పదిహేను
చైనీస్ కమ్యూనిస్టు పార్టీకి జన్మస్థానమైన షాంఘై నగరంలోనే ఆధునిక చైనీస్ సాహిత్యానికి ఆద్యుడని చెప్పవలసిన లూషన్ స్మారక మందిరమూ, ఉద్యానవనమూ, మ్యూజియమూ ఉన్నాయి. పార్టీ ప్రథమ సమావేశం జరిగిన భవనం నుంచి సరాసరిగా 10.30 గంటలకు లూషన్ పార్కుకు వెళ్ళాము.
Luhsun - (జననం 1881 - మరణం 1936).
"సోవియట్ సాహిత్యానికి మాక్సింగోర్కి ఎటువంటివాడో చైనీస్ సాహిత్యానికి లూషన్ అటువంటివాడు. "విప్లవ విజయానికి సాహిత్యం కూడా ఒక ప్రధానమైన ఆయుధం" అనేది లూషన్ దృఢ విశ్వాసం. ఈయనను చైనీస్ సాంస్కృతిక విప్లవానికి సర్వ సైన్యాధ్యక్షుడుగా మావో అభివర్ణించాడు.
"అసంఖ్యాక ప్రజానీకానికి ప్రాతినిధ్యం వహిస్తూ లూషన్ శత్రుదుర్గాల మీద తుఫానులా విరుచుకుపడ్డాడు. సాంస్కృతిక రంగంలో సరియైన, సాహసవంతమయిన మార్గం అతనిది. ఆ మార్గమే మన నూతన జాతీయ సంస్కృతికి రాచబాట!" అన్నాడు మావో.
లూషన్ రచనలలో చాలా భాగం కథలూ, వ్యాసాలూ. అయితే అతని కథలు కేవలం కట్టుకథలు మాత్రం కావు. తన చుట్టూ వున్న సామాజిక వాస్తవికతకు స్పష్టమైన ప్రతిబింబాలు. అలాగే అతని వ్యాసాల్లో నిశితమైన ఆలోచనా శక్తి, విప్లవానురక్తీ తొణికిసలాడుతాయి. "మన రచయితలు జీవితాన్ని ముఖాముఖిగా ఎదుర్కోలేక దాపరికాన్నీ, దగానూ ఆశ్రయించారు. అనుదినం మతిపోతున్న ప్రపంచంలో ఈ రచయితలు తాము కప్పుకున్న ముసుగులను తొలగించుకోవలసిన తరుణం ఆసన్నమయింది. జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కొని వాస్తవాన్ని నిజాయితీతో బయటపెట్టగల రచనలు కావాలి. సాహిత్యం ఒక కొత్త సమరరంగం. అక్కడ పోరాడగల ముక్కాకలు తీరిన యోధులు ఇప్పుడెంతయినా అవసరం" అని ఒకచోట రాశారు లూషన్.
నిస్సందేహంగా ఇటువంటి యోధుల్లో అగ్రేసరుడు లూషన్.
చైనీస్ విప్లవ విజయానికి చాలా సంవత్సరాలకు పూర్వమే ఆయన మరణించాడు. కాని తన అసాధారణ సాహిత్య సృష్టితో సాంస్కృతిక విప్లవ విజయాన్ని సాధించాడు. అతని కథలలో కొన్నిటినైనా తెలుగులోకి అనువదించవలసిన బాధ్యత నామీద నేను విధించుకున్నాను. బూజుపట్టిన భావాలతో ఊరేగుతున్న మన సాహితీ వేత్తలకవి కనువిప్పు కాగలవని నా ఆశ.
22 డిసెంబరు అపరాహ్ణం 3 గంటలకు షాంఘైలోని పారిశ్రామిక ప్రదర్శన భవనం చూశాము. ఒక్కొక్క అంతస్తులో ట్రాక్టర్లు, మోటారు కార్లు, సినిమా ప్రాజెక్టర్లు ఇలాంటివే ఎన్నెన్నో ప్రదర్శనకు పెట్టుబడి ఉన్నాయి. ఇవన్నీ చైనీస్ వనరులతో, చైనీస్ కార్మిక శక్తితో నిర్మితమైనవే అని వేరే చెప్పనక్కరలేదు. ఫ్యూడలిజానికి శాశ్వతంగా స్వస్తి వాచకం పలికి ఆధునిక పారిశ్రామిక యుగం లోనికి దూకిన చైనా ఎంత తక్కువ కాలంలో ఎంత గొప్ప అభివృద్ధి సాధించిందో ఈ ప్రదర్శనే నిదర్శనం!
23-12-76
ఉదయం ఎనిమిదింటికి షాంఘై విమానాశ్రయానికి వెళ్ళాము. అక్కడ నుంచి కున్మింగ్ కి వెళ్ళాలి. మొదటిసారిగా చైనీస్ విమానంలో ప్రయాణం చెయ్యబోతున్నందుకు నాకెంతో ఉత్సుకత కలిగింది. కానీ తీరా విమానాశ్రయానికి వెళ్ళేసరికి వాతావరణం మారిపోయింది. ఎప్పటికప్పుడు తెరిపి ఇచ్చేటట్లుగానే కనబడేది. అలాగ అపరాహ్ణం 3 గంటలైనవరకూ అక్కడే వుండిపోయాము. ఆ రోజుకి మరి ప్రయాణం కాన్సెలయినట్లు తెలుసుకొని షాంఘై హోటల్ కు మరలిపోయాము.
నా యెడమ ముంజేతి మీద ఉన్న రెండు టీకా గుర్తులను మా ప్రతినిధి వర్గానికి చూపించాను. వీటిలో ఒకటి 1967లో రష్యాకు వెళ్ళినప్పుడు వేయించుకున్నది. రెండవది చైనా ప్రయాణానికి ముందు ఈ యేడు వేయించుకున్నది. రెండు దేశాలకీ ఇవి గుర్తులన్నాను.
అప్పుడు ఎవరో అన్నారు. "మన ప్రతినిధివర్గంలో ఇద్దరు కోట్నీస్ లూ, ఇద్దరు బాసులూ, ఇద్దరు పాండేలూ ఉన్నా"రని.
యిద్దరు డాక్టర్లూ, యిద్దరు కవులూ, యిద్దరు ప్రొఫెసర్లూ వున్నారని ఇంకొకరన్నారు.
యిద్దరు దాడీవాలాలు కూడా వున్నారని మరొకాయన గుర్తించాడు.
ఇటువంటి పిచ్చాపాటీతో ఆ రోజు గడిచింది.
