Previous Page Next Page 
చైనా యానం పేజి 17


                                             పధ్నాలుగు

    తప్పుడు లెక్కలుచూపించి ప్రభుత్వ ధనం అపహరించినందుకు శిక్ష అనుభవిస్తున్న ఒక ఖైదీతో మా ప్రతినిధి వర్గంలో ఒకాయన (న్యాయవాది) సంభాషణ జరిపాడు. (భాషాంతరీకర్త ద్వారా)
    సాంస్కృతిక విప్లవానికి పూర్వం పది సంవత్సరాల పాటు 15 వేల యువాన్ ల దాకా అతడు డబ్బు కాజేశాడట.
    "ఆ డబ్బంతా ఏం చేశావు?"
    "తిన్నాను. తాగేశాను. అంతే."
    సాంస్కృతిక విప్లవం వల్ల చైతన్యం పెరిగిన ప్రజానీకం అతని దొంగతనాన్ని బయటపెట్టారు. సక్రమమైన న్యాయ విచారణ జరిపి 15 సంవత్సరాల శిక్ష పడింది.
    దీన్ని కఠిన శిక్ష అని గాని, సులభ శిక్ష అని గాని వర్ణించనక్కరలేదు. బయట కార్మికులంతా ఎలా పనిచేస్తారో అవే పనిగంటలు. చిత్రలేఖనం, కుట్టు పనులు, ఉచిత వైద్యసహాయం.
    తరచుగా కార్మికులు, రైతులు, సైనికులు ఈ ఖైదీలకు ఉపన్యాసాలిస్తూ వుంటారు. మాసానికి ఒకసారి ఖైదీల కుటుంబ సభ్యులు వచ్చి చూసిపోవచ్చును.
    నీ గురించి నీ కుటుంబ సభ్యులు ఏమని భావిస్తారు? అని 15 సంవత్సరాల శిక్ష అనుభవిస్తున్న ఖైదీని అడిగించాము.
    వెంటనే జవాబు వచ్చింది-They hate me!(వాళ్ళు నన్ను అసహ్యించుకుంటారు అనీ.)
    ఖైదీలకు ఉపన్యాసాలతో బాటు, సామ్యవాద నిర్మాణం జరుగుతున్న చోట్లకు తీసుకువెళ్ళి నూతన సమాజ స్వరూపాన్ని చూపిస్తారు.
    ఖైదీలను (రాజకీయ ఖైదీలను సహా) చిత్రహింసలు పెట్టడం జరగదు. కొట్టడమే కాదు, తిట్టడము కూడా ఉండదు.
    జైలుశిక్ష ముగించి బయటకు వచ్చిన ఖైదీ మామూలు మనిషిగా, మర్యాదగా జీవించగల పరిస్థితులను కల్పించడమే చైనీస్ శిక్షా విధానపు ధ్యేయం! ఖైదీలు తాము చేసిన తప్పుల్ని అంగీకరించడమూ, చేసిన దానికి హృదయ పూర్వకంగా పశ్చాత్తాపం చెందడమూ సర్వ సాధారణం.
    "చైనాలో Juvenile delinquency వుందా?" అని మాలాయరు ప్రతినిధి ప్రశ్నించాడు. ఇంగ్లీషులో యం.ఎ.ప్యాసయిన మా భాషాంతరీకరణ కర్తలకు ఆ ఇంగ్లీషు మాటలకు అర్థం బోధపడలేదు. "మైనర్ కుర్రాళ్ళ చెడుతిరుగుళ్ళు తిరగడం" అనే అర్థంవచ్చేటట్టుగా నేను వివరించాను.
    "అవి మా సమాజంలో అసంభవం. ఎందువల్లనంటే పిల్లలందరూ ఒకరినొకరు సరిదిద్దుకుంటూ సంత్ర్పవర్తన సంతరించుకుంటారు. ప్రధానంగా సాంస్కృతిక విప్లవం సత్ప్రవర్తనకు సంబంధించినది" అని మాకు జవాబు వచ్చింది.
    ఇక్కడ నాకో కథ జ్ఞాపకం వస్తోంది. కథ కాదు. జరిగిందే అనుకుంటాను.
    అవి హిందీ చీనీ భాయీ భాయీ రోజులు. అప్పుడు మన ఇండియా నుండి ఒక ప్రతినిధి వర్గం చైనాలో పర్యటన చేసింది.
    పీకింగ్ లో ఒక ప్రాధమిక పాఠశాల. లెక్కల క్లాసు జరుగుతోంది. భారతీయ ప్రతినిధి వర్గంలో ఒకాయన విద్యాశాఖకు చెందినవాడు- ఆయన "ఒక లెక్కల సమస్య ఇస్తాను. జవాబు చెప్తారా?" అని అడిగాడు- ఓ అన్నట్లు పిల్లలందరూ చేతులెత్తారు. "సరే చేతులు దించం" డన్నారాయన.
    ఆయనవేసిన ప్రశ్న ఇది-"ఒక పాలవర్తకుడు ఒక లీటరు పాలలో పదిలీటర్లు నీళ్లు కలిపి లీటరు రూపాయి చొప్పున అమ్మితే అతనికేమిటి వస్తుంది?"
    జవాబు మాకు తెలుసునన్నట్లు మళ్ళీ పిల్లలందరూ చేతులెత్తారు. ఒక కుర్రవాణ్ణి చూపించి, "నువ్వు చెప్పు" అన్నాడాయన.
    "పది సంవత్సరాలు జైలుశిక్ష" అన్నాడు కుర్రాడు చైనీస్ భాషలో.
    ఇది నేను మనదేశంలో విన్న కథ. కాని, దీన్ని కథగా కొట్టి పారెయ్యడానికి వీలులేదు.
    పెట్టుబడిదారీ విధానంలోని చట్టాలు ఆస్తిని కాపాడటానికి ఉద్దేశించినవయితే కమ్యూనిస్టు సమాజంలో చట్టాలు సంఘ వ్యతిరేకమయిన నేరాలను శిక్షించడానికి ఉద్దేశించినవి.
    "సంఘ వ్యతిరేక రచయితలను శిక్షిస్తారా?" అని నేను ప్రశ్నించాను. "అలాంటి రచనలు చేసేవాళ్ళకు ప్రత్యేకంగా శిక్షలంటూ లేవు. తీవ్రంగా విమర్శించడం మాత్రమే జరుగుతుంది" అని తెలుసుకున్నాను.
    ఆ మధ్యాహ్నం 11 గంటలకు డాక్టర్ బాసూ మా అందరి తరఫునా కృతజ్ఞతలు తెలిపిన తర్వాత 11.20 షాంఘై నగరం చైనాలోని భారీ పరిశ్రమల కేంద్రాలలో అతి ముఖ్యమైనది.
    అక్కడ తయారయ్యే మోటారు కార్లలో ఒకరకానికి "షాంఘై" అని పేరు. ఈ కార్లలోనే మేము అన్నిచోట్లా ప్రయాణం చేశాము. ఇవి మన ఎంబాసిడర్ కార్లలాగా ఉంటాయి. కాని అంతకన్న బలిష్టమైన నిర్మాణం.
    2.20 గంటలకు కార్మికుల నివాస గృహాలను సందర్శించాము. వాటి నిర్మాణం 1952లో ప్రారంభమయింది. అప్పుడా ప్రాంతమంతా ఒక పెద్ద బంజరునేల. విమోచానానంతరం అంచెలంచెలుగా గృహనిర్మాణం సాగింది. మొదట రెండు అంతస్తులు, తర్వాత మూడు, ఇప్పుడు నాలుగంతస్తుల భవనాలు.
    ఇవి 45000 మంది నివశించే 9900 ఇళ్లు.
    ఈ ప్రాంతాన్ని పరిపాలనా సౌకర్యం నిమిత్తం. 9 ఉపప్రాంతాలుగా విభజించారు. వీటిలో 4 కిండర్ గార్డెన్ లు, 4 నర్సరీలు, 7 ప్రాథమిక పాఠశాలలు, 3 మాధ్యమిక పాఠశాలలు, ఒక స్థానిక వైద్యశాల వున్నాయి. ఇద్దరేసి, ముగ్గురేసి "చెప్పులు లేని (Bare foot) డాక్ట"ర్లున్నారు.
    1958 నుండి వివాహిత స్త్రీలు ఫ్యాక్టరీలలో పనిచెయ్యడానికి ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది.
    ఇప్పుడీ ప్రాంతంలో 13 వర్కుషాపులున్నాయి.
    1000 మంది కార్మికులున్నారు.
    3.30 గంటలకు బాలబాలికల మరో సాంస్కృతిక ప్రదర్శన.
    4.45కు ఒక కార్మిక నివాసగృహం చూశాము. ముగ్గురు సభ్యుల కుటుంబం. తల్లి, తండ్రి, కొడుకు. కొడుకు వయస్సు 26 ఏళ్ళు. ఇంకా పెళ్ళి కాలేదు.
    (డాక్టర్ కోట్నీస్ పుత్రుడు 24వ ఏట ఇటీవలనే అవివాహితుడుగా మరణించాడు.)
    ఇంటిలో గ్యాస్, నీళ్ళు, విద్యుచ్చక్తి కారుచవకగా లభిస్తాయి. ఒక గదిలో రేడియో సెట్టు, టేబిల్ గడియారమూ ఉన్నాయి. ఒక బీరువాలో పుస్తకాలూ, పత్రికలూ వున్నాయి.    
    రాత్రి భోజనం చేసిన తర్వాత 8 నుంచి 9 గంటల దాకా బాత్ టబ్ లో స్నానం చేశాను. ఈ పది పదిహేను రోజుల్లో ఇది మూడవసారి స్నానం చెయ్యడం.
    22-12-76
    ఉదయం 8.30గంటలు చైనీస్ కమ్యూనిస్టుపార్టీ మొదటి కాంగ్రెస్ జరిగిన చోటు చూశాము.
    మావో నాయకత్వం క్రింద 12గురు వ్యక్తులు 1921, జూలై 1వ తేదీ నుంచి అయిదు రోజులు ఈ సమావేశం జరిపారు. (ఈ గృహంలో మొదటి నాలుగురోజులు మాత్రమే సమావేశం జరిగింది.) జూలై 4వ తేదీని ఫ్రెంచి గూఢచారులు ఈ రహస్య ప్రదేశానికి వచ్చి భోగట్టాలు చేశారు. మర్నాడు ఎవ్వరూ అక్కడ లేరు. అయిదవరోజు సభ ఒక స్టీం లాంచిలో జరిగింది.
    రాత్రి పాఠశాలల ద్వారా, పత్రికా ప్రచురణ ద్వారా చైర్మన్ మావో మార్క్సుజం - లెనినిజం విస్తృత ప్రచారం ఇచ్చారు. ఆ తొలి రోజుల్లో కమ్యూనిస్టు పార్టీ గ్రూపులుగా పనిచేసింది. వీటిలో 6 చైనాలోనూ, 2 విదేశాలలోను వున్నాయి.
    హునాన్, హూపే, షాన్ టుంగ్, క్వాంగ్ టుంగ్, పీకింగ్, షాంఘై చైనీస్ కేంద్రాలు.
    జపాన్ లోనూ, ఫ్రాన్స్ లోనూ చదువుకుంటున్న చైనీస్ విద్యార్థులు మొట్టమొదటి పార్టీ సభ్యులు - వీరిలో ముఖ్యుడు చౌ ఎన్ లై.
    ఒక్క ఫ్రాన్స్ నుంచి తప్ప మిగిలిన అన్ని గ్రూపుల నుండి మొదటి సమావేశానికి డెలిగేట్లు వచ్చారు. వీరి సంఖ్యా 12. దరిమిలాను వీరిలో నలుగురు పార్టీకి ద్రోహం చేశారు. ఒకడు జపాన్ తరఫున గూఢచారిగా పనిచేసి 1948లో జైలులో చనిపోయాడు.
    చైనీస్ భాషలో కూడా సి.పి.సి. (కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా) సాధికార చరిత్ర వెలువడలేదు. ఇది నాకు ఆశ్చర్యం కలిగించింది. త్వరలోనే వెలువడుతుందన్నారు చైనీస్ మిత్రులు. ప్రస్తుతం మావో సెలెక్టెడ్ వర్క్స్ తయారు చేస్తున్నారు. ఆ తర్వాత కలెక్టెడ్ వర్క్స్ ప్రచురిస్తారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS