Previous Page Next Page 
మ్యూజింగ్స్ - 1 పేజి 18

     
    నువ్వు చెప్పమన్నావు.
    నా solutions భయంకరమైనవి నన్నడగవద్దన్నాను.
    నా సాహసాన్ని నీ వెరగనన్నావు.
    నమ్మి చేయి జాచాను.
    సాహసయాత్రకు నడుముకట్టాను.
    భయపడి పంజరపుకడ్డీని పట్టుకు వేళ్ళాడావు. పాపం!
    నన్ను ప్రేమించడానికి నా జీవితాన్ని నీ మాధుర్యంతో ముంచెత్తడానికేకాదు నీ వేపు నేను చేయిజాచింది.
    నీ జీవితాన్ని అర్ధయుక్తం చేసుకోమని ముఖ్యం విశ్వసించగలిగానా నామాటలు!
    కాని నీ జీవితమార్గంలో నేను సోపానమా- అవసరమా- నాకూ భాగమున్నదా?
    అనుగ్రహం.
    లేదా, దారి సద్దుతాను నా వుత్తరీయంతో ఆనందంగా!
    అన్నీ కలలు, కలలు, మధురమైన కలలు.
    కాని అర్ధరాత్రివేళల ఆ కలలే, చచ్చిపోయిన ఆ కలలే దిగులుతో మూలుగుతో మూగి నన్ను రాత్రులు రాత్రులిట్లా పలకరించి వేధిస్తాయి.
    కానీ ఇట్లాంటి హృదయంతో నరాలతో జన్మించినందుకు శిక్ష! పంజరాల తలుపుకడ్డీలతో పెనుగులాడిన గాయాల బాధ! బేలగా దీనంగా చూసిన నేత్ర దృష్టుల్ని నమ్మి హృదయాన్ని ముక్కలుచేసి అర్పించిన వెర్రితనం!
    అనుభవించవద్దా, మూర్ఖత్వాల ఫలితం!
    నిరంతర జన్మాల్లో నమ్మే మీకే యింత అవిశ్వాసమా? అంటున్నాను.
    నీకు విశ్వాసమివ్వలేని లోపం నాది. భీరుత్వం నీది అనుకోకు. నా కింకా తపస్సు అవసరం.
    ఏమైపోయినాయి మన జీవితాలు చి....!
    ఇట్లా యోచిస్తోవుండగానే, అనుకోకుండానే, కళ్ళముందే, సాయంత్రమయింది. సముద్రం ఘోషపెడుతోంది. కొట్టభయాలతో. ఈ నీటిమీద యెగిరే తెల్లని పిట్టలకి గూళ్ళెక్కడో! గుడ్లెక్కడో! వాటితో సంభాషించ కలిగితే! ఇందాక పక్కన కూచుని నాకేసి నిదానంగా చూసే ముసలి పల్లెవాడితో యేం మాట్లాడాలో తోచలేదు నాకు, తోడి మానవుడితో!-యింక యీ పక్షులతోనా!
    వొక్కన్నీ వెళ్ళాలి మెల్లిగా యింటివేపు. ఈ నిమిషాన సుందరమ్మ ఏం చేస్తుందో! ఎన్నేళ్ళ కొకసారి నన్ను తలుచుకుంటుంది!
    సుందరమ్మా నేనూ కలుసుకోడం, ప్రేమించడం యెట్లా తటస్తపడ్డాయి? ఎందుకు వెర్రికలలు కన్నాము? మా భవిష్యత్తును గురించి ఒకరితో ఒకరం ఆ విషయమై మాట్లాడగల ధైర్యమన్నాలేక! విధికి, కులాలికి యెదురీదాలని యెందుకు సాహసించాం?
    ఇందాకనే ఆ దూరం రాతిమీదికి యీదాలని ప్రయత్నించే నన్ను సముద్రపు అలలు వరసగా యెదురుకొట్టి నవ్వుతో వెనక్కి తోశాయి. పట్టువిడవని నన్ను చూసి కోపగించి, పొర్లించి, అడుగున యీడ్చి గాయంచేసి ఒడ్డున పారేశాయి. అంతే మన యత్నమూ సుందరమ్మా!
    అప్పుడింత జ్ఞానంలేదు. ఆ నూతన బాల యవ్వనంలో లోకాన్ని జయిస్తామనే విశ్వాసం, సాధించలేనిది లేదనే ధైర్యం రక్తంలో పొంగేవి. కాని యీనాడు మాత్రం? నా చి-విషయంలో ఏమయింది నా వివేకం? లాభం లేదనుకుంటాను యీ జన్మకి! పాపం చచ్చిపోయిన మిత్రుడు విశ్వనాథం "ముళ్ళ మధ్య గులాబిపువ్వు లెందుకయ్యా చేతులు చాస్తావు? చుట్టూ కంచ కనపట్టంలేదూ? నువ్వు సరే, ముళ్ళు గుచ్చుకోడమే ఆనందమంటావు. కాని మోహపడి నీ దగ్గిరకి వొచ్చే ప్రయత్నంలో ఆ పువ్వు ఆ ముళ్ళల్లో గీసుకుని రేకులు గాయమై నశిస్తుంది" అనేవాడు.
    విశ్వనాధం - ఎందుకు చచ్చిపోయినావు? ఏమయినావు తలరాత? గొప్ప త్యాగాలూ, శాపాలూ, ధర్మాలూ, ఇవన్నీ అనేక జీవితాల్లో గుర్తించి ప్రకటించి శాశ్వతంగా లిఖింపజూచింది, లోకం? కాని వాళ్ళందరూ ప్రపంచం కళ్ళముందు ఘనతకెక్కినవాళ్ళు. సహజంగా రక్తంలోవున్న nobility వల్ల నీచత్వానికి బానిసత్వానికి లోబడ నిరాకరించి నశించిన నీబోటి జీవితాలుసంగతి యెవరు గుర్తిస్తారు? నువ్వా! ఏమయినావో నాకు తెలీదు. తెలుసుననుకునేవాళ్ళకీ తెలీదు. నేనా? విశ్వనాథం! ఇంకా ముళ్ళల్లో గులాబి పువ్వులవేపే చేతులు జాస్తున్నాను. పువ్వులకి కలిగే అపాయం సంగతి తలుచుకోక!
    చి--నీకూ తెలుసు, నాకూ తెలుసు, చుట్టూ పొదల్లో గాయపడతామని పసిదానిని నీకు తెలీకపోవచ్చు. కాని నాకు? మోహమాయ అంత గొప్పతెర కప్పుతుంది మన జ్ఞానచక్షువులమీద నేనేదో నీ గాయాల్ని నా రసికత్వంతో, మాన్చలేనా అని నమ్మకపడతాను. కాని.....కొన్ని గాయాలుమానవు. చి--మరిచిపో నన్ను.
    సుందరమ్మవలె నువ్వూ నాలుగేళ్ళలో మధురమైన జ్ఞాపకంగా మారతావు. ఈ నాడు ప్రతినిమిషం నా కళ్ళయెదట నిలిచి, నావంక నిదానంగా చూసి విరహం రేపి కాల్చే నువ్వు? ఎందుకు నామీద అంతకోపం నీకు? ఒక్కనిమిషం విశ్రాంతి నివ్వక నన్ను వెంబడించి యిట్లా accuse చేసి వదలక వేధించడం ఎందుకు? కాని యిది బలహీనులైన స్త్రీలు తరతరాలనించి నేర్చుకున్న trick మోహించి నందుకూ మోహించనందుకూ కూడా మొగవాన్ని నిందించడం.
    నువ్వూ! నువ్వుకూడా విశ్వనాథంవలె సుందరమ్మవలె జ్ఞాపకంగా మారిపోతావా? కాని అంతకన్నా యేముంది? ఈ ప్రపంచమే ఉత్తజ్ఞాపకం. ఈ నిమిషాన నేను వినే k O, డే పాటలు, రాదా మనోహరి, పుష్పపరిమళం తూర్పున దివ్యతేజస్సు అన్నీ అప్పుడే 'ఇప్పుడు' అనే భావంలోంచి వుత్త జ్ఞాపకాలైపోతున్నాయి.
    ఈ ఆనందమేమిటి, యీ జ్ఞానం స్వభావమేమిటి, అనే ప్రశ్న లలోకి వెళ్ళావా, నరాలు లాక్కుపోయి అలిసిపోతాను. వొద్దు అని యేనాడో ఎట్టాగొ అర్ధమవుతాయి గావును. ఈలోపల నీ కళ్ళల్లోకి చూసి - ఆకాశంవంటి నీ కళ్ళల్లోకి చూడనీ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS