సన్నని చంద్రకాంతిలో ఆడుతున్న పిల్లలగుంపుల్ని వెతుకుతున్నాను. సన్ననివొళ్ళూ, చంపఅంతా కళ్ళూ, సూదివంటి ముక్కూ వెన్నెలని మింగేజడా, గాలిలో కొట్టుకుపోతున్నట్లు పరిగెత్తే నా ప్రియురాలికోసం దగ్గిర గా వెళ్ళి మొహాలుచూసే నావంక ఆడపిల్లలు 'స్కాండ్ లస్'గా చూస్తున్నారు. చాలామంది తన హృదయానికి తగిన ప్రియులకోసం జనాన్ని వెతికే ఉదారులకి దుర్మార్గుడనే అపకీర్తి యిట్లానే కలుగుతుంది.
కనపడ్డది నా వంకచూడడు. పిల్లలతో కేకలేస్తుంది. నవ్వుతుంది. దూరంగా పరిగెత్తి దగ్గిరగా రాసుకుంటో పోతుంది. తలెత్తడు. పంకజాక్షి-
"బాబు వచ్చాడు సుందరమ్మా!" అన్నా వినిపించుకోలేదు.
ఈ చంచలమేకదూ, యీ non-dependability, variable quality యే కదూ స్త్రీమీద పురుష ఆగ్రహాన్ని గుమ్మరింప జేసింది! పూర్వకాలంనించి దీనివల్లనేకదూ స్త్రీని తిట్టినతిట్లన్నీ!
"ఈడుండమంటాది యిలు దూరిపోతాది."
"మాట యివబడనట్టే మరి ఎటో చెపుతాది."
కాని యీ ఆటలే, ముందు నిమిషం ఏంచేస్తుందో ఎట్లా మారుతుందో తెలీని యీ మిస్టరీ యే లేకపోతే స్త్రీ యెంత uninteresting, tame, insipid వ్యక్తి ఐపోయివుండును!
హృదయాన్ని మండిస్తుంది. కాని ఆ మంటలో యెంత మాధుర్యముంది? విశ్వేశ్వర్రావు తన పుస్తకానికి 'మధుకీల' అని పేరు పెట్టడంలో వింత యేముంది? పురుషుడేట్లానైనా స్త్రీని యీ చంచలత్వం నించి dependable సాధారణ గృహిణిగా మార్చాలని చూస్తాడు, comfort కోసం. సఫల మనోరధుడవుతాడు. ఆకర్షణ పోగొట్టుకు న్నదని నిందించి త్యజిస్తాడు. బాధలో ఆనందాన్ని, అగ్నిలో మాధుర్యాన్ని, 'మధుకీల' పెరగని మానవుడు చాలా అల్పుడు.
ఆ ఉదయాన నేను పడ్డబాధని పదిహేడేళ్ళ తరువాత నా కవి పాడాడు అద్బుతంగా.
"నీ వెళ్ళిపోయినావంటే"
"వన్నె సీరెలుకట్టి నీవా నాయెంకి" అని ఆపాటంతా నేను కొత్తగా వ్రాయవలసిన అవసరమున్నంత దౌర్భాగ్యంలో ఆంధ్రదేశం లేదని విశ్వసిస్తున్నాను.
"సుబ్బారావుగారూ యివన్నీ యింత సుకుమారమూ, అంతరాంతరమైన 'టచ్చెస్' మీకెట్లా వొచ్చాయండి? అసలు 'సోర్సు' ఏమి" టని అడిగాను సగం కొంటిగా, సగం 'యీగర్' గా.
పాపం ఆ రెండేళ్ళూ నా కొంటెతనాన్ని నేను తెచ్చిపెట్టుకున్న విపత్తులలో 'యీగర్ నెస్నీ' భరించారు ఆయన వోపికగా. ఎన్ని తిప్పలు పెట్టినా పడ్డారు; నామీది వాత్సల్యంచేత ఆ మహాకవి. నేను స్తాపించబోయే సెడక్షన్ ఎసోసియేషన్ కి మాత్రం లీగల్ ఎడ్వైజర్ గా వుండడానికి వొప్పించలేకపోయినాను.
ఆయన ఇదివరకే జవాబు చెప్పాడు యిట్లాంటి కొంటె ప్రశ్నలకి.
"ఎంకెవ్వరని లోకమెపుడైన కదిపితే
యెలుగు నీడలకేసి యేలు చూపింతు." అని.
ఆ రెండు పాదాలకీ యీడైనకవిత్వం యీ ప్రపంచ వాంగ్మయంలో ఎక్కడా కనిపించదు. నా ముందు ఆరాటపడే ఈ సముదరపు అగాధత్వమూ, నిరంతర అశాంతీ, నా హృదయంలోని అర్ధం లేని ఆరాటమూ, నిర్నిద్ర, ఆదర్శవాంఛా; సఫలం లేని, కాని, ఘోషా; జీవితంలోని మాధుర్యమూ, విషమూ, నిష్ఫలత్వమూ, నిరాశా, నిరంతరమూ ఆకర్షించే యీ ఆనందాల అల్పత్వమూ, వ్యర్ధత్వమూ అన్నీ గోచరిస్తాయి నాకు ఆ పాదాలలో. అంతేకాదు యీ సృష్టి ప్రజాహపునడక - ఆత్మ అందుకునే అర్ధంగాని పిలుపు, సాధారణ మోహంలోని మిస్టరీ, ఔన్నత్యం అన్నీ తోస్తాయి నా మనోవీధిలో.
నా ప్రశ్నని వొదల్లేదు నేను. నా రహస్యాలు అప్రయత్నంగా ఆయన కంటబడ్డ తరవాత ఆయన రహస్యం తెలుసుకోకుండా వొదులుతానా?
"పూర్వ జన్మంనించి తెచ్చుకున్నాను" అన్నాను చిరునవ్వుతో గొప్పగా గంభీరంగా.
పూర్వ జన్మంలో నాకు నమ్మకం లేదని తెలిసి ఆ జవాబు లేని జవాబు చెప్పాననే legal satisfaction లేదుకదా ఆ చిరునవ్వులో మీసాలకింద!
గత జన్మలనించి యింత దీర్ఘకాలాన్ని, దేహాన్ని, పుటకల్ని, అనుభవాలని దాటివొచ్చి యీ నాడింకా యింత స్పష్టంగా, మధురంగా, రక్తాన్ని పొంగిస్తో నిట్టూర్పులు వినిపిస్తో శుష్కజీవితాల్లోకి రసం ప్రవహింపజేస్తో సున్నితంగా detailed గా, దృఢంగా, పాటల్లో పలికిస్తున్న ఆ అనుభవం మొదట్లో వాస్తవంగా జరిగినప్పుడు యెంత గొప్పదై వుండాలి! కోప్పడకండి మీ పూర్వజన్మల సంగతి మాట్లాడుతున్నాను. ఈ జన్మల సంగతికాదు, సుబ్బారావు గారూ? ఎందుకంటే చాలామంది పవిత్రులకి పూర్వజన్మల్లో రొమాన్సు జరిగి వుంటుందన్నా ఆగ్రహం కలుగుతుంది, అందుకని.
నేనే కాదు, ఆంధ్రదేశమే పూర్వ పతివ్రతల్ని వాళ్ళ పీఠాల్నించిలాగి కింద పారేసింది. ఇంక నూతన యుగపు బాలికలకి ఆదర్శమైన పతివ్రత మీ యెంకి. యెంకి అనే హాస్యాస్పదమైన assosiations వున్న సాధారణ నామాన్ని యెంత శక్తితో, romance తో, poetryతో, తపస్సుతో, charge చేసి మా హృదయాలను యిట్లా వెర్రిత్తించ గలిగారో మీరు!
నమ్రతతో నేను తోటి కవిని, ఆంధ్ర యువకుల తరఫున శిరస్సు వొంచుతున్నాను మీ ముందు.
"ప్రేమలో విశాలత్వంకాదు, వెరయిటీకాదు, ఇస్టెన్ సిటీ ముఖ్యం" అన్నాను మొన్న బాపయ్యతో.
"వెంకటచలమేనా మాట్లాడేది?" అన్నట్లు చూశాడు నావంక.
అట్లాంటి అద్భుతానుభవం తరవాత ఏం చేసివుంటారు నా హృదయగాయకా! ఏ మహాపరాధంచేశారు, ప్రేమదేవతకి కవినించి ప్లీడరుగా జారిపోయేందుకు? మాబోటివాళ్ళందరి కళ్ళనూ dazzle చేసి తెలుగు కవిత్వంలో కొట్ట ఆశలు, విశ్వాసాలుకల్పించి - యిది వరకు పాకుతున్న బురదచాళ్ళల్లోంచి తెలుగు సారస్వత రకాన్ని ఒక్కవూపుతో పువ్వులతో నిండిన పచ్చికబయలు మీదికి లాగి చివరికి- చివరికి.......
