"రమణా నన్ను క్షమించలేవూ" అన్నాను.
"మేము ఫార్మాలిటీస్ కోసం నీ వెంటపడలేదు. కాని ఓబులు చెప్పిన దానికీ, ఈ జరుగుతున్న తంతుకూ ఏదో సంబంధమున్నదనే అనుమానం కలుగుతోంది. చెప్పదగిన విషయమయితే చెప్పు" అన్నాడు రమణ.
"సమయం రానివ్వు" అంటూ తప్పుకున్నాను. అప్పటికి పొద్దుతూలింది. భోజనాలు ముగించి విశ్రాంతిలో ఉన్నాము. నేను గత రాత్రి జరిగిన దానిని నెమరువేస్తున్నాను. జరిగిపోయిన దానిని గురించి ఆలోచించేటందుకు ముందు ముందు చాలా సమయముంది. జరగవలసిన దానిని చూడగలనా అన్నదే నా సమస్య.
పెద్దియజ్వగా నేను భావించే రూపం ఏదైనా కావచ్చు. నాకు కథ చూపించే తీరు ఏమిటని నేనే ఆలోచించటల్లేదు. ఆ తరువాత ఏమయిందన్న ఆదుర్దాతో ఉన్నాను. పొద్దు పూర్తిగా వాలిపోయింది.
కీచురాళ్ళ రొద ప్రారంభం కాగానే నా మనసు స్వాధీనం తప్పుతోంది. మిత్రులిద్దరూ స్నానాలు, వంట పురమాయింపులూ వగైరా వ్యవహారాల్తో మునిగితేలుతున్నారు. నేను వరండాలో పచార్లు చేస్తున్నాను. ఈ అవ్వ చరిత్ర నన్ను ముగ్ధుణ్ని చేసింది. వేమాంబ విషయమూ నన్ను కలచివేసింది. ఈ రెండు ఘట్టాలూ నా జీవితంలో అత్యంత విలువైనవనిపించింది.
అనేకనేక మందిలో ఒక్కరికి, ఎప్పుడో అరుదుగా దొరికే అవకాశం నాకు దొరికింది. అది నిజం కావచ్చు. భ్రాంతో, కలో మానసిక రుగ్మతో ఏదైనా కావచ్చు. కాని ఆ చరిత్ర చూడాలి. ఆ వెలుగు వెల్లువలో బుద్బుదంలా తేలిపోవాలి. తరువాత ఏమైంది? తర్వాత ఏమైంది? అప్రయత్నంగానే ఆ మాటలు నా నోటినుండి వెలువడ్డాయి.
కొంత స్పృహ కలిగి పరిసరాలను పరికించాను. వరండాలో పచార్లు చేస్తున్నా నేను కారడవిలో వున్నాను.
నాకు తెలియకుండానే ఎప్పుడో దారిన పడ్డాను. భగవంతుని దయవల్ల పురుగూ పుట్రా తప్పుకుని వచ్చాను.
కొద్దిసేపటిలో నేను చూడబోయే దశ్యజాతి సౌరద్రుని కథను ఊహించుకుంటూ ఓ రాయి మీద నుండి మరో రయి మీదకు ఛెంగున దూకుతూ ముందుకు సాగిపోతున్నాను.
నా మనసులో కొంత అనుమానంగానే ఉంది. నిన్న నేను చూచినది భ్రమ కావచ్చు. కల కావచ్చు. మరేదైనా కావచ్చు. కాని నేను చూచినది చారిత్రకంగా యధార్ధమైన విషయమే! కనుక మిగతా చరిత్ర ఏమైందన్న ఉత్కంఠ నాకు సహజంగానే కలిగింది. ముందుకు పోతున్నాను. పెద్ది యజ్వ నేను చూచిన మహామూర్తి తేజస్వి. అది యదార్థమైన భౌతిక శరీరమో, కాదో కూడా నాకు తెలియదు. వైష్ణవ సంప్రదాయంలో భౌతిక దేహాన్ని విడిచిన ఆత్మలు తేజోరూపాలై గ్రహాల మధ్య సంచారం చేస్తూ వుంటాయని నమ్ముతారు. వాటికి ఒక్కొక్కరి మీద నర్హేతుకంగా అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఆత్మకు సంకల్ప వికల్పాలుంటాయని మనం ఊహించరాదు కాని దానినే నిర్హేతుక జాయమానకరుణా కటాక్షమని చెప్తారే. పెద్దియజ్వకు నా మీద అటువంటిదైనా కలిగి వుండవచ్చు.
కొండవీటి చరిత్రను ఆసాంతమూ చూడాలనుకున్న నాకు పెదకోమటి వేమునిలో కథ ప్రారంభమైందన్నమాట. అంటే ఉజ్వలమైన చరిత్రను సృష్టించిన కొండవీటి మహా సామ్రాజ్య పతన గాధ నేను చూడబోతున్నానన్నమాట. వేమాంబ సోమదేవుల కథ అదే!
అంతేకాక నాకు కథ కనిపించేముందు నన్ను ముంచెత్తే ఆ వెలుగు వెల్లువలో మళ్ళీ విహరించాలనిపించింది. ఆ వెల్లువతో నాకేదో దివ్యమైన అనుభందమున్నదనిపించింది. ఎలాగైతేనేం ఆ మూర్తిని చూచాను. విషయమంతా యధావిధిగా నిన్నటిలాగే జరిగింది. నా చుట్టూ వెలుగు వెల్లువ. ఆ వెల్లువలో మణిశిలా ఫలకం. దానివెనుక ఏమున్నదో చూడాలన్న సంకల్పం మళ్ళీ కలిగింది. వెంటనే మణిశిలా ఫలకం చీలి ఆ వెనుకటి దృశ్యం కనిపించసాగింది. ఒక అద్భుతమైన చరిత్రను చూడసాగాను.
5
రాణివాసానికి దగ్గరలోని ఉద్యానవనం మధ్యలో చక్కని కోనేరు.
అది కూడా సంతాన సాగరంతో పాటు త్రవ్వించబడింది. కోమటి వేముని అర్ధాంగి విదుషీమణి అయిన సూరమాంబ శ్రీశైల మల్లిఖార్జున స్వామికి సమర్పించినదే సంతాన సాగరం. సూరమాంబ తొలి యౌవన దశ నుండి ప్రౌఢగా మారేవరకు ఆమె జీవితం కష్టాల సముద్రమే! కోమటి వేమునికి ఒక నిలకడ అంటూ వుండేది కాదు. అతని జీవితం కల్లోల సాగరంలో మునిగి వుండే రోజులవి. దువ్వూరి రెడ్ల మద్దతుతో కృష్ణార్జునుల వంటి కుమారగిరి రెడ్డి, కాటయ వేమారెడ్డి విజృంభించారు. యధార్ధంగా కోమటి వేమునికి రావలసిన రాజ్యానికి వారే మకుట ధాకులయ్యారు. పై పెచ్చు చినకోమటి వేముడు వారితో రాజీపడవలసిన పరిస్థితులు కూడ ఏర్పడ్డాయి. అప్పటికి ఆ దంపతులకు రాచ వేముడు పుట్టాడు. వారికి కుడి భుజంగా వుంటూ వచ్చిన అన్నె చోడునికి సోమదేవుడు పుట్టాడు.
