలి.'
'శివరాం అమెరికన్ ని చేసుకోలేదా ?' అని ప్రశ్న వేస్తావు నువ్వు.
'వాడు మనవాళ్ళ కే దూరం అయిపోయాడు. మనకోసం వాడేమీ బెంగ పెట్టుకోవడం లేదు. తెగతెంపులు చేసుకున్న వాడికీ, సంఘానికి దూరం కాలేని నాకూ హస్తి నుశాంతకం తేడా వున్నది. నేను పడే మానసిక బాధ చెల్లెలివైన నువ్వు పడుతుంటే నేను చూడలేను. గంగ కి అభం శుభం తెలియదు. విడో కొడుకు అని అందరూ అంటుంటే యెంత యాతనగా వుంటుందో నీకు అర్ధం కాదు' చటర్జీ కళ్ళు తుడుచుకున్నాడు.
రాధిక పూర్తిగా విని తేలికగా నవ్వింది. వెనువెంటనే గంబీరంగా మారిపోయింది. తలపుల్ని చాలా యేళ్లకి వెనక్కి పంపి అతని దగ్గరగా వచ్చి భుజం మీద చేయి వేసి 'పిచ్చి అన్నయ్య. నేను ఆనాడు పెళ్లికి ముందూ, తరువాత కూడా చెప్పాను. నువ్వా ఫీలింగ్ తో గడుపుతే బ్రతకలేవని. సంఘం!' అని రాధిక నవ్వింది. 'నీ యిష్టం వచ్చినట్లు నువ్వు చేస్తే ఈ సంఘం ఏం చేస్తుందన్నయ్యా. వెర్రి గానీ, బ్రతికి నన్ని రోజులు బ్రతకం ఈ భూప్రపంచం లో , ఎప్పుడో వోనాడు వెళ్ళి పోవలసిందే. శ్రీకాంత్ కి యింత వరకూ వాడు యెవరో తెలియదు. నీ కొడుకే అనుకుంటున్నాడు. వాడి మొహం చూస్తె వాడిని కృషి మోహిని కి యిచ్చి వదిలించుకోవాలని నీకెలా అనిపిస్తోందన్నయ్యా.'
'మనం యేమీ కానిపని చేసి సంఘానికి కీడు తేబోవడం లేదు. శ్రీకాంత్ కి గంగని చేసుకోవడం వల్ల వాడు మన పిల్లాడిగా మరింత దగ్గిర అవుతాడు. కృష్ణ మోహినిని ఉమేష్ కి చేసుకుంటే ఒక ఆడపిల్ల బ్రతుకు తీర్చి దిద్దిన పుణ్యాన్ని భగవంతుడు యెక్కడికి పోనిస్తాడు. ఆలోచించన్నయ్యా న్యాయవేత్తవి. న్యాయా న్యాయాలు నీకన్నా చాలా చిన్నదాన్ని నాకు తెలుస్తాయా . నీ స్థితిలో నేనే వుంటే అసలు హైదరాబాదు వదిలే రాకపోయేదాన్ని. పిరికివాళ్ళ ని సమాజం తరిమి తరిమి కొడుతుంది. అలా పారిపోయి పారిపోయి యెంత దూరం, అనీ, యెక్కడ అనీ తలదాచుకుంటాం ?'
'ఒక విషయం అడగనా అన్నయ్యా.'
రాధిక వైపు చూశాడు అతను, చెప్పమన్నట్లు.
'శ్రీకాంత్ ని యిన్నేళ్ళు పెంచావు: నీకు మనసులో కూడా వాడు పరాయి వాడనే అనిపిస్తోందా అన్నయ్యా. పెంచిన ప్రేమ కన్న కొడుకుగా ఒప్పు కొనివ్వ లేనంత బలహీనం అయిపోయిందా ,' రాధిక యింకా అన్నగారి మెడ చుట్టూ చేతులు వేసే వుంచింది.
చటర్జీ విధి లేనట్లు బలవంతంగా నవ్వుని మొహం మీదికి తెచ్చుకున్నాడు. చెల్లెలి వైపు తలెత్తి చూశాడు.
'చెప్పన్నయ్యా,'' అని అడిగింది రాధిక.
అతను ఎడం చేతి మీద కుడిచేతిని అన్చాడు, 'ఈ రక్తం లోంచి రక్తం వేరు పడినాక విధిగా పక్షపాతం లాంటిది ప్రవేశిస్తుంది. అంతరాత్మ వెక్కిరిస్తూ 'నీ కొడుకేమీ కాదు శ్రీకాంత్. అసలు బిడ్డ వీడు' అంటుంది వుమేష్ ని చూసి నప్పుడు. వాడినీ వేడిని ఒక్కటిగా చూసేందుకు ఒప్పుకోదు అంతరంగం.'
రాధిక చటుక్కున చేతుల్ని తీసేసింది. అన్న మెడ మీద నుంచి. 'మనసులో యింత బేధం వుంచుకుని నలుగుర్ని మభ్యపెట్టి బ్రతకడం కష్టం. అన్నయ్యా. నాకు ముందే తెలుసును. ఏదో ఒకరోజు నువ్వీపని చేస్తావని. నాకు యిచ్చి వేయాల్సింది వాడిని అప్పుడే.'
'తనదాకా వస్తే గానీ తలనొప్పి బాధ తెలీదంటారు. నువ్వు మాత్రం అత్మసాక్షిగా చూసేదానివా వాడిని.'
'హ' తిరస్కారంగా చూసింది రాధిక. 'స్త్రీని అన్నయ్యా నేను స్త్రీని. అలా చెప్పుకునేందుకు యెంత గర్వంగా వుందో తెలుసా. మీ మగజాతికి మల్లె మాకు ఈర్ష్యా ద్వేషాల్ని యెక్కువగా యివ్వలేదా విధాత. సహనం ఎన్నో రెట్లని మీ కన్నా యెక్కువగా మాలో చేర్చి వుంచాడు. శ్రీకాంత్ కి యిప్పుడైనా నిజం చెప్పెయ్యి.'
చటర్జీ త్రుళ్ళి పడ్డాడు" 'ఒద్దు , ఒద్దు వాడికి నేనంటే యెంతో ప్రేమ. ఆ ప్రేమని నేను పోగొట్టుకోలేను. వాడిని చూస్తుంటే చాలని పిస్తోంది. వాడికి దూరంగా వుండలేను అది మాత్రం నిజం.'
'ఛ! యెంత స్వార్ధ పరుడివి నువ్వు. వాడి ప్రేమ, నీ పట్ల పూజ్యా భావం అన్నీ నీ స్వంతం కావాలేం. వాడికి మాత్రం ఇవేం అవసరం లేదు. మనిషి యెప్పుడూ మనిషే అన్నయ్యా. నూటికి యే ఒక్కరో యిద్దరో దైవాన్ని గుర్తు చేస్తుంటారు!
'నువ్వు ఆవిడని చేసుకుంటానని నాతొ అన్న రోజున మా అన్నయ్య మానవా తీతుడు అనుకున్నాను. నిజం యెంత చేదు. ఫలితాన్ని యిస్తుంటే ఆవిడ ఖర్మకి ఆవిడని వదిలివేసినా బాగుండి పోయేదాని యిప్పుడనిపిస్తోంది. మించి పోయిందేమీ లేదు. వాడిని నాతొ పంపెయ్యి.'
'వుహూ నేనలా చేయలేను. వాడు నాకు కావాలి.' చటర్జీ బాధగా కణతలు రుద్దుకుంటుండిపోయాడు. కుట్టుపని పూర్తీ చేసిన గోవింద మెట్ల మీంచి వస్తున్న అలికిడి ని ఆవిడ కాలి మట్టేలు శబ్దం ద్వారా పసిగట్టిన చటర్జీ చెల్లెల్ని కూర్చోమని సైగ చేసి రాజకీయాల్లో కి, సినిమా విశేషాల్లోకి , కలకత్తా గురించీ కలగాపులగం గా సంభాషణ ప్రారంభించాడు.
గోవింద వంట యింట్లోకి వెళ్ళి పోయింది. కుట్టు బట్టలు బీరువా లో పెట్టేసి.
