పదమూడు
20-12-76
షాంఘై చైనీస్ కమ్యూనిస్టు పార్టీ జన్మించిన నగరం, 12 గురు సభ్యులతో మొట్టమొదటి సమావేశం జరిపిన చోటు, ఈ విషయాలూ, వివరాలూ ముందు ముందు.
కాని, ఒక ముఖ్యమైన సంగతి ఇక్కడ చెప్పాలి. 1921లో స్థాపితమైన కమ్యూనిస్టు పార్టీ 1949లో చైనా అంతటా జాతీయ విమోచనం సాధించింది. అనగా 28 యేళ్ళలో పండు ముసలి చైనా దేశం పటిష్టయౌవన దశకి చేరుకుంది. ఆ తర్వాత ఈ 1977లో ప్రపంచపు మూడవ అగ్రరాజ్యంగా రూపొందింది.
ఈ శతాబ్దం పూర్తి అయ్యేలోగా తనదేశ ప్రజలు ఆర్థికంగా అమెరికాను అధిగమించాలని మావో ఆదేశం. ఆ గమ్యం చేరుకోవడానికే ఇప్పుడు చైనా అంతటా నిర్విరామ కృషి జరుగుతుంది.
మన స్వాతంత్ర్యానికి వచ్చాయి ముప్పయ్యేళ్ళు. ఈ మూడు దశాబ్దాలలో మనం మూడు శతాబ్దాల వెనక్కి వెళ్ళాం. ఇంకా వెనక్కి పోదాం అనే వాళ్ళకి ఈ దేశంలో ఎక్కడలేని మర్యాదలూ జరుగుతున్నాయి.
బాబాలనీ, బామ్మలనీ నమ్ముకునే ఈ దేశానికి ఇంకా ఎప్పుడో విమోచనం?
కాపట్యానికీ, కాలుష్యానికీ కాణాచి అయిన ఈ దేశానికింకా ఎప్పుడు విముక్తి?
నిన్న రాత్రి షాంఘైలో మేము బసచేసిన హోటల్ పేరు Hsin Kiang Hotel (షిన్ అంటే కొత్త. కియాంగ్ అంటే నది.)
నా గది నంబరు 712.
ఇవాళ ఉదయం 9.25 గంటలకు షాంఘై నగర పరిసరాల్లో వున్న ప్రజల కమ్యూన్ ఒకటి చూశాము. ఇది సెప్టెంబరు 1958లో స్థాపితమయింది.
ఇందులో 16 (ప్రొడక్షన్ బ్రిగేడ్స్) నిర్మాణ సైన్యాలున్నాయి.
133 (టీమ్స్) దళాలున్నాయి.
23000 మంది జనాభా.
5000 గృహ వసతి.
ఇక్కడ ముమ్మరంగా వ్యవసాయం జరుగుతుంది. 2100 హెక్టార్ల నేలను సాగుచేస్తున్నారు. (ధాన్యాలు, ప్రత్తి)
ఏడాదికి రెండుసార్లు వరిపంటా, ఒకసారి గోధుమ పంటా పండుతాయి.
కమ్యూన్ యాజమాన్యంలో నడిచే 13 ఫ్యాక్టరీలున్నాయి. అదే అజమాయిషీలో నడిచే షాపులూ పాఠశాలలూ ఉన్నాయి.
100కి 75 శాతం వ్యవసాయం యంత్ర పరికరాల ద్వారా జరుగుతుంది. హెక్టారుకి 80 వేల కిలోగ్రాముల రాబడి.
కిందటేడు (1975) ఒక్కొక్క కుటుంబానికి 1200 యునాన్ల రాబడి (ఒక యువాన్ విలువ 4.50 రూ||లు)
యేడాదికేడాది అచ్చటి కార్మికుల జీవన ప్రమాణం పెరుగుతోంది.
గ్రామంలో 800 సీట్లు గల సినిమా భవనం ఉంది.
ఒక్కొక్క నిర్మాణ దళానికి ఒక్కొక్క టెలివిజన్ సెట్ వుంది.
యేడాదికి 60 రోజుల సెలవు దినాలు.
తమకు కావలసిన వ్యవసాయ పరికరాలను తయారుచేసే ఫ్యాక్టరీలు ఆ గ్రామంలోనే ఉన్నాయి.
ఒక్కొక్క నిర్మాణ సైన్యానికి ఒక్కొక్క గ్రంథాలయం ఉంది.
ముగ్గురు సభ్యులున్న ఒక రైతు కుటుంబం జీవించే ఒక ఇంటిని చూశాము. (తండ్రి, తల్లి, బిడ్డ) ఇంటావిడ ఇచ్చిన టీ తీసుకున్నాము.
గదిలో ఒక టేబిల్ గడియారం ఉంది కాలానికి చైనావారిచ్చే విలువకు సూచనగా.
గ్రామంలో తారు రోడ్లు లేవు. కొంతదూరంలో మా కార్లను నిలిపివేశారు. మేమందరమూ కాలినడకనే ఊరంతా పర్యటించాము. 1958 నుంచి నేలను చదును చెయ్యడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ యత్నంలో ఎన్నో అవాంతరాలను ఎదుర్కోవలసి వస్తోంది.
నీటి పారుదల నిమిత్తం గ్రామస్తులే 37 కాలువలు త్రవ్వడం జరిగింది.
చైనా అంతటా విద్యుచ్చక్తికి, మంచినీటికీ కొరత లేనట్టే అక్కడ కూడా అవి సమృద్ధమే. సమృద్ధం మాత్రమే కాదు, ఉచితం కూడా. ఉచితమే కదా అని వాటినెవ్వరూ దుర్వినియోగం చెయ్యరు. మనం వాడుతున్నవి పొరుగువాళ్ళకు కూడా అవసరమే అన్న గుర్తింపులోని నిస్వార్థం చైనా సాంస్కృతిక విప్లవం సాధించిన ఘనవిజయాలలో ముఖ్యమైనదని చెప్పవచ్చు.
మానవజాతిని పట్టిపీడించే ఎన్నో మానసిక రుగ్మతలకు విరుగుడు ఈ విప్లవం. చదువు మాత్రమే సంస్కృతి కాదు. ప్రవర్తనను కూడా దానితో జతచేయాలి. అప్పుడే ఒక నూతన మానవత్వం ఆవిర్భవించడం సాధ్యమవుతుంది.
నాటి అపరాహ్ణం 3-15 గంటలకు షాంఘై నగరంలోని బాలల భవనం చూశాము. ఇక్కడ ఉన్నవాళ్ళంతా 7 నుంచి 14 సంవత్సరాల వయస్సుగల బాలబాలికలు. ఇక్కడ కనిపించేది రాజభవనాలలోని ఐశ్వర్య ప్రదర్శన కాదు. యుగాలలో రాజకుమారులకు మాత్రమే లభించే పరిపోషణ ఎలాంటిదో అది యీ బాలల భవనంలో కనిపించుతుంది.
సాయంత్రం దాకా, వాళ్ళ విద్యాభ్యాసం తిలకిస్తూ రకరకాల సాంస్కృతిక ప్రదర్శనలు చూస్తూ గడిపాము. అదో మరపురాని మధుర సంస్కృతి. వాళ్ళని చూస్తూ ఉంటే "నేటి బాలలే రేపటి పౌరులు" అనాలనిపించలేదు. "రేపటి పౌరులే ఇప్పుడు నా కళ్ళముందు కనిపిస్తున్నా"రనుకున్నాను.
21-12-76
రవిరాజ్ మా ఆవిడచేత మరో టెలిగ్రాం ఇప్పించారు. అందులో సారాంశం కూడా వెంటనే బయల్దేరి రమ్మని, ఎలాగూ బయలుదేరాలనే అనుకున్నాను. నన్ను స్వదేశానికి పంపించడానికి యేర్పాట్లు కూడా జరుగుతున్నాయి. కాని నికరమైన తేదీ నిర్ణయం కాలేదు. అందుచేత త్వరలోనే వచ్చేస్తున్నానని ఒక ఉత్తరం రాసి పోస్టు చేశాను.
ఉదయం 9 గంటలకు షాంఘై మునిసిపల్ జైలు చూశాను. ఇది బ్రిటీష్ సామ్రాజ్యవాదులు నిర్మించిన అయిదంతస్తుల కట్టడం. (చైనా ప్రజలను అణచడం కోసం కట్టినదని వేరే చెప్పనక్కరలేదు.)
చైనాలో వుండేది మనుష్యమాత్రులే కాబట్టి ఇక్కడ కూడా జైళ్ళూ, నేరగాళ్ళూ, శిక్షలూ ఉండడంలో వింతలేదు. అయితే విశేషమంతా చైనాలో శిక్షా విధానంలో ఉంది. ఇది నేరస్తుణ్ణి మంచి పౌరునిగా మార్చడానికి ఉద్దేశించిన విధానం. ఇంచుమించు అందరు నేరస్థులూ తాము చేసింది తప్పని ఒప్పుకున్నవాళ్ళే. అందుకు సిగ్గుపడుతున్నామని అంగీకరిస్తున్న వాళ్ళే.
