Previous Page Next Page 
ప్రసన్నకుమార్ సర్రాజు కథలు 2 పేజి 16


                                   

    "ఏంటి బావా! ఇంత రద్దీగా ఉందీ? ఈ ప్రయాణీకుల గోలకి తోడు అరనిమిషం గ్యాప్ లేకుండా ఎనౌన్స్ మెంట్ల హోరు, కనీసం కూర్చోడానికి కాస్త జాగా కూడా లేదేంటి?" ఆశ్చర్యపోయాడు పెదరాయుడు.
    "నువ్వు ఊళ్ళోంచి కదిలి, ప్రయాణం అంటూ పెట్టుకుని చాలా కాలం అవలా? అందుకే నీకంతా కొత్తగా ఉంది" అన్నాడు చినరాయుడు.
    'అవున్లే. పొలం పనుల్లో తీరికేక్కడ చిక్కిందీ? ఇదుగో .... రామి సుబ్బారెడ్డి గారింట్లో పెళ్లి..... వెళ్ళకపోతే బాగోదు .... ఎంతైనా ఎమ్మీగారు. సాయంగా ఆహ్వానించారు. అందుకని బయల్దేరక తప్పలేదు. అవునూ! మనం ఈ రద్దీలో విశాఖపట్నం టైముకి చేరుకోగలమంటావా?"  సందేహపడ్డాడు పెదరాయుడు.
    "ఏం చేస్తాం బావా! సమ్మర్ రష్. ఆ ట్రావెల్ ఏజెంట్ "అతి కష్టం మీద ఈ ఫ్లైట్ కి దొరికింది, ఈ ఒక్కసారికి సర్దుకొండ"ని బ్రతిమిలాడాడు" చెప్పాడు చినరాయుడు.
    హ్యాండ్ బ్యాగ్ ని భుజానికి తగిలించుకుని లాంజ్ లో ఓ చోట జాగా చూసుకుని నిల్చున్నారు ఇద్దరూ.
    దూరంగా వచ్చే విమానాలూ, పోయే విమానాలూ ఇదు నిమిషాలకి ఐదో పదో పై కేగురుతున్నై కిందికి దిగుతున్నై.
    ఎయిర్ పోర్టు లాంజ్ కిటకిటలాడుతోంది. కుర్చీల్లో చోటులేక నేలే మీదే గుంపులుగా సెటిలయ్యారు ప్యాసింజర్లు.
    'అమ్మా! అయ్యతో సెప్పవే .... ఒచ్చేప్పుడైనా రైల్లో వద్దామని..."
    "ఉష్... అయ్య వింటే చెమడాలిరగదీస్తడు...." తల్లి సర్దుతోంది ఎనిమిదేళ్ళ కొడుకుని.
    జేబులోంచి చుట్ట తీసి నోట్లో పెట్టుకుని అగ్గిపెట్టె కోసం తడుముకుంటూ "అడికేం తెలుసే! రైలు ప్రయాణవంటే మాటలా! అది అయ్యకంత తాహతు లేదని సెప్పినా అర్ధం కాదు ఎదవకి ...." అని ప్రేమగా కొడుకుని చూశాడు తండ్రి. కొడుకు మొహమాటంగా తల్లి కొంగు చాటు చేసుకుని గునుస్తూ "ఎప్పుడూ ఇమానమేనా.... పొద్దుననగా వచ్చాం..... ఇంతవరకూ మనం ఎప్పుడేడతామో తెలీదు.... అమ్మా.... ఆకలేస్తోందే" అన్నాడు.
    "ఉండు నాయనా" అని మూటలోంచి చిన్న స్టవ్వు తీసి కింద పెట్టి, చిన్న సంచీ లోంచి రెండు డబ్బాల బియ్యం తీసి గిన్నెలో వేసి, నీళ్ళు పోసి, స్టవ్ వెలిగించటానికి మొగుడి దగ్గిర ఆగ్గిపెట్టే తీసుకుంది. ఒకతను వచ్చి "అగ్గిపుల్ల 'ఉఫ్' మని ఆర్పేసి "ఇక్కడ వంటలు చెయ్యకూడదు. ఇదిగో .... నువ్వు కూడా చుట్ట అర్పేయ్....లేకపోతే పోలీసులోస్తారు" అని బెదిరించి వెళ్ళిపోయాడు.
    పెదరాయుడు బామ్మర్ది కేసి చూశాడు. చినరాయుడు గమనించనట్లు తల పక్కకి తిప్పుకున్నాడు.
    అంత గోలలోనూ దారి చేసుకుంటూ "బ్రిలియన్స్ కూరగాయలూ ......ఆర్గానిక్ పళ్ళండి...." అని అరుస్తూ ఒకతను వచ్చాడు. నెత్తి మీద తువ్వాలుతో చుట్టిన కుదురు మీద తట్ట వుంది. మనిషి నీరసంగా వున్నాడు.
    అంతలో ఇంకోకతను "పల్లీలండి బాబూ.... అంబాణి వారి పల్లీలూ కాలక్షేప టాటా బైబై బఠాణీలు" అంటూ వచ్చాడు. ఒకళ్ళిద్దరు కొన్నారు. ఇద్దరు తట్టలు దించి, పిచ్చా పాటీలో పడ్డారు. "సంజీవనీ మాత్రలూ, కస్తూరీ మాత్రలూ , అపూర్వచింతామణి కధలు , కాలజ్ఞానం పుస్తకాలూ" అంటూ ఇంకొకడు అమ్ముతున్నాడు.
    పెదరాయుడు "ఏమిటి బావా ఇదంతా" అని విసుగ్గా మొహం పెట్టాడు. చినరాయుడు విరక్తిగా నవ్వి "కార్పోరేటీకరణ బావా! సరళీకృత విధానం ..... మనం నోట్లో పెట్టుకునే ముద్ద మీద కూడా ఏదో ఒక కంపెనీ పేరు ఉండే రోజులొచ్చాయ్...." అంటుంటే ఒక సూటు మనిషి తుమ్ముకుంటూ వచ్చాడు. అవి నిజం తుమ్ములా లేక ఏదైనా మాటలబుందా అనిపించింది చినరాయుడికి.
    హచ్ హచ్ హచ్ అని అతను తుమ్మినప్పుడల్లా అతని పక్కనే వున్నతను చిరంజీవి .....చిరంజీవి .... అంటున్నాడు. ఇద్దరూ చుట్టానికి మర్యాదస్తుల్లాగే ఉన్నారు. మరి ఈ తుమ్మడాలేమిటో , పక్కవాడు అశీర్వదించటాలేవిటో అర్ధం కాలేదు.
    తుమ్మువాడు ఒచ్చి ఆగి "సార్! ప్రీ పెయిడ్ కనెక్షన్ తీసుకోండి సార్! పొద్దుట్నించి బోణీ అవలేదు" అని బతిమిలాడాడు.
    "ఏ కనెక్షన్? ఏ కంపెనీ" అడిగాడు పెదరాయుడు. అంతే అతను మళ్ళీ తుమ్మాడు "హచ్" అని.
    పక్కవాడు "చిరంజీవి" అని, "సార్.... మీరు తీసుకునే కనెక్షన్ తో చిరంజీవి కొత్త సినిమా టిక్కెట్లు ఫ్రీగా ఇస్తాం సార్' అన్నాడు.
    ఇంతలో ఎనౌన్స్ మెంటు వినిపించింది. "హైదరాబాదు నుంచి విశాఖపట్నం పోవు విమానము ఏడో నెంబరు రన్ వే మీద బయలుదేరుటకు సిద్దంగా ఉంది" అని.
    వెంటనే గోలగోలగా లేచారు జనాలు.
    ట్రంకు పెట్టెలు, నెత్తి మీద పెట్టుకుని , గోతాలు భుజాన వేసుకుని పరుగెత్తారు.
    ఆ రద్దీ సద్దుమణిగాక చివర్లో ఎక్కారు బావ, బావమర్దులు. వీళ్ళ సీట్ల మీద కర్చీఫ్ లు వేసున్నై. ఇద్దరూ కాసేపు ఇబ్బందిగా అక్కడే నిల్చున్నారు. ఇంతలో ఒక ఎయిర్ హాస్టస్ వచ్చి, ఆ రెండు రుమాళ్ళు తీసేసి, "కూర్చోండి సార్.... ఇవి నేనే వేశాను ' అంది చిరునవ్వుతో.
    వాళ్ళు తెల్లబోయారు. " అయినా బోర్డింగ్ ప్యాసులు మీద సీటు నెంబర్లుంటే ఇదేంటి మరీనూ" అన్నాడు పెదరాయుడు.
    "ఈ జనం సీటు నెంబర్లు ఫాలో అవరు. మీరు రావటం చూసి, మీరు ఇబ్బంది పడకూడదని నేనే వేశాను" అంది ఆ అమ్మాయి.
    "మేం నీకు తెలుసా? మేం ఎప్పుడూ ఇలాంటి చవక ఫైట్లు ఎక్కలేదే!.... అన్నట్లు నిన్ను ఎక్కడో చూశానమ్మాయ్.... ఆ.. మా ఎదురింట్లో ఉండే జిల్లేళ్ళ సుబ్బరత్నానివి కదూ?" అన్నాడు చినరాయుడు.
    ఆ అమ్మాయి "అవును సార్!" అంది నవ్వుతూ.
    అప్పుడే ఇంకో ఎయిర్ హాస్టస్ ఆ టేపుగా వచ్చి "హయ్ సుబ్బరత్తో జిలేలే" అని పలకరించి పైలట్ క్యాబిన్ వేపు వెళ్ళింది.
    ఇద్దరూ కూర్చున్నారు. విమానం లోపలంతా గోలగోలగా ఉంది. వెనక చివరి సీట్లో అయితే ఓ గంప నిండా కోళ్ళు తీసుకెడుతున్నాట్టున్నాడు ఓ ఆసామీ. అవి గోలగోలగా అరుస్తున్నాయి. ఒకటి రెండు కోళ్ళయితే అప్పుడే తెల్లావారినట్లు కొక్కొరొకో అని కూస్తున్నాయి.
    ఒక ఎయిర్ హోస్టెస్ వెళ్ళి, అతన్ని అందంగా విసుక్కుంది.
    "ఇలా కోళ్ళూ, మేకలూ విమానంలో తీసుకురాకూడదు...." అన్నది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS