ప్రేమ కనిపించి mystic poet ఆధ్యాత్మికకవి విశ్వప్రేమ గాయకుడివైతే, ఏమీ మాట్లాడని మౌనివైతే, ఆనందిస్తాము. కాని, కాని...... నవయువకుల నిరాశా నిశ్వాసాలు విశ్వాన్ని నింపుకున్నాయి. అయినా భయంలేదు కోర్టుల ఆవరణలు ప్రవేశించవు లెండి.
"ఏటినురగలకేసి ఏమీ మా కేవే?"
ఏమిటి చూస్తాను యీ అలల నురగల్లో అలలనే తెరమీద ప్రతినిమిషం మారేబొమ్మల్ని గీసే యీ నురుగులో నేను! ఏమిటా సంబంధం, పిలుపు? నా చి- కళ్ళువిప్పి నన్ను ఆహ్వానించినప్పుడు సగం చూసి నా ముఖాన్ని దేనికోసమో వెతికేప్పుడు నేను గాఢంగా మాట్లాడిన మాటకి అర్ధమేమా అని యోచించేటప్పుడు యీ కాంతి ఉదయంనించి, అర్ధరాత్రివరకు యీ నీతిమీద తెచ్చే మార్పులే జ్ఞాపకంవొస్తాయి నాకు.
"ఆత్మకోసం కళ్ళు వెతుకుతాను. నా ప్రేమకి ప్రవేశమార్గాలు నేత్రాలు. నీ నేత్రాలంత అందమైనవాటిని నేను చూడలేదు. నీకళ్ళవంటి దయగల పాపలూ" అన్నాను చి- తో....ఏమనుకుందో.
నమ్మిందా? నేను ప్రేమించే స్త్రీతో మాట్లాడే సాధారణ వాక్యాలనుకుందా?
ఎన్నడో ఎట్లానో Lawson's Bay కి వొచ్చి యీ స్తలాన్నే యీ మొగలిపొద కిందనే కూచోడమనే కల యేమైపోయింది చి....? న్నా- విధి వూయించిన వొక్క వూపుతో, ఆఫీసులోని కలల ఒక్క గీటుతో యెంత దూరమైపోయినాము మనిద్దరం?
"ఎంత దూరం" అన్నావు! నీ పంజరంలో రెక్కలుచాస్తో.
"నాలుగు మైళ్ళు. కాని నేనున్నానుగా!"
తలుచుకో సముద్రమువంచన, నీళ్ళు యీ భూమిని నిద్రపోతానేమని యుగయుగాల్నించి ప్రశ్నించే స్తలాన మనిద్దరం-పారిపోయి వచ్చి చెమటతో నా వంక చూసే నువ్వు, ధైర్యమివ్వాలని ప్రశ్నిస్తో బాధ పడుతున్నావేమోననే నీ ముఖం వెతికే నేను, ఆ ప్రయాణం, అనంతమూ, నిరాటంకమూ చెయ్యగలిగితే!
"ఆటంకాలూ అభ్యంతరాలూ మన హృదయాల్లో వున్నాయి. ఇనపకడ్డీలు పంజరాలకిలేవు మన ఆత్మలకి వున్నాయి. సాహసించు. జీవితాన్ని భవిష్యత్తుని తలుచుకుని భయపడకు" అని మాటలతో చెప్పాను. కాని నీ ఆత్మకి అర్ధం కాలేదు నా భాష. అర్ధంచేయించే శక్తి నా ఆత్మకి లేదు. అందువల్లనే మన జీవితాలిట్లా అయిపోయినాయి చివరికి.
పైగా చచ్చిపోతానంటావు. ఇన్ని పుస్తకాలు నావి చదివావు నేను చెప్పేది- "జీవితంనించి సంఘాన్నించి అపజయాన్ని అంగీకరించవొద్దు. మరణంలో, మర్యాదలో, జడత్వంలో, మామూలులో, శరణ్యం పొందవొద్దు రణభూమిలోకి రా గాయ మయిందా, అవయవాలే ఖండాలైనాయా, రక్తమంతా నేలపాలయిందా, హృదయమే ముక్కలయి పోయిందా! ఫరవాలేదు. ఆ సంసార మృత్యువు కన్న ఇదే నయం!" అని.
నన్ను మరిచిపోతున్నావు. అవును. మరిచిపోతాను. మరిచి పోక నిరంతరం జ్ఞాపకం తెచ్చుకుంటో భరించలేను. నా నరాలు కాలిపోతాయి. ఆశలేని వెలుగుకై విరహపడి-లాభమేమిటి? అర్ధం లేని బాధలో యోగ్యతలేదు. చివరికి విరహబాధకైనా సరే, నిన్ను నా consciousness, పైపొరల్లోంచి అంతరమైన deapths లోకి నెట్టేస్తాను. ఆ అనుభవంలోంచి కవిత్వాన్ని, ఆత్మవిశాలత్వాన్ని సేకరించుకునేందుకు ప్రయత్నిస్తాను. ప్రేమసామ్రాజ్యం; తప్పితే దానితో తులతూగాగలది ఒక ఆత్మసామ్రాజ్యమే. నా చేతులూ, నా పెదవులూ నా-ఏమో? ఏ యితర సౌందర్యంతోనో వాటి ఆరాటాన్ని ఆపడానికికూడా ప్రయత్నించవొచ్చు.
కాని నువ్వు! నీ గతి? వంటా, నేనా, చివాట్లూ, చికాకూ దినదినమూ భరిస్తో కళ్ళు ఆకాశంవేపు, ఆత్మ సౌందర్యంలోకాల సంచారం- పిల్లల చరువుల్లో పెళ్ళిళ్ళల్లో, వియ్యపురాలి మన్ననల్లో నువ్వు నా చి..ని, నువ్వు తృప్తిపడతావా, లోపల యే దీపాలార్పిన చీకట్లోనో, యే దొడ్డిపందిట్లోనో, వీధి గుమ్మందగ్గిరో, ఒక్క చూపుకి, ఒక్కమాటకి కరువువాచి, మర్యాదస్తుల మాయమాటల్లో, నీరసస్తుల నీతినియమాల్లో, ఎక్కడ ప్రియమైన స్నేహాల్ని గాయంచేస్తానో, అన్యాయం చేస్తానో అని భయపడుతూ ఏడ్చే నీహృదయాన్ని సముదాయింప ప్రయత్నిస్తావా? నువ్వు! ఒక్క చూపులో రాయిని కరిగింపచేసే మహాశక్తి, ఒక్క పలుకుతో లోహాల్ని మెత్తపడచేసే మాధుర్యం, గానంతో సమస్త దోషాలూ కడగగల నీ ఆత్మ ఔన్నత్యం అంతా, అంతా, వ్యర్ధమై లోపల లోపల కాలి, కాల్చి, నశింపవలిసిందే! ఎందుకిట్లా? మనకు మనం మన చేతులతోనే యీ గతికి తెచ్చుకున్నామా? మనుషులా, సంఘమా, కర్మా, దేవుడా? ఎవరు, ఏది? ఏమిటి కారణం? గుడ్డితనం పరిపాలిస్తోందా లోకాన్ని? క్రౌర్యం కాలికింద నొక్కుతోందా హృదయాల్ని! ఎక్కడగతి? ఏదిముక్తి?
ఒక్కటే సాధనం సాహసం జీవితంలోవిశ్వాసం మూఢత్వంమీద, కర్మమీద, శాసనంమీద తిరుగుబాటు. భవిష్యత్తులో నిర్భయం, ఆత్మలో విశ్వాసం పర్యవసానాల నిర్లక్ష్యం.
నా సత్యంలో నమ్మకం.
విధిని తారుమారు చేస్తుంది సాహసం!
నా సొత్రిని అప్పుడే మరిచావా?
నిన్ను మరవగలనా, అంటాను కాని!
గుమ్మంలోంచి దూరమయ్యే నా వంక నీ కడపటి చూపుని----
ఎందుకు కనపడ్డావు నాకు!
అనేక సంవత్సరాలు వుత్తపేరు నువ్వు. నాకు మనిషివై, దేవతవై నాముందు ఎందుకు నిలిచావు?
నీ ముళ్ళపంజరం చూసి నీవెందుకు దూరంగా నడవలేదు?
తలుపు తెరవమని అంత జాలిగా యెందుకడిగావు?
గొళ్ళెం బైటలేదు.
గడియ లోపలవుంది.
సాధన మేమిటన్నాను.
