"గోమతికి తన దగ్గర రహస్యమా? గోమతి భద్ర పరచుకున్న దేమిటి?" కీర్తి ఆలోచిస్తున్నది.
ఎవరి ఆలోచనలు వారిలో వున్నాయి. బాజారావు గురించి మాట్లాడుకుంటూ కీర్తి, గోమతి బైలు దేరారు.
చెట్ల చాటునుంచి వీళ్ళనే గమనిస్తున్న బాజారావు వడి వడిగా పక్కదోవన బైలు దేరాడు.
12
రోజులు గడిచి పోతున్నాయి.
బాజారావు లోపల ఏముందో గాని పైకి బాగానే వుంటున్నాడు గోమతి, కీర్తితో.
సుండాజాతి వాళ్ళతో కల్సిపోయారు వీళ్ళు ముగ్గురు.
ఇప్పుడు వీళ్ళమీద కాపలా లేదు.
ఇక్కడనుంచి పారిపోటానికి దారి లేక దారి కనపడితే వెళ్ళాలని ఎవరికి వారికుంది. సుండాజాతి వారితో వేట కెళుతున్నారు. వాళ్ళు అభ్యంతరం చెప్పటం లేదు.
పడమటి దిక్కున నాలుగు గంటలు నడిస్తే సముద్రం వస్తుందని దక్షిణాన కొండలున్నాయని తూర్పున వెళితే ఇంకా కీకారణ్యం అని తెల్సుకున్నారు.
ఓ జుట్టుతో ఆరోజు వేట కెళ్ళింది కీర్తి. ఆరోజు వారు పడమటి దిక్కుగా వెళ్ళారు.
కావాలని కీర్తి చెట్లచాటుగా మాయమయి సముద్రం పక్కగా వచ్చింది.
సముద్రం దరీ తెన్ను లేకుండా కనబడుతున్నది. ఎటు చూసినా నీరు నీరు.
ఎదురుగా అంతా జలమయం.
ఈ సముద్రంపై ఈతకొడుతూ ముందుకు సాగితే ఎన్నాళ్ళు పయనించగలం? ఏ మూల తేలగలం? పడవలాంటిది తయారుచేసుకుంటే? కీర్తి సముద్రం వైపు చూస్తూ ఆలోచిస్తుండగా చాలా దూరంగా పెద్ద ఓడ కనిపించి ఇంకా దూరమయి కనుమరుగయింది.
కీర్తి కళ్ళు మిలమిల లాడాయి.
ఇంతలో కీర్తి తప్పిపోయిందనుకుని వెతుక్కుంటూ సుండా జాతివారు పదిమంది జట్టువచ్చారు. తప్పిపోయినట్లే నటించింది కీర్తి.
కీర్తి వాళ్ళతో కల్సి వాళ్ళగూడానికి వచ్చింది.
ఆ రోజు వేటకెళ్ళి తిరిగొచ్చిన ముగ్గురి ముఖాలలో కళ వచ్చింది.
"నేను సముద్రంలో ఓడ పయనించటం చూశాను. గోమతి ఏమి చూసిందో బాజారావు ఏం చూశాడో వాళ్ళలో ఈ రోజు చాలా మార్పు వుంది" అనుకుంది కీర్తి.
అదే వాళ్ళిద్దరూ అనుకున్నారు.
ఆ రాత్రి ఒంటి గంటయి వుంటుంది.
కీర్తికి చటుక్కున మెలకువ వచ్చింది. కారణం తెలియదు ప్రక్కన గోమతి లేదు.
కాసేపు చూసి చెట్టు దిగింది కీర్తి. చెట్ల చాటు చేసుకుంటూ ముందుకు పోయింది. బాజారావు తన గుడిసెలో లేడు.
కీర్తి ఇద్దరినీ వెతుకుతూ స్నానం చేసే చెరువు దగ్గర కొచ్చింది.
ఓ చెట్టు క్రింద బాజరావు గోమతి అనుకున్నంత దగ్గరగా కూర్చున్నారు. తగ్గు స్వరంతో మాట్లాడుకుంటున్నారు.
కీర్తి మెల్లగా వాళ్ళు కూర్చున్న చెట్టు చాటుకి చేరింది.
వాళ్ళిద్దరూ గుసగుసలాడుతూ మాట్లాడుతున్నా కీర్తికి బాగానే వినపడుతున్నది.
"నీకు బాగా నమ్మకం కుదిరిందా గోమతీ"! అంటున్నాడు బాజారావు.
"ఈ గోమతి పొరబడదు, పొరపాటు చేయదు రావ్" అంటున్నది గోమతి.
వీళ్ళిద్దరికీ ఇంత దగ్గర సంబంధం ఎప్పుడేర్పడింది. పాత పరిచయం వుందా? అసలు వీళ్ళెవరు! అమాయకంగా బాజారావు అంటే భయపడే గోమతి కాలాంతకురాలా? వీళ్ళిద్దరూ కల్సి తన్ని ఫూల్ చేస్తున్నారా? ఈ పొరపాటు ఎక్కడ జరిగింది?" కీర్తి కెన్నో ఆలోచనలు వస్తున్నాయి. అన్నింటినీ ప్రక్కకు నెట్టి వాళ్ళ మాటలు వింటున్నది.
"ఆ రోజు మన గుర్తు కాబ్ వెబ్ బిళ్ళ నేలమీద పడి వుండగా చూశాను. ఈ కాబ్ వెబ్ నీ జేబులోంచి జారిపడిందా లేక కమల్ జేబులోంచి జారిపడిందో అర్ధంకాలేదు. మనవాళ్ళ దగ్గర వుండవు ఇవి. ఆ రాత్రి కమల్ నిద్రపోతున్నప్పుడు వళ్ళంతా తడిమి చూశాను. కమల్ కి చీమ చిటుక్కుమంటే మెలుకువ నిద్రలో మీద కాలేసినట్లు చెయ్యేసినట్లు భయం కల్గినప్పుడు గట్టిగా కౌగిలించుకోటం చేస్తూ కొద్ది కొద్దిగా తడిమి చూశాను. కమల్ ధరించిన దుస్తులు అనుమానం కల్గించాయి. షర్టు కాలర్ లో ఏవో వున్నాయి. పాంటు కున్న బెల్టులో గట్టి వస్తువులు తగిలాయి. అలాగే అతని తలలో అంటే క్రాఫ్ లో ఏదో వైరులాంటి వస్తువు దాచి వుంది. ఓ రోజు అతని బూటు చూశాను. బూటు మడమలో బుల్లి పిస్టల్ పవర్ ఫుల్ ఆటోమేటిక్ ది వుంది. అతనివాచీ కూడా ఓ యంత్రమే దీన్ని బట్టి నీకేమని పిస్తున్నది?"
"కమల్ మొహ్రా తప్పక ఓ డిటెక్టివ్"
"నేనూ అదే అనుకున్నా బాజీ ఇప్పుడేం చేద్దాం"
"అతని సంగతి అలా వుంచు. మనం ఇక్కడినుంచి బైటపడటం ఎలా? ఇదోపెద్ద సమస్యకదా!"
