Previous Page Next Page 
ప్రతీకారం పేజి 16


    "మరి?" ఆశ్చర్యంగా ప్రశ్నించాడు హిప్పీరావు.
    "నాకు భర్త వున్నాడు!"
    హిప్పీరావుకు అర్థం కాలేదు. కప్పలా నోరు తెరిచి వింతగా హేమ ముఖంలోకి చూస్తూ వుండిపోయాడు.
    "ఏమిటలా చూస్తావ్? నేను వివాహితను. నా భర్త బతికే వున్నాడు."
    "చచ్చాం పో!" మరింత కాలం చెప్పావు కాదేం?"
    "నువ్వు చెప్పనిస్తేనా? ఎప్పుడు చెప్పాలని మొదలుపెట్టినా నువ్వు వినిపించుకుంటేగా? ఏ పరిస్థితుల్లోనైనా నన్నే వివాహం చేసుకుంటున్నావ్. ఇప్పుడు తీరా తెలుసుకున్నాక ఆలోచనలో పడ్డావు?" అంది దాదాపు ఏడుపు గొంతుతో హేమ.
    "నేను ఎవర్ని హిప్పీరావును! నేను నీ గత జీవితాన్ని గురించి ఆలోచించడం లేదు! నీ భర్త బ్రతికుండగా మనం పెళ్ళి చేసుకుంటే...వాడు కోర్టులో కేసు పెడతాడు. నాకు కృష్ణ జన్మస్థానం తప్పదు. అదే ఆలోచిస్తున్నాను!"
    "జైల్లో ఎందుకు పెడతారు?" అమాయకంగా అడిగింది హేమ.
    "మన వివాహం 'లా' ఒప్పుకోదు.
    "మనిద్దరికీ ఇష్టం అయితే మధ్యలో అదెవత్తి ఒప్పుకోక పోవటానికి?" హేమ విసురుగా అన్నది.
    హిప్పీరావు పకపక నవ్వాడు.
    "లా అంటే...అంటే...లా" బుర్ర గోక్కుంటూ ఓ క్షణం ఆలోచించి "లా అంటే రూల్సు... రూల్సు ఒప్పుకోవు" అన్నాడు హిప్పీరావు.
    హేమ బెదురుగా హిప్పీరావు ముఖంలోకి చూసింది.
    హిప్పీరావు ఆలోచనలో పడ్డాడు. హేమ ఆత్రంగా అతని ముఖంలోకి చూస్తూ కూర్చుంది.
    "నీ భర్త ఎక్కడున్నాడు?" హిప్పీరావు 'భర్త' అన్నమాటలు అయిష్టంగా ఉచ్చరించాడు.
    "తెలియదు. ఎదురింటి అమ్మాయిని తీసుకుని పారిపోయాడు. నేనంటే అతనికెప్పుడూ ఇష్టంలేదు. రోజూ చచ్చేలా తన్నేవాడు అన్నది హేమ.
    హిప్పీరావు ముఖం వికసించింది.
    "అయితే భయంలేదు! పెళ్ళామంటే ఇష్టంలేనివాడు ఒకసారి ఇల్లు వదిలి పారిపోయాక మళ్ళీ తిరిగి రాడు!" అన్నాడు హిప్పీరావు.
    "కాని..." సందేహిస్తూ హిప్పీరావు ముఖంలోకి చూసింది.
    "మళ్ళీ ఏమొచ్చింది?" విసుక్కున్నాడు హిప్పీరావు.
    "నువ్వలా విసుక్కుంటే నేను చెప్పను" మూతి సున్నా చుట్టింది హేమ.
    "అప్పుడే బుంగమూతి పెట్టేశావ్! చెప్పు నాకేం విసుగు లేదు." అంటూ హేమ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు.
    "నాకూ...నాకూ?"
    "ఆఁ ఏమిటి నీకు...ఏం కావాలి?"
    "నాకు ఒక కూతురు వుంది." ఆ మాటల్ని బలవంతంగా కక్కేసింది.
    హిప్పీరావు హేమ చేతిని ఒక్కసారిగా వదిలేశాడు. పొరపాటుగా విషప్పురుగును దేన్నో చేతిలోకి తీసుకున్నట్టు బెంచీమీద నుంచి లేచి నిటారుగా నుంచున్నాడు.
    హేమ నవనాడులు బిగిసిపోతున్నట్టు బాధపడుతూ కూర్చుంది.
    "ఏమన్నావ్? నీకు కూతురు వుందా? మరి ఇంతకాలం చెప్పలేదేం?"
    "అసలు నువ్వు చెప్పనిస్తేగా, ఎంతసేపూ "నన్ను ప్రేమిస్తున్నావా? లేదా? అనే ప్రశ్న తప్ప మరో ప్రశ్న వేశావా? మరో మాట మాట్లాడనిచ్చావా?" అంది హేమ గద్గద స్వరంతో.
    హిప్పీరావు బెంచీమీద కూలబడి తల పట్టుకున్నాడు.
    "రావ్! ఏమిటి ఆలోచిస్తున్నావ్? నువ్వు లేకుండా నేను బతకలేను" అంటూ హేమ హిప్పీరావు రెండు కాళ్ళూ పట్టుకుంది.
    "ఛ!ఛ! ఇదేమిటి సినిమాల్లోని ప్రతివ్రతలాగా కాళ్ళమీద పడతావ్! లే! లే! మా తల్లివిగదూ" అంటూ వంగి హేమను లేవదీశాడు హిప్పీరావు.
    "నీ గతం గురించి నాకక్కరలేదు. నువ్వు నాకు కావాలి అంతే! మనం దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్ళి చేసుకుందాం!" అన్నాడు హిప్పీరావు.
    "మరి...?"
    "మళ్ళీ ఏమొచ్చింది? నీ...మరి... కానీ...లతో చచ్చిపోతున్నాను. త్వరగా చెప్పు చంపకు."
    "పాప సంగతి! పాపను విడిచి నేను వుండలేను రావ్" దాదాపు ఏడుస్తూనే అన్నది హేమ.
    రావ్! ఓ క్షణం ఆలోచించి "పాప కూడా మనతోనే వుంటుంది" అన్నాడు.
    "రావ్ నువ్వెంత మంచివాడివి!" కృతజ్ఞత నిండిన కళ్ళతో రావు ముఖంలోకి ఆరాధనా పూర్వకంగా చూసింది.
    రావు చిరునవ్వు నవ్వాడు. మెడమీద పడుతున్న జులపాలను చేత్తో దువ్వుకోసాగాడు.
    "దూరంగా ఎక్కడికి వెళదాం? మా నాన్న మనకోసం గాలిస్తాడు. దొరికితే ఇద్దర్నీ పాతి పెడతాడు" అన్నది హేమ దిగులుగా.
    "హైదరాబాద్ లో మా బంధువు ఒకావిడ వుంది. ఆమె చాలా మంచిది. చిన్నప్పుడు నన్ను బలే ప్రేమగా చూసేది. ఆమె తప్పక మనకు ఆశ్రయం ఇస్తుంది. అక్కడికి వెళదాం!" అన్నాడు హిప్పీరావు.
    హేమ ముఖం ఆనందంతో వెల్లివెరిసింది.

                                             13

    రజని పుట్టినరోజు పండుగకు మూర్తి ఘనంగా ఏర్పాట్లు చేశాడు. ఇల్లంతా బంధువులతో హడావుడిగా వుంది.
    రజని స్నేహితులూ, స్నేహితురాండ్రూ రకరకాల దుస్తులలో ఆడుకుంటున్నారు, పాడుతున్నారు, హడావుడి చేస్తున్నారు. ప్రకాశ్ ట్రిమ్ గా తయారై వచ్చి రజని పక్క పక్కనే తిరుగుతున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS