"వున్న మన ముగ్గురిలో" భేదాభిప్రాయాలు పొరపొచ్చాలు నా కిష్టంలేదు బాజీ! మనం ఇక్కడ కొచ్చి మూడు నెలలయింది కొద్ది కొద్దిగా వీళ్ళ భాష తెలుసున్నది. వీళ్ళలో కల్సిపోయాము. మనమీద వీరికి నమంకం ఏర్పడి కాపలా తీసేశారు. మనం ఇక్కడి నుంచి ఎటువెళితే సురక్షితంగా బైటపడగలమో దారి వెతుక్కుంటున్నాము. మంచయినా చెడయినా ఒకేమాట ఓకే బాటగా కల్సి వుందామని సమయం చూసి పారిపోదాం అనుకున్నాం. ఇప్పుడు ఇదేమిటి? అసలీ మధ్య గోమతి విషయంలో నీ ప్రవర్తన ఏం బాగుండ లేదు బాజీ. ఈ విషయం నాకెంతో చిరాకు కలిగిస్తున్నది."
"మంచిది."
"ఏమిటా వ్యంగ్యం! నీ వుద్దేశ్యం ఏమిటో చెప్పెయ్యి బాజి, నీ దోవ నీది నా దోవ నాదిగా వుందాం."
"చూడు కమల్! ఆడ తోడులేంది ఒక్క రోజు నిద్రరాదు నాకు."
"మంచిది" ఇందాక బాజీ అన్నట్లే వ్యంగ్యంగా అంది కీర్తి.
"ఏమిటా వ్యంగ్యం!" ముఖం గంటు పెట్టుకుని అన్నాడు బాజారావు.
"దెబ్బకు దెబ్బ."
"అంటే నాతో కయ్యానికి కాలు దువ్వుతున్నావన్న మాట?"
గోమతి ఆడపిల్ల బాజారావు ఆడదాన్ని తేలిగ్గా తీసుకునే రకం. కీర్తి మగవాడిగా చలామణి అవుతున్నది ఫరవాలేదు. బాజారావు బరి నుంచి గోమాత్య్ని రక్షించాలంటే గోమతి తనదంటూ కమల్ వేషంలో వున్న కీర్తి అచ్చం మగాడిలా రోషంతో మీసం దువ్వాల్సిందే ప్రస్తుతం కీర్తి అదే పనిచేస్తున్నది. బాజారావు మాటవిని ఫక్కున నవ్వింది కీర్తి.
"నేను ఆడపిల్లల తండ్రిని కాదు బాజీ! ఇవ్వటానికి సంసిద్ధం కావటానికి....నీ కసవరమయితే కయ్యం తప్పదు"
"అంతేగాని మాట మార్చుకోవు."
మాట తప్పితేగా మార్చుకోతం సంగతి. నీవు ముందు రూట్ మార్చుకుంటే మంచిది."
"ఎయ్!" బాజీ చెయ్యి పైకెత్తాడు.
"సేమ్ టు సేమ్" శాంతంగా అంది కీర్తి.
అంతే బాజారావు పులిలా కీర్తి మీదకు దూకాడు. పోరుకు సిద్దంగా వున్న కీర్తి బెబ్బులి బాజారావుని డీ కొంది.
గోమతి ఇద్దరినీ చూస్తున్నది.
బాజారావుకి కరాటే, జూడో, లాంటి విద్యల్లో నేర్పు వున్నట్లుంది. ఒకటి తర్వాత ఒకటి ప్రదర్శిస్తున్నాడు.
కీర్తి ఎదురు దెబ్బతీయలేదు. బాజారావు విసిరే ప్రతి దెబ్బకి మెలుకువగా తప్పించుకుంటు నవ్వుతున్నది.
ఎదురు దెబ్బ తీయకుండ తన ప్రతి తప్పించుకుంటున్న కమల్ ని చూస్తుంటే ఆశ్చర్యంగా వుంది బాజారావుకి.
"తనకి ఎదురులేదు. చీకట్లో కూడా ప్రత్యర్ధి ఊపిరి చప్పుడుకే గుర్తించి దెబ్బతీయగలడు అలాంటిది లేత వంకాయలా వున్న ఈ కుర్రాడు నూనుగు మీసాలవాడు, శరీరం మీద ఒక్క దెబ్బ పడకుండ ఎదురు దెబ్బ తీయకుండ తప్పించుకోటమా? ఇతను సామాన్యుడు కాడు. తనతో సమానం గలవాడంటే...?" బాజారావు అనుమానంతో ఆలోచించి దొంగదెబ్బ తీయటానికి కుస్తీలోకి దిగాడు.
కుస్తీ పట్టటంలో అదనంగా కొన్ని పట్లు తెల్సిన కీర్తి ప్రయోగించటం మొదలు పెట్టింది.
"కుస్తీలో ఈ పట్లు తెలియాలంటే మామూలు విషయం కాదు. ఇవన్నీ ఇతనికెలా తెల్సు? కమల్ మొహ్రా మామూలు మనిషి కాడు. మామూలు మనిషి కాకపోతే ఎవరు? ఎవరు...?" బాజారావు చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాడు.
ఉన్నట్లుండి చటుక్కున బాజారావు కీర్తి యుద్ధం ఆపేశారు. అనుమానంగా....విచిత్రంగా....దూరంగా జరిగి ఒకరి నొకరు చూసుకున్నారు.
వాళ్ళిరువురూ కూడబలక్కున్నట్లు ఒకేసారి ఎందుకు వెనక్కు తగ్గారో గోమతికి అర్ధం కాలేదు.
"బాజారావు కోపంగా భూమీద కాలితో తన్ని గిరుక్కున వెనుతిరిగి వెళ్ళి పోయాడు.
బాజారావు అలా వెళ్ళిపోయాడేమిటి?" అంది గోమతి.
"అదేనాకు అర్ధం కావటంలేదు." అంది కీర్తి.
"నీతో గెలవలేక తోక ముడుచుంటాడు."
"అంతే అంతే."
"బాజారావు పోరాడలేక కాదు! ఏదో అనుమానం తగిలి కావాలని ఆగిపోయాడు. ఏం అనుమానం తగిలింది? తను ఆడపిల్లని తెల్సిందా? ఊహు, అలా జరిగుండదు. ఆ అనుమానమే వచ్చుంటే అప్పుడే తేల్చేసేవాడు. మరి.... మరి..." కీర్తి చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నది.
కీర్తి బాజారావు దుమ్ము రేగేటట్లు కొట్లాడు కున్న చోట చూస్తూ నుంచున్న గోమాతికి ఏదో చిన్న వస్తువు కనపడి ఆకర్షించింది. ఆ వస్తువుని పరీక్షగా చూసి నిర్ఘాంత పోయింది. ఆ తర్వాత కీర్తి చూడకుండా ఆ వస్తువుని తీసి జాకెట్ లోపల వేసుకుంది.
"ఇది ఇక్కడికెలా వచ్చింది! ఇది బాజారావు జేబులోంచి కిందపడిందా! లేక కమల్ జేబులోంచి కింద పడిందా ఎలా తెల్సుకోవటం?" గోమతి తీవ్రంగా ఆలోచిస్తున్నది.
గోమతి నేల మీదనుంచి ఏదో తీసి జాకెట్లో వేసుకోటం చూసింది. చూడనట్లు వుండిపోయింది.
